దైవ లీల - పోడూరి వెంకటరమణ శర్మ

Daivaleela

పాడుతా తీయగా కార్యాక్రమం రాజారావు తప్పకుండా చూసే కార్యక్రమాలలో ఒకటి.

ఒకప్పుడు మధ్యరగతి వాళ్ళు పట్టణాలలో ప్రయాణాలకు చాలా అవస్థ పడేవారు. హైదరాబాద్ లాంటి చోట టాక్సీలో వెళ్లడమంటే

చుకోబడటమే అనే అభిప్రాయంతో నానా అవస్థలు పడి ఆటోలు బస్సులు ఆశ్రయించడం జరిగేది. ఇప్పుడు ఉబర్, ఓలాలు ఆ

లోటు తీర్చి టాక్సీలు నడిపే వాళ్ళని, కావలిసిన వాళ్ళని టెక్నాలజి కలిపింది. అలాగే పాడే శక్తి ఉన్న వాళ్ళని, సినిమాల్లో పాటలు

పాడేవాళ్లు కావలిసిన వాళ్ళని ఇటువంటి ప్రోగ్రాములు జత పరుస్తున్నాయి.

తరువాతి అభ్యర్థి కి అందరూ బాగా తప్పట్లు కొట్టండి అని బాలూ గారు అనగానే రాజారావు ఆలోచనల నుంచి బయట పడి టీవీ

మీద దృష్టి పెట్టాడు. ఒక పదేళ్ల వయసు ఉన్న అబ్యర్థిని ఇంకో అభ్యర్థి చెయ్యి పట్టుకుని తీసుకు వచ్చ్హాడు. కారణం ఆ కుర్రవాడు

పూర్తి గా అంధుడు. రాజారావు మనసు ద్రవించి పోయింది. పూర్తి అంధత్వం తో ఆ కుర్రాడు జీవితం ఎలా గడుపుతాడు?

జీవితాంతం ఇంకొకళ్ళ మీద ఆధార పడటం మాట అటుంచి, మిగతా వాళ్ళు అనుభవించే ఎన్నివిషయాలు అతను మిస్

అవుతాడు ?వలుస్తున్న చిక్కుడు కాయల బుట్ట తో సహా వచ్చిఅతని పక్కన అప్పుడే వచ్చి కూర్చున్న భార్య సుమతి తో అదే

అన్నాడు.

అతని ముఖం లో ఏడుపుకు తక్కువగా ఉన్న భావం ఏమయినా కనపడిందేమో ఆవిడ వెంఠనే " మీరు మరీ అంత యిదయి

పోనక్కరలేదు. దృష్టి లేకుండా జీవించడం ఎవరికయినా విచారకరమే. కానీ దానికి అడ్జస్ట్ అయి జీవితాన్ని నెట్టుకు వచ్చే ధైర్యం,

మెళుకువ భగవంతుడు వాళ్లకి ఇస్తాడు" అంది ఆమె అతని భావోద్వేగాన్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తూ.

"ఇలాంటి లోపాలతో పుట్టకుండా సైన్టిష్టులు ఏమీ చేయలేరంటావా?" అన్నాడు, తన కంటే ఆమెకు ఎక్కువ తెలియదు అని తెలిసీ కూడా.

" చేయగలిగితే ఈ బాటికి చేసేవారు కదా? ఇటువంటి విషయాలలో మానవమాత్రులు ఏమి చేయగలరు?" అంది ఆ మాత్రం తెలియదా అన్నట్టు. "

అదేమిటో ఖచ్చితంగా చెప్పలేను కానీ మానవ మాత్రులు చేసేది కొంతయినా ఉంటుందేమో అనిపిస్తోంది" అన్నాడు ప్రోగ్రాము

అయిపోవడంతో టీవీ కట్టేసి లేస్తూ.

" అన్నట్టు మధ్యాహ్నం చిన్న పుల్లయ్యట ఎవరో ఫోన్ చేశారు మీ క్లాస్ మెట్ అని చెప్పారు . ఫోన్ నెంబర్ ఫోన్ బుక్ లో రాశాను చూడండి " అంది సుమతి వంట ఇంట్లోకి వెడుతూ.

"చిన్న పుల్లయ్యా? ఏ నాటి చిన్న పుల్లయ్య? రాజారావుకి తన చిన్నతనం గుర్తుకు వచ్చింది. వాళ్ళ నాన్నగారికి ఉద్యోగరీత్యా

అమలాపురం బదలీ అయినప్పుడు టెన్త్ క్లాస్ వరకూ మూడు సంవత్సరాలు అక్కడే ఉన్నారు . ఆంజనేయ స్వామీ గుడి వీధిలో

ఉండేవారు. వాళ్ళ ఇంటిపక్కనే జానకయ్య గారని ఒక టీచర్ ఉండేవారు. ఆయన కి ఇద్దరు కొడుకులు. ఇద్దరు ఆడ పిల్లలు

ఆడపిల్లలకి అప్పటికే పెళ్ళిళ్ళయి అత్తవారింటికి వెళ్లి పోయారు. కొడుకు లిద్దరినీ పెద్ద పుల్లయ్య, చిన్న పుల్లయ్య అని

పిలిచేవారు. ఆ మూడు సంవత్సరాల లో రాజారావు, చిన్నపుల్లయ్య చాలా మంచి స్నేహితులయి పోయారు. ఉంటె వాళ్ళ

ఇంట్లోనూ, లేదా వీళ్ళ ఇంట్లోనూ ఉండేవారు. టెన్త్ తరువాత రాజారావు వాళ్ళ నాన్నగారికి కాకినాడ బదలీ అయి వచ్చేశారు.

అప్పటి నుంచీ చిన్న పుల్లయ్యని మరిచే పోయాడు రాజారావు.

సుమతి, వాడు ఫోన్ చేశాడని చెప్ప గానే, తన నంబర్ ఎలా సంపాదించాడబ్బా అనుకుంటూ ఫోన్ చేద్దామని టైం చూసి

మరునాడు చేద్దామని ఊరుకున్నాడు.

మరునాడు రాజారావు ఫోన్ చేయడానికి ముందే పుల్లయ్య ఫోన్ చేశాడు. ఇంకో చిన్నప్పటి క్లాస్మేట్ రమణయ్య, రాజారావు ఫోన్

నెంబర్ ఇచ్చాడనీ, రాజారావు ఐటీ రంగం లో పెద్ద జీతం లో ఉన్నాడని తెలిసి సంతోషించానని చెప్పి, తాను వచ్చి కలవడం

కొంత కష్టమనీ అందు చేత ,వీలయితే వచ్చి తనని సరోజినీ కంటి ఆసుపత్రి దగ్గరగా ఉన్న జాగృతి లాడ్జి లో కలవమని కోరాడు.

కలిసినప్పుడు తన విషయాలు అన్నీ చెబుతానన్నాడు . తప్పకుండా వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు రాజారావు.

ఫోను పెట్టెయ్యగానే రాజారావు కి చిన్న తనం అంతా గుర్తుకు వచ్చింది. ముఖ్యం గా పుల్లయ్య తో స్నేహం గా గడిపిన రోజులు.

క్లాసులో తనకి మార్కులు బాగా వస్తాయని తనంటే పుల్లయ్య ఒక రకమయిన ఆరాధనా భావంతో ఉండేవాడు. తాను కూడా

పుల్లయ్యకి చదువులో సహాయ పడేవాడు. నిజంగా ఆ మూడు సంవత్సరాలూ పుల్లయ్య తో స్నేహం మరువలేనిది. చిత్రంగా

అక్కడినుంచి వచ్చేసిన తరువాత వాళ్ళ మద్య కాంటాక్ట్ పోయింది. ఆ విషయాలే సుమతికి చెప్పి సాయంత్రం ఆఫీసు నుంచి వెళ్లి

పుల్లయ్యని కలుస్తానని, వాడు వస్తానంటే ఇంటికి తీసుకు వస్తానని చెప్పి వెళ్ళాడు ఆఫిసుకి. సాయంత్రం ఆఫీసు అవగానే

పుల్లయ్య చెప్పిన లాడ్జి కి వెళ్ళాడు రాజారావు. కంటి ఆస్పత్రికి దగ్గర లోనే చిన్న లాడ్జి అది. పుల్లయ్య ఉన్న గది తెలుసుకుని

తలుపు కొట్టగానే అతనే తలుపు తీశాడు. రాజారాం అతన్ని చూసి ఆశ్చర్య పోయాడు. తన వయసు వాడయినా ఏంతో నీరసంగా,

మాసిన గెడ్డం తో ఉన్నాడు. అయినా వాడి నవ్వు చూడగానే రాజారావు వెంఠనే పోల్చుకున్నాడు.

"ఏమిటిరా అలా ఉన్నావు ? ఆరోగ్యం సరిగ్గానే ఉందా ? అన్నాడు రూమ్ అంతా చూస్తూ. చిన్న రూము . పక్కగా మంచం మీద ఒక

ఆరేళ్ళ కుర్రాడు నిద్రపోతున్నాడు.పుల్లయ్య జవాబు చెప్పేలోపే " నీ విషయాలు అన్నీ చెప్పు. ఎక్కడ చేస్తున్నావు? ఏక్కడ

ఉంటున్నావు? ఈ కుర్రాడు మీ అబ్బాయా? " అని ప్రశ్నల వర్షం కురిపించాడు రాజారావు.

అక్కడ ఉన్న కుర్చీ రాజారావు కి ఇచ్చి, తాను పక్కాగా ఉన్న చిన్న స్టూల్ మీద కూర్చుంటూ చెప్పాడు పుల్లయ్య “ దురదృష్టం

నన్ను చాలా గాఢంగా హత్తుకుందిరా. మీ నాన్నగారికి బదిలీ అయి మీరు వెళ్లి పోయిన తరువాత రెండు సంవత్సరాల కి

నాన్నగారు పోవడంతో అన్నయ్య మీద ఆ భారం పడింది. అయినా వాడు చిన్న వయసులోనే ఉద్యోగం లో చేరి నాకు చదువు

చెప్పించాడు. డిగ్రీ అవగానే కాకినాడ లో ఒక కాంట్రాక్టర్ వద్ద అకౌంటెంట్ గా చేరాను. మా అమ్మ పోతూ పోతూ మా చిన్నక్క

కూతురిని నాకు కట్టపెట్టి పోయింది. రియల్ ఎస్టేట్ డౌన్ తో నేను పని చేసే ఆయన కుదేలయితే పాత పరిచయాల వల్ల ఒక

బిల్డింగ్ మెటీరియల్ షాప్ లో గుమస్తాగా చేస్తున్నాను.మా ఆవిడ అక్కడా ఇక్కడ వంట పనులు చేస్తూ కొంత సహాయ పడుతోంది.

కానీ ఇవేవీ పెద్ద ప్రొబ్లెమ్స్ కావు మాకు అని ఇంకా చెబుతుంటే" నాన్నా " అని మంచం లో కుర్రాడు లేచినట్టున్నాడు

పిలిచాడు. చివాలున పుల్లయ్య వెళ్లి వాణ్ని కూర్చోపెట్టి. పక్కనే కూర్చుని బుజ్జగిస్తూ అడిగాడు. “ఏమన్నా తింటావా నారాయణా ?”

అని అడిగి, వాడికేదో తినడానికి చేతిలో పెట్టి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు.

" ఎంతమందిరా పిల్లలు నీకు?. ఏమిటి అలా ఉన్నాడేమిటి నీ కొడుకు?" అడిగాడు రాజా రావు, ఎదో తేడా ఉందని గ్రహించి.

"ఏమి చెప్ప మంటావురా! వాడికి చిన్నప్పటినుంచీ కళ్ళు కనపడవు రా. చాలా మంది డాక్టర్లకు చూపించాము లాభం లేక పోయింది. కాకినాడ లో ఓ కంటి డాక్టర్, సరోజినీదేవి హాస్పిటల్ లోఆయనకి తెలిసిన స్పెషలిస్ట్ ని కలవమంటే తీసుకు వచ్చా.

ఆర్ధిక ఇబ్బందుల వల్ల చాలా కష్టంగా ఉందిరా. చాలా మాట్లు నువ్వే గుర్తుకు వచ్చావు. అనుకోకుండా రమణయ్య కలిస్తే వాడు

చెప్పాడు నీ గురించి. అసలు గుర్తున్నానా అనుకున్నాను. నేనే వచ్చి కలుద్దామనుకుంటే, వీణ్ణి వదిలి వచ్చే పరిస్థితి కాదు. చాలా

థాంక్స్ రా వచ్చినందుకు" అన్నాడు చేతులు పట్టుకుని.

" ఛ ఛ అలా మాట్లాడకురా. నువ్వు చాలా మంచి పని చేశావు నన్ను కాంటాక్ట్ చేసి" రాజారావు కి కళ్ళల్లో నీరు తిరిగి ఒక నిమిషం

మాట్లాడ లేక పోయాడు. మళ్ళీ అన్నాడు " నీకు రెండు విధాలా అన్యాయం జరిగిందిరా. ఆర్థిక ఇబ్బందులు తో బాటు నీ కొడుక్కి

ఇలా అవడం ఇంకా బాధాకరం.మీ అబ్బాయికి చిన్న తనం నుంచీ ఇలాగే ఉందా ? లేక మయంలో వచ్చిందా? డాక్టర్లు కారణం

ఏమిటంటారు? " అడిగాడు

" పైకి కళ్ళు బాగానే ఉంటాయి. పుట్టినప్పటినుంచీ ఉండి ఉండాలి. మాకు తెలిసేటప్పటికే కొంచెం సమయం పట్టింది. డాక్టర్లు

అనడం అక్క కూతురిని చేసుకున్నందుకు 90% కంటే ఎక్కువ కారణం అంటారు. మా చిన్నక్క కళ్ళు చికిలించేది. దగ్గర రక్త సంబంధం వల్ల వాడికి ఇలా అయింది. " అన్నాడు పుల్లయ్య వివరిస్తూ

." సరే వాడి సంగతి మెల్లిగా చూద్దాం, ముందు నీ ఆర్ధిక సమస్య పరిష్కరిద్దాము" అన్నాడు వెళ్ళడానికి లేస్తూ. పర్సులో ఉన్న అయిదు వేలు ఇచ్చి "ఇది ఉంచు. నీ అవసరాలు తీరుబడిగా డిస్కస్ చేసి పరిష్కరిద్దాము. పెద్దగా వర్రీ అవ్వకు. నేను మళ్ళీ రేపు వస్తాను " అన్నాడు లేస్తూ

** **

ఇంటికి రాగానే సుమతి కి చెప్పాడు పుల్లయ్య సంగతి.

"ఎటిఎం లోంచి తీసి ఇంకా కొంచం ఇవ్వక పోయారా?" అంది ఆమె సానుభూతి గా.

తన కంటే ఎక్కువ సానుభూతి సుమతి ఫీల్ అవడం తలుచు కుని అతను మనసులోఆనందించాడు. అతనికి ఉద్యోగ రీత్యానే కాకుండా ఆమె ద్వారా చాలా ఆస్తి వచ్చింది. సుమతి ఒక్కత్తే కూతురు. రాజారావు కూడా షేర్ మార్కెట్ లో చాలా సంపాదించాడు . చాలా మందికి షేర్ మార్కెట్ అంటే లాటరీ లాంటిదని, చాలా మంది డబ్బు పోగొట్టుకుంటారనీ ఒక అర్థం లేని అభిప్రాయం ఉంది. తెలియని వాళ్ళు పోగొట్టుకున్నా, సరయిన అవగాహన తో మంచి కంపెనీల షేర్లు కొనడం వల్ల, పెట్టుబడి ఉండాలి కానీ చాలా సంపాయించ వచ్చు. అలా కోట్లు సంపాదించాడు రాజారావు. ఎప్పటి కప్పుడు కొన్ని లాభాలని స్థిరాస్తులకింద మార్చుకున్నాడు.

సుమతి ని కూడా సంప్రతించి పుల్లయ్య జీవితం లో పెద్ద మార్పే తీసుకువచ్చాడు రాజారావు. అతన్ని హైదరాబాద్ మార్చేసి తన మామగారికి తెలుసున్న కంపెనీలో ఉద్యోగం లో పెట్టి, పుల్లయ్య కొడుకు రామాన్ని మంచి అంధుల బడి లో చేర్చి అతని జీవితాన్ని ఒక గాడి లో పడేశాడు.

" కుచేలుడికి కృష్ణుడి లా దొరికావురా" అనేవాడు పుల్లయ్య రాజారావు తో.

"అందరూ నీలా సహాయం చేయరు రా" అనేవాడు కలిసినప్పుడల్లా.

" అంత పెద్ద మాటలు అనకురా. నీ మటుకు నువ్వు కూడా ఇతరులకి సహాయం చేయగలవు." అన్నాడు ప్రోత్సాహకరంగా.

" నా లాంటి వాడు ఎవరికీ సహాయం చేయగలడు రా ?" అన్నాడు పుల్లయ్య నిస్పృహతో

*****

ఓ శనివారం సాయంత్రం టీ తాగి వాకింగ్ కి బయలు దేరబోతూంటే ఫోన్ మోగితే ఎత్తాడు రాజారావు. ఎవరా? అనుకుంటూ.

"నేనురా కామేశ్వరక్కని రేపు గోదావరికి వస్తున్నాను స్టేషన్ కి వస్తావా ?"అంది ఆవిడ.

"తప్పకుండా వస్తాను" అని చెప్పి, బోగీ వివరాలూ అవీ కనుక్కుని పెట్టేశాడు రాజారావు.

అవడానికి పెద తండ్రి కూతురు అయినా రాజారావు కీ ఆవిడకీ చాలా దగ్గర అనుబంధం ఉంది. ఆమెని చిన్నప్పుడు చదువు కోసం రాజారావు తండ్రి వద్ద ఉంచినప్పుడు ఇద్దరూ కలిసి పెరగడంతో దగ్గర అయ్యారు. చాలా విషయాలలో ఆవిడ రాజారావుకు మార్గదర్శి. చదువులో కానీ, బడిలో స్నేహితులతో వచ్చిన సమస్యలకి కానీ ఆవిడ పెద్ద లీడర్ లా గైడ్ చేసేది. కానీ ఆమెకి చిన్నప్పటినుంచీ ఒక రకమయిన మొండి తనం ఉండేది. ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంటే దానిని మార్చడం ఎవరి తరం అయేది కాదు.ఆమెని నరసాపురం దగ్గర ఒక పెద్ద వ్యవసాయ కుటుంబం లో ఇచ్చారు. పెళ్లయినా ఆమెతో సంబంధం చిన్నప్పటి లాగే కొనసాగింది. అత్త వారింట్లో కూడా ఆవిడ సహజ లీడర్ షిప్ లక్షణాలవల్ల ఆమే చక్రం తిప్పేది. ఎటొచ్చీ ఆవిడ చదువు ఎక్కువ సాగించలేదు కాబట్టి, స్థిరాస్తులూ, బంగారం, బట్టలూ వంటివి పెద్ద మొత్తంలో కొనడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు రాజారావు సలహా తీసుకునేది. ఆమెకి ఒక కొడుకు రవి , ఒక కూతురు రజని. కూతురిని భర్త చెల్లెలు కొడుక్కి ఇచ్చి చేసింది. ఆ అల్లుడు నిజామాబాద్ వెళ్ళిపోయి అక్కడ వ్యవసాయం చేసి చాలా గడించాడు. కామేశ్వరమ్మ కొడుకు రవి, చదవడానికి డిగ్రీ చదివినా ఇంటి దగ్గరే ఉండి వ్యవసాయం చూసుకుంటూ తల్లికి సహాయం గా ఉండి పోయాడు.

మరునాడు ప్రొద్దుటే రాజారావు స్టేషన్ కి వెళ్లి అక్కని తీసుకు వచ్చాడు. అతను అనుకున్నట్టు గానే యాదగిరి గుట్ట దగ్గర స్థలాలు పెరగ వచ్చని అక్కడ కొంటె మంచిదని అల్లుడు సలహా ఇస్తే అవి కొందామని వచ్చింది. అల్లుడు కూడా నిజామాబాద్ నుంచి వస్తాడని చెప్పింది. ఆ రాత్రి భోజనాలు అయిన తరువాత అక్కా తమ్ముడూ కబుర్లలో పడ్డారు. సుమతి దగ్గరలోనే వింటూ కూర్చుంది.

మాటల సందర్భంలో కామేశ్వరి అంది " ఒరేయి మన రవికి రజని కూతురు వనజ ని ఇచ్చి చేయడానికి నిర్ణయించాను రా. వాళ్ళది బోల్డు ఆస్తి ఎవరో పై సంబంధం వాడు దాన్ని తన్నుకు పోవడం ఎందుకు? మన రవికి దాన్ని ఇచ్చి చేస్తే పైకి ఎక్కడికీ పోదు కదా "అంది

సుమతి వెంఠనే ఎదో అనబోయి భర్త కేసి చూసి ఆగి పోయింది.

సుమతి ఏమి చెప్ప బోతోందో రాజారావు కొంత ఊహించాడు. రజని వాళ్ళ ఆయన మేనత్త మేనమామ పిల్లలు. ఇప్పుడు వనజని మేన మామ వరస కి చేద్దామనుకుంటున్నావు. కొంచెం ఆలోచించాలేమో అక్కా " అన్నాడు, ఆమె ఒక మాటు నిశ్చయానికి వచ్చిన తరువాత అది మార్చుకోదని తెలిసినా.

" ఆ ఏమి పరవాలేదు రా మనవాళ్ళలో ఎన్ని జరగ లేదు ? అందరూ బాగానే ఉన్నారు" అంది ఆ విషయం ఇంకా కొనసాగించడం ఇష్టం లేదన్నట్టు.

అందులో ఉన్న రిస్క్ గురించి అక్కకి ఇప్పుడు చెప్పినా లాభం లేదని అతనికి తెలుసి ఊరు కున్నాడు. ఏ విషయం లో నయినా రిస్క్ ఉంది అని అనిపించినప్పుడు, పది శాతం ప్రాబబిలిటీ ఉన్నా రిస్క్ తీసుకోకూడదు. తరవాత వెనక్కి తీసుకోలేని నష్టాలు జరగ వచ్చు. ఇలా అక్క పిల్లలిని చేసుకున్న వాళ్ళకి , పిల్లలు బలహీనం గా పుట్టడం, వంశం లో జన్యు పరం గా ఉన్న చిన్న చిన్న లోపాలు , పెద్దవి గా వీళ్ళ పిల్లల లో పైకి వచ్చి, అనేక రకాల లోపాలకి గురి కావడం జరుగుతుందని, నారాయణ ని డాక్టర్లకు చూపించినప్పుడు , వాళ్ళు చెప్పారని పుల్లయ్య చెప్పాడు. ఎలా ఆలోచించినా దగ్గర సంబంధాలు చేసుకోవడం మూర్ఖత్వానికి పరాకాష్ట అని అతనికి అనిపించింది. ఆఖరికి మొక్కలు అంటు కట్టడం ఎందుకు చేస్తున్నామో కూడా తెలుసుకోక పోతే ఏమి చెబుతాం.

ఆ సాయంత్రానికి అల్లుడు వచ్చిన తరువాత రెండు రోజులలో పని ముగించుకుని ఆవిడ వెళ్ళిపోయింది.

రెండు నెలల తరువాత ఓ సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే సుమతి " పోస్ట్ చూడండి" అంది.

"ఏమిటి విశేషం?" అంటూ పోస్ట్ పెట్టే టేబుల్ దగ్గరకి వెళ్ళాడు. మిగతా వాటితో కలిసి రెండు సుభలేఖలు ఉన్నాయి.

మొత్తానికి అక్క తన నిర్ణయాన్ని అమలు చేస్తోందన్నమాట అనుకున్నాడు, రెండు శుభలేఖలూ ఒకే పెళ్లివి ఆడ పెళ్ళివారూ, మెగా పెళ్ళివారూ ఇద్దరూ పంపారు అనుకుని.

కానీ లోపల చూస్తే రవిని వేరే అమ్మాయికి, వనజని వేరే అబ్బాయికీ ఇస్తూ చేస్తున్నట్టు ఉన్నాయి శుభలేఖలలో.

గట్టిగా అన్నాడు సుమతి తో. "చూశావా శుభ లేఖలు?" అన్నాడు ఆనందం గొంతులో పలికిస్తూ.

"అదే ఆశ్చర్యంగా ఉంది. ఆవిడ మనసు ఎలా మార్చుకుందో అంత సులువు గా? " అంది.

" నేను ఒక ప్రయత్నం చేశాను. ఫలిస్తుందన్న ఆశ అంత లేకపోయినా. కానీ అది ఫలించిందన్న మాట"

"ఏమిటా ప్రయత్నం? అంది సుమతి కుతూహలంగా

"ఆ వేళ మా అక్కయ్య వాళ్ళూ వెళ్ళింతరువాత నాకో ఆలోచన వచ్చింది. మా పుల్లయ్యని ఒక కారు ఇచ్చి వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకుని అంతర్వేది నరసింహ స్వామిని దర్శించి రమ్మన్నాను. నరసాపురం లో ట్రైన్ దిగి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ దిగమన్నాను. మా అక్కకి ఫోన్ చేసి నా దగ్గర మిత్రుడు ఒకడు వస్తాడు , వాడికి ఒక రోజు ఆతిధ్యమివ్వమన్నాను. దానికేముంది తప్పకుండా రమ్మను అంది ఆవిడ.

వాడికి ప్రత్యేకంగా నేను ఏమీ చెప్పలేదు. కానీ నాకు తెలుసు. వాళ్ళ అబ్బాయి అంధత్వం గురించి ఎవరడిగినా వాడు చెప్పేది ఒకటే, దగ్గర సంబంధం చేసుకోవడం వల్ల అలా జరిగిందని. అందరికీ అలా జరుగుతుందా అని అడిగితే, అలా జరగడానికి దగ్గర సంబంధాలలో చాలా ఎక్కువ అవకాశం ఉందని డాక్టర్లు కూడా చెప్పారని వాడు కేసెట్ వేసినట్టు చెబుతాడనీ నాకు తెలుసు.

వీడు వెళ్ళినప్పుడు అక్కడ ఏమి జరిగిందో నేను ఊహించాను. అదే జరిగింది. ఫలితమే ఈ శుభలేఖలు" అన్నాడు తాను రచించిన ప్లాను వివరిస్తూ.

“దైవ లీల ఏమి అర్థం చేసుకోగలం? అక్కడ అంధత్వం ఇచ్చి ఇక్కడ తప్పించాడు” అంది సుమతి.

ఆ మరునాడు పుల్లయ్యకి ఫోన్ చేసి " ఒరేయి ఆ రోజు మీ రామాన్ని అంధుల బడి లో చేర్చిన రోజున ఏమాన్నావో గుర్తుందా ? "నాలాంటి వాడు ఎవరి కి సహాయం చేయగలడు రా అన్నావు. గుర్తుందా ?మొన్న నువ్వు నరసాపురం లో మా అక్క ఇంటికి వెళ్లి ఎంత సహాయం చేశావో నీకు తెలియదు. తరువాత చెబుతాలే" అని ఫోన్ పెట్టేశాడు.

సమాప్తం

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు