కామేశం చార్టెడ్ ఎకౌంటెంటు. హాల్లో సాఫాలో కూర్చుని ల్యాప్ టాప్ లో ఆఫీసు పని చూసుకుంటున్నాడు. ఇంతలో శ్రీమతి కాఫీ కప్పుతో వచ్చి చేతికిచ్చి పక్కన కూర్చుని " ఏమండీ ! మీరు పెళ్లికి ముందు ఎవర్నైన ప్రేమించారా?" అంది . భార్యని ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు. " ప్రేమించాను" " ఎవర్ని?" " మా అమ్మని" " అది కాదండీ ! ఎవర్నైన అమ్మాయిని" " ఆ, ప్రేమించేను" " ఎవరండీ, ఆ భాగ్యురాలు?" ఆత్రంగా అడిగింది. " మన చంటిది, చంద్రికని" "అబ్బబ్బ , మన పెళ్లికి ముందు ఏ అమ్మాయితో నైన లవ్ లో పడ్డారా?" అని. " ప్రేమంటే ఆప్యాయత, అనురాగం , ఆదరణ వివరణ ఇస్తూ, సడన్ గా ఈ ధర్మ సందేహాలెందుకు అడుగున్నావ్?" అన్నాడు కామేశం. " నిన్న టీ.వీ. లో పాత బ్లాక్ వైట్ సినేమా చూసాను. అందులో హీరో యవ్వనంలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుందామనుకుంటారు. ఆ యువకుడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని ఊరెళతాడు. పెద్దలు కులాలు వేరైనందున వారి పెళ్లికి అడ్డంకులు చెప్పి బంధువు రాజకీయ నాయకుడి అమ్మాయితో బలవంతంగా వివాహం జరిపిస్తారు. చివరకు ఆ యువకుడు కుటుంబ పరిస్థితులతో రాజీ పడక తప్పలేదు. తర్వాత జరిగిన విషయాలు వివరించి తన అశక్తను తెలియ చేద్దామని పట్నాని కొస్తాడు. ఆ యువకుడి కోసం ఎదురు చూసి చూసి తను అప్పటికే నెల తప్పినందున అక్కడ ఉండలేక ఎటో వెళిపోయింది ఆ యువతి. కాలగమనంలో ఆ అబ్బాయి పెద్ద రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు. ఒక కొడుకు కూతురు పుడతారు. ఆయనకి సమాజంలో పలుకుబడి హోదా పెరుగుతాయి. ఆ నాయకుడు తను ప్రేమించి పెళ్లి చేసుకుందామను కున్న అమ్మాయి వేరే ఊరికి పోయి ఒక ఆయా సాయంతో మగ పిల్లవాడిని కంటుంది. ఒక స్వచ్ఛంద సంస్థ సాయంతో టీచర్ గా ఉధ్యోగం సంపాదించి కొడుకును డిగ్రీ వరకూ చదివిస్తుంది. కొడుకు పెరిగి పెద్దవాడైనందున తన తండ్రి ఎవరని అడుగుతుంటాడు. ఏ సమాధానం చెప్పలేక మనసులో కుములుతుంటుంది తల్లి. తర్వాత ఒక రాజకీయ మీటింగ్ సందర్భంలో తనని మోసం చేసిన వ్యక్తి పలుకుబడి ఉన్న ఆ రాజకీయ నాయకుడని గ్రహిస్తుంది . ఎలాగైనా కొడుకును తండ్రి దగ్గరకు చేర్చాలనుకుంటుంది... ఇంత వరకు సినేమా టెన్షన్ గా నడిచింది. ఇంతట్లో ఇంట్లో కరెంటు పోయి మిగతా సినేమా చూడలేక పోయానండి. ఆఖరికి ఆ అమ్మాయి కొడుకును తండ్రి దగ్గరకు చేరుస్తుందా? రాజకీయ నాయకుడు కొడుకును చేరదీస్తాడా లేదా అంతా సస్పెన్సుగా ఉంది. నేటి మగాళ్లు లవ్వు ప్రేమ అంటూ అమ్మాయిల చుట్టూ తిరిగి మోజు తీరగానే మోసం చెయ్యడం అలవాటైంది." ఉపోద్గాతం మొదలెట్టింది శ్రీమతి. ఓపిగ్గా విన్న కామేశం "అబ్బబ్బ! మీ ఆడాళ్లు టి.వీ.ల్లో వచ్చే దరిద్రపు సీరియల్స్ సినేమాలు చూసి లేనిపోని అనుమానాలతో మగాళ్ల బుర్రలు తినేస్తారని" విసుక్కున్నాడు. * * *