ఆడికి నవ్వారు - శ్రీనివాస్ మంత్రిప్రగడ

Aadiki navvaru

ఒక రోజు రామచంద్రం లేచేటప్పడికి బారెడు పొద్దెక్కింది. రాత్రి కరెంటు లేక పోవడం వల్ల విపరీతమైన ఉక్కపోతా, దోమలూ కలిసి రామచంద్రం నిద్ర పాడు చేసాయి. రాత్రిప్పుడో రెండే అయిందో మూడే అయిందో...కొద్దిగా నిద్ర పట్టింది.

లేస్తూనే ఆ రోజు శ్రీవారి పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి లేటవుతానని అర్ధమై కొంచం చిరాకు పడ్డాడు. ముఖ్య భృత్యుడికి ఫోన్ చేసాడు.

"ఏం పరవాలేదు మాస్టారూ. ఇవాళ పిల్లలు కూడా లేటు గా లేచారు. మెల్లిగా రండి" అన్నాడు

గబా గబా తయారయ్యి వెళ్ళేటప్పడికి శ్రీవారింకా సింహాసనం అధిష్టించలేదు...గురువు గారూ, ముఖ్య భృత్యుడూ టీవిలో ఎదో ఒక జోక్ సీన్ చూస్తూ నవ్వుకుంటున్నారు...

"నా వెధవతనం తో పోల్చుకుంటే నీ వెధవతనం ఒక వెధవతనముట్రా" అంటున్నారు కోట శ్రీనివాసరావు గారూ ఆ సీన్లో...

తాను కూడా ఆ సీన్ చూసి నవ్వుతూ "శ్రీవారివాళ లేటయినట్టున్నారే" అన్నాడు రామచంద్రం గురువు గారి తో

"అవునయ్యా. రాత్రి పార్టీ పెద్దాయనతో చాల లేటయ్యే వరకు మాట్లాడారు...తరువాత కొంచం చిరాగ్గా ఉన్నారు...రాత్రి చాలా సేపు శ్రీవారి గదిలో లైటు వెలుగుతూనే ఉంది...పొద్దున్న కొంచం బద్ధకించారేమో" అన్నారు గురువు గారూ

"అంత రాత్రి మంతనాలు ఏముంటాయి గురువు గారూ...ఇప్పుడు ఎన్నికలేమీ లేవు కదా" అనడిగాడు రామచంద్రం

"ఎన్నికల కన్నా అత్యవసరమైన వ్యవహారం

...మన పార్టీ పెద్దాయన ఒక చిన్న తప్పు చేసారు...అది పట్టుకుని ప్రతిపక్షం గొడవ చేసే లోగా మనం కప్పి పుచ్చాలి ...దాన్ని గురించిన చర్చ" అన్నారు గురువుగారు

"ఎలా? అయినా ఇలాంటి విషయాలు పై వర్గాల్లో కదా చూసుకుంటారు...శ్రీవారి వరకూ ఎందుకొచ్చింది" అనడిగాడు రామచంద్రం ఆశ్చర్యంగా

"దానికి రకరకాల స్థాయిల్లో రకరకాల చర్యలు నిర్ణయించారు...కంప్యూటర్ నిపుణులు గడిచిన పదేళ్లలో పార్టీ పెద్దాయన చేసిన గొప్ప పనులను రకరకాల బొమ్మలూ, పద్యాలూ లాంటి వాటితోనూ, ఆ పనుల ఫొటోలతోనూ సాంఘిక మాధ్యమాలన్నీ ఊదర గొట్టేస్తారు...పై స్థాయి నాయకులు రోజుకొకళ్ళు చొప్పున పెద్దాయన గొప్పదనం, ఆయనతో పనిచెయ్యడమనే అదృష్టం కలిగినందుకు తమ సంతోషం లాంటివి ప్రెస్ తో పంచు కుంటారు...శ్రీవారి స్థాయి నాయకులు తమ పద్ధతిలో సాంఘిక మాధ్యమాల్లో ప్రకటనలు చెయ్యడమే కాకుండా కొన్ని లోకల్ మీటింగులు పెట్టి కూడా చెప్పాలి...పార్టీ పెద్దాయన చేసిన తప్పు కొంచం ఇబ్బంది కరమైనదే...అందువల్ల అయన చేసిన పని సవ్యమైనదే అని నిరూపించడం చాలా కష్టం...అందుకని మేమందరమూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాము" అన్నారు గురువుగారు

"మరీ సినిమా చుస్తున్నారేం?"అనడిగాడు రామచంద్రం

"చాలా సేపు ఆ విషయం చర్చించాం. దాంతో కొంచం బుర్ర పిచ్చెక్కింది...కొద్దిగా వినోదం కోసమని" అన్నాడు ముఖ్య భృత్యుడు

"తప్పులు చెయ్యడం మానవ సహజం...దాని వల్ల పెద్దాయన నోరు జారారు అనే విమర్శ మాత్రమే వస్తుంది కదా...అయన సుబ్బరంగా తన తప్పు ఒప్పేసుకుని, ఇకనుంచి జాగర్త గా ఉంటానని ప్రకటన చేస్తే చాలు కదా" అన్నాడు రామచంద్రం

"ఇంకా నయం...కొంచం నెమ్మదిగా మాట్లాడవయ్యా మేస్టారూ...శ్రీవారు విన్నారంటే గొడవలై పోతాయి" అన్నారు గురువుగారు చిరాగ్గా

"మన ప్రజలకు మతిమరపు ఎక్కువ...దానిపైన పశ్చాత్తాప పడితే ఎలాంటి తప్పయినా మాఫీ చెయ్చ్చని మన శాస్త్రాలు చెబుతున్నాయి కదా...అది అన్నింటి కన్నా సులభమైన పధ్ధతి" అన్నాడు రామచంద్రం

"శ్రీవారి స్థాయి నాయకుడు పెద్దాయనతో మీ తప్పొప్పుకోండి అనలేరు...అదీగాక పార్టీ పెద్దాయన ఇంతవరకు తన తప్పు ఒప్పుకున్న చరిత్ర లేదు...అలంటి సలహాలిస్తే అదోచ్చ్చి మన తలే చితక్కొడుతుంది" అన్నారు గురువుగారు

"మరో పధ్ధతి ఉంది" అన్నాడు రామచంద్రం పట్టు వదలకుండా

"మళ్ళీ మరో సత్యకాలపు సలహా ఇవ్వకు...అసలే బుర్ర తిగురుతోంది" అన్నారు గురువుగారు

"లేదు గురూజీ, ఈ రోజుల్లో తప్పు చేసిన వాళ్ళు దాన్ని ఒప్పుకుని సరిదిద్దుకోవడం కంటే తాము చేసే తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి రకరకాల ఎలిబీలు సృష్టించు కోవడం ఎక్కువైంది...

ఇదే మొదటిసారి కనుక కొంచం తప్పయింది, నా మనసు ఇంకేదో విషయం మీద కేంద్రీకృతం అవడం వల్ల తప్పయింది లాంటివి, పార్టీ పెద్దాయన కూడా ఎదో ఒక ఎలిబీ సృష్టించు కుంటే మంచిది కదా" అన్నాడు రామచంద్రం...

గురువుగారు ఆలోచనలో పడ్డారు...కాసేపు మౌనం తరువాత "సరే, అదో మార్గం. ఇంకేమైనా మంచి మార్గాలు దొరుకుతాయేమో చూడు" అన్నారు

"ఈ మధ్య లియోన్ ఫెస్టింగర్ అనే ఒక మానసిక శాస్త్రవేత్త రాసిన పుస్తకం ఒకటి చదివాను...అందులో అయన ఇంతకూ ముందు మనం చూసిన జోక్ వెనక కథ రాసారు...ఆలా చేస్తే సరి" అన్నాడు రామచంద్రం

"ఏమంటున్నావు, మన తెలుగు సినిమా జోకులు అమెరికాలోని మానసిక శాస్త్రవేత్తను ఉత్తేజ పరిచాయా...ముందీ విషయం శ్రీవారికి చెప్పాలి" అంటూ లేచాడు ముఖ్య భృత్యుడు

"ఒరే భృత్యా, నీకెప్పుడూ తొందరే. దాని వల్ల మనకు ఎన్నోసార్లు తలలు బొప్పి కట్టాయి....మేష్టారు అనేది అది కాదు" అన్నారు గురువుగారు

"అవును గురువుగారూ. నేను మన సినిమా డైలాగు అమెరికా మానసిక శాస్త్రవేత్తను కదిలించింది అని కాదు...ఆ డైలాగు వెనుక ఒక మానసిక సిద్ధాంతం ఉంది, దాన్ని గురించి...ఆ జోకు గుర్తు చేసుకోండి, కోటగారు తన కొడుకు అనవసరం గా వెధవనైపోయాను నాన్నా అంటే నా వెధవతనం తో పోలిస్తే నీదొక వెధవతనమా అని ఉత్సాహ పరుస్తారు, దాన్నిదిగజారుతున్న సామజిక పోలికా సిద్ధాంతం అంటారు అయన" అన్నాడు రామచంద్రం

"మేస్టారూ, చిన్న సినిమా జోకును అంత సంక్లిష్ట పరచాలా? ఏమైనా నువ్వు చెప్పిన విషయం బాగానే ఉన్నట్టుండి...కానీ ఇంకొంచం వివరంగా చెప్పు" అన్నారు గురువుగారు

"మన పెద్దాయన చేసిన లాంటి తప్పు ఇంతకు ముందు ప్రతిపక్ష నాయకుడెవరైనా చేసుంటే దాన్ని గురించి ఊదర గొట్టమనండి...మా పెద్దాయన తప్పు చేశారంటున్నారు

కానీ అంతకన్నా హేయమైన తప్పు ప్రతిపక్ష నాయకుడు చేసాడు, దానికేమంటారు అని ఎదురు ప్రశ్నించండి...ఆ ప్రతిపక్ష నాయకుడు ఇప్పడి వాడే అవ్వక్కర లేదు...ఏ తరం వాడైనా పరవాలేదు...ఆ విషయమై కార్టూన్లు, బొమ్మలూ రకరకాల సరుకులు మన కంప్యూటర్ నిపుణుల చేత తయారు చేయించండి" అన్నాడు రామచంద్రం

తనలో ఇలాంటి కోణం కూడా ఉందని అతనికే తెలియదు...కొంచం సిగ్గేసింది

"అద్భుతమైన ఆలోచన...వెంటనే శ్రీవారికి చెప్పాలి...ఇంత మంచి సలహా చెప్పినందుకు నిన్ను చాలా మెచ్చుకుంటారయ్యా మేస్టారూ" అన్నారు గురువుగారు

రామచంద్రం సిగ్గుతో తల దించుకున్నాడు...ఒక్క నిముషం మౌనం తరువాత "గురువు గారూ, ఇవాళ రాజకీయ రంగస్థలం లో నేను తప్పు చేశానంటావు కానీ అంతకన్నా పెద్ద తప్పు చేసినవాళ్లు సంగతేమిటి? అని సమర్ధించుకోవడం ఒక ప్రముఖమైన ఆయుధమై పోయింది...ప్రతీ తప్పుని అంతకన్నా పెద్ద తప్పు చూపించి కప్పి పెట్ట వచ్చు...కానీ అది మనల్ని ముందుకి తీసుకుని వెళ్ళదు...ట్రెడ్‌మిల్ మీద పరిగెడుతున్న చందం అవుతుంది...అదోరకం ముచ్చట" అన్నాడు రామచంద్రం కొంచం బాధపడుతూ

"నిజమేనయ్యా, కానీ ముల్లుని ముల్లుతోనే తియ్యాలి...అదే చాణక్య నీతి...ఈ కాలం రాజకీయాలకు అదే సరైన మందు" అన్నారు గురువుగారు

"చివరకు మిగిలేది ముళ్ళే గురువుగారూ. వజ్రాన్ని వజ్రం తో కొయ్యడం అనే సామెత దగ్గరకు వెళ్ళ్లాలి. రాజకీయాలకు అదే ముఖ్యమైన ప్రక్షాళన" అన్నాడు రామచంద్రం

"నీ చాదస్తం గానీ ఆలా జరగదు...వజ్రాలు పెద్ద చదువులు చదువుకుని పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తూ దేశం లోనూ విదేశాల్లోనూ ఎన్నో మంచి పనులు చేస్తాయి...మిగిలిన రాళ్లే కదా రాజకీయాల్లోకి వచ్చేది" అన్నారు గురువుగారు గుస గుసలాడుతూ

"ఆ వజ్రాలకు కావాల్సిన సామజిక, ఆర్ధిక,న్యాయ పరమైన నిర్ణయాలు ఈ రాళ్ళూ లేదా మూళ్ళ కంపలూ తీసుకుంటాయి..పరవలేదా" అనడిగాడు రామచంద్రం

"అది నిజమే కానీ ఆ మార్పు పరిణామాత్మకం గా రావాలి, విప్లవాత్మకం గా కాదు...అంతవరకూ మనం చెయ్య గలిగే పనులు చెయ్యాలంటే మనం రాజకీయాల్లో ఉండాలి కదా" అన్నారు గురువుగారు

"ప్రజలకు ఈ విషయమై పెద్ద అభ్యంతరాలున్నట్టు లేదు...మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారం మనం సాంఘిక మాధ్యమాల్లో ఊదర గొడితే ప్రజలే మన పార్టీ పెద్దాయన గొప్పవాడు అని ప్రచారం చేస్తారు" అన్నాడు ముఖ్య భృత్యుడు

"మొదట్లో ఆ తులనాత్మక విశేషాలు చూసి ప్రజలు కొంత ఉత్సాహ పడతారు...మన పార్టీ పెద్దాయన చిన్న తప్పే చేసాడు...ప్రతిపక్షం లో అంతకన్నా పెద్ద తప్పులు చేసిన వాళ్ళున్నారు అని సరిపెట్టుకుంటారు...

కానీ మెల్లిగా విషయాలు తెలుస్తుంటే పధ్ధతి మారుతుంది...దాన్నే అభిజ్ఞా వైరుధ్యం (కాగ్నిటివ్ డిసనాన్స్) అంటారు...ఆ స్థితికి వెడితే మనం ప్రజలను మభ్య పెట్టలేం" అన్నాడు రామచంద్రం

"నువ్వు చెప్పే సిద్ధాంతాలు వ్యక్తుల మీద పనిచేసినట్టు సమూహాల మీద పనిచెయ్యవయ్యా... ఇక్కడ మనం సమూహ గమనాత్మక పద్ధతులు వాడుకోవాలి" అన్నారు గురువుగారు

"అంతేలెండి, మా చిన్నపుడు ఆడికి నవ్వారు అనే ఒక కంప్లైంట్ ఉండేది...మా చిన్న తమ్ముళ్ళిద్దరు ఒకటే జోక్ చెప్పేవారు...ముందు చెప్పిన వాడి జోక్ కి నవ్వేవాళ్ళం...అందుకు రెండో వాడు కోప్పడే వాడు...ఆది జోక్ కి నవ్వారు అదే నేను చెప్తే అందుకు నవ్వారు అని...

ఇప్పుడు మీరు అంటున్న విషయం కూడా అలాంటిదే...ముందు ఒక నాయకుడు తప్పు చేస్తే మీరేమీ అనలేదు ఇప్పుడు కూడా అనకండి అని...ఈ ట్రెడ్‌మిల్ బతుకు నుంచి ప్రజలకు విముక్తి ఎపుడో" అంటూ లేచాడు రామచంద్రం పిల్లలకు పాఠాలు చెప్పడానికి.

మరిన్ని కథలు

Satpravarthana
సత్ప్రవర్తన
- చెన్నూరి సుదర్శన్
Chalicheemalu kaadu
చలిచీమలు కాదు
- జి.ఆర్.భాస్కర బాబు
Enta chettuki anta gaali
ఎంతచెట్టుకు అంత గాలి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.