ప్రేమలేఖ - యు.విజయశేఖర రెడ్డి

Premalekha

దైవం,అమ్మ,నాన్న,భార్య,బిడ్డ అన్ని పదాలూ రెండు అక్షరాలే ప్రేమ కూడా రెండు అక్షరాలే.అది 1982 వ సంవత్సరం. “చిత్రంగా చిత్రా... నీవు నన్ను ప్రేమిస్తున్నాను అన్న రోజున, ఆ ప్రేమ దూదిపింజల నా మనసులో ప్రవేశించి కొండంతగా అయ్యింది. నేనూ,నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు “దొంగ” మరి నువ్వేందుకు చెప్పలేదు అన్నావు.ప్రేమ విషయంలో ఆడవాళ్లు చేసినంత సాహసం మగవాళ్లు చేయలేరు.

నీవు ప్రేమలో పడకూడదూ అంటూనే నన్ను కూడా ప్రేమ ముగ్గులోకి దింపావు. నా చిరు రచనలు పత్రికలలో చూసి అందులో “ప్రేమ” కథ చాలా బాగుంది అన్నావు. నా కథలేనా నేను బాగులేనా? అన్నప్పుడు నీ తరువాతే... నీ కథలు అన్నావు.

గులాబీలు అంటే ఇష్టం అని చెప్పావు. మా ఇంట్లో పూచే పూలను రోజూ తెచ్చి నీకు ఇస్తుంటే నాకు ఎంతో సంతోషమేసేది... అది తలలో పెట్టుకుని నీవు మురిసిపోవడం నీ ముఖంలో ఆ వెలుగు, నిన్ను మరింతగా ప్రేమించేలా చేసింది.

నేను డిగ్రీ పట్టాతో పాటు ఇంగ్లిష్,తెలుగు టైప్ రైటింగ్ హైయ్యర్ పాసయ్యి, ఉద్యోగం వేటలో ఉన్నప్పుడు కొండంత ధైర్యం చెప్పావు. మన ప్రేమను మీవాళ్లు,మా వాళ్లు ఒప్పుకోవడం మన అదృష్టం. నీకు ముందుగా ఉద్యోగం వచ్చిన రోజున మీ ఇంటికి వచ్చినప్పుడు. ‘ఇదిగో మాకు కాబోయే అల్లుడికంటే, నీకు ముందుగా ఉద్యోగం వచ్చిందని నీవు ఫోజు కొట్టావంటే ఊరుకునేది లేదు’ అని మీ అమ్మగారు అన్నప్పుడు నీ కళ్ళు చెమ్మగిల్లాయి అది చూసి నా కంటినీరు పోగింది.

ఆ క్షణమే నీ తలను నా గుండెకు హత్తుకుని నిమురుదామనుకున్నాను.’ కాబోయే అల్లుడు ముందే నన్ను ఆట పట్టిస్తారా?’ అని నీవు విసవిసా మరో గదిలోకి వెళ్లావు.

నిన్ను తొలిసారి మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు, మా వీధిలో వాళ్ళంతా కళ్లప్పగించి చూశారు... జంట అంటే ఇలా ఉండాలని తరువాత అన్నారట. ఆ రోజు మనమిద్దరం తెల్ల దుస్తులు ధరించడం కాకతాళీయంగా జరిగింది. అంటే మన ప్రేమ ఎంత తెలుపో తెలియజేసింది.

ప్రేమించుకున్న వాళ్లందరూ పెళ్లి చేసుకోలేరు అన్నారు మన మిత్రులు.పెద్దల దీవెనలతో మన ప్రేమ గెలిచింది.పెళ్లి జరిగింది.

“ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్ప” అది నా విషయంలో జరిగింది. “ఏమండీ కాఫీ” అని చిత్ర అన్నాక ఆ నాటి ప్రేమలేఖను చదవడం ఆపి, కాఫీ అందుకున్నాను.”నాకు వ్రాసిన ప్రేమలేఖ చదవడం అయ్యిందా?” అని సున్నితంగా నా చేతిలోని లేఖను తీసుకుంది.మేము ఒకరికి ఒకరం వ్రాసుకున్న ప్రేమలేఖలను సమయం చిక్కినప్పుడల్లా చదువుకోవడం మాకెంతో ఆనందాన్ని ఇస్తాయి.

****

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు