పరిహసించిన బ్రతుకులు - చెన్నూరి సుదర్శన్

Parihasinchina bratukulu

ఇంటి అరుగు మీద కూర్చోని మురళి, ముకుందం ముచ్చటించుకోవడం వరలక్ష్మికి ముచ్చటేసింది. ముకుందం ఆమె తోటి కోడలు కళావతి కొడుకు.

వరలక్ష్మి స్టౌ ఆఫ్ చేసి వంటింట్లో నుండి బయటకు వచ్చేసరికి ముకుందం వెళ్లిపోతూండడం.. మురళి ముఖం అత్తపత్తి ఆకులా ముడ్చుకుని పోవడం కంగారు పడింది.

“మురళీ..! ఏమయ్యిందిరా! తమ్ముడు ఏమైనా అన్నాడా” అంటూ ఆరా తీసింది.

మురళికి దుఃఖం పొంగుకు వస్తోంది. చెప్పలేక పోతున్నాడు. మురళిని హృదయానికి హత్తుకుని బుజ్జగించింది.

“మా బంగారు కొండ కదూ! ముకుందం ఏమన్నాడురా?” అంటూంటే వరలక్ష్మి కళ్ళు చెమ్మగిల్లాయి.

“ఏడువకమ్మా.. చెప్తాను” కడుపులో నుండి ఎగదోసుకుంటూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ.. “వాళ్ళు గోల్కొండ కోటకు వెళ్తున్నారట. ‘నేను మెట్లు ఎక్కుతా గాని నీకు ఎక్కరాదు గదా!’ అని ఎక్కిరించి పెట్టాడు” అనగానే.. వరలక్ష్మి గుండె గుభేలుమంది.

’నీకు ఎక్క రాదుగదా.. నీకు ఎక్క రాదుగదా..!’ అనే ముకుందం పరిహాసాలు వరమ్మ గుండెల్లో శూలాల్లా దిగబడ్డాయి. ఎదలో ఆవేదన గతాన్ని తోడుతోంది.

***

ఆ రోజు తెల్లవారు ఝామున ఊరవతలి కాలువ గట్టుకు మీదకు పోయింది వరలక్ష్మి. గేదె కోసం.. గడ్డి కోసుకొద్దామని. కాసంత దూరంల తంగేడు పొదల్లో నుండి పసిగుడ్డు ఏడ్పు వినిపించింది. వచ్చిన పని మరిచి.. బిడ్డ కోసం వెదకింది. మబ్బుల్లో చందమామలా తంగేడు కొమ్మల నడుమ పిల్లవాడు మెరిసిపోతూ కనబడ్డాడు. చేతులున్న కొడవలి, గొనె సంచి కింద పడవేసింది. ఆత్రంగ పిల్లవాణ్ణి ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నది. ముద్దుల వర్షం కురిపించింది. తబ్బిబ్బవుకుంటూ.. ఇంటి వైపు వడి, వడి అడుగులు వేసింది.

వరలక్ష్మి సంతానభాగ్యానికి నోచుకో లేదు. భర్త ఆమె పాదాల పారాణి ఆరకముందే ప్రమాద వశాత్తు కాలం చేశాడు. ఆమె చేతుల మీదుగా పెరిగిన మరిది మల్లెశంకు పెళ్లి చేస్తే.. వారికి పుట్టిన బిడ్డలలో ఒకరిని దత్తత తీసుకోవచ్చని కలలు కన్నది.

ఆ సమయంలో దొరికిన పిల్లవానికి మురళి అని నామకరణం చేసి మురిసి పోయింది.

అదే సంవత్సరం మల్లేశంకు కళావతితో వివాహమయ్యింది. అదీ వరలక్ష్మి చూసిన సంబంధమే. అదే ఊరు అమ్మాయి కళావతి.. వాళ్లింట్లో ఒక్కగానొక్క గారాల పట్టి. పట్నంలో ఉద్యోగస్తున్ని తప్ప మరెవ్వరినీ చేసుకోనని మంకు పట్టు పట్టింది. ఈడు మీరి పోతూండడం.. ఇంట్లో పోరు వెరసి.. నిరక్షరాస్యులైన కళావతి చివరికి మల్లేశంను చేసుకోక తప్పలేదు.

కళావతి ఇంట్లో కాలు బెట్టగానే వేరే కుంపటి పెట్టించింది. అయినా గుండె నిబ్బరం చేసుకుని మురళి మీదే ప్రాణాలు పెట్టుకుని జీవనం కొనసాగిస్తోంది వరలక్ష్మి. ఎంత మంచి వారినైనా ఆ భగవంతుడు పరీక్షిస్తాడనుకుంటాను. మురళి నడిచే ప్రాయంలో.. వరలక్ష్మి గుండె పగిలే వార్త వినాల్సి వచ్చింది. మురళి పోలియో మహమ్మారి బారిన పడ్డాడు. నడిచే వాడల్లా కూలబడి పోతున్నాడు. ఆమె కష్టాలు ఆరంభమయ్యాయి.

మరో ఏడాదికి కళావతి, మల్లేశం దంపతులకు ముకుందం పుట్టాడు. వారి ఎదిగే కొడుకును చూసుకుని మురిసి పోతూ.. మురళి ఎక్కడ దొరికాడో అక్కడే వదిలేసి రమ్మని పోరు పెట్టాడు మల్లేశం. కుంటి పోరడు నిన్నేం ఉద్ధరిస్తాడని ఎగతాళి చేశాడు. అనాధాశ్రమంలో అయినా.. విసిరేసి రమ్మన్నాడు. వరలక్ష్మి మనసుక్షోభించింది. మన కడుపులో పుట్టిన పిల్లవాడైతే పారేసు కుంటామా? మనసు కుత కుతలాడింది.

“అక్కయ్యా! ఆయన మాటలకేంగాని మురళిని వదులుకోవద్దు” అని కళావతి నెమ్మది పర్చింది. మురళిని తీసుకుని పట్నం పొమ్మని సలహా ఇచ్చింది.

ఎలాగైనా మురళిని మళ్ళీ నడిపించి.. మా బ్రతుకులను పరిహసించే మల్లేశం లాంటి మనుషుల ముఖాలు నల్లబడేయాలని నిర్ణయించుకుంది వరలక్ష్మి.

***

ఈరోజు ముకుందం పరిహసించడం.. మనసు దిటవు చేసుకుని గోల్కొండ కోటకు ప్రయాణం కరారు చేసింది. అలాగే కళావతి చెప్పినట్టు పట్నంలో బ్రతుకుదెరువు చూసుకొని రావచ్చని ఆశ అంకురించింది.

“మురళీ.. మనం గూడా రేపు గోల్కొండ వెళ్దాంరా” అంది. మురళి నమ్మశక్యంగానట్టు ముఖం పెట్టాడు.

మరునాడు తెల్లవారు ఝామున గంప కింది కోడిపుంజు మొదటి కూతకే లేచి మురళిని తయారు చేసింది. తనూ తయారయ్యింది.

అంతా కలిసి గోల్కొండ చేరే సరికి ఉదయం ఎనిమిదయ్యింది.

“మురళి కింది నుండే చూస్తాడు గాని మనం కొండ ఎక్కుదాం పద..” అని మల్లేశాన్ని వేగిరపెట్టసాగాడు ముకుందం.

వరలక్ష్మి టవల్ ను మడిచి నడుంకు కట్టుకున్నది. మురళిని మెడమీద కూర్చోబెట్టుకుంది. రెండు చేతులు మురళి వీపు వెనుకాల వేసి వేళ్ళతో లాక్ చేసుకుంది.

“మురళీ.. గోల్కొండను పూర్వం గొల్లకొండ అనేవాళ్ళు” అని మొదలు పెట్టి.. మెట్లు ఎక్కసాగింది. కోట పెద్ద దర్వాజ దగ్గరికి పోయింది. మురళి, ముకుందంలతో చప్పట్లు కొట్టిస్తూ.. అవి కొండ మీదున్న రాజదర్బారుకు వినవస్తున్నాయని వివరించింది.

గోల్కొండ కోటలో ఉన్న రాజమహల్లు, గుళ్ళు, గోరీలు, రామదాసు బందీఖాన చూసుకుంటూ అతని కథ విన్న మురళి, ముకుందంల ఆనందానికు హద్దు లేదు. నిన్న ముడ్సుకున్న మురళి ముఖం ఈరోజు విప్పుకునే సరికి.. వరలక్ష్మి గోల్కొండ ఎక్కుతున్న యాతన మర్చి పోయింది. “ఎలా అయితేనేం.. గోల్కొండ ఎక్కాను దిగాను” అని మురళి అంటుంటే ముకుందం తల దించుకున్నాడు.

వరలక్ష్మి అకుంఠిత దీక్షను చూసి తోటి యాత్రికులంతా అచ్చెరువొందారు. మురళి గురించి అడిగి తెలుసుకున్నారు. ఒకతను కూకట్ పల్లిలో ఫిజియో థెరెపిస్ట్ చంద్రకాంత్ గురించి చెప్పి చిరునామా ఇచ్చాడు. వరలక్ష్మికి చీకట్లో చిరుదీపం దొరికినట్టు ధైర్యం చేకూరింది.

***

కూకట్‍పల్లిలో ఒక చిన్న గది అద్దెకు తీసుకుంది వరలక్ష్మి.

మురళిని ఎత్తుకుని చంద్రకాంత్ హాస్పిటల్ కు తీసుకు పోయేది. అతను చూపించిన విధంగా స్ప్రింగ్స్ తో వ్యాయామాలు చేయించేది. కాళ్ళకు కాలిపర్స్ కట్టి వాకర్ సాయంతో నడిపించేది. అలా దాదాపు ఒక నెల రోజులలో క్షుణ్ణంగా సాంతం అవగాహన చేసుకుంది. చంద్రకాంత్ సలహాలతో పరికరాలన్నీ కొనుక్కొని ఇంట్లోనే మురళికి వ్యాయామాలు చేయించసాగింది.

మురళికి డాక్టర్ వ్రాసిచ్చిన బలానికి టానిక్కులు తాగించేది. ఆయుర్వేద తైలాలతో కాళ్ళను మాలిష్ చేసేది. ఉదయం, సాయంత్రం వ్యాయామాలు.. వాకర్ సాయంతో నడిపించడం.. సరేసరి.

మరో మాసం గడిచేసరికి మురళి కుడి మోకాలు మీద అరచెయ్యి ఆసరాగా వేసి స్వతహాగా లేచి నిలబడడం.. నెమ్మదిగా, నెమ్మదిగా అడుగులు వేయడం.. వరలక్ష్మి ఆనందం ఆకాశాన్నంటింది. ఆమెలో పట్టుదల మరింత పెరిగింది. చంద్రకాంత్ దగ్గరికి మరో మారు తీసుకెళ్లింది. అతను రెండు చేతి కర్రలు ఇచ్చాడు. ఒక చిన్న సైకిలు కొని నడపడం ప్రాక్టీసు చేయించాలని సలహా ఇచ్చాడు.

వరలక్ష్మి కలలు నిజం కాసాగాయి. మురళి లోనూ తానెలాగైనా నడవాలనే పట్టుదల పెరిగింది. తన స్నేహితుల సాయంతో సైకిలు నడపడం నేర్చుకున్నాడు. చేతి కర్రల సాయంతో సునాయాసంగా నడవడంతో.. కాస్త ఊపిరి పీల్చుకుంది వరలక్ష్మి.

తన ఒంటి మీది నగలమ్మి మురళిని స్కూల్లో జాయిన్ చేయించింది. ట్యూషన్ పెట్టిచ్చింది ఇక తనకు రోజూ భావన నిర్మాణ కూలీ పనులకు పోయే వెసలుబాటు లభించింది..

చదువులో మురళి ప్రజ్ఞ చూసి ఉపాధ్యాయులు మరింత ప్రోత్సామిచ్చారు. వరలక్ష్మి ఒంటి మీది నగలు తరగడం.. మురళి చదువులు పెరగడం.. రివాజుగా మారినా వరలక్ష్మి నారాజు కాలేదు.

సమయం చిక్కినప్పుడల్లా చంద్రకాంత్ దగ్గరికి మురళిని తీసుకుని వెళ్ళేది. అతను మరికొన్ని సలహాలిస్తూ.. అంత తక్కువ సమయంలో మురళి కోలుకోవడం వరలక్ష్మి కృషిని కొనియాడాడు.

కాలచక్రం తిరగడం.. పెద్ద సైకిలు నడిపే మురళి పదవ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడవడంతో దశ తిరిగింది. కార్పోరేట్ కాలేజీ ఒకటి ముందుకు వచ్చి మురళిని ఆదుకుంది.

మురళి ఇంటర్ లో పదవ ర్యాంకు.. ఎంసెట్ లో రెండవ ర్యాంకు.. రావడంతో ఒక ప్రైవేటు కంపెనీ ముందస్తు ఒప్పందం చేసుకుని ఇంజనీర్ చదివించి ఉద్యోగంలో చేర్చుకుంది.

అమెరికాలో ఉన్న వారి బ్రాంచ్ కు వెళ్ళాల్సి రావడం.. మురళితో బాటుగా కూకట్ పల్లి అద్దె కొంపలో ఉండే వరలక్ష్మి విమానమెక్కి అమెరికా వెళ్ళే యోగం పడుతుందని ఎవరూ ఊహించని వాస్తవం.

మురళి తన కోసం ప్రత్యేకంగా తీర్చి దిద్దిన కారులో ఆఫీసుకు వెళ్లి వచ్చే వాడు. ఇంట్లో వరలక్ష్మి ఒక్కర్తే బిక్కు, బిక్కుమంటూ గడిపేది. బయటకు వెళ్ళ లేదు.

కొద్ది రోజుల్లోనే వరలక్ష్మికి మొహం మొత్తింది. తిరిగి మన దేశం రావాలనే కోరిక ప్రబలమయ్యింది. అదే విషయాన్ని సందేహిస్తూ మురళి ముందు పెట్టింది. తల్లిని విడిచి ఉండ లేని మురళి హైదరాబాదు బ్రాంచికి బదిలీ పెట్టుకున్నాదు.

కంపెనీ కనికరించింది.

***

హైటెక్ సిటీ దగ్గరలో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు మురళి. కారుకొని తనకనువుగా మార్పించుకున్నాడు.

“అన్ని మార్పులూ సరే గానీ.. నీజీవితంలో మార్పు రావద్దా..” అన్నట్టు మురళిని పెళ్లి చేసుకోవాలని వెంట పడింది వరలక్ష్మి.

“అమ్మా.. నీ మాట ఎప్పుడు కాదన్నాను. నీకు ఇష్టమైన అమ్మాయిని చూడు . ఆమె నన్ను ఇష్టపడితే చేసుకుంటా” అని వాగ్దానం చేశాడు మురళి.

వరలక్ష్మికి ఆనాటి మల్లేశం మాటలు గుర్తుకు వచ్చాయి. తన మనసులోని మాట మురళికి చెప్పింది. మురళి కాదన లేదు.

ఒక రోజు ఇద్దరు కలిసి అనాధాశ్రమం వెళ్లి ఒక అమ్మాయిని చూసి కరారు చేసుకున్నారు.

***

మురళి పెళ్ళికి వచ్చిన మల్లేశం, కళావతి నెల రోజులు దాటినా.. వెళ్ళడం లేదు.

ఎంతో కాలానికి అంతా కలుసుకున్న సంతోష సమయమిదని వరలక్ష్మి గూడా వారిని వదలి పెట్టడం లేదు. కాని మరో ప్రక్క ముకుందం రాలేదనే బెంగ లేక పోలేదు. అదే విషయం మురళి పదే, పదే అడిగే సరికి ఎలా చెప్పాలో అర్థం గాక ఒకరి ముఖం మరొకరు చూసుకోవడం.. వరలక్ష్మి మరీ బలవంతం పెట్ట లేదు. కాని ఒకరోజు తమ ఎదలోని వ్యథనంతా వెళ్ళగక్కుతూ వరలక్ష్మి కాళ్ళమీద పడ్డాడు మల్లేశం.

“ఇద్దరమ్మాయిల పెళ్ళిళ్ళు చేసే సరికి ఉన్నదంతా ఊడ్చుకు పోయి అప్పులపాలయ్యాం. అప్పుల వాళ్ళు పీక్కుతింటున్నారు. కాళ్ళున్న నాకొడుకు మమ్మలు కాలదన్నాడు. సరిగ్గా నడువలేడని నేను ఈసడించుకున్న
మురళి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. నిన్ను ఆనాడు పరిహసించినందుకే దేవుడు మాబ్రతుకులనిలా మార్చాడు” అంటూ భోరుమన్నాడు.

వరలక్ష్మి చటుక్కున మల్లేశంను పైకి లేపింది.

“మురళి గూడా నీకొడుకే అనుకో.. మల్లేశం” అంటూ ఓదార్చింది. “ఈరోజు నేను పచ్చగా ఉన్నాని వెనుకటి రోజులు ఎలా మర్చి పోతాను. ఎంతైనా మనం మనం ఒకటి. మాతో బాటుగా ఉండండి.” అనేసరికి మల్లేశం రెండు చేతులూ జోడించాడు. కళావతికి నమ్మశక్యంగాక తెల్లబోయి చూస్తోంది. గమనించిన మురళి ముందుకు వచ్చి తన తల్లి మాటను బలపర్చాడు.

మురళిని చూడగానే అతణ్ణి హత్తుకుని.. గుండె పగిలేలా ఏడువసాగింది కళావతి.

వరలక్ష్మికి మాత్రమే తెలుసు.. కళావతి ఆవేదనకు కారణం ..

కళావతి రంగుల కలలుకనే వయసులో పట్టణం యువకునితో మోస పోయింది. పుట్టిన కొడుకును తంగేడు పొదల్లో పారేసింది. మురళి మెడ కింద కుడిపక్క రూపాయి బిల్లంత పుట్టుమచ్చ చూసి ఆనాడే గుర్తు పట్టింది. కాని మురళికి పోలియో సోకడంతో కొడుకును మర్చి పోవడం మంచిదనుకున్నది. అందుకే ఆరోజు మురళిని వదిలించుకోవద్దని పట్టణం తీసుకు వెళ్ళమని వరలక్ష్మికి సలహా యిచ్చింది. ఎంతైనా కన్న కడుపు గదా... దుఃఖం ఆపుకోలేక పోతోంది.

ఇదంతా కళావతికి పురుడు పోసిన పోచమ్మతో తెలిసింది. కాని అప్పటికే మల్లేశంతో పెళ్ళయ్యింది. తోటి ఆడదాని బ్రతుకు బండలవుమతుందని.. ఆ విషయం తన కడుపులోనే దాచుకుంది వరలక్ష్మి. *

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు