“అమ్మమ్మా.. నన్ను ఎప్పుడూ.. తెలివి తక్కువ దద్దమ్మ అని తిట్టేదానివిగా.. ఇటు చూడు. కాని ఖర్చు లేకుండా ఎలా గుండు కొట్టించుకొని వచ్చానో!” మురిపెంగా మూతి మూడు వంకర్లు తిప్పుతూ.. అన్నాడు అంజన్న. పదహారేండ్ల ప్రాయం వాడైనా.. పసితనపు ఛాయలు ఇంకా పోలేదు.
బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆంజనేయులును, అతని అమ్మమ్మ ఆండాళమ్మ బడికి పంపకుండా అతిగారాబంగా పెంచడం.. అతని బుద్ధి వికసించ లేదని ఊరంతా అనుకుంటారు. లోకజ్ఞానం ఏమాత్రమూ తెలియని ఆంజనేయులు అమాయకత్వంతో అంతా అతణ్ణి ‘అమాయకపు అంజన్న’ అని పిలవడం మొదలుపెట్టారు.
అంజన్నను తన మానాన తనను వదిలేయాలని అప్పుడే అతడి లోకజ్ఞానం సంపాదించుకోగలడని ఇరుగు, పోరుగు వారి సలహాలతో.. అతనికి సుద్దులు, బుద్ధులు చెప్పింది అండాళమ్మ. చేతిలో పైసా పెట్టలేదు. స్వంతంగా కష్టపడి సంపాదించుకోవాలని హితబోధ చేసింది. ఊళ్లు తిరిగి రమ్మని తరిమింది.
నాలుగు రోజుల తరువాత తళ, తళ మెరిసే గుండుతో ప్రత్యక్షమైన మనవణ్ణి చూసి ఆండాళమ్మ ఆశ్చర్యపోయింది. మనుమని గుండు సంబురంగా తడుముతూ..
“అంజన్నా.. గుండు ఎవరో గాని నున్నగా చేశాడురా. అవునూ.. నేను డబ్బులివ్వ లేదు గదరా..!” అంది.. ముక్కు మీద వేలేసుకుని.
తాను సాధించిన ఘనకార్యం కళ్ళకు కట్టినట్టు చెప్పసాగాడు అంజన్న.
***
ఆ రోజు తెల్లవారు ఝామున్నే లేచి పొరుగూరు వెళ్లాను.. ఊరంతా తిరిగి ఉలువ గింజ, చేనంతా.. తిరిగి శనగ గింజ, కల్లమంతా.. తిరిగి కంది గింజ సంపాదించాను. నా తెలివి తేటలు ప్రదర్శించి ఆ మూడు గింజలతో మరింత కష్టపడి సంపాదించాలని మరో ఊరు వెళ్లాను. అక్కడ ఒక ఇంట్లో ఒక ముసలవ్వ రాట్నంతో కండెలు చుట్టుతోంది.
“ముసలవ్వా.. ముసలవ్వా.. ఈ మూడు గింజలు నీ వద్ద పదిలంగా దాచి పెట్టు. నేను ఊళ్లోకి అలా వెళ్లి వస్తాను” అని జాగ్రత్తలు చెప్పి ఊళ్లోకి వెళ్లాను. ఎవరైనా ఆ మూడు గింజలు కొంటారేమోనని ఆరా తీశాను. ఎవరూ మందుకు రాలేదు. గింజలు తిరిగి తీసుకుందామని ముసలమ్మ ఇంటికి వెళ్ళి అడిగాను.
“అయ్యో! అంజన్నా పొరపాటయ్యింది. పగలు నిద్ర వచ్చింది.కంటి మీద కునుకు తేలిపోవాలని ఆ మూడు గింజలు నమిలి నీళ్ళు తాగాను” అంటూ ఖిన్నురాలయ్యింది.
నేను ఊర్కోలేదు. దానికి రెట్టింపు వసూలు చెయ్యాలని రెట్టించాను.
“బలే ఉన్నావు ముసలవ్వా.. నేనంత కష్టపడ్డాననుకున్నావు. గింజలకు బదులు కండెచుట్టు ఇవ్వు” అని భీష్మించుకుని కూర్చున్నాను. గత్యంతరం లేక కండెచుట్టు ఇచ్చింది
దాన్ని తీసుకొని మరో ఊరు వెళ్లాను. ఆ ఊళ్ళో బట్టల నేతగాళ్ళు ఎక్కువగా కనిప్మ్చారు.. ఒక నేతగాని ఇంట కండెచుట్టు చూపించి ఖరీదు చెప్పాను. అంత ఇచ్చుకోలేనని బేరమాడాడు. మిగతా వారిని కూడా అడిగి తెలుసుకుని వచ్చి చెబుతానని.. అందాక దానిని అతని దగ్గరే ఉంచమన్నాను. నేను తిరిగి వచ్చేసరికి ఆ నేతగాడు చీరకు తక్కువ పడిందని కండెచుట్టును వాడుకున్నాడు. నాకు కోపం వచ్చింది. బేరం కుదురకుండా ఎందుకు వాడుకున్నావు దాని బదులు పంచవన్నెల పంచె ఇమ్మన్నాను. లేకుంటే నా కండెచుట్టు నాకిమ్మన్నాను. చేసేది లేక పంచవన్నెల పంచె ఇచ్చాడు.
అది తీసుకుని మరో ఊరు వెళ్లాను. ఊరి మొదట్లోనే ఒక గొల్లవాని ఇంట్లో పంచె దాచిపెట్టమని ఇచ్చి ఊళ్ళో ఎవరైనా దాన్ని కొంటారేమో! నని వెళ్లాను. ఊళ్ళో పంచెను కొనే స్థితిపరులు కనబడ లేదు. మరో ఊరు వెళ్దామని పంచె కోసం వచ్చేసరికి దాని దుస్థితి చూసి బావురుమన్నాను. పంచెను చిన్న, చిన్న పీలికల్లా చీల్చి అందంగా ఉంటుందని మేకల కొమ్ములకు చుట్టాడు గొల్లవాడు. పంచెవన్నెల పంచె బదులు కొమ్ముల పొట్టేలు కావాలని భీష్మించుకుని కూర్చున్నాను. గొల్లవాడు ఎలాగూ పంచె తిరిగి ఇవ్వలేడు కనుక కొమ్ముల పొట్టేలును ఇచ్చాడు.
కొమ్ముల పొట్టేలును తీసుకుని ఒక దొరవారి ఇంటికి వెళ్లాను. దాన్ని వారి ఇంట్లో అప్పగించి లోకజ్ఞానం కోసం ఊళ్లో తిరిగి వచ్చేసరికి పొట్టేలును కోసుకుని తిన్నారు. నా ఏడుపు ముఖం చూసి చారెడు నాణాలిచ్చాడు దొరవారు.
చారెడు నాణాలు తీసుకుని తిరిగి మన ఊరికి బయలుదేరాను. దారిలో ఒక వడ్రంగి కలిసి చారెడు ఏ మూలకు సరి పోతుంది. మా ఇంటికి వస్తే చాటెడు ఇస్తానని ఆశ చూపాడు. వడ్రంగి ఇంటికి వెళ్లాను చారెడు నాణాలు తీసుకుని చాటెడు చెక్క పొట్టు ఇచ్చాడు. నాకెంతో సంబరమేసింది.
మన ఊళ్ళో అడుగు పెట్టేసరికి మన మంగలి మల్లన్న కలిశాడు. తన ఇంట్లో పొయ్యి సరిగ్గా వెలగడం లేదని.. చెక్కపొట్టు కావాలని వేడుకున్నాడు. నేను ఊరికే ఇస్తానా? నాకు తెలివి లేదనుకున్నాడు వాడు. చెక్కపొట్టు ఇచ్చి దానికి బదులు నా గుండు గీయమన్నాను. మల్లన్న సంతోషంగా నా గుండు గీచాడు.
***
“చూడు అమ్మమ్మా.. “ అంటూ పిలక పట్టుకుని ఊపసాగాడు అంజన్న.
అండాళమ్మ తన పెంపకంలో తప్పిదాన్ని గుర్తించింది. అంజన్నను బడికి పంపకపోవడం పెద్ద పొరబాటు చేశానని గుండెలు బాదుకుంటూ.. కుప్పలా కూలి పోయింది.
ఉచితంగా గుండు గీయించుకున్నందుకు సంతోషించక.. ఎందుకలా అండాళమ్మ పడిపోయిందోనని అయోమయంలో పడిపోయాడు అమాయకపు అంజన్న. *