అర్థరాత్రి..
హారికకు హాస్టల్ వాతావరణం కొత్త.. పైగా కొత్త ప్రదేశం. సరిగ్గా నిద్ర పట్టడం లేదు. పక్కపై అటూ.. ఇటూ దొర్లుతోంది. మరో ప్రక్క బెడ్ మీద లావణ్య గాఢ నిద్రలోవుంది.
ఇంతలో ఏదో అలికిడి..
దిగ్గున లేచి కిటికీ తెర కొద్దిగా తొలగించి చూసింది హారిక.
హాస్టల్ వెనకాలున్న గేటు తెరచుకొని ఎవరో ఒక ఆడమనిషి ప్రొఫెసర్ కామేశం ఇంటి వైపు వెళ్తోంది.
భుజంపై చెయ్యి పడే సరికి ఉలిక్కి పడింది హారిక. అది లావణ్య చెయ్యి.
“నిద్ర రావడం లేదా హారికా..” అంటూ ఆవలిస్తూ అడిగింది లావణ్య.
ఔనన్నట్లు తలూపింది హారిక.
“ఏం చూస్తున్నావ్..”
“ఎవరో ఒకావిడ ప్రొఫెసర్ ఇంటి వైపు వెళ్తోంది”
“ఆమె పాపమ్మ” అంది లావణ్య. తనకంతా తెలుసు అన్నట్లుగా..
“ఆ.. మన హాస్టల్ ఓనర్ పాపమ్మనా..!” ఆశ్చర్యంగా అడిగింది హారిక.
“ఔను. తాను విధవరాలని చెప్పుకుంటుంది గాని నిజం గాదు. ఆమె భర్త బతికే ఉన్నాడు. పాపమ్మ సంతాన లేమికి కారణం తన భర్తేనన్న అనుమానంతో పరాయి పురుషుల వంక వక్ర చూపులు చూసేదట. మగడు తన్నితరిమేసాడని చెప్పుకుంటారంతా” అంది లావణ్య.
“మరి.. ఇలా..!”
“అవును నీ అనుమానం నిజమే.. ప్రొఫెసర్ దగ్గరికే..”
“చాలా మంచివాడన్నావ్..”
“ఉదయం నీతో మాట్లాతున్నప్పుడు.. పాపమ్మ మన మాటలు చాటుగా వింటోంది. అందుకే ప్రొఫెసర్ గురించి
అలా చెప్పాను. వాడు పరమ దుర్మార్గుడు హారికా. నీకు ఇంకో విషయం చెప్పనా..”
హారిక కళ్ళు పెద్దవిగా చేసుకొని లైటు వేయబోయింది.
“వద్దు.. “ అంటూ లావణ్య వారిస్తూ హారిక బెడ్‍పై కూర్చుంది. ఏదో చెప్తానన్నావ్.. అన్నట్లుగా హారిక కళ్ళతో అడుగుతూ.. లావణ్య ప్రక్కనే కూర్చుంది.
“ప్రొఫెసర్ డ్రగ్ అడిక్టేడ్ ఫెల్లో. పాపమ్మను మత్తుకు బానిసను చేసి లొంగదీసుకున్నాడు” అంటుంటే లావణ్య గొంతు గద్గదమయ్యింది. కళ్ళల్లో కన్నీళ్లు.. నిర్ఘాంత పోయింది హారిక.
ఇద్దరి మధ్య లిప్తకాలం మౌనం ఆవహించింది.
లావణ్య గొంతు సవరించుకుని తిరిగి చెప్పసాగింది..
“వాడొక మేకవన్నెపులి హారికా.. వారం రోజుల్లోనే వాని వాలకం నాకర్థమయ్యింది. తనకు విద్యార్థులు చిన్న పిల్లలతో సమానమని మాయ మాటలు చెబుతూ చాక్లెట్ తినిపిస్తాడు. అవి మామూలు చాక్లెట్లు గావని తెలిసిపోయి ఎదురు తిరిగితే రహస్యంగా తీసిన వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తాడు” అంటూ ఒక్క సారిగా బోరుమంటూ హారిక భుజాలపై వాలిపోయింది లావణ్య.
హారిక నిలువెల్లా కంపించి పోయింది. కాసేపటికి కాస్త ధైర్యం తెచ్చుకొని..
“ఇదంతా నీకెలా తెలుసు..” అంటూ నిలదీసినట్లుగా అడిగింది.
“అలా మోసపోయిన వారిలో నేనూ వున్నాను. పాపమ్మ సాయంతో మన హాస్టల్లో డ్రగ్స్ వ్యాపారం కూడా జరుగుతోంది. వాడు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటున్న రాక్షసుడు” అంటూ కళ్ళు ఒత్తుకుంటూ సన్నగా ఏడువ సాగింది లావణ్య. “పరిశోధన మానేసి మాఇంటికి వెళ్లిపోదామనుకుంటున్నాను. హారికా.. నువ్వు గూడా హాస్టల్ నుండి వెళ్ళిపో..” అంటూ బేలగా చూడసాగింది.
“లావణ్యా.. అలాంటి పిరికి మాటలు మాట్లాడకు. ఏదైనా సమస్య వస్తే ఎదుర్కోవాలి. పోరాడాలి.. పరిష్కరించుకోవాలి గాని.. సమస్యల నుండి పారిపోవడం అవివేకం. మనం పారిపోతే సమస్య తీరి పోతుందా..! వాని ఆట కట్టించాలి. వాని ఉచ్చులో మరే యితర అమ్మాయి చిక్కకుండా.. వానికి తగిన బుద్ధిచెప్పాలి” అంటూ ధైర్యం చెప్పింది. “వాడు మా ఊళ్ళో జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పని చేశాడు. ట్యూషన్ నెపంతో శారద అనే అమ్మాయిని లైంగికంగా వేధించాడు. పాపం! ఆమె బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వాణ్ణి నామ రూపాలు లేకుండా చేద్దామని కంకణం కట్టుకున్నాను. నీ సాయం తీసుకోవాలను కున్నాను. అందుకే ఈ హాస్టల్లో చేరాను.
లావణ్యా.. మనకు మంచి అవకాశముంది. నువ్వు సహకరిస్తే కామేశం కటకటాల పాలై ఊచలు లెక్కించేలా పథకం నేను వేస్తాను.
వాడు ఎలాగైతే వీడియాను అడ్డం పెట్టుకొని ఆటలాడుతున్నాడో.. అలాంటి మీడియాతోనే సోషల్ వైరల్‍గా మార్చి.. వాని భరతం పడదాం” అంటూ హారిక పథకం వివరించింది.
‘మనకు సాధ్యమవుతుందా..!’ అని లావణ్య ముందు అనుమాన పడింది. కాని అంత చిన్న వయసులోనే ఎన్నో సాహసాలు చేశానని చెప్పిన హారిక సాహస గాధలు విన్నాక కాస్తా ధైర్యం తెచ్చుకుంది.
అదే రాత్రి.. ప్రొఫెసర్ మీద ప్రతీకారం తీర్చుకుందామని లేచి నడుం బిగించారు నారీమణులు.
ముహూర్తం కరారు చేసుకున్నారు.
***
ఆరోజు కళాశాలలో నూతన విద్యార్థినీ విద్యార్థులకు స్వాగతోత్సవ కార్యక్రమం..
కళాశాల ప్రాంగణమంతా కన్నుల పండువగా అలంకరించ బడింది. సీనియర్ విద్యార్థినిలు చీరలు కట్టుకొని వచ్చారు. జానపదనృత్యం చేసే విద్యార్థులు ధోవతులు కట్టుకొని వచ్చారు. చేతుల్లో కోలాటం కర్రలు.. డప్పులు.. చూసి వేదిక తెగ సంబరపడి పోతోంది.
సభ ఆరంభమయ్యింది.
జూనియర్ విద్యార్థుల పక్షాన హారిక కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మైకు అందుకుంది.
ఉపన్యాసాలు ముగిసాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
సభ ముగుస్తుందనగా..
“ఒక ముఖ్య ప్రకటన..” అంటూ హారిక ప్రకటించే సరికి సభ యావత్తు నిశ్శబ్దమయమయ్యింది.
“ఈనాటి కార్యక్రమంలో చివరగా భారత నాట్యం అనంతరం.. మన గౌరవనీయ ఇంగ్లీష్ ప్రొఫెసర్ కామేశంగారి వద్ద పరిశోధన చేస్తున్న లావణ్యగారు తన పరిశోధన అంశాల పురోగతిని వీడియో రూపంలో ప్రదర్శిస్తారు” అనగానే సభ చప్పట్లతో మారు మ్రోగింది.
కళాశాల ప్రిన్సిపాల్ లేచి కామేశంకు అభినందనలు తెలిపాడు. కామేశం అయోమయంలో పడ్డాడు. తనకు తెలియకుండా ఏమిటా వీడియో ప్రదర్శన అని మనసులో తుఫాను రేగింది. తోటి అధ్యాపకులొక వంక అభినందనలు తెలుపుతుంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించక తప్పలేదు.
హారిక ‘మహిషాసుర మర్ధని’ అనే అంశాన్ని భరతనాట్యంలో ప్రదర్శించింది. ఆమె హావభావాలతో సభ అచ్చెరువొందింది. ప్రదర్శన ముగిసిన మరుక్షణమే వేదికపై తెర వెలిసింది. ముందు కెమెరా.. లైట్సాఫ్.. కెమెరా ఆన్ గావడం.. అందరి సెల్ ఫోన్లల్లో వాట్సాప్ వీడియో మెసేజ్‍లు రావడం.. యాంత్రికంగా ఒక్క సారిగా జరిగి పోయాయి. అవి అంతటితో ఆగకుండా ప్రవాహాలై కొనసాగుతూనే ఉన్నాయి..
“ప్రొఫెసర్ కామేశం కామలీలలు’ అంటూ తెరపై ప్రత్యక్షమయ్యింది.
సభలో ఈలలు.. చప్పట్లు.. కేరింతలు.. గెంతులు.. వాట్సాప్ ఓపెన్ చేసి చూసే వాళ్ళకూ అవే సీన్లు.
కామేశం మత్తుమందు వ్యవహారం విశ్లేసిస్తూ.. వీడియో నిరాఘాటంగా కొనసాగి పోతోంది. దానికి అంతరాయం కలుగకుండా.. తోటి విద్యార్థినీ విద్యార్థుల సహకారం తీసుకుంది హారిక.
సభకు ముందు ఉదయమే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగారిని కలిసి ఆధారాలూ అందజేసింది.
తెర ‘ఇంకా కొనసాగుతుంది..’ అని ప్రకటించింది. లైట్లు వెలిగాయి.
కన్నులు మిరుమిట్లు గొలిపే శారద నిలువుటెత్తు ఫోటో పట్టుకొని వేదికపై నిల్చోని ఉన్నాడు ఉప్పలయ్య.
ఆదృశ్యం చూడగానే కామేశం కళ్ళు బైర్లుకమ్మాయి. కామేశం పాపం పండింది అన్నట్టుగా అతని ఎదలోని తుఫాను సునామీగా మారి అఖాతంలోకి తొక్కేసింది.
హారిక తన నాన్నగారిని.. శారద ఫోటోను సభకు పరిచయం చేసింది. తన అక్కయ్య మరణానికి కారకుడు కామేశమని ఎలుగెత్తి చాటింది.
“గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః. ఇది మన ఆర్యోక్తి. దానిని భ్రష్టుపట్టించే ఇలాంటి గురువులను ప్రజల మధ్య ఉప్పుపాతరెయ్యాలి” అని ఆక్రోశిస్తూ కన్నీరుమున్నీరయ్యింది.
కామేశం ముఖంమ్మీద కాండ్రించి ఉమ్మేసింది లావణ్య. వేదికపైకి పరుగెత్తి హారికను తన హృదయానికి ఆత్మీయంగా హత్తుకుంది.
హారిక విజయానికి సంకేతంగా.. పోలీసు వ్యాను సైరన్ గర్జిస్తూ వస్తూంది. *