రామాపురం గ్రామంలో కార్తికేయుడు అనే వ్యాపారి ఉండేవాడు.ఎంగిలి చేత్తో కాకిని తోలినా చేతికి అంటుకున్న మెతుకులు ఎక్కడ నేలమీద పడితే అది తినేస్తుందేమో అనుకుని ఆ చేతిని వెనక దాచుకుని రెండో చేతితో కాకిని తోలే రకం. అతని బుద్ధి వాటికి తెలుసో ఏమో ఆతని ఇంటి పరిసరాల్లోకి ఒక్క కాకి కూడా వచ్చి వాలేది కాదు. పెద, గొప్ప బేధం లేకుండా అందరికీ ఒకేవిధంగా సరుకులు అమ్మేవాడు. అతని సరుకు నాణ్యంగా ఉండటం తో తప్పక అతని వద్దనే అందరూ సరుకులు కొనేవారు. అదే ఊరిలో బ్రహ్మదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. నిత్యం వేదవిధులు నిర్వర్తిస్తూ వేదపారాయణ చేస్తూ ఊరిలో ప్రజలందరికీ తల్లో నాలికలా మసిలేవాడు. గౌరవం ఇచ్చి పుచ్చుకునేవాడు. . తాతముత్తాతల దగ్గర నేర్చుకున్న ఆయుర్వేద విద్య ద్వారా తన దగ్గరకు అనారోగ్యం తో వచ్చే పేద ప్రజలకు ఉచితంగా మందులు ఇచ్చేవాడు.దాంతో ఆయన పేరు వూరు ఊరంతా మారుమ్రోగిపోయింది. ఒకసారి ఆ గ్రామానికి తీవ్ర కరువు కాటకాలు సంభవించాయి. ఆ సమయంలో బ్రహ్మ దత్తుడు తన సహజధోరణిలో ఎన్నో రకాల సాయం అందించాడు గ్రామ ప్రజలకి. అయితే కార్తికేయుడు తన వ్యాపారాన్ని నిక్కచ్చిగా చేశాడు. పైసా తక్కువైనా సరుకు ఇవ్వలేదు యెవరికీ. దాంతో బ్రహ్మదత్తుదిని పొగడనివాడు లేడు. కార్తికేయుడిని తెగడని వాడు లేదు. కార్తికేయుడు అది చూసి తానూ బ్రహ్మదాత్తుడిలా అంతటి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. తాను చనిపోయాకా అయినా తన పేరును గ్రామంలో చెప్పుకోవాలి....ఎలాగా? అన్న మానసిక వేదనతో బెంగపెట్టుకుని తొందరలోనే మరణించాడు. తండ్రి అకాల మరణానికి అతని భార్యా బిడ్డలు చాలా చింతించారు. కార్తికేయుని వ్యాపారం కొడుకు చిత్రకేతుడు అందుకుని న్యాయబద్ధంగా వ్యాపారం చేయసాగాడు. దాంతో ప్రజలందరూ సంవత్సరం పూర్తి కాకుండానే కార్తికేయుని మర్చిపోయారు. చిత్రకేతుని పేరు కూడా బ్రహ్మదత్తుని పేరుతో సమానంగా వినిపించసాగింది. తన తండ్రిని ప్రజలందరూ అనతి కాలంలోనే మర్చిపోవడం చూసి చిత్రకేతుడు చాలా బాధపడ్డాడు. ఎలాగైనా తన తండ్రి ఆఖరి ఒరిక తీరేలా చేయాలనుకుని తండ్రి విగ్రహం తయారు చేయించి తమ ప్రాంగణం లో ప్రతిష్టించి దాని కింద ''బ్రతికి ఉండగా ఎవరికీ సాయం చేయని వ్యక్తి '' అని రాయించాడు. అతని దుకాణానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ''మీ నాన్న బతికి ఉండగా జనానికి ఏ విధంగానూ సాయపడలేక పోయాడు. ఆ తండ్రి లా కాకుండా నువు మంచి సేవలు అందిస్తున్నావు. పదికాలాలపాటు చల్లగా ఉండు బాబు.'' అని దీవించసాగారు. పైగా తమ పిల్లలకు ''ఆ కార్తికేయునిలా ఎవరికీ సాయం చేయని బ్రతుకు బ్రతక్కండి. అతని కొడుకులా బతకండి'' అని చెప్పడం చూసి తండ్రికి ఆవిధంగానైనా పేరు వచ్చినందుకు ఎంతో సంతోషించాడు చిత్రకేతుడు. సమాప్తం