నానమ్మ కాదు నాన్నా..! - చెన్నూరి సుదర్శన్

Naannamma kaadu naannaa

ధీరజ్ ఆరవ తరగతి చదువుతున్నాడు. అతనికి సినిమాలంటే మహా పిచ్చి. ఆ ఊరిలో ఒకే ఒక సినిమా హాలు ఉంది. నెలలో దాదాపు ఐదారు సినిమాలు మారుతుంటాయి. ధీరజ్ ప్రతి సినిమా చూడాల్సిందే. దీరజ్ నాన్న ఆఫీసు పనిమీద ఎక్కువగా ఇతర ప్రాంతాలకు వెళుతుంటాడు. ఆ సమయాలలో అమ్మను కాకా పట్టి సినిమాకు చెక్కెయ్యడం.. ధీరజ్ కు వెన్నతో పెట్టిన విద్య. ఒకే ఒక పుత్ర రత్నం కావడం వల్ల గారాబమెక్కువ.

ధీరజ్ నాన్నమ్మ కూడా వాడికి వత్తాసు పలుకుతుంది. దానికి కారణం లేక పోలేదు, ధీరజ్ సినిమా చూసొచ్చి నానమ్మకు ఆ సినిమా కథను కళ్లకు కట్టినట్టుగా చెబుతాడు. ఆమెకు సినిమాలకు వెళ్లి డబ్బులు ఖర్చు చేయడం ఇష్టముండేది కాదు. కానీ చిరుతిళ్లు తినడం.. ఐస్ క్రీమ్ తినడం మహా ఇష్ఠం చాటుమాటుగా తను తింటూ.. ధీరజ్ కూ తినిపిస్తుంటుంది. అందుకే ఒకరంటే మరొకరికి ప్రాణం.

ఆ రోజు బడి నుండి ధీరజ్ రాగానే.. ఇంట్లో నుండి పెద్ద.పెద్ద కేకలు వినబడటంతో బిక్కముఖమేసుకున్నాడు. గుమ్మం చాటున నిలబడి వినసాగాడు.

“అమ్మా.. నీకు డబ్బులు అవసరమైతే నన్ను లేదా నీ కోడలును అడిగి తీసుకో.. అంతే గాని ఇలా గల్ల గురిగి (నాణేలు వేయడానికి వీలుగా రంధ్రం కలిగిన చిన్న కుండ) నుండి దొంగతనంగా డబ్బులు తీయడం ఏమైనా బాగుందా!” అంటూ ధీరజ్ తండ్రి తన తల్లిని నిందిస్తున్నాడు.”ధీరజ్ కోసం సైకిల్ కొందామని డబ్బులు అందులో వేస్తున్నాను.. వేసినప్పుడల్లా లెక్క వ్రాస్తున్నాను. ఈ రోజు గురిగిని పగులగొట్టి లెక్క చూస్తే డబ్బు తగ్గింది.. చూసావు కదా!”

“నాకేపాపామూ తెలియదురా... నేను తీయలేదు” అంటోంది నానమ్మ.

ధీరజ్ ఆలోచనలో పడ్డాడు. తన మీద అనుమాన పడకుండా నాన్న, నానమ్మను అనుమానించడంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి.”డబ్బులు దొంగిలించింది నానమ్మ కాదు నాన్నా... నేనే తీశాను” అని భోరుమని ఏడుస్తూ తండ్రి కాళ్లను చుట్టేశాడు.

“ధీరజ్ సినిమాల పిచ్చిలో పడి నువ్వు తప్పు చేశావని నాకు తెలుసు.. నువ్వు డబ్బు అవసరమయ్యినప్పుడల్లా సన్న పుల్లతో గురిగి నుండి నాణేలను తీయడం అమ్మ చాలా సార్లు చూసింది.. ‘పిల్లి పాలు తాగుతూ ఎవ్వరూ చూడలేదనుకుంటుంది’. తప్పు ఒప్పుకుంటావో! లేదో! నని, నువ్వు వస్తూ ఉండడాన్ని గమనించి ఈ నాటకమాడాను. చేసిన తప్పును ఒప్పుకోవడానికి గుండె ధైర్యం కావాలి. చూడు ధీరజ్ ఒక వ్యామోహం మనల్ని దొంగతనం చేసేలా చేస్తుంది. నీది చదువుకునే వయసు.. బాగా చదువుకుని విద్యార్థిగా మంచి పేరు తెచ్చుకుంటావో.. లేకపోతే ఇలా చిల్లర నాణేలు దొంగతనం చేస్తూ దొంగ అనే ముద్ర వేసుకుంటావో.. నీ ఇష్టం” అని సున్నితంగా మందలించాడు ధీరజ్ నాన్న.

“లేదు నాన్నా..! నేను బాగా చదువుకుంటాను.. ఇలాంటి తప్ప ఇంకెప్పుడూ చేయను” అంటూ దేవుడి మీద ప్రమాణం చేశాడు ధీరజ్. *

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు