నాలుగు రోజులుగా ... అపస్మారక స్థితిలో ఉన్న ఖలీద్ మెల్లగా కన్నులు తెరుస్తున్నాడు... కంటిమీద కునుకును దూరంగా తరిమేస్తూ, ఈ క్షణం కోసమే ఎదురు చూసిన లక్ష్మి చిరునవ్వుతో ఖలీద్ వైపు చూసింది. శరీరం కదపడానికి ఏమాత్రం సహకరించక... కనురెప్పలు మాత్రమే కదిలిస్తూ చుట్టూ చూసాడు ఖలీద్ కి 'తనో హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడన్న సంగతి తెలియడానికి కాస్త సమయం పట్టింది' ఆశ్చర్యంగా అర్థంకాక లక్ష్మి వైపు చూసాడు "మీకేమి కాలేదు..గాభరాపడకండి ధైర్యంగా ఉండండి. మీరు కన్నులు తెరిస్తే వచ్చి చెప్పమన్నారు డాక్టర్ గారు వారికి చెప్పి వెంటనే వస్తాను. " అనేసి ఐ.సి.యు గదినుండి బయటకు వెళుతున్న లక్ష్మి నే చూస్తూన్న ఖలీద్ కి ఏమైంది నాకు అనుమకుంటూ మెల్లగా కళ్ళు మళ్లీ మూతపడిపోడంతో మగతలోకి జారుకున్నాడు ****** ఖలీద్ విలాసాలకు కేరాఫ్ అడ్రస్ బ్రతికుండగానే జీవితాన్ని అనుభవించాలి అనే కాన్సెప్ట్ తప్ప మరోకటి అతని నోటినుండి రావడం శ్రీరామ్ కాలనీలో ఎవ్వరూ వినివుండరు. నిత్యం మద్య సేవనం .చైన్ స్మోకింగ్, మగువలతో కాలక్షేపం ఇవే అతని నిత్యకృత్యాలు. ట్రక్క్ డైవర్ గా దుబాయ్ లో ఇరవై సంవత్సరాలు ఉద్యోగం చేసి,ఈ మధ్యకాలంలో నే ఇండియా తిరిగి వచ్చి.శ్రీ రామ్ కాలనీలో ఓ ఇల్లు కొనుక్కుని నివాసం ఉంటున్నాడు ఖలీద్. స్త్రీలపట్ల అతనికి ఏమంత సదభిప్రాయం లేదు. కారణం తన తల్లి చిన్న తనంలోనే తనని అనాథను చేసి తన సుఖం కోసం ఓ మార్వాడితో వెళ్ళిపోవడం కావచ్చు.. అటుపై బతకడానికి అతను ఎంచుకున్న మార్గం, అతను పెరిగిన వాతావరణం , చుట్టూ తనకి పరిచయమైన చెడు సావాసాలు కావచ్చు. తప్పతాగి ఏ అర్దరాత్రో ఇంటికి రావడం. వస్తూ వస్తూ ఎవరినో ఒకరిని ఇంటికి తెచ్చుకోవడం.ఉదయమే డబ్బులు ఇచ్చి పంపించేయడం ఖలీద్ అలవాటుగా మారిపోయింది. డబ్బు కోసమే స్త్రీ తన దగ్గరకు వస్తుందనే చులకన అభిప్రాయం ఖలీద్ మనసులో బాగా ముద్ర పడిపోయింది. అటువంటి మనస్తత్వం ఉన్న ఖలీద్ ఇంటి ముందు అద్దెకు దిగింది లక్ష్మీ అనే అందమైన స్త్రీ. రాత్రి పూట కార్లు రావడం , లక్ష్మిని పికప్ చేసుకుని వెళ్ళడం. తిరిగి ఉదయం వచ్చి దించి వెళ్ళడం గమనించిన ఖలీద్ లక్ష్మిని కాస్ట్ లీ కాల్ గాల్ గా భావించాడు. ప్రయత్నిస్తే తనకూ పడకపోతుందా అని ఎన్నో రకాలుగా ఎంతో ప్రయత్నం చేసాడు...మ్ డబ్బు ఆశ చూపించాడు.బంగారం ఆశ చూపించాడు. బతిమాలాడు బెదిరించాడు. దేనికీ ఆమె ఏమాత్రం సమాధానం ఇవ్వకపోవడంతో.. చివరకు చులకన మాటలతో తులనడుతూ తన అక్కసునంతా చూపించడం మొదలు పెట్టాడు. ఎన్ని వెర్రిమొర్రి వేషాలు వేస్తున్నా... లక్ష్మి చిరునవ్వుతో తలవంచుకు వెళ్ళిపోయేది. అది ఇంకా అవమానంగా భావించాడు ఖలీద్. చివరకు తనని కిడ్నాప్ చేయించాలనుకున్నాడు. దానికోసమై పన్నాగాలు ఆలోచిస్తూ ఇంటికొస్తున్న రాత్రి ఎడతెరిపిలేకుండా వర్షం. తాగిన మత్తు లో సరిగా నడవలేని పరిస్థితి. దూరంగా ఆకాశం గర్జించింది. ఉరుములు కన్నులు తెరచి చూడలేని వెలుగు.. అడుగు తడబడుతుంది. ముందు దారి ఏమిటో ఏమీ కనిపించడం లేదు. సరిగ్గా అప్పుడే జరిగిందొక సంఘటన... ఖలీద్ కెవ్వుమన్న కేకతో మ్యాన్ హోల్ లోకి జారిపోయాడు **** లీలగా ఏవో మాటలు వినిపిస్తుండటంతో మెల్లగా కళ్ళుతెరిచి చూసాడు ఖలీద్.. "ఏం ఫర్వాలేదు మేడమ్.. సమయానికి తీసుకు వచ్చి అతని ప్రాణాలు కాపాడగలిగారు. మీకే అతను ఋణపడి ఉన్నాడు మీరు కాదు. రేపు అతన్ని డిశ్చార్జి చేస్తాం మేడమ్. మీరు రావాల్సినంత అవసరంలేదు . హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్నీ నేను దగ్గర ఉండి చూసుకుంటాను . మీరింకా వెళ్లి రెస్ట్ తీసుకోండి. ఉంటాను .."అంటూ డాక్టర్ లక్ష్మికి నమస్కరించడం ఖలీద్ కు ఆశ్చర్యం కలిగించింది.ఆమె కృతజ్ఞతలు చెప్తూ నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించి డిశ్చార్జి అవుతూ డాక్టర్ ని అడిగాడు ఖలీద్... డాక్టర్ చెప్పిన విషయం అతనిలో అనూహ్యమైన మార్పుకి కారణం అయింది.. ****** తనని అసహ్యించుకునే వారంతా ఇప్పుడు గౌరవిస్తుంటే ఒక మనిషిలా గుర్తిస్తుంటే..మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ అలోచనలు గతంలోకి మళ్ళాయి ఖలీద్ ఒకప్పటి సప్తవ్యసనాల దిగజారుడు మనిషి కాదు. తానిప్పుడు క్యాబ్ డ్రైవర్. లక్ష్మీని ప్రతిరోజు సాయంత్రం బయటకు తీసుకు వెళ్ళి ఉదయం ఇంటికి తీసుకు రావడం అతని జీవితంలో భాగమైయింది. అతనిలోని మార్పుకు కారణం ఆరోజు హాస్పిటల్లో డాక్టర్ చేప్నినమాటలు. "డాక్టర్ మీరు తనకు నమస్కరించడం నాకు కొంత ఆశ్చర్యం కలిగించింది. మీరు పెద్దడాక్టర్ అయివుండి కూడా...అంటూ సందేహంగా అడుగుతున్న ఖలీద్ మాటలకు డాక్టర్ కృపాకర్ చిరునవ్వుతో "ఆమె మెడిసిన్ పూర్తి చేసి ఏమాత్రం స్వలాభాపేక్ష లేకుండా సమాజం సేవ చేస్తున్న సమాజ సేవకురాలు. పగలు మెడికల్ విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తుంది. సిటీలో ఉన్న డాక్టర్సు ఏ సమయంలో ఏ సహాయం కావాలన్నా చేస్తారు.ఆపరేషన్ విభాగంలో సహాయం చేయడానికి వస్తుంటారు. డబ్బులు తీసుకోరు..ఇతరులకు తనకు చేతనైన సేవ చేసుకునే భాగ్యం తనకు కల్పించినందుకు తిరిగి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. తను ఎవరికైతే చికిత్స చేస్తారో వారికి మెడిసిన్ మొత్తం ఇప్పించి వెళ్తారు. అదే ఆమెలోని గొప్పతనం..చేతులు ఎత్తి నమస్కరించేలా చేస్తుంది..." అన్న డాక్టర్ మాటలతో ఒక్కసారిగా ' తాను ఎంత నీచంగా ప్రవర్తించిందీ ఎంతగా ఇంతటి మహోన్నత వ్యక్తిత్వాన్ని అవమానించిందీ తలచుకొని కన్నీళ్ల పర్యంతం అయ్యాడు.. క్షమాపణ కోరే అర్హత అయినా తనకుందా అని ప్రశ్నించుకున్నాడు' ఖలీద్ ఆ అర్హత సంపాదించుకునే పనిలో తనని తాను మంచిగా మార్చుకున్నాడు.. ఆలోచనల్లో లక్ష్మి రావడం గమనించలేదు ఖలీద్. "ఏం ఖలీద్ గత జ్ఞాపకాల్లోకి వెళ్ళాలా ఏంటి" అన్నీ లక్ష్మి మాటతో వాస్తవంలోకి వచ్చాడు ఖలీద్. "ఊరు కొండి మేడమ్ గుర్తు పెట్టు కోవాలనుకునే గతమా అది"అంటూ క్యాబ్ స్టార్ట్ చేసాడు. *ఉపన్యాసాలు ఇస్తూ ఎవరూ ఎవరినీ మార్చక్కర్లేదు మార్చలేరు కూడా.. ఒకవేళ మారినా స్థిరత్వం ఉండదు. ... మాటలు ద్వారా మారని మనిషి ఆచరించి చూపడం ద్వారా ఎదుటిమనిషి లో క్షేత్రస్థాయిలో పెనుమార్పులు జరిగి ఉన్నతమైన జీవనం ఇకపై చేస్తాడు..* అదే ఈ కథ లో లక్ష్మీ పాత్ర ఖలీద్ ని మార్చిన వైనం...