వమ్ముకాని నమ్మకం - బుద్ధవరపు కామేశ్వరరావు

Vammu kaani nammakam

గోవర్ధన్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ షోరూములు. సిటీలో నమ్మకమైన, నాణ్యమైన ఉపకరణాలు దొరుకుతాయి అని పెద్ద పేరున్న చైన్ షోరూములు. ఈ మధ్యనే ఆరంభించిన ఎనిమిదో బ్రాంచ్ కేష్ కౌంటర్ లో కూర్చున్నాడు అరవై ఏళ్ల గోవర్ధనం. తన సెల్ లో బాల్య మిత్రుడు రామదాసు నుంచి ఫోన్ రావడంతో, ఫోన్ ఎత్తగానే అవతలనుంచి, "ఒరే గోవర్ధనం! నేను రా, రామదాసుని. ఆరోగ్యం సరిలేక మీ కొత్త బ్రాంచి ఓపెనింగ్ కి రాలేకపోయాను, ఏమీ అనుకోకు. ఇక, అసలు విషయానికి వస్తే, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా! కొడుకు కంటే ఎక్కువగా చూసుకునే అల్లుడు దొరికాడు. నీ నమ్మకం వృధా కాలేదు. నాకూ ఉన్నారు ఇద్దరు కొడుకులు. ఏం లాభం. వాళ్ళు విదేశాల్లో. నేను స్వదేశంలో. వ్యవహారాలన్నీ ఫోన్ లోనే. సరే నా బాధలు చెప్పి నిన్ను విసిగించను. త్వరలో స్వయంగా వచ్చి కలుస్తా. మరి ఉంటా!" అని ఫోన్ పెట్టేసాడు. అల్లుడు గుర్తుకు రాగానే గోవర్ధనం ఆలోచనలు ఓ పది సంవత్సరాలు వెనక్కి పరుగుతీసాయి.

*****

ఓ ప్రైవేటు కంపెనీలో ఛీఫ్ ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్న ఏభై ఏళ్ల గోవర్ధనం ఇంట్లో, ఆ రోజు అతని ఏకైక సంతానం వర్షిణికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. "అంకుల్! మీ అమ్మాయి నాకు నచ్చింది. మీరు ఓకే అంటే త్వరలో మేరేజ్ చేసుకుని అమెరికా తీసుకెళ్లిపోతాను" ఆనందంగా చెబుతున్నాడు పెళ్లి కొడుకు.

"మరి మీ అమ్మా నాన్నా ఎక్కడుంటారు ?" అడిగాడు గోవర్ధనం.

"వాళ్ళు ఇక్కడే ఉంటారు అంకుల్. వాళ్లకు ప్రతీ నెలా ఎంతో కొంత డబ్బు పంపుతాము కదా!" మామూలుగా చెప్పాడు పెళ్లి కొడుకు.

"అయితే మీ అందరూ కలిసి ఉండడం కుదరదంటావ్. అంతేనా?" అడిగాడు గోవర్ధనం, పెళ్లి కొడుకు తల్లితండ్రులు ఆశ్చర్యంగా చూస్తుండగా!

"ఎలా కుదురుతుంది అంకుల్? అక్కడి ఖర్చు గురించి మీకు తెలియనిదేముంది?" ప్లేటులో జీడిపప్పు నములుతూ చెప్పాడు.

"సరేనమ్మా! ఏ విషయం ఆలోచించుకుని చెబుతాం" మొహమాటం లేకుండా చెప్పాడు గోవర్ధనం, చాలు ఇక బయలుదేరండి అని అర్థం వచ్చేలా.

పెళ్లివారు వెళ్లిన తరువాత, "ఏమిటండీ మీ చాదస్తం ? అతని తల్లిదండ్రులు గురించి మీకెందుకు?" భర్తను నిలదీసింది గోవర్ధనం భార్య.

"చూడు రాధా! మనకు వర్షిణి ఒక్కతే సంతానం. రేపు మనకి ఏదైనా అయితే చూడవలసింది అతడే. తల్లిదండ్రులను చూడని ఆ కుర్రాడు ఇంక మనల్ని ఏం చూస్తాడు?" ఘాటుగా సమాధానం ఇచ్చాడు గోవర్ధనం.

"అలాంటప్పుడు ఇల్లరికం అల్లుడ్ని తెచ్చుకోండి" టీ తో పాటు సలహా కూడా ఇచ్చింది రాధ. ఆ దిశగా ఆలోచనలో పడ్డాడు గోవర్ధనం.

పది రోజులు తిరక్కుండానే తమ రెండో కొడుకును ఇల్లరికం ఇచ్చి సంబంధం కలుపుకోడానికి వచ్చారు వెంకట్రావు, రత్నం దంపతులు. పెళ్లి కొడుకు అందంగా ఉన్నాడు. మంచి ఉద్యోగం. అబ్బాయికి అమ్మాయి నచ్చింది.

"అన్నయ్య గారూ! మాకు, అబ్బాయికి కూడా మీ సంబంధం నచ్చింది. మరి మాకిచ్చే లాంఛనాల విషయం తేలితే తాంబూలాలు పుచ్చుకుందాము" చెప్పింది రత్నం చీర కుచ్చిళ్ళు సవరించుకుంటా.

"అదేంటమ్మా! నేను సంపాదించినదంతా మా అమ్మాయి, అల్లుడికేగా ? మళ్లీ లాంఛనాలు ఏమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు గోవర్ధనం.

"ఔననుకోండి. మీ సంపాదన అంతా మీ ఇంటికి ఇల్లరికం వచ్చిన మీ అల్లుడుకి వస్తుంది కానీ మాకు కాదుగా! అందుకే లాంఛనాల కింద ఓ పది లక్షలు ఇస్తే మాకూ ఈ వయసులో ఇబ్బంది లేకుండా ఉంటుంది" మొహమాటం లేకుండా చెప్పేసింది రత్నం.

ఆవిడ చెప్పింది కూడా నిజమే కదా అనుకుని, "సరేనమ్మా! ఏ విషయం త్వరలో తెలియచేస్తాం" చెప్పాడు గోవర్ధనం.

"త్వరగా చెప్పండి అన్నగారూ! మా వాడికి చాలా సంబంధాలు వస్తున్నాయి మరి" వెళ్లడానికి లేస్తూ చెప్పింది రత్నం. ఈ సంబంధం కూడా అటకెక్కింది అని మనసులో అనుకుని,

"ఏమండీ! ఇప్పటికే వర్షిణికి మీ వయసులో సగం వచ్చేసింది. త్వరగా ఏదో ఓ సంబంధం చూసి దానిని ఓ ఇంటిదాన్ని చేయండి" పెళ్లి వారు వెళ్లగానే భర్తను వేడుకుంది రాధ.

"చూస్తూ ఉండు. మూడు నెలలు తిరగకుండా మన అమ్మాయికి పెళ్లి చేసే బాధ్యత నాది. సరేనా?" ఏదో నిశ్చయానికి వచ్చినట్లు చెప్పాడు గోవర్ధనం. తండ్రి మాట మీద పూర్తి నమ్మకం ఉన్న వర్షిణి ఆనందంగా తన గదిలోకి వెళ్లింది ప్రశాంతంగా నిద్రపోవడానికి.

*****

చూస్తూండగా కాలం, ఓ ఐదు సంవత్సరాలు తన ఖాతాలో జమ వేసేసుకుంది. ఆ రోజు ఉదయం... సిటీలో, తమ గోవర్ధన్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ యొక్క మూడవ శాఖ ప్రాంరంభోత్సవం ఏర్పాట్లులో బిజీగా ఉన్నాడు గోవర్ధనం.

ఈ లోగా, "మావయ్యా! నేను, వర్షిణి, అత్తయ్య, చంటాడు కారులో వస్తున్నాం. ఈ రోజు మన షో రూమ్ ప్రారంభించడానికి వచ్చిన బేంక్ మేనేజర్ గారు కింద ఉన్నారుట. మీరు వెళ్లి ఆయనను రిసీవ్ చేసుకోండి. ఓ పది నిమిషాల్లో అక్కడ ఉంటాం!" అంటూ ఫోన్ లో అల్లుడు పెట్టిన మెసేజ్ చూసాడు గోవర్ధనం. వెంటనే లేచి, బేంక్ మేనేజర్ ని సాదరంగా ఆహ్వానించి, అల్పాహారం అందచేసాడు గోవర్ధనం.

"కంగ్రాట్స్ గోవర్ధనం గారూ! మూడు సంవత్సరాలు తిరక్కుండానే సిటీలో మూడవ శాఖ ప్రారంభిస్తున్నారు. అంతే కాదు రెండు షాపులకూ మేము ఇచ్చిన లోన్ కూడా చాలా మటుకు తీర్చేసారు. అఫ్ కోర్స్ ఏ అమ్మకానికి అయినా నమ్మకం పునాది అని తెలుసు కానీ, ఇంతటి విజయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి?" అల్పాహారం తీసుకుంటూ అడిగారు బేంక్ మేనేజర్ అహ్మద్ గారు.

"మా అల్లుడు" తడుముకోకుండా రెండు ముక్కల్లో చెప్పాడు గోవర్ధనం. "ఔనా ? కొంచెం వివరంగా చెప్పండి" ఆశ్చర్యంగా అడిగారు అహ్మద్.

"ఏం లేదు సార్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన మా అమ్మాయికి పెళ్లి చేద్దామని అనుకున్నాం. అయితే వచ్చిన పెళ్లి వారు అందరూ అడిగిన గొంతెమ్మ కోరికలకు, కొన్ని సందర్భాల్లో పెళ్లి కొడుకు ప్రవర్తన నచ్చకపోవడంతో చాలా సంబంధాలు తిరస్కరించా. విసుగెత్తిపోయిన నేను కొంచెం విభిన్నంగా ఆలోచించి, ఆ సంగతి మా అమ్మాయికి చెప్పా! నా మీద పూర్తి నమ్మకంతో తను కూడా ఓకే చెప్పింది" కాఫీ తాగడానికి ఆగాడు గోవర్ధనం.

"చెప్పండి సార్! ఆ ఆలోచన ఏమిటి?" ఉత్సాహం ఆపుకోలేక అడిగారు మేనేజర్.

"నాకు తెలిసిన ఓ మిత్రుని సాయంతో ఓ అనాథ ఆశ్రమాన్ని సంప్రదించి, కొంచెం రూపురేఖలు ఉండి, చదువుకున్న ఓ వరుడు కావాలని అడిగాను. వెంటనే వాళ్ళు కొంతమంది యువకుల జాబితా ఇచ్చారు. అందులో నాకు నచ్చిన వ్యక్తి, మా అమ్మాయి లాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుకుని ఓ చిన్న కంపెనీలో పనిచేస్తున్న వర్ధన్ అనే వ్యక్తి" చెబుతూ ఆగాడు గోవర్ధనం.

"అయితే వెంటనే ఓకే చెప్పేసారా?" అడిగారు అహ్మద్.

"లేదండీ. అతని నడవడిక గురించి ఆశ్రమ అధికారులు మంచిగా చెప్పినా కానీ, నేను కూడా రహస్యంగా మా మిత్రులు ద్వారా అతని ప్రవర్తన గురించి ఆరా తీసాను. అందరూ కూడా అతనికి అనుకూలంగా చెప్పడంతో ఓ రోజు నేనే అతడిని డైరెక్ట్ గా కలిసా?" తాగిన కాఫీ గ్లాసు పక్కన పెట్టడం కోసం ఆగాడు గోవర్ధనం.

"అతడిని కలిసి ఏం అడిగారు?" మీసాలు తుడుచుకుంటూ అడిగారు అహ్మద్.

"నీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి" అని అడిగాను సార్!

దానికి, 'ఎప్పటికైనా ఓ చిన్న కుటీర పరిశ్రమ పెట్టి, తనలాంటి అనాథలకు అందులో ఉపాధి కల్పించడమే తన ధ్యేయం 'అని చెప్పాడు. నేను వెంటనే మా అమ్మాయి చదువు, వివాహం, కట్నంగా ఇచ్చే పది లక్షలు గురించి చెప్పి, వివాహం సింపుల్ గా చేస్తా, ఆ కట్నం డబ్బుతో ఓ చిన్న ఎలక్ట్రానిక్స్ షాపు పెడదాం మీరిద్దరూ హాయిగా షాపును నడుపుకోండి, నీ మిత్రులను కూడా సేల్స్ బాయ్స్ గా పెట్టుకో. నీకు అంగీకారం అయితే ఈ నెలలోనే వివాహం జరిపిస్తా!' అని చెప్పాను సార్"

ఈలోగా ఓ సేల్స్ గర్ల్ వచ్చి, "సార్! పూజకు అన్నీ సిద్ధం చేసారుట, పంతులు గారు రమ్మంటున్నారు" అని చెప్పడంతో "ఒక్క ఐదు నిమిషాలు ఉండమని చెప్పమ్మా! పిల్లలు కారులో వస్తున్నారు" అని చెప్పి పంపించి, తిరిగి చెప్పడం మొదలెట్టాడు.

"నా ప్రపోజల్ వినగానే, వర్ధన్ ఆనందంతో, 'అంకుల్! నా జీవితానికి ఓ వెలుగు బాట చూపడానికి వచ్చిన దేవదూత మీరు. తల్లి తండ్రులు ఎవరో తెలియని నేను మిమ్మల్నే కన్న తల్లిదండ్రులుగా భావిస్తాను' అంటూ నా కాళ్లకు నమస్కరించాడు. వెంటనే నేను కూడా 'కొడుకు లేని మమ్మల్ని నువ్వే కొడుకు కంటే ఎక్కువగా చూడాలి మరి' అని చెప్పా. అంతే నెల తిరక్కుండానే వివాహం, తర్వాత మా షోరూముల ఓపెనింగ్ అంతా మీకు తెలిసిన కథే. ఈ రోజున మా మూడు షోరూముల్లో కలిపి నలభై మంది అనాథ యువతీయువకులు పనిచేస్తున్నారు" ఒకింత గర్వంగా చెప్పాడు గోవర్ధనం.

ఈలోగా కారు దిగుతున్న వర్ధన్ దగ్గరకు వెళ్లిన బేంక్ మేనేజర్, "కంగ్రాట్స్ వర్ధన్! నీ విజయగాథ గురించి మీ మావయ్య గారు చెప్పారు. నిన్ను తన కుటుంబంలోనే కాదు, తన పేరులో కూడా కలిపేసుకున్నారు. ఆయన నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయలేదు. ఔనూ ! ఈ చంటాడు మీ అబ్బాయా ?" అంటూ ప్రశంసల, ప్రశ్నలు వర్షం కురిపించారు.

"ధన్యవాదాలు సార్! ఇదంతా మా మావయ్య గారి విజయమే తప్ప నాది కాదు. ఔను సార్, వీడు మా అబ్బాయే. పేరు మావయ్యదే. మా బుల్లి గోవర్ధనం" అంటూ చంటాడిని ముద్దాడాడు వర్ధన్.

ఆ దృశ్యం చూసిన గోవర్ధనం మనసు ఆనందంతో పొంగిపోయింది. అందరూ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పంతులు గారు, "ద్వాపరయుగంలో ఆ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తి ఎంతోమందిని రక్షించినట్లు, మీ మామాఅల్లుడు కలసి ఇలాంటి గోవర్ధన్ ఎలక్ట్రానిక్స్ షాపులు ఎన్నో ప్రారంభించి, అవి దినదిన ప్రవర్ధమానమై ఇంకా ఎంతోమంది అనాథలకు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను" అంటూ ఆశీర్వదించారు.

*****

"ఏంటి మావయ్యా! ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నారు. అప్పుడే రాత్రి తొమ్మిది అవుతోంది. మీ కోసం అత్తయ్య, వర్షిణి, మీ మనవడు ఎదురు చూస్తున్నారు. ఇంటికి బయలుదేరండి. నేను అన్ని బ్రాంచీలు ఒకసారి చూసి ఓ అరగంటలో వస్తా. ఒరే రంగా! కేష్ కౌంటర్ లో కూర్చో. రఘూ! కారులో మావయ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రా" అల్లుడు పురమాయింపులతో గతంలో విహరిస్తున్న గోవర్ధనం, ఒక్క సారిగా ఉలిక్కిపడి, వాస్తవంలోకి వచ్చి, అల్లుడు భుజం తట్టి, ఇంటికి వెళ్లడానికి బయలుదేరాడు.

అదే సమయంలో షాపులో గడియారం తొమ్మిది గంటలు కొట్టసాగింది. వారు త్వరలో ప్రారంభించబోయే తొమ్మిదో షాపునకు ఆరంభ సూచకంగా.

***** **శుభం** *****

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు