రాజారావు గారు చిరుద్యోగి రిటైర్మెంట్ తరువాత ఓ ఇల్లు కొనుక్కుని, ఇద్దరు కుమారులతో కలసి జీవిస్తున్నారు.ఇద్దరి కుమారులకు వివాహం చేసి ఏ కలతలు లేకుండా,విడిపోకుండా జీవించాలని ఉద్బోధ చేశాడు.దానికి ఇద్దరూ సరేనన్నారు.
ఓరోజు ఇద్దరిని పిలిచి " రేపు నేను మీ అమ్మ తిరుపతి వెళుతున్నాం.కొంతకాలం అక్కడే ఉండాలనుకుంటున్నాం ".అని చెప్పాడు.
" సరే అలాగే వెళ్ళి రండి నాన్న, అన్నారు కొడుకులు. " ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మావయ్య " అన్నారు కొడళ్ళు. అన్ని సర్దుకుని
" వస్తాం అమ్మ ,ఇల్లు మీరు జాగ్రత్త " అంది అత్త.
పెద్ద కుమారుడు శివకుమార్ కు ప్రైవేట్ సంస్థ లో ఉద్యోగి.అరకొర జీతం.చిన్నవాడు సునీల్ బ్యాంక్ మేనేజర్. ఇంటిపని పెద్ద కోడలు ఎంతో ఓపికగా చేసేది. చిన్న కోడలు విజయ బారెడు పొద్దెక్కిన తరువాత నిద్ర లేచేది.ఈ లోపు టిఫిన్ తయారు చేసేది కమల.అన్నదమ్ములు ఇద్దరు ఎంతో ఐక్యత ఉండేవారు.అన్న పెద్దరికాన్ని ఏనాడు తమ్ముడు అగౌరపరచలేదు.జీతం డబ్బులు వదిన కే ఇచ్చేవాడు. కమల ఎంతో పొదుపరి.
ఏది వృధా చేయక అవసరమైన వాటికే డబ్బు వాడేది.
ఓరోజు విజయ తన భర్తతో " ఇలా ఉంటే మన
సంసారం సాగినట్లే రేపు పిల్లలు పుడితే మనకు ఖర్చులు ఉండవా! మన బతుకు మనం బతుకుదాం " అంది.
" ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏమిటి? ప్రశ్నించాడు సునీల్. దానికి మూతి మూడు వంకర్లు తిప్పింది విజయ.
" వద్దు విజయ కలసి ఉంటేనే జీవితం. ఇంట్లో పెద్దరికం ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి.
అన్నయ్య, వదినే ఏది వృధా చేయరు కదా! నీ కో విషయం తెలుసా నేనిచ్చే జీతం డబ్బుతో నే.ఆవిడ పొదుపు చేసి ప్రక్క వీధిలో ఓ ఇల్లు అమ్మకం ఉంటే అది నా పేరు పైనే రిజిస్టర్ చేసింది.ఈ విషయం నా ఫ్రెండ్ కృష్ణ చెప్పాడు.అతను రిజిస్టర్ ఆఫీస్ లోనే పని చేస్తాడు, దీనికి ఏమంటావ్ " అన్నాడు.
" ఆ మాత్రం మనం కొనలేమా!మీరు బ్యాంక్ లోన్ పెడితే మనకు ఇల్లు రాదేమిటి " అంది
మూతి తిప్పుతూ.
" అదే మీ అడవాళ్ళతో వచ్చేది. వదిన నెల,నెల పొదుపు చేసి ఆ ఇల్లు తీసింది. ఆ ఇంటికి వచ్చే అద్దె మనకు ఎంతో వెసులుబాటు కదా! ఆలోచించు " అన్నాడు.
" ఏమో బాబు నాకు మాత్రం వేరే ఉండాలి అనిపిస్తోంది " అంది విజయ.
"విజయా! నేనొక మాట చెబుతాను విను . నేను అన్నయ్య ఎంతో సఖ్యతగా ఉన్నాం.మా మధ్య ఏ దాపరికాలు లేవు.అన్నయ్య ప్రైవేట్ ఉద్యోగి. ఇప్పుడు మనం మన దారి చూసుకుంటే అన్నయ్య,వదినే ఒంటరి అయిపోతారు.ఉమ్మడి కుటుంబాన్ని వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదు.మా నాన్న కూడా అదే చెప్పారు." అన్నాడు.
" మీరు ఎన్నైనా చెప్పండి. ఈ ఉగాదికి మనం మన ఇల్లు, అదే మీ వదినే తీసిందే అందులోకి
వెళ్లాలసిందే. ఎవరి జీవితం వారిదే." నిక్కచ్చిగా చెప్పింది విజయ.
అన్నయ్య కు, వదినే కు ఈ విషయం చెప్పి తన ఇంటికి మారాడు .
" విజయ సంతోషం కంటే మాకు కావలసింది ఏముంది " అన్నారు ఇద్దరూ. రోజులు గడుస్తున్నాయి.ప్రక్కకు వచ్చామన్న మాటే కానీ రోజు విజయ తో గొడవే. టైమ్ కు టిఫిన్ ఉండదు.బారెడు పొద్దు వచ్చే వరకు లేవక పోవడం, ఈ లోగా బ్యాంక్ టైమ్ కావడం, సమయానికి భోజనం చేయక హోటల్ నుంచి
తెచ్చు కోవడం జరుగుతోంది.
ఓ రోజు గుడికి వెళ్ళి వస్తున్న కమల కొంతమంది గుమికూడి ఉండటంతో వెళ్ళి చూసింది. ఆశ్చర్యం అక్కడ విజయ పడి పోయింది. అలస్యం చేయక వెంటనే ఆసుపత్రికి తీసుకు పోయింది. డాక్టర్ పరీక్ష చేసి " ఏం లేదమ్మ ,నీరసం బాగా ఉంది.టైం కు తినకపోతే ఇలానే ఉంటుంది. రెండు రోజులు ఆసుపత్రిలో ఉంటే చాలు " అన్నాడు.
ఆసుపత్రిలో అన్ని సపర్యలు చేసింది కమల.ప్రతి రోజు శివకుమార్ వచ్చి పలకరించి వెళ్ళేవాడు. సునీల్ అది చూసి " చూశావా వారి ప్రేమ.మనం వేరు కాపురం పెట్టినా ప్రేమ పోలేదు.ప్రక్కకు వచ్చి ఏమి సాధించావ్, ప్రేమను పోగొట్టుకున్నావ్.కలసివుంటే కలదు సుఖం.ఉమ్మడి కుటుంబం లో ఎంతో ఆనందం ఉంటుంది తెలుసా" అన్నాడు.
ఆ మాటకు విజయ కళ్ళు చెమర్చాయి. తల దించుకుని " మన్నించండి నా తప్పు తెలుసుకున్నాను.మనమందరం కలిసే ఉందాం " అంది. ఆ మాటకు సంతోషించాడు సునీల్.
అప్పుడే కమల,శివ రావడంతో వారి మంచి మనసుకు నమస్కరించింది. తను చేసిన తప్పుకు ఎంతో బాధపడింది." అక్కా, బావ ఈ ఉగాది మనమందరం కలసి చేసుకుందాం " అంది.ఉమ్మడి కుటుంబం లో ఉగాది సంబరంగా చేసుకున్నారు.