విశ్వనాథం మాస్టారు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా అనేక ప్రాంతాల్లో పని చేసి పదవీ విరమణ తర్వాత పుట్టి పెరిగిన అగ్రహారంలో స్థిరపడాలనుకున్నారు. కొడుకులు ఇద్దరూ ఉధ్యోగరీత్యా ఇతర రాస్ట్రాల్లో ఉండగా ఏకైక కుమార్తెను వివాహం కావించి అత్తారింటికి పంపించారు. అగ్రహారంలో వారి పూర్వీకుల పెంకుటింటిని మరామ్మత్తులు చేయించి భార్య అన్నపూర్ణ తో కాపురం పెట్టారు. విశ్వనాథం మాస్టారు ఎంత సౌమ్యులో అంత పరోపకార వ్యక్తిత్వ మున్న మనిషి. పేదరికం , నిరక్షరాస్యత , మూఢ నమ్మకాలు, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజల్లో చైతన్యం తెచ్చి పురోభివృద్ధికి పాటు పడాలనుకున్నారు. అన్నపూర్ణమ్మ గారు కూడా నలుగురికి సాయం చెయ్యడం, దాన ధర్మాల్లో ముందుంటారు. కష్టమైనా సుఖమైనా భర్తకు బాసటగా ఉంటారు. అగ్రహారం చేరిన మాస్టారు ముందుగా గ్రామ ప్రభుత్వ పాఠశాల మీద దృష్టి పెట్టి గ్రామ సర్పంచి సాయంతో మరామ్మత్తులు కావించి తన పెన్సన్ డబ్బులు ఖర్చు చేసి విధ్యార్దులకు కావల్సిన మౌలిక వసతులు కల్పిచారు. ఊరి రచ్చబండ సమావేశాల్లో ప్రజలకు నచ్చచెప్పి వారి పిల్లల్ని పొలం పనులు , పశువులు తోలుకెళ్ల కుండా పాఠశాలకు వచ్చేలా చేసారు. జిల్లా విధ్యాధికారికి పరిస్థితులు వివరించి ఆర్థిక వనరులతో పాటు ఉపాధ్యాయుడిని నియమించారు. గ్రామ పురోభివృద్ధి కోసం మండల రెవిన్యూ అధికారుల్ని కలిసి బాలవాడి కేంద్రానికి, పాఠశాల విధ్యార్దుల మధ్యాహ్న భోజన పథకానికీ , గ్రామ ప్రజల నిత్యావసర వస్తువుల పంపిణీకి అవకాశం కల్పించారు. ప్రాంతీయ , జిల్లా వైధ్యాధికారుల సహకారంతో గ్రామం లో ఆరోగ్య సేవిక సేవల ద్వారా శిసు , స్త్రీల ఆరోగ్య రక్షణ, పరిసరాల శుభ్రత గురించి అవగాహన కలగ చేసారు. నిరక్షరాస్యులైన రైతు కూలీయువత , కులవృత్తుల వారిలో తాగుడు, ధూమపానం, జూదం వంటి దుర్వస్యనాలకు దూరం పెట్టి సహకార సంఘాలు ఏర్పాటు చేసి డబ్బు పొదుపు చేయిస్తున్నారు. బ్యాంకు అధికారుల్ని సంప్రదించి యువతకు కోళ్ల పెంపకానికీ , బోర్లు తవ్వించి కాయకూరల సేద్యానికి రవాణా సౌకర్యాలతో పట్నానికి పంపి ఆర్థికంగా చేయూత నిచ్చారు. స్త్రీ లకు పాడిపశువుల పెంపకం , పాల ఉత్పత్తులను పాల కేంద్రం ద్వారా సరఫరా చేసి ఆర్థిక సాయం ఏర్పాటు చేసారు. ఊరిబయట ఉన్న కొండవాగుకి చెక్ డ్యామ్ నిర్మించి వర్షాకాలంలో వరద నీటిని ఊరి చెరువుకి చేర్చి చేపల పెంపకానికి దోహద పడ్డారు. గ్రామ సర్పంచి ఎన్నికల్లో చదువుకున్న యువకుల్ని ఎన్నుకుని పురోభివృద్ధికి కృషి చేసారు. గ్రామ పంచాయతీ ఆఫీసుకీ, రామాలయానికి, రచ్చబండకు కొత్త సొగసులొచ్చాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ముందు జండా రాట పాతి జాతీయ దినాలపుడు జండా ఆవిష్క్ రణ జరిపి విధ్యార్థుల్లో జాతీయ భావన కలగచేసారు. ఊళ్లో విథ్యుత్ వెలుగుల్లో గ్రామ దేవతల ఉత్సవాలు ఘనంగా జరుపు కుంటున్నారు.విశ్వనాథం మాస్టారు వచ్చిన తర్వాత అగ్రహారం గ్రామ దశ దిశ మారి పోయింది. జిల్లాలో ఉత్తమ పంచాయతీగా జిల్లాధికారి చేతుల మీదుగా నగదు పారితోషికం, ప్రశంసా పత్రం అందుకున్నారు. మాస్టారి కృషి వల్ల అన్ని రంగాల్లో గ్రామం పురోభివృద్ధి చెందుతోంది. వారికి వయసు పెరిగి వృద్ధాప్యం కారణంగా చేతి ఊతకర్ర వాడమని వైద్యులు సలహా ఇచ్చారు. విశ్వనాథం మాస్టారు అగ్రహారం వచ్చిన కొత్తలో వారి పూర్వీకులు భద్రపరచిన కొన్ని వస్తువులతో పాటు వారి తాత గారు వాడిన చేతికర్ర బయట పడింది. మాస్టారు దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి అటక మీద ఉంచారు. నల్లమద్ది కర్రతో చేసిన ఆ చేతికర్ర చేతివంపు దగ్గర నాగసర్ప పడగతో వెడల్పుగా పట్టుకోడానికి వీలుగా ఉంటుంది. విశ్వనాథం మాస్టారి తాత గారు అగ్రహారం గ్రామ కరణంగా పనిచేసే రోజుల్లో ఎవరో కోయదొర కొండదేవత కానుకగా ఇచ్చారట. కొండదొర ఇచ్చిన ఆ చేతికర్ర మహిమో లేక మరే కారణమో తెలియదు , రాజా వారి సంస్థానంలో కాని అగ్రహారం ఊళ్లో కాని కరవు కాటకాలు లేకుండా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలకు కొదవ ఉండేది కాదట.ఊరి ప్రజలు సభిక్షంగా సుఖసంతోషాలతో ఉంటున్నారు. తర్వాతి కాలంలో రాజ సంస్థానాలు పోయి అగ్రహారాలకు ఆర్థిక వనరులు లేక అదునుకు వర్షాలు పడక పంటలు పండక ఊరి ప్రజలు జీవనోపాధికి ఎక్కడెక్కడికో పోయారు. గ్రామం అభివృద్ధిలో వెనక పడి పోయింది. మళ్లీ విశ్వనాథం మాస్టారి కృషి పట్టుదల వల్ల పూర్వ వైభవం సంతరించుకుంది. అటక మీద నుంచి తాత గారి నగిషీల ఊతకర్రను కిందకు తెచ్చిన మాస్టారు దాని దుమ్ము దులిపి నగిషీలకు , చేతి వంపు దగ్గరున్న నాగ సర్పపడగను నూనెగుడ్డతో మెరీసేలా చేసారు. నల్ల మద్దికర్రతో చేసినందున చూడ ముచ్చటగా ఉంది. అన్నపూర్ణమ్మ శ్రావణ వరలక్ష్మి పూజ కావించి చేతికర్రను భర్తకు అందించింది. .దాన్ని చేతిలోకి తీసుకుని నడుస్తుంటే చెప్పలేని అనుభూతి కలిగింది. పైనుంచి తాత గారు ఆశీర్వదిస్తున్నా రనిపించింది. కొద్ది రోజుల తర్వాత మాస్టారు బంధువులతో పుణ్యక్షేత్ర సందర్సనకు బయలుదేరారు. ఒకచేత్తో ఊతకర్ర మరోచేత్తో సరుకుల సంచితో నడుస్తుంటే సరుకుల చేతిసంచి బరువు తెలిసేది కాదు.ఎంత దూరం నడిచినా అలసట భావన ఉండేది కాదు. పుణ్యక్షేత్ర సందర్సనలో ఒకచోట అందరూ అలసి ఆలయ ప్రాంగణంలో నిద్రపోయారు. విశ్వనాథం మాస్టారు వారి ధర్మపత్ని అన్నపూర్ణమ్మ గుడి చివర సామాన్లు ఊతకర్ర పక్కన పెట్టుకుని నిద్ర పోయారు. అర్థరాత్రి ఒకదొంగ మాస్టారి తల దగ్గరున్న బేగ్ పై నున్న నాగసర్పపడగ చేతికర్రను పక్కకి నెట్టి బేగ్ తియ్యబోయాడు. అంతే , ' అమ్మో' పాము అంటూ పరుగెత్తాడు. అందరూ కలిసి వాడిని పట్టుకుని నిలదీస్తే ఆ బేగులో పాముందని భయపడుతు చెప్పాడు. వారందరూ లేచి చూస్తే వాడి చేతిమీద పాముకాట్లు కనిపించాయి. సామాన్లన్నీ వెతికినా పాము జాడలేదు. అలా ఎలా జరిగిందోనని అందరు ఆశ్చర్యపోయారు. పుణ్యక్షేత్ర దర్సన జరిగి క్షేమంగా అగ్రహారం చేరుకున్నారు మాస్టారు దంపతులు. మరో సంఘటన ఏమిటంటే , ఏదో పని మీద విశ్వనాథం మాస్టారు ప్రయాణం చేస్తున్న బస్సు నది బ్రిడ్జి మీదుగా వెళుతుండగా బస్సు ముందు చక్రం ఊడి వంతెన గోడెక్కి ఆగిపోయింది. ప్రమాదం జరిగితే ముందు కూర్చున్న మాస్టారి వైపే నదిలో పడేది. చమత్కారం, బస్సు ముందుకు కదల లేదు. మాస్టారి చేతిలోని నాగ సర్ప పడగ చేతికర్ర బస్సు కొక్కానికి శ్రీరామరక్షలా వేలాడుతూ రక్షణ గోడను ఆని ఆపింది. మాస్టారితో పాటు బస్సు డ్రైవరు మిగతా ప్రయాణీకులు పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డామని ఆనందాశ్చర్యాలకు గురయారు. ఇది వరకు జరిగిన సంఘటనలు ఇప్పుడు జరిగిన దుర్ఘటన చూసిన మాస్టారికి ఈ చేతికర్రలో ఏదో మహత్తు ఉందని గ్రహించారు. కోయదొర తాత గారికి ఇచ్చిన ఈ అద్భుత చేతికర్ర తనను చాలా ఆపదల నుంచి కాపాడిందని నాగసర్పపడగను కళ్లకి అద్దుకున్నారు. * * *