తీరని కోరిక - కొడాలి సీతారామా రావు

Teerani korika

చంద్ర శేఖర్ అనుమతి లేకుండా నా గదిలోకి వచ్చి పదిహేను రోజులు శెలవు కావాలని చెప్పిన కారణం విని నేను నిశ్చేస్టుడినయ్యాను.

###

నేను పనిచేస్తున్న గంగారం సాఠె సైంటిఫిక సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి జూనియర్ సైంటిస్టుల కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. నిజానికి ఆ ఇంటర్వ్యూలు మా చైర్మన్ గంగారాం గారు,మా సీనియర్ సైంటిస్ట్,చీఫ్ ఎక్జిక్యూ టివ్ డైరెక్టర్ శ్రీ ప్రకాశ్ పాఠక్ గారు చేయాలి.కానీ కొద్ది రోజుల ముందు మా చైర్మన్ గారు తన భార్య వైద్యం నిమిత్తం అమెరికా వెళ్ళారు. ఎప్పుడొస్తారో తెలియదు. ఇంటర్వూలు రద్దు చేయటం ఇష్టం లేదు. ఒక కారణం అభ్యర్ధులు నిరాశ పడతారు. మరో కారణం కేంద్ర,రాష్త్ర ప్రభుత్వాల నుంచీ వచ్చే కొత్త పరిశోధనల గురించిన విజ్ణప్తులు చాలెంజి గా తీసుకోవాలి అనే మనస్థత్వం. అందువల్ల నన్ను కూడా మా డైరెక్టర్ గారికి సహకరించమన్నారు.

చంద్రశేఖర్ ఇంటర్వ్యూ బాగా చేసాడు. అతను లేచి వెళ్ళి పోయేటప్పుడు అతన్ని అడిగాను అతని తల్లి పేరు భువనేశ్వరి అని అతని అప్లికేషన్ లో చూసాక. “మీ తాత గారు నారాయణ రావు గారా ?” అని. అతను ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి నవ్వుతూ చెపాడు “అవును” అని. నేను వెంటనే అన్నాను “ ఆయన దగ్గిర లెక్కలు నేర్చుకున్నాను తాడేపల్లిగూడెం లొ.” అతను నవ్వుతూ “ చాలా సంతోషం సార్. మా అమ్మ గారు చాలా సంతొషిస్తారు.”అని వెళ్ళిపోయాడు.

మా డైరెక్టర్ గారు నా వంక చూసి “ఇంటర్వ్యూలలో ఇలా వ్యక్తిగత వివరాలు అడిగితే వాళ్ళు ఆ పరిచయాల వల్లే తాము ఎంపిక అయ్యాము అని పొరబడే అవకాశం వుంది. ఐతే ఇతను ఇంటర్వ్యూ బాగా చేసాడు.” అన్నారు. నేను వెంటనే పొరబాటు ఒప్పుకున్నాను.

###

నేను ఏడో తరగతి చదివేటప్పుడు భువనేశ్వరి తొమ్మిదో తరగతి చదివేది. మా ఇంటి పక్కనే వుండేవాళ్ళు. వాళ్ళ నాన్న గారు లెక్కల మాష్టారు. ఒకే స్కూల్లో చదివే వాళ్ళం. ఒకరోజు భువనేశ్వరి మా ఇంటికి వచ్చి నన్ను ఒకసారి బయటికి రమ్మంది. అప్పుడు సమయం రాత్రి ఏడుగంటలు. నేను తనతో బయటికి వచ్చాను. మా ఇళ్ళు ఒక దాని వెనుక ఒకటి వుంటాయి. అందువల్ల మా ఇళ్ళు ఒక సందులో వున్నట్టు వుంటాయి. వీధి దీపం వెలుతురు ఎక్కువ పడదు.చీకటిగా వుంటుంది.

భువనేశ్వరి వాళ్ళ ఇంటి గుమ్మం ఇవతల ఆగి వెనక్కి తిరిగి నన్ను కౌగిలించుకుని ఘట్టిగా ముద్దులు పెట్టింది. నాకు అర్ధం కాలేదు ఎందుకలా చేసిందో. తను వెళ్ళిపోతూ

“ఎవరికీ చెప్పకు. నువ్వంటే నాకు ఇష్టం.” అని వాళ్ళ ఇంటిలోకి వెళ్ళిపోయింది. నాకూ బావుంది ఆ అనుభవం. ఒక క్షణం ఆగి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్ను చూస్తూనే కంగారు పడింది. నేను వాళ్ళ ఇంట్లో చెప్తాననుకుంది. ఊరికే వచ్చాను అని చెప్పాను. వాళ్ళ అమ్మ గారు లోపల వున్నారు.వాళ్ళ తమ్ముడు మూడేళ్ళుంటాయి.అడుకుంటున్నాడు.కాసేపు కూర్చుని వచ్చేసాను.

ఆ తర్వాత అలా చాలా సార్లు చేసింది. నేనూ ప్రతిస్పందించేవాణ్ణి. ఒక సారి స్కూలు నుంచి వస్తుంటే నా భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ “నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను.” అంది.

నేను నవ్వి, “పెళ్ళి చేసుకోవాలంటే నేను నీకన్నా పెద్దవాణ్ణి అయి వుండాలి. ఉద్యోగం చెయ్యాలి.” అన్నాను.

“నీకన్నా ముందు నా చదువు అయిపోతుంది కదా.నేను ఉద్యోగం చేసి నిన్ను చదివిస్తాలే.” నేను నవ్వేసాను.

ఆ ఏడాది పరీక్షలయ్యాక శెలవుల్లో మా నాన్న గారికి భువనేశ్వర్ బదిలీ అయిపోవటం తో వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు తను ఎన్నోసార్లు చెప్పింది ఉత్తరాలు రాస్తూ ఉండమని.

కానీ నేను ఎప్పుడూ ఉత్తరాలు రాయలేదు. కానీ ఒకసారి మా నాన్న గారి ఆఫీసుకి నా పేరున ఉత్తరం వచ్చింది. అందులో ఏం రాసిందో అని కంగారు పడ్డాను. అందులో ఉత్తరాలు రాయమనే రాసింది.

ఆ తర్వాత మా నాన్న గారికి అనేక ప్రదేశాలకి బదిలీ అవుతుండటం వల్ల నా చదువు చాలా చోట్ల జరిగింది. చివరికి పీ హెచ్ డీ చేసాకా ఈ సంస్థలో వుద్యోగం వచ్చింది సైంటిష్టుగా.

నేను ఉద్యోగంలో చేరినప్పటినుంచి పెళ్ళి చేసుకోమని మా అమ్మనాన్న చెప్తున్నారు.ఇప్పటికే ఆలస్యమైందని వారి భావన. అందుకే భువనకి పెళ్ళి కాకపోతే తనని పెళ్ళి చేసుకుందామనుకున్నాను.

ఉద్యోగం లో చేరిన ఏడాదికి ఒక వారం రోజులు శెలవు పెట్టి తాడేపల్లిగూడెం వెళ్ళాను.మేము ఇంతకుముందు వున్న ఇంటిలో వేరే వాళ్ళు వున్నారు. వాళ్ళకి నారాయణ రావు గారు తెలియదు. నేను మేము చదువుకున్న స్కూలుకు వెళ్ళాము. అక్కడ హెడ్ మాష్టరు గారిని కలిసి అడిగితే వారు ఐదేళ్ళ కిందటే రిటైర్ అయ్యారనీ, విజయవాడలో వుంటున్నారనీ వారి చిరునామా ఇచ్చారు.

విజయవాడలో వారి ఇల్లు కనుక్కోవటం కష్టం కాలేదు. అక్కడ తెలిసింది భువనేశ్వరికి రెండేళ్ళ క్రిందట పెళ్ళయిందని,చెన్నై లో వుంటోందని,ఒక కొడుకని. అక్కడినుంచీ బయటికి వస్తున్నప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా నాతో పాటు బయటికి వచ్చాడు తన చేతిలో ఒక కవరు వుంది. కొంత దూరం వెళ్ళాక ఆ కవరు నా చేతిలో పెట్టి చెప్పాడు “ మా అక్క చాలా కాలం పెళ్ళి చేసుకోవటానికి ఇష్ట పడలేదు. అమ్మా నాన్న ఒప్పించి చేసారు. అక్క పెళ్లి అయ్యాక తన పుస్తకాలు సర్దుతుంటే ఒక పుస్తకం లో మీ గురించి రాసుకున్నది కనపడింది. అందులో మీకు రాసుకున్న వుత్తరాలు వున్నాయి. అప్పుడే తెలిసింది తను పెళ్ళి ఎందుకు ఇష్టపడలేదో. మీరంటే చాలా ప్రేమ అక్కకి.ఎప్పటికైనా కలుస్తారని,మిమ్మల్నే పెళ్ళి చేసుకోవాలనీ కలలు కంది. ఆ పుస్తకం చేద్దామనుకున్నా. కానీ మనసు ఒప్పలేదు.ఎప్పటికైనా మీ జాడ తెలిస్తే మీకు అందించాలనుకున్నా. “ అతను పుస్తకం నాకు ఇచ్చి వెళ్ళి పోయాడు.

నేను మా అమ్మానాన్న దగ్గిరకి వెళ్ళటానికి బస్సు ఎక్కాను. ఆ పుస్తకం తెరిచి చదువుతుంటే నా కళ్ళంట నీళ్ళు కారాయి. తను నన్ను ఎంతగా ప్రే మించింది!ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించాను. ఎలాగూ మా వాళ్ళు నన్ను పెళ్ళి చేసుకోమంటున్నారు. కనుక చెన్నై వెళ్ళి తనని కలిసి తనని పెళ్ళి చేసుకోవటమా, లేక వేరే పెళ్ళి చేసుకోవటమా. కొంచం సందిగ్దంలో పడ్డాను.ఆలోచిస్తే తను తల్లి కూడా అయింది. సంతషంగానే వుండి వుంటుంది. ఇప్పుడు వెళ్ళి ఆమెలో అలజడి రేపటం సమంజసం కాదు.

మా వాళ్ళకి చెప్పాను పెళ్ళి ఏర్పాట్లు చేయమని.

@@@

ఆరు నెలల తర్వాత చంద్రశేఖర్ నాతో అన్నాడు “మా అమ్మా నాన్న గారు వచ్చారు చెన్నై నుంచీ. మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు.”

“అంత ప్రత్యేకత ఏముందయ్యా. నాకు ఇష్టం వుండదు.”అని చెప్పా.

“వాళ్ళు మిమ్మల్ని కలుసుకోవాలనే వచ్చారు సార్.”

“సరే,నేనే వాళ్ళని కలుస్తాలే.” అని వాళ్ళుంటున్న హోటల్ వివరాలు తీసుకున్నాను.

ఆ సాయంత్రం హోటల్ కి వెళ్ళాను. వాళ్ళ నాన్న గారు తలుపు తీసారు. నన్ను పరిచయం చేసుకుని లోపలికి అడుగు పెట్టాను.భువన కోసం చూసాను. తను దూరంగా కిటికి దగ్గిర పుస్తకం చదువుకుంటున్నది లేచి వచ్చింది నమస్కారం చేస్తూ. ఆమె కళ్ళల్లో వెలుగు గమనించాను.

పాత విషాయాలు ఏమీ రాకుండా కాసేపు కూర్చుని వచ్చేసాను.నిజానికి తనలో పెద్ద మార్పు ఏమీ లేదు.వయసు వల్ల వచ్చిన కొద్ది మార్పులు తప్ప. నిజానికి చిన్నప్పటికన్న ఇప్పుడే ఆకర్షణగా వుంది. ఆమెని చూసాక నాకు చిన్నప్పటి విషయాలన్నీ కళ్ళ ముందు కదలాడేయి.

@@@

ఒక వారం తర్వాత లంచ్ టైంలో ఫోన్ వస్తే తీసాను. భువన మాట్లాడుతోంది “ఫోన్ పెట్టేయకు. నేను చెప్పేది విను. నీకోసం ఎన్నాళ్ళో ఎదురు చూసాను. ఎప్పటికైనా కనిపిస్తావనే ఆత్మహత్య చేసుకోలెదు. అమ్మనాన్న కోసం పెళ్ళి చేసుకున్నాను. నిజానికి నేను కాపురం చేసింది మానసికంగా నీ తోనే.ఇప్పుడు నాకు చాలా సంతోషంగా వుంది.ఇప్పుడైనా మనం పెళ్ళి చేసుకుందాం. కొన్నాళ్ళైనా కలిసి జీవిద్దాం. ప్లీజ్. నా మాట కాదనకు. నా కోరిక తీర్చు.”

“భువనా నా మాట విను.ఇప్పుడు మనం అలా చేస్తే మన ఆత్మీయులు ఎంత అవామానాలు పొందుతారు. మనల్ని మాత్రం ఎవరైనా గౌరవంగా చూస్తారా. ఈ జన్మ కింతే. వచ్చే జన్మలో మన కోరిక తీరాలని కోరుకుందాం. దయచేసి ఇంక ఇటువంటి ఆలోచన మానేయ్.” ఫోన్ పెట్టేసాను.

@@@

మరునాడు ఉదయం చంద్రశేఖర్ నా గదిలోకి అనుమతి లేకుండా వచ్చి చెప్పాడు, “మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది.కారణం తెలియదు. నాకు పదిహేను రోజులు శెలవు కావాలి.” అని.

నేను నిశ్చేష్టుడినయ్యాను. నేను ఊహించలేదు.భువన ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని. తను ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన సమయం వచ్చినా కోరిక తీరలేదు. నిరాశతో ఆత్మహత్యకి పాల్పడింది. తొందరపడింది అనిపించింది.చెంతను న్నది బంగారు జీవితమే అనుకోలేదే అని బాధ పదుతున్నాను.@

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు