ఓ పల్లెటూరిలో పేరయ్యనే వాడు భార్య, పిల్లాడితో జీవనాన్ని సాగిస్తున్నాడు అతను కొన్ని సమయాల్లో అర్థం పర్థం లేని పనులను చేస్తుంటాడు.అందుకే వూర్లో జనం అతడ్ని తిక్కల మొహం పేరయ్యని పిలుస్తుంటారు. పేరయ్య క్రమంగా పనికెళితేనే పూట గడుస్తుంది.కాని అతను వెళ్ళడు . వీధిలో వున్న చిన్నపిల్లలతో ఆడుకొంటూ పోసుకోలు వ్యవహారాలతో పొద్దు వెళ్ళబుచ్చుతుంటాడు.ఆ కారణంతో అతని భార్య పనికి వెళ్ళడం ప్రారంభించింది. పదిహేను రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తోందనగా పిల్లాడికి కొత్త బట్టలు కొనాలన్న ఆలోచన వచ్చింది పేరయ్యకు. అతని వద్ద డబ్బుల్లోవు.తిన్నగా బట్టలకొట్టు బాలయ్య వద్దకెళ్ళాడు. "అయ్యా! సంక్రాంతి పండగొస్తోంది. పిల్లాడికి కొత్తబట్టలు కావాలి.బట్టలు అప్పుగా ఇప్పిస్తే రెండు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను"అన్నాడు. అందుకు బట్టలకొట్టు బాలయ్య"అరువుకు బట్టలు రావు.అలా అప్పుచేసి పండగ చేసుకోక పోతే నిన్నెవ్వరు కొట్టరు.అయినాడబ్బుకావాలని అంటున్నావు కనుక ఆ ఏడుకొండల వాడికి వుత్తరం రాసుకో నీ మొరనాలకిస్తాడు.వెళ్ళు"అని మాయ మాటలు చెప్పి పంపించేశాడు. బట్టలకొట్టు బాలయ్య చెప్పింది నిజమనుకొన్నాడు పేరయ్య. వెంటనే 'స్వామీ! రాబోయే సంక్రాంతి పండక్కల్లా నా పిల్లాడి బట్టలకు, ఇంటి ఖర్చులకు గాను నాకు మూడు వేల రూపాయలు కావాలి. పంపించు'అని 'ఏడుకొండల స్వామివారికి, తిరుపతి" అన్న చిరునామాకు వుత్తరాన్ని రాసి పోస్టు డబ్బాలో వేసి కిమ్మనకుండా డబ్బుకోసం ఎదురు చూశాడు. పేరయ్య ఎదురు చూసినట్టే వారం రోజుల్లో తన పేరా రెండు వేల రూపాయలు మనియార్డరు వచ్చింది.అంతే! ఎనలేని ఆనందంతో పొంగి పోయాడు పేరయ్య.ఆడబ్బుతో పిల్లాడికి బట్టలు కొన్నాడు.బోలెడు పిండివంటలతో,భార్య పిల్లాడితో పండుగను బ్రహ్మాండంగా జరుపు కొన్నాడు. అయితే తను దేవుడ్ని కోరుకొంది మూడు వేల రూపాయలైతే రెండువేల రూపాయలే ఇచ్చి వెళ్ళిన పోస్టుమేన్ను సందేహ పడ్డాడు. వెంటనే 'స్వామీ మిమ్మల్ని నేను కోరింది మూడు వేల రూపాయలయితే పోస్టుమేన్ నాకు ఇచ్చింది రెండు వేల రూపాయలే! కనుక అసలు మీరెంత పంపారో నాకు తెలియజేయండి' అంటూ మరో వుత్తరం రాశాడు. మరుసటి రోజు పేరయ్య రాసిన వుత్తరాన్నితీసుకొని తిన్నగా అతని వద్దకొచ్చా డు పోస్టుమేన్. ."ఏమిటీ నాకు దేవుడు పంపిన మూడు వేల రూపాయల్లో వెయ్యి రూపియలు నువ్వే వుంచేసు కున్నావ్ ! నా పిర్యాదుకు భయపడి వాటిని ఇవ్వటానికి వచ్చావా?"అని అడిగాడు పేరయ్య. అందుకు పోస్టుమేన్ "ఒర్ తిక్కలమొహం పేరయ్యా!ఎక్కడైనా మనుష్యులకు దేవుడు డబ్బులు పంపుతాడటయ్యా నీ అమాయకత్వం కాకపోతే! దేవుడి పేరా నువ్వు రాసిన ఆ వుత్తరం చూసి వుత్తరాలను బట్వాడా చేసే సిబ్బందిమి మేము నవ్వుకొని నీ ఆర్థిక ఇబ్బందులను గుర్తించి 'పాపం పోనీలే పిల్లాడికి బట్టలు కొనుక్కొని పండగ చేసుకోనీ' అని చందాలు వేసుకొని రెండువేలు మేముగా పంపాము.ఇదిగో! వుత్తరాలను రాస్తే దేవుడు డబ్బు పంపుతాడనుకొంటే ఇక జనం మొత్తం ఆ పనిమీదే వుంటారయ్యా బాబూ!కనుక ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకొని కష్టించి చెమటోడ్చి డబ్బు సంపాయించుకొని భార్యా,పిల్లాడినిపోషించకో.డబ్బులు వూరికే రావయ్యా పిచ్చిపేరయ్యా!"అంటూ వుత్తరాన్ని చేతికిచ్చి వెళుతుంటే ' పోస్టుమేన్ అన్నది నిజమే! కష్టపడి సంపాయించి భార్య పిల్లాడ్ని పోషించు కోవాలి కాని వూరికే ఎవరో యిస్తారనుకోవటం తప్పు. రేపటినుంచి క్రమం తప్పకుండా పనికి వెళ్ళాలి. వెళతాను ' అని మనసులో అనుకొన్నాడు తిక్కల మొహం పేరయ్య. ©©©©© ©©©©©