లంచ్ క్యారియర్ రిటైర్ అయ్యింది - యు.విజయశేఖర రెడ్డి

Lunch carrier retire ayindi

నా బాధ ఏమని చెప్పనండీ...నేను హాట్ ప్యాక్ లంచ్ క్యారియర్‌ను,నా యజమానురాలు,ప్రతి రోజు రెండు గిన్నెలలో, వేడివేడి అన్నం పెడుతుంది. ఆ వేడి భరిస్తుండగానే మరో గిన్నెలో వేడివేడి సాంబారు పోస్తుంది. పెరుగు మాత్రం ప్లాస్టిక్ డబ్బాలో వేస్తుంది.

మా వాడు అదే నా యజమాని ట్రిమ్ముగా తయారయ్యి, నన్ను తన బ్యాగ్‌‌లో పెట్టుకుని బస్‌లో పడి ప్రయాణం చేసి, ఆఫీసుకు వచ్చాక బ్యాగ్‌ను,అందరూ టిఫిన్ బాక్స్‌లు పెట్టే చోట పడేసి,ఆయనేమో హాయిగా ఎ.సి. రూంలో కూర్చుని పని చేసుకుంటాడు.

మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో కానీ,నన్ను బయటకు తీయాడు. వేడి వల్ల అప్పటి వరకు నేను ఉక్కిరి,బిక్కిరి అవ్వాల్సిందే.

ఒక్కోసారి ఫోజు కొట్టి, ఆడిటర్ వచ్చాడని, ఇంకో ఆఫీసర్ పార్టీ ఇస్తున్నాడని, బయట హోటల్ కెళ్ళి తినేస్తుంటాడు.

అప్పుడు ఏ అటెండర్‌కో నన్ను ఇచ్చి, నేను బయటకు వెళుతున్నాను నువ్వు తినేసెయ్యి అంటాడు. అలా ఎవరికైనా ఇచ్చినప్పుడు నాకు ఎంతో సంతోషమేస్తుంది. ఎందుకంటే అతను తిన్న తరువాత నన్ను శుభ్రంగా కడిగి, ఆర బెట్టి తరువాత మా వాడి బ్యాగ్‌లో పెడతాడు.

అదే మా వాడైతే బాగా తిని కడగకుండా అలాగే బ్యాగ్‌లో పడేస్తాడు..ఎందుకంటే నన్ను కడగడం అతనికి నామోషీ మరి.

ఇంటికి వచ్చాక బ్యాగ్ పక్కన పారేస్తాడు. మా మహాతల్లి, అదే యజమానురాలు, నన్ను బ్యాగ్ నుండి తీసి కడగకుండా సింక్ దగ్గర పెడుతుంది.తెల్లారి పనిమనిషి వచ్చే వరకు కుళ్లు కంపుతో నేను చచ్చి పోవలసిందే.

పనిమనిషి తోమి.. తోమి నా శరీరాన్ని సగం అరగ దీసింది.

ఒక్క సెలవు రోజుల్లో మాత్రమే నాకు విశ్రాంతి దొరుకుతుంది.

***

ఇటీవల మా వాడికి 60 సంవత్సరాలు నిండ బోతున్నాయి..మా యజమానురాలు క్యారియర్ కడుతూ మా వాడితో మాట్లాడుతుంటే విన్నాను. “మహా అయితే క్యారిర్ ఇంకో పది రోజులు తీసుకెళతారు అంతేగా..”అంది.

“అవును” అన్నాడు మా వాడు. నాకు కూడా రిటైర్మెంట్ వస్తోందని చాలా సంబర పడ్డాను.

ఆ రోజు రానే వచ్చింది. వంటింట్లోకి వచ్చిన మా వాడితో “ఈ రోజు భోజనాలు బయట హోటల్లో అన్నారుగా అందుకే క్యారియర్ కట్టడం లేదు” అంది యజమానురాలు.

ఆ మాటలకు ఒక్కసారి ఎగిరి గంతు లెయ్యాలని పించింది..కానే ఎగర లేక పోయాను.

మా వాడికంటే నేను ఒక రోజు ముందర రిటైర్ అయ్యానని హాయిగా ఊపిరి పీల్చు కున్నాను.

కొన్ని రోజుల తరువాత నా యజమానురాలు నన్ను కప్‌‌బో‌‌ర్డ్‌లో పడేసింది. పాత గిన్నెలు నాకు స్వాగతం పలికాయి. ఆహా నాకు తోడు దొరికాయని నా మనసు గెంతులెసింది.

ఇక నన్ను ముట్టుకునే వారు లేరు... ఎందుకంటే మా యజమాని పిల్లలిద్దరూ, అమెరికాలో ఉన్నారు. నేను హాయిగా మా వాళ్ళతో కాలక్షేపం చేస్తున్నాను.

****

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు