స్నేహమంటే ఇదే - కందర్ప మూర్తి

Snehamante Ide

పల్లె గ్రామం సంతలో చికెన్ షాపు యజమాని మస్తానయ్య నాటుకోళ్లను కొని పట్నం తీసుకు వచ్చాడు. అందులో ఒక కోడిపుంజు ఉంది. పట్నంలో సంత నుంచి తెచ్చిన కోళ్లను మస్తానయ్య షాపు వెనక ఇనుప జల్లెడ అమర్చిన పెట్టెలో ఉంచి అవుసరమైనప్పుడు ఒక్కొక్క కోడిని పైకి తీసి కత్తితో తల కోసి ఈకలు పీకి మాంసంగా చేస్తున్నాడు. ఇదంతా జల్లెడపెట్టెలో ఉన్న కోడిపుంజు గమనిస్తూ తన వంతు ఎప్పుడొస్తుందోనని భయపడుతోంది.ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలని సమయం కోసం ఎదురు చూస్తోంది. మరుచటిరోజు సాయంకాలం చీకటి పడుతూండగా యజమాని మాంసం కోసం ఇనప జల్లెడ పెట్టె తలుపు తీసి కోడి కోసం చెయ్యి లోపల పెట్టే సమయానికి విద్యుత్ ఆగి చీకటి అలముకుంది. చీకటిగా ఉన్నందున షాపు యజమాని వెలుగు వచ్చినప్పుడు కోడిని కోయ వచ్చని ముందున్న షాపులో కెళ్లిపోయాడు. ఆ సందడిలో కోళ్లను ఉంచిన జల్లెడ పెట్టె తలుపు గడియ వేయడం మరచి పోయాడు. కోడిపుంజు తప్పించు కోడానికి ఇదే సమయమనుకుంది.తలతో జల్లెడ పెట్టె తలుపును పైకి తోసి బయట పడి మెల్లగా దగ్గరున్న మామిడి చెట్టు పైకి ఎగిరి కూర్చుంది. మళ్లీ విద్యుత్ వెలుగు వచ్చే లోపు ఆ ప్రాంతం నుంచి ఎలా బయట పడాలని ఆలోచిస్తుండగా చెట్టు కింద తిండి గింజలతో నిండిన లారీ కనబడింది. ఆలస్యం చెయ్యకుండా కోడిపుంజు లారీ మీదకు దూకి బస్తాల మద్య కూర్చుంది. కోడిపుంజు ప్రాణాలతో బయట పడటమే కాకుండా ఆకలి బాధ తీర్చుకునే అవకాశం చిక్కింది.ఆ వాహనం పౌరసరఫరా శాఖ గోధుమ, బియ్యం బస్తాలతో నిండి ఉంది. ఆకలితో నకనక లాడుతున్న కోడిపుంజు కిందపడ్డ గింజల్ని కడుపు నిండా తిని రాత్రి గడిపింది. తెల్లారింది.వాహన చాలకుడు వాహనాన్ని నడుపుకుంటు వేరే ప్రాంతానికి తీసుకెళ్లి బస్తాలు గోదాములో వెయ్యడానికి ఉంచాడు. ఇంతలో గుంపులు గుంపులుగా పావురాలు వచ్చి వాహనం మీదున్న తిండి గింజల బస్తాల మద్య వాలి రంద్రాలు చేసి గింజలు తినసాగాయి. బస్తాల మూల భయంతో పడుకున్న రంగు ఈకల కోడిపుంజు మీద వాటి ధృష్టి పడింది. " ఏయ్ , ఎవరు నువ్వు ? నిన్నెప్పుడూ చూడలేదే ! " ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అడిగాయి. " అవును, నేను పల్లెగ్రామ పెంపుడు పక్షిని. నా పేరు కోడిపుంజు. అక్కడ హాయిగా బతికే నన్ను మరికొందర్నీ మా యజమాని డబ్బు కోసం మాంసం అమ్మే కసాయికి అమ్మేసాడు.వాడు పట్నం తీసుకువచ్చి దుకాణం వెనక ఇనపజల్లెడ గూడులో ఉంచి రోజూ నా కళ్లెదుటే సహచరుల్ని కత్తికి బలి చేసి ప్రాణాలు తీసేవాడు. నేను ఎలాగో ప్రాణాలు దక్కించుకుని ఇలా బయట పడ్డాను.నేను మీలాగ గాల్లో ఎగరలేను. ఈ ప్రాంతం నుంచి ఎలా బయట పడాలో తెలియడం లేదని" తన గోడు వెళ్లబోసుకుంది. కోడిపుంజు దీన గాధ విన్న పావురాలు " ఔను, ఈ మనుషులు దుర్మార్గులు. ఏది దొరికినా పట్టుకు తినేస్తారు.మాకూ రక్షణ లేకుండా పోతోంది" అన్నాయి. అవన్నీ ఆలోచించి కోడిపుంజును రక్షించాలని నిర్ణయాని కొచ్చాయి. ఈ రంగుల కోడిపుంజును చూస్తే మనుషులు, జంతువులు ప్రాణాలతో వదలరు. దీన్ని సురక్షితంగా నగరం బయటకు చేర్చాలనుకున్నాయి. గోదాము దగ్గర నివాస ముంటున్న మిత్రుడు కోతికి విషయం చెప్పాయి పావురాలు. కోతికి కూడా కోడిపుంజు దీన గాధ విని జాలేసింది.ఏదైనా ఉపాయం ఆలోచించాలనుకుంది. మెల్లగా గోదాము దగ్గరున్న పాత ఇంటికి కోడిపుంజును చేర్చి రోజూ గోదాము నుంచి గింజలు తెచ్చి వేస్తూ పోషిస్తోంది. ఒకరోజు జీవకారుణ్య సంస్థ ప్రతినిధులు పట్నంలో సర్కసుల నుండి, రోడ్ల మీద చిలక జోస్యం చెప్పే వారి నుంచి, మూగజీవాలను గొలుసులతో బంధించి జీవనోపాధి పొందు తున్న వారి నుంచి రక్షించిన జంతువులు , పక్షులతో ఉన్న వాహనం గోదాము దగ్గర ఆపి వాటికి తిండిగింజలు సేకరిస్తున్నారు. కోతి ఇదే సమయమని తలిచి కోడిపుంజును మిగత పక్షుల దగ్గరకు చేర్చి వీడ్కోలు పలికింది. మిగతా పావురాల సమూహం కోతి సాయానికి కృతజ్ఞత తెలిపాయి. అక్కడ కోడిపుంజు ప్రశాంతంగా జీవితం సాగిస్తోంది. నీతి : ఆపద సమయంలో ఒకరికొకరు సహాయ పడాలి. * * *

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు