డాక్టరు గారూ, ఎలా గున్నాడండి మా శ్రీధర్ ! " ఆతృత ఆందోళనలతో ఆపరేషసన్ థియేటర్ నుంచి పైకి వచ్చిన డాక్టర్ని అడిగింది గాయత్రి . " తలకి హెల్మెట్ ఉండటం వల్ల ప్రాణాపాయం తప్పింది. శరీరం మీద మల్టిపుల్ ఫ్రేక్చర్స్ ఉన్నాయి. కోలుకోడానికి సమయం పడుతుంది." జవాబు చెప్పేడు డాక్టరు. కొడుక్కి పెద్ద ప్రమాదం తప్పినందుకు స్థిమిత పడిన గాయత్రి బయట ఉన్న కుర్చీలో కూర్చుంది. " ఏమైందండి బాబుకి ? " అడిగింది పక్క కుర్చీ మీద కూర్చున్న ప్రమీల. " మోటరు సైకిల్ యాక్సిడెంటు జరిగింది " " ఎలా ? " గాయత్రి ఒక నిట్టూర్పు వదిలి చెప్పడం మొదలెట్టింది. నెక్లెస్ రోడ్లో ఎవరో ఇంద్రజాలికుడు కళ్లకు గంతలు కట్టుకుని మోటరు బైక్ నడపడం శ్రీధర్ టీ.వీ.లో చూసాడట. అప్పటి నుంచి తనూ అలా బైక్ నడుపుతానని ఫ్రెండ్స్ వద్ద అనే వాడట. వాడికింకా మైనార్టీ తీరనందున డ్రైవింగు లైసెన్సు ఇవ్వలేదు. శ్రీధర్ ఇంటర్ సెకెండియర్ చదువు తున్నాడు. మాకు వాడొక్కడే కొడుకు. మా పెద్దబ్బాయి శ్రీకాంత్ ఐదు సంవత్సరాల వయసప్పుడు ఆడుకుంటూ బంతి పడిందని వంగి తియ్యబోతే వాటర్ సంపులో జారిపడి చచ్చిపోయాడు. అప్నటికి శ్రీధర్ వయసు మూడు సంవత్సరాలు. పెద్దబ్బాయి మరణం తర్వాత వీడిని అపురూపంగా చూసుకుంటు న్నాము. గారాబం ఎక్కువైంది. ఏది కావాలంటె అది తెచ్చి ఇచ్చేవాళ్లం. అందువల్ల మొండితనం పెరిగి తన పట్టుదల సాదించుకునే వాడు. ఫ్రెండ్స్ దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయనీ తనకీ కావాలంటే కొనిచ్చాం. ఎప్పుడు చూసినా స్నేహితులతో చాటింగులు అలాగే పోకేమాన్, డ్రాగాన్ లాంటి ఎడ్వంచర్ వీడియో గేమ్స్, బైక్ రేసింగులు చూస్తుంటాడు. మేము ఎప్పుడైన కోపగిస్తే తిండి మాని గదిలో గడియ పెట్టుకుని ముభావంగా ఉంటాడు. పెద్దబ్బాయికి జరిగిన ప్రమాదం వల్ల వీడికేమైన జరిగితే తట్టుకో లేము.అందువల్ల వీడిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాము. నా శ్రీవారు మెడికల్ రిప్రజెంటీవ్. నెలలో సగం రోజులు టూర్లో ఉంటారు. నేను బ్యాంకు లో జాబ్ చేస్తున్నాను. శ్రీధర్ అప్పుడప్పుడు వాళ్ల నాన్న మోటర్ బైకు బయటికి తీసు కెల్తూంటాడు. లైసెన్సు లేనందున బయటకు తీసుకెళితే పోలీసులు పట్టుకుంటారని భయపెట్టే వాళ్లం. ఐనా వాడి మొండి పట్టుదలకు తల ఒగ్గవలసి వస్తోంది. మా వారు డ్యూటీ మీద పూణె వెళ్లారు. శ్రీధర్ కి రెండు రోజుల శలవు కలిసొచ్చింది. నేను బ్యాంకు డ్యూటీలో ఉన్నాను. ఎప్పటిలా వాళ్ల నాన్న బైకు బయటకు తీసుకెళ్లాడట. ఫ్రెండ్స్ ముందు తనూ కళ్లకు చేతి రుమాలు కట్టుకుని బైక్ నడుపుతానని ఛాలెంజ్ చేసాడట. వాళ్లు ఎగతాళిగా మాట్లాడగానే రోషంతో మొహానికి చేతిరుమాలు చుట్టు కుని బైక్ స్ఫీడు పెంచి బయలు దేరాడట. కొంత దూరమెళ్లి బేలన్సు తప్పి కరెంటు స్తంభాన్ని గుద్దేశాడట. హెల్మెట్ ఉన్నందున తలకి దెబ్బ తగల లేదు. భగవంతుడి దయవల్ల దెబ్బలతో బతికి బయట పడ్డాడని " ఏడుస్తూ చెప్పింది గాయత్రి. అంతా విని మీ బాధలాంటిదే నాది కూడా అంటూ ప్రమీల తన గోడు చెప్పడం మొదలెట్టింది. మాకు అమ్మాయి, అబ్బాయి సంతానం.అమ్మాయి చిన్నది. అబ్బాయి పెద్ద. కార్పొరేట్ హైస్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు. మగపిల్లాడు వంశోద్ధారకుడని గారాబం ముద్దు చేసాము. ఏది కావాలంటె అది కొనిస్తున్నాము. ఫ్రెండ్స్ దగ్గరున్నాయని తనకూ ఖరీదైన సైకిల్ కావాలంటే కొన్నాము. మొబైల్ కొనమంటే కొనిచ్చాము. మొబైల్ ఫోన్లో ఏవేవో వీడియో గేములు, సూపర్ మేన్ , స్పైడర్ మేన్ , క్రైమ్ స్టోరీలు చూస్తూ పిచ్చిగా అరుస్తుంటాడు. స్కూల్ నుంచి వస్తూనే యూనిఫాం విప్పి సోఫాలో పడేసి టి.వి. ఆన్ చేసి భోజనం పెట్టినా టి.వి. చూస్తూనే తింటాడు.రకరకాల కార్టూన్ ఛానల్స్ మారుస్తూ ప్లేట్లో అన్నం తినడు. " అన్నం తినరా" అంటే డిస్ట్రబ్ చెయ్యొద్దని చికాకు పడతాడు. ప్లేట్లోది తినడానికి గంట చేస్తాడు. క్రికెట్ లీగ్ మేచ్ లు ప్రారంభమైతే టి.వి. కి అతుక్కుపోతాడు. మా శ్రీ వారిది బిజినెస్ అయినందున ఆ పనుల్లో బిజీగా ఉంటారు. నేనే పిల్లల బాగోగులు చూసుకుంటాను. మొన్న ఆదివారం నేనూ, మావారు గుడికి వెల్తూ మా అబ్బాయి ని రమ్మంటే టి.వి.లో లీనమై రాను పొమ్మన్నాడు. చిరుజల్లు వాన మొదలైతే అమ్మాయిని వెంట పెట్టుకుని గుడికెళ్లి తిరిగొచ్చి గొడుగు ఆరుతుందని వరండాలో పెట్టి లోపలి కెళ్లాము. అబ్బాయి కి ఏమైందో టి.వి. చూస్తూ హోల్లోంచి బయటి కొచ్చి వరండాలో ఆరబెట్టిన నల్ల గొడుగు పట్టుకుని మేముంటున్న మూడవ అంతస్తు నుంచి కిందకు దూకేసాడు. పాత గొడుగై నందున వాడి బరువుకి ఊసలు విరిగి కింద పూల కుండీల మీద పడ్డాడు. సెక్యూరిటి గార్డు చూసి మాకు తెలియ చేస్తే వెంటనే అంబులెన్సులో హాస్పిటల్ కి తీసుకొచ్చాము.రెండు కాళ్లకి దెబ్బలు తగిలాయి. నిన్న ఆపరేషను జరిగింది." తన బాధ చెప్పుకుంది ప్రమీల. ఇదండీ నేటి పిల్లల పరిస్థితి. ఇంగ్లిష్ చదువులు , స్మార్టు ఫోన్లు, టి.వి .ల్లో వీడియో గేమ్స్, కార్టూన్ , ఎడ్వెంచర్ పిక్చర్స్, క్రికెట్ ఆటలతో కాలక్షేపం. స్కూల్ అవగానే ఇంటి కొచ్చి టి.వి. లు , స్మార్టు ఫోన్ల సందడితో బయటి ప్రపంచం తో సంబంధ ముండదు. ఇంటి భోజనం పనికిరాదు. పిజ్జాలు, బర్గర్లు , ఐస్ క్రీమ్ లు రక రకాల జంక్ ఫుడ్ తిని చిన్న వయసులోనే ఊబ కాయం. మైదానంలో ఆట పాటలు ఏమీ ఉండవు. టి.వి.ల్లో వచ్చే సాహస క్రీడలు గన్ ఫైరింగులు, నరుక్కోవడం,చంపు కోడం కౄర స్వభావ పాత్రల విదేశీ సినిమాలు పిల్లల మనస్తత్వాల్ని కలుషితం చేసి ఆప్యాయతలు, అనురాగాలకు దూరం చేస్తున్నాయి. సున్నితమైన వారి మనసుల్ని కర్కశంగా చేస్తూ మానసికంగా కుంగ తీస్తున్నాయి. ఈ యంత్ర యుగంలో పేరెంట్సు వారి వృత్తి వ్యాపారాల్లో పిల్లల కోసం సమయం కేటాయించ లేక పోవడం కూడా దురదృష్టమే. * * *