బ్రతుకు బలిచేయకు - చెన్నూరి సుదర్శన్

Bratuku bali cheyaku

ఆరోజు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలు..

ఆరాధ్యకు నమ్మశక్యం కాలేదు. తను ఫస్ట్ క్లాసు వస్తుందనుకుంటే ఫెయిలయ్యింది. కాళ్లు చేతులు వణుక సాగాయి.

‘నా ముఖం నాన్నకి ఎలా చూపించను? నాన్న నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు? కొడుకువయినా కూతురివయినా నువ్వేరా నా ప్రాణం అంటూ నన్ను తన గుండెల్లో పెట్టుకుని పెంచుతున్నాడు. అమ్మ లేని లోటు రానివ్వడం లేదు. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. ప్రతీ రోజు ఉదయం లేవగానే అమ్మ ఫోటోకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకునే అలవాటు నాది. పరీక్షలన్నీ అలాగే అమ్మ ఆశీర్వాదం తీసుకుని రాశాను. ఎమ్సెట్‍లో మంచి ర్యాంకు వస్తుందని ఎదురి చూస్తుంటే ఇలా జరిగిందేమిటి?’ అని మనసులో అలజడి.. కన్నీళ్ల పర్యంతమైంది.

వంటింట్లో నుండి వచ్చిన ఆమె నాన్న భాస్కర్, మార్కుల పట్టిక చూసి.. “ఆరాధ్యా! ఏంటమ్మా నీ మీద నీకు నమ్మకం లేదా? గణితంలో ఇరవై ఐదు మార్కులంటే ఎలా నమ్ముతున్నావ్?. పిచ్చి తల్లి ఏడువకురా.. నేనున్నాను కదా.. రీ వెరిఫికేషన్ పెట్టిస్తాను. నీ సమాధాన పత్రం జిరాక్స్ కూడా తెప్పిస్తాను” అంటూ బుజ్జగించాడు.

భాస్కర్ కూకట్‍పల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గణితశాస్త్ర లెక్చరర్. . పరీక్షల విభాగపు అధిపతి. దాదాపు ఇరవై సంవత్సరాల అనుభవం, విద్యా బోధనలో, మూల్యాకనంలో మంచి పట్టు వుంది.

***

ఆరాధ్య ఆన్సర్ పేపర్ జిరాక్స్ కాపి వచ్చింది.. ఆతృతగా కవరు తెరచింది. కవరింగ్ లెటరులో ‘మార్క్స్ నో చేంజ్’ అని కనబడే సరికి గుండె జారిపోయింది. చేతులు వణుక సాగాయి. ముందుగా అది తన పేపరేనా అని వెరిఫై చేసుకుంది. అది ముమ్మాటికీ తన పేపరే. మెల్లిగా ఆన్సర్ షీటు ఓపెన్ చేసింది. మార్క్స్ చూసుకుంటూ వెళ్లింది. అన్నీ మూల్యాంకనం చేయబడే ఉన్నాయి. కాని సరియైన సమాధానాలకు కూడా ఫుల్ మార్కులు రాలేదు. ఏదో ఉడుతా భక్తిగా అన్నట్లు అతి స్వల్ప సమాధానాలకు ఒక్కొక్క మార్కు చొప్పున పది వేసారు. స్వల్ప సమాధాన ప్రశ్నలకు కూడా ఒక్కో మార్కు చొప్పున అయిదింటికి అయిదు మార్కులు.. దీర్ఘ సమాధాన ప్రశ్నలు అయిదింటికి రెండేసి చొప్పున పది మార్కులు.. అలా మొత్తం ఇరవై అయిదు మార్కులు అని నమోదు చేయబడి వుంది. అప్రయత్నంగా ఆరాధ్య కళ్లు జలపాతాలయ్యాయి..

భాస్కర్‍కు ఇంట్లోకి అడుగు పెడుతూనే విషయం అవగతమయింది. నెమ్మదిగా ఆరాధ్య వద్దకు వెళ్లి ఆమె చేతిలోని సమాధాన పత్రం తీసుకుని చూశాడు. ఎగ్జామినర్ ఎవరో గాని చాలా తెలివిగా ప్రవర్తించాడు. అతడు రీ-వెరిఫికేషన్ గూర్చి అవగాహన ఉన్నవాడే అని పసి గట్టాడు. జరిమాన తప్పించుకునే యత్నంలో నేర్పుగా మూల్యాకనం చేశాడు.

రీ-వెరిఫికేషన్‍లో కేవలం మూల్యాంకనం చేయని ప్రశ్నలు, జీరో మార్కులు వచ్చిన ప్రశ్నలను మాత్రమే తిరిగి సరి చూస్తారు. మార్కులు నిర్ణయించిన ప్రశ్నలను చూడరు. నిర్ణయించిన మార్కులు తక్కువా? ఎక్కువా? అనే విషయం అసలే పట్టించుకోరు. పది శాతానికంటే అధికంగా వ్యత్యాసం ఉంటే మాత్రం అతడికి జరిమానా వేస్తారు. పూర్వం జరిమానా బదులు వాల్యూయేషన్ క్యాంపు నుండి తాత్కాలికంగా డిబార్ వారు. అలా అయితే మూల్యాంకనం చేయడానికి ఎవరూ మిగులడం లేదని ఇలా జరిమానాతో సరిపుచ్చుతున్నారు.

భాస్కర్ ఒక చిరునవ్వు నవ్వుతూ “ఆరాధ్యా.. అండర్ వాల్యూయేషన్ అయిందిరా.. నీ సమాధానాలన్నీ సరి అయినవే. అయితే పొరపాటున ‘కీ’ ఫాలో గాకుండా మార్క్స్ అలాట్ అయినట్లు గమనించాను. దీని కోసం నేను బోర్డులో అప్పీల్ చేస్తాను. నువేం దిగులు పడకు” అంటూ సమాధాన పరిచాడు. ఆరాధ్య మౌనమే సమాధానమయ్యింది.

***

‘నాన్న ఏదో నన్ను మభ్యపెట్టడానికి అలా అంటున్నాడే కాని ఒక సారి వాల్యూ అయిన తరువాత మళ్లీ వాల్యూ చేయటం.. అది జరగని పని’ అని తన పరిధిలోనే ఆలచిస్తూ ధృఢ నిర్ణయం తీసుకుంది.

ఆ రాత్రి ఫ్యానుకు చున్నీ విసిరేసింది. స్టూలును తన్నిన శబ్దంలో తలుపు తెరుచుకున్న శబ్దం కలిసి పోయింది. వాయువేగంగా పరుగెత్తుకుంటూ వచ్చిన భాస్కర్ ఆరాధ్య కాళ్లను చుట్టేసి పైకి లేపాడు. వణుకుతున్న చేతులతో ఆరాధ్య మెడ కట్టును విప్పతీస్తూ బిగ్గరగా ఏడ్చేశాడు. ఆరాధ్య స్పృహ తప్పి భాస్కర్ భుజంమ్మీద వాలిపోయింది. నెమ్మదిగా ఆరాధ్యను బెడ్ మీద పడుకోబెట్టి టేబుల్‍పై ఉన్న వాటర్ జగ్‍లో నుండి నీళ్లు తీసి ముఖంమ్మీద చల్లాడు.

ఆరాధ్య కళ్లు తెరిచింది. భాస్కర్ టవల్ తో ఆమె ముఖం తుడుస్తూ..

“ఆరాధ్యా నా పెంపకంలో ఇదేనారా నీవు నేర్చుకుంది. ఇన్నాళ్లు కష్టపడి చదివి నీ విజ్ఞానాన్ని ఈ ఫ్యానుకు బలి చేస్తావా? నీకు నా మీద నమ్మకం లేదు సరికదా నీకు నీ మీదే నమ్మకం లేదు. ఇలాగయితే ఎలాగురా? నువ్వు కష్టపడి చదివావు. పరీక్ష చాలా బాగా రాశావు. నీకు గణితంలో నీ గెస్ ప్రకారం సెవెన్టీ త్రీ రావాల్సిందే. కాని ఒక ఎగ్జామినర్ మూల్యాంకనం తప్పిదం వల్ల నీకు అన్యాయం జరిగింది. దాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ ఎగ్జామినర్ నీ పేపరు విషయంలో ఎలా తప్పు చేశాడో..! నువ్వూ నీ జీవితం విషయంలో అలాగే తప్పుడు మూల్యాకనం చేసుకుంటున్నావు. నీ పేపరు పేపరు పోయినట్లే నీ బ్రతుకు బలిచేసుకోవద్దు.. పేపరుకు పునఃమూల్యాకనం చేయిస్తాను. అలాగే నువు కూడా స్తిమితంగా ఆలోచించి నీ జీవిత పుటను పునఃమూల్యాకనం చేసుకో. పేపరు పోతే మళ్లీ రాసుకోవచ్చు గాని ప్రాణం పోతే తిరిగి వస్తుందా?

ఆరాధ్య బిగ్గరగా ఏడుస్తూ .. భాస్కర్ గుండెల మీద వాలి పోయింది... ‘నాన్నా.. ఇలాంటి తప్పు ఇక ముందు చేయను’ అన్నట్టు.

***

భాస్కర్ ఇంటర్మీడియట్ బోర్డుకు వెళ్లి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కమ్ సెక్రటరీ కాశీనాథం గారిని కలిసి ఆరాధ్య మ్యాత్స్ పేపర్ చూపించాడు. మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లను దృష్టికి తీసుకు వచ్చాడు. పునః మూల్యాంకనం కోసం అనుమతి తీసుకున్నాడు. ఫీజు బ్యాంకులో జమచేశాడు. చలాన్ ఒరిజినల్ రశీదు జత చేసి బోర్డులో సబ్మిట్ చేశాడు. ఇది తన కూతురి పేపర్ కనుక వేరే బోర్డుకు అలాట్ చేయుమని వినతి పత్రం జత చేశాడు.

ఆరాధ్య పేపర్ రీవాల్యూ జరిగింది. అనుకున్నట్లుగానే డెబ్బది అయిదు మార్కులకు గాను డెబ్బది మూడు వచ్చాయి. ఆరాధ్య ఫలితం చూసి ఆశ్చర్యపోయాడు కాశీనాథం. ఆరాధ్య రీ-వాల్యూ అయిన పేపరు తెప్పించుకొని ప్రతీ ప్రశ్నను పరిశీలించాడు. రీ-వాల్యూలో ప్రతీ ప్రశ్నకు ఎందుకు మార్కుల్లో తేడా వచ్చిందో నోట్ చేసిన రిమార్క్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి ఆశ్చర్యపోయాడు. ‘ఎంత వ్యత్యాసం?. భాస్కర్ మ్యాథ్స్ లెక్చరర్ కాబట్టి ఆరాధ్యకు న్యాయం జరిగింది. మరి పల్లెటూళ్లలో ఏమీ తెలియని అభాగ్యులు ఎంత మంది బలి అవుతున్నారో..’ అని వాపోయాడు. భాస్కర్‍ను పిలిచి మాట్లాడాడు. భాస్కర్ ఆరాత్రి జరిగిన సంఘటన కాశీనాథంకు వివరించాడు. అర నిముషం ఆలస్యమైతే ఆరాధ్య బ్రతుకు.. ఇలాంటి ఎగ్జామినర్ తప్పిదాల వల్ల బలైపోయేదని కంటతడి పెట్టాడు. కాశీనాథం చలించి పోయాడు.

“కేవలం సూచనలు సర్క్యులర్‍ల ద్వారా పంపటం కాదు సార్.. ప్రతీ సంవత్సరం పేపర్ మూల్యాంకన శిబిరాలలో పిల్లల జీవితాలతో చెలగాటాలాడుకోవద్దంటూ ఆన్‍లైన్లో మీరు మాట్లాడాలి. ఉదాహరణకు కొన్ని శాంపుల్ పేపర్లు తీసుకుని ఎలా పిల్లలకు అన్యాయం జరుగుతుందో చూపించాలి. మీ ప్రేరణ కావాలి. అప్పుడే అందరూ అంకిత భావంతో పనిచేయడానికి అవకాశం వుంటుందని అనుకుంటున్నాను. పై అధికారులందరూ కేవలం ఏసీ గదుల్లో కోర్చోకుండా క్యాంపులను విజిట్ చేయాలి” అంటూ కాస్తా చొరవ తీసుకొని మాట్లాడాడు భాస్కర్.

కాశీనాథంలో చలనం కనిపించింది.. *

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు