జస్ట్ ఫర్ ఎ ఛేంజ్ - శింగరాజు శ్రీనివాసరావు

Just for a change

పెళ్ళయి పాతికేళ్ళు గడిచిపోయింది సులోచనకు. స్వర్ణోత్సవానికి గుర్తుగా ఒక చంద్రహారం కొనమంటే ఎంత అవమానించాడు భర్త సురేంద్ర. ఇప్పటిదనుక తనపైన పెట్టిన ఖర్చు లక్షల్లో ఉందట. అదే దండగ అన్నాడు. తల కొట్టేసినట్టయింది ఆమెకు. ఆ మాటలకు పగలబడి నవ్విన కొడుకు. పక్కనే ముసిముసిగా నవ్వుతూ కోడలు. అవును ఎందుకు నవ్వరు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారుగా మరి. ఏడుపు తన్నుకు వచ్చింది సులోచనకు. ఈ అవమానం తనకే కాదు. తనలా తెలివితక్కువ జీవితం మొత్తాన్ని కుటుంబం కోసం ధారపోసిన ఆడపిల్లలందరిదీ. అందరికీ సమయానికి వండి వార్చి, ఇంటెడు చాకిరీ చేసే ఆడవాళ్ళందరిదీ ఇదే పరిస్థితి. అత్త మామలు సరేసరి, కట్టుకున్నవాడు కూడ గుర్తించడు. గుర్తించకపోతే పోయారు హీనంగా చూస్తారు, హేళనగా మాట్లాడుతారు. ఎందుకు పనికిరాని చెత్తసరుకు అన్నట్లుగా చూస్తారు. మగవాళ్ళమన్న అహంకారం. వళ్ళు సలసల కాగుతున్నది సులోచనకు. ఎంతకాలమిలా... ఏదో ఒకటి చేయాలి... తెగించి నిర్ణయం తీసుకోవాలి.... అదే ఆలోచనలో ఉన్నది సులోచన. ******* " ఒసేయ్ సులోచన. ఎక్కడ తగలడ్డావు. కాఫీ తెచ్చి చావు. ఏడు గంటలు దాటింది " ప్రేమ నిండిన మనసుతో ముద్దుగా చెప్పాననుకున్నాడు సురేంద్ర. అదే పొగరు గొంతులో పాతికేళ్ళ నుంచి, అనుకుంది సులోచన. ఆప్యాయంగా 'సులూ' అనో 'అమ్మలూ' అనో పిలుస్తాడని ఎన్నో రోజులు ఎదురుచూసింది. ఆ ఆశ ఎండమావేనని తెలిసిపోయింది ఆమెకు. క్రమంగా ఈ పిలుపులకు అలవాటు పడిపోయింది. కాఫీ గ్లాసు తెచ్చి ఠపీమని స్టూలు మీద కొట్టి పెట్టింది. " అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు, నా మీద కోపం గ్లాసు మీద చూపిస్తావేం" హూంకరించాడు సురేంద్ర. " ఆంధ్ర దేశపు పతివ్రతలం, అంతకంటే ఏం చేస్తాం" " చనువిస్తే నెత్తినెక్కి ఆడతారే మీరు" " ఆ పని మేము చేయబట్టే కదా, ఇప్పుడు మీరిలా చిందులేస్తున్నది" "మాటకు మాట ఎదురు చెబుతున్నావు. ఏమైంది నీకు" " జ్ఞానోదయం" ఠపీమని చెప్పింది సులోచన. " అమ్మా నాకు లంచ్ బాక్స్ త్వరగా తయారుచెయ్. నేను పెందలాడే ఆపీసుకు వెళ్ళాలి" అరిచాడు సుపుత్రుడు సందీప్ లోపలినుంచి. " నీ పెళ్ళాని లేపి వండించుకో " అదే స్వరంతో సమాధానమిచ్చింది సులోచన. కాఫీ గ్లాసు పక్కనబెట్టి అయోమయంగా భార్య వైపు చూశాడు సురేంద్ర. " అమ్మా జోకులేయకుండా త్వరగా కానీయవే" అరుస్తూనే ఉన్నాడు సందీప్. " ముందు ఆ కేకలు మాని మీ ఆవిడను లేపి వంట చేయించుకో లేదా ఏ క్యాంటిన్ లోనో తిను. నేను చేయను" నొక్కి వక్కాణించింది సులోచన. " ఏమయిందమ్మా నీకు ఇవాళ. ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నావు" లోపలి నుంచి వచ్చి అడిగాడు సందీప్. " చెప్పానుగా జ్ఞానోదయమని. ఇకనుంచి ఇంటితో గానీ, ఇంటి పనులతో గాని నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నాకు సంసారం మీద విరక్తి కలిగింది" " ఏమిటే ఈ రోజు వింతగా మాట్లాడుతున్నావు. దయ్యమేమైనా పూనిందా" తలగోక్కుంటూ అడిగాడు సురేంద్ర. " ఇన్నాళ్ళూ పూనిన భర్త, పిల్లలు, వాళ్ళ ప్రేమ కావాలి అనే దయ్యం, ఈరోజుతో వదలిపోయింది" తాపీగా సమాధానం చెప్పింది సులోచన. " హిస్టీరియా లాంటి జబ్బో.... సైకలాజికల్ డిప్రెషనో వచ్చిందే నీకు. పద. ఒరేయ్ సందీప్ మీ అమ్మను అర్జెంటుగా మానసిక వైద్యశాలకు తీసుకువెళ్ళాలి" అంటూ లేచాడు సురేంద్ర. " అక్కరలేదు. నాకేమీ పిచ్చిపట్టలేదు. డిప్రెషన్ అంతకన్నా కాదు. ఫ్రస్టేషన్. పెళ్ళయినప్పటి నుంచి గానుగెద్దులా ఇంటెల్లపాదికి చాకిరీ చేసి అలసిపోయాను. ఆడది అంటే వంటింటికే పరిమితమని, తన బ్రతుకెప్పుడూ మరు కవాటం వెనకేనని చచ్చిన మా మామగారు, లేచినప్పటి నుంచి పడుకోబోయేదాకా అరనిముషం ఖాళీ ఇవ్వకుండా బండెడు చాకిరీ చేయించి, సాధించి సాధించి మంచంలో పడి గుటుక్కుమన్న అత్తగారు, వారసత్వం పోకుండా పీక్కుతిన్న మొగుడు, కొడుకు, ఈ గుంపుకంతా చేసి చేసి నీరసపడిపోయాను. కోడలు వచ్చి కాస్తంత అతుకుతుందనుకుంటే, ఉద్యోగం పేరుతో నన్ను వంటమనిషిగా శాశ్వతంగా మార్చేసింది. అందుకే బ్రతుకంటే ఛీ.. అనిపించి ఒక నిర్ణయం తీసుకున్నాను" దీర్ఘోపన్యాసమిచ్చి వెళ్ళబోతున్న సులోచన చెయ్యిపట్టుకుని ఆపాడు సురేంద్ర. " సులోచనా. ఏమిటిలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. కరోనాకు వేయించిన వ్యాక్సిన్ వికటించలేదు కదా. అసలెందుకిలా మారిపోయావు. అంత బాధపెట్టామా నిన్ను" ఉపశమనపు మాటలు నటించాడు సురేంద్ర. " వేదిక మీద ఆడే నాటకాలు ఇంట్లో ఆడకండి. ఎవరూ చప్పట్లు కూడ కొట్టరు. అయినా పెళ్ళయి పాతికేళ్ళు దాటి, భర్తలు పెట్టే టార్చర్ను తట్టుకున్న ప్రతి ఆడపిల్లకు ప్రతిరక్షకాలు దేహంలో ఉద్భవించే ఉంటాయి. వాళ్ళకు వేరే వాక్సిన్ ఏదీ అవసరం లేదు. నలుచుకు తిన్నారు కదండీ నన్ను. ఇక అన్నీ బంద్. మీదారి మీది, నాదారి నాది" చెయ్యి విదిలించుకుంది సులోచన. " అమ్మా టెన్షన్ పెట్టకే. ఆడిన డ్రామా చాలు. వెళ్ళి కనీసం టిఫినన్నా చెయ్యి, నేను ఆఫీసుకు వెళ్ళాలి" విసుక్కున్నాడు సందీప్. " ఒరేయ్ నేను సులోచనను. ఏంచేసినా నిర్భయంగా చేస్తాను. నీ భార్యలాగ నాటకాలాడను. ఈ రోజు నుంచి నేను ఏ పనీ చేయను. నా భవిష్యత్తుకు సంబంధించి నేను తీసుకున్న నిర్ణయానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి" అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది సులోచన. ఆమె ప్రవర్తన అర్థంగాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు తండ్రీకొడుకులు. ********** నిన్నటి నుంచి భార్య వింత ప్రవర్తనను తట్టుకోలేక పోతున్నాడు సురేంద్ర. ఎప్పుడూ గంగిరెద్దులా చెప్పినదానికల్లా తలవూపే సులోచన శివంగిలా మారిపోయింది. కారణం అర్ధంకావటం లేదు. ఈ వయసులో చాకిరీ చేయలేక అలసిపోతూ ఆవేశపడిపోతున్నదా...ఎంత ఆలోచించినా విషయం సురేంద్ర బుర్రకు తట్టడం లేదు. "హలో... చేసిన ఆలోచన చాలు. ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి" అంటూ పేపర్లు, పెన్ను చేతిలో పెట్టింది సులోచన " ఏమిటే..కొంపదీసి విడాకుల కాగితాలా.. అయినా ఈ వయసులో నీకిదేం పోయేకాలమే" చివుక్కున లేచాడు. " అరవై సంవత్సరాల వయసులో నలభై సంవత్సరాల వాడితో ప్రేమలో పడి, మూడవ పెళ్ళి చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజుల్లో. నాకింకా యాభై కూడ రాలేదు. నేను 'ఊ' అంటే 'ఉస్కో' అనే వాళ్ళు కోకొల్లలు. అయినా ఒకసారి పెళ్ళిపేడ పూసుకున్న ఏ ఆడపిల్లయినా తెలిసి తెలిసి మరల పేడలో కాలేస్తుందా. నెవర్.. నేనలాంటి పిచ్చిపని చెయ్యను. అయినా విడాకులు ఇచ్చే అంత చీప్ దాన్ని కాదు నేను. ఇవి అంతకంటే పెద్దవి" తెగించి మాట్లాడుతున్న భార్య మాటలకు తల తిరిగిపోతున్నది సురేంద్రకు. " మరి ఈ కాగితాల మీద నా సంతకాలు దేనికే" "నేను చేయబోతున్న పని మీకు అభ్యంతరం లేదని, మీకు సమ్మతమేనని తెలిపే అంగీకారపత్రం" " ఏం చెయ్యబోతున్నావే. నువ్వు చెబితేగానీ పెట్టను" " సన్యాసం తీసుకోబోతున్నాను" " సన్యాసమా... మతుండే మాట్లాడుతున్నావా. అయినా పెళ్ళయి, పిల్లలున్న నువ్వు ఈ పనిచేయడమా...హవ్వ.." " ఏం. పెళ్ళాన్ని, పిల్లలను గాలికొదిలేసి ఎంతమంది మగవాళ్ళు సన్యాసమంటూ ఇల్లు వదిలి ఆశ్రమాలకు పోలేదు. జస్ట్ ఫర్ ఎ ఛేంజ్ నేను సంసారమంటే విరక్తి చెంది సన్యాసం తీసుకుని, మా ఆడజాతికి మార్గదర్శకం కావాలనుకుంటున్నాను. పాతికేళ్ళు బండ చాకిరీ చేసి, అడగక అడగక ఒక చంద్రహారం అడిగితే చులకనగా మాట్లాడతారా. ఐ హర్ట్. త్వరగా సంతకం పెట్టండి. లేకుంటే మీ సంతకం నేనే ఫోర్జరి చెయ్యాల్సివస్తుంది" "నో..నో.. నేను ఒప్పుకోను గాక ఒప్పుకోను" చిందులు తొక్కుతున్నాడు సురేంద్ర ****** " అబ్బబ్బబ్బ. పట్టపగలు నిద్రలో ఈ కేకలేమిటండీ. రోజురోజుకు ఎక్కువయిపోతున్నాయి మీ కలవరింతలు. లేవండి" భర్త వీపు మీద దబదబ బాదింది సులోచన. ఉన్నపళంగా లేచి కళ్ళు నులుముకుని " సులోచనా..ఇక్కడే ఉన్నావా.. ఆ కాగితాలు ఏవి?" అని అడిగాడు. " కాగితాలా... అవేంటి" ఉలిక్కిపడి " అబ్బే ఏంలేదు. అదేనే. నువ్వు చంద్రహారం అడిగావు కదా. వాటి మోడల్స్ తెచ్చి చూపిస్తున్నట్లు కలవచ్చింది" సర్దిచెప్పాడు సురేంద్ర. " అక్కర్లేదు లెండి" అని బుంగమూతి పెట్టింది సులోచన. " అలిగావా" కొసరాడు " ఉహూ.. ఏదయితే అదంయిందని తెగించి చంద్రహారానికి ఆర్డరిచ్చాను. నేను దాచుకున్న డబ్బులో పాతికవేలు అడ్వాన్సు ఇచ్చాను. మిగిలిన లక్ష రూపాయలు అయిదు కంతులలో మావారు ఇస్తారని చెప్పి, మా అన్నయ్య ఖాతా కొట్లో చెప్పివచ్చాను. రెండు రోజులలో ఇస్తానన్నాడు. కలవరింతలు ఆపి దాని సంగతి చూడండి. కాదు కూడదు అన్నారంటే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను " అంటూ ఆవేశంగా వెళ్తున్న సులోచనను గుర్రుగా చూశాడు. 'లక్ష రూపాయలా..అమ్మో... నీ బొందమండ. నాకే ఎసరుపెట్టావు కదే. అత్త, మామ కాలం చేసేసరికి నీకు కాళ్ళు వచ్చాయే. ఖర్మ. కట్టుకున్నాక తప్పుతుందా. లేకుంటే సన్యాసమంటూ జెండా పీకనైనా పీకుతావు' అని మనసులోనే శతపండు పెడుతూ లేచాడు సురేంద్ర. ************ అయిపోయింది ***********

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు