అసలైన గరీబు - Somavarapu Raghubabu

Asalaina gareebu

"కంటి చూపుకి ఏమీ ప్రమాదం లేదు. రెండు రోజులు మా పర్యవేక్షణలో ఉంచి పంపేస్తాము" కేస్ షీట్ పక్కన పెట్టేసి, స్టెతస్కోపు సర్దుకుని చకచకా నడుచుకుంటూ పక్క వార్డు వైపు వెళ్ళిపోయాడు డాక్టర్.

హాస్పిటల్ బెడ్ మీద జారగిల పడి కూర్చున్న రాముకి ఇంకా గుండె టకటకా కొట్టుకుంటూనే ఉంది. 'ఎంత ప్రమాదం తప్పింది' నూట ఒకటోసారి అనుకున్నాడు మనసులో.

22 ఏళ్ల బ్యాచిలర్ రాము హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ డ్రాఫ్ట్స్'మేన్ గా పని చేస్తున్నాడు. ఫౌండేషన్ డ్రాయింగ్ లను ట్రేసింగ్ చేయడం, సీనియర్ డ్రాఫ్ట్స్'మేన్ గీసిన మెషిన్ పార్ట్స్ మరియు ఫ్యాక్టరీ లేఔట్ డ్రాయింగ్ లను బ్లూప్రింట్స్ తీయడం అతని రోజువారీ పని.

ఎప్పటిలాగే ఈ రోజు ఉదయం కూడా బ్లూ ప్రింట్ మెషిన్ నుండి బ్లూ ప్రింట్స్ తీస్తున్నాడు రాము. బ్లూ ప్రింట్స్ తీసే ముందు మెషిన్ లోకి బ్లూ ప్రింట్ పేపర్ ని ఫీడ్ చేయడంతో పాటు అమ్మోనియా లిక్విడ్ కూడా పోయాలి. ప్రింట్స్ చాలా డల్ గా వస్తూండటంతో కొంచెం లిక్విడ్ పోద్దామని 'అమ్మోనియా లిక్విడ్' బాటిల్ ఓపెన్ చేశాడు. అది కాస్త ఓల్డ్ స్టాక్ అవటం వల్ల మూత తీయగానే గ్యాస్ సోడాలా బుస్సున పొంగి ముఖమంతా చిందింది. ఒక కంట్లో కూడా పడడంతో కన్ను ఎర్రగా అయింది.

విషయం తెలియగానే ఆఫీసు స్టాఫ్ అంతా పనులు వదిలేసి అతని చుట్టూ గుమిగూడారు. ఏం జరిగిందో అని అందరిలో ఒకటే క్యూరియాసిటీ!

వెంటనే మేనేజర్ రంగంలోకి దిగి రాముని దగ్గరలో ఉన్న ఇ.ఎస్.ఐ హాస్పిటల్ కి పంపాడు. ఆఫీస్ స్టాఫ్ ఒకతన్ని కూడా తోడుగా పంపాడు. రాముని పరీక్ష చేసిన డాక్టర్ "ప్రమాదమేమీ లేదు. ఓ రెండు రోజులు బయట తిరగకుండా ఉంటే సరిపోతుంది" అన్నాడు. వెంటనే అడ్మిట్ అయి అదే హాస్పిటల్ లో రెండు రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడు. డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ తీసుకొచ్చి రామూకిచ్చి కాసేపు ఉపశమనం మాటలు చెప్పి వెళ్లిపోయాడు కొలీగ్.

"ఫుడ్ కూడా వీళ్లే ఇస్తారట బయటకి వెళ్లకు రేపు మళ్ళీ వస్తాను" అని అతని కొలీగ్ వెళ్లిపోయాడు.

* * *

అది జనరల్ వార్డు. హాల్ పెద్దదిగానే ఉంది. బెడ్'లన్నీ ఖాళీగా ఉన్నాయి రాము పక్కన బెడ్ తప్ప. పక్క బెడ్ మీద ఓ ముస్లిం పేషెంట్ ఉన్నాడు. బెడ్ పక్కన స్టూల్ మీద అతని భార్య కావచ్చు బుర్ఖా తగిలించుకుని ఉంది. ఇద్దరూ ఉర్దూలో ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. కొంచెం సేపటికి మరి కొంత మంది.. ముస్లిం పేషెంట్ బంధువులు కావచ్చు, అతడిని పరామర్శించడానికి వచ్చారు.

అంతా గోల గోలగా ఉంది. ఇదెక్కడి గోలరా బాబు అనుకుంటూ కళ్లు మూసుకుని పడుకున్నాడు రాము.

కాసేపటికి గోల సర్దుమణిగింది. అందరూ వెళ్లిపోయారు. ముస్లిం అతను రాముకేసి చూసి ఏమయిందని అడిగాడు. చెప్పాడు. తన పేరు కరీమ్ అనీ తను బాలనగర్'లో ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తూంటాననీ చెప్పాడు ఆ ముస్లిం పేషెంట్. ఎర్రగడ్డలో ఉంటాం అని కూడా చెప్పాడు. 'ఆహా! ' అని ముభావంగా చెప్పి కళ్లు మూసుకుని పడుకున్నాడు రాము.

* * *

సాయంత్రం అయింది. పక్కన బెడ్ దగ్గర మళ్లీ అలజడి మొదలయింది.

ఈసారి కరీం బ్యాచ్ ఇంకా ఎక్కువ మంది చేరారు. రాత్రికి భోజనం క్యారియర్, కొన్ని పళ్లు తెచ్చారు అతనికోసం. కాసేపు కబుర్లు చెప్పి వెళ్లిపోయారు బ్యాచ్ అంతా.

ఇంతలో నర్సు ప్లేట్ లో భోజనం తీసుకు వచ్చింది. రేషన్ బియ్యంతో వండిన అన్నం అందులోకి ఉప్పు, కారం, పులుపు లేని చప్పిడి కూర, ఒక బాయిల్డ్ ఎగ్, కొంచెం పెరుగు ఇదే డిన్నర్. ఫుడ్ అంటే విరక్తి కలిగేలా ఉంది ఆ హాస్పిటల్ భోజనం. తిన బుద్ధి కాక బాయిల్డ్ ఎగ్ మాత్రం తిని ప్లేట్ పక్కన పెట్టేశాడు రాము.

"ఆ మీల్స్ బాగుండదు భాయ్. జర ఏ లేలో" అని తన కోసం తనవాళ్లు తెచ్చిన క్యారియర్ రాముకి షేర్ చేశాడు కరీం.

రోటీ, ఆలు టమోటా కర్రీ, బిర్యానీ కొంచెం కొంచెం ప్లేట్ లో పెట్టి రాము చేతికి అందించాడు.

"గరీబోం కా ఖానా. ఖావో" అన్నాడు నిష్కల్మషంగా నవ్వుతూ.

రాముకి కళ్లమ్మట నీళ్లు తిరిగినంత పనయ్యింది. నిజంగా కరీం ఆఫర్ చేసిన ఫుడ్ చాలా బాగుంది. వాళ్లావిడ ప్రేమను రంగరించి వండిందేమో!

"నువ్వు కాదు కరీం భాయ్, గరీబుని నేనే‌. నాకోసం ఎవ్వరూ లేని నేనే అసలు గరీబుని" మనసులో అనుకుంటూ కరీమ్ అందించిన ప్లేట్ మీల్స్ ఆబగా తినేశాడు రాము.

మరిన్ని కథలు

Chalicheemalu kaadu
చలిచీమలు కాదు
- జి.ఆర్.భాస్కర బాబు
Enta chettuki anta gaali
ఎంతచెట్టుకు అంత గాలి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.