సుభద్రార్జునీయం - Bodapati Ramesh

Subhadrarjuneeyam

“సుభద్రా...సుభద్రా” తలుపు తడుతున్నాడు అర్జునరావు.

‘ఆ..ఆ..వస్తున్నా’ అన్న మాటలు వినబడటం తప్ప ఎవరూ తలుపు తీసే ప్రయత్నం కనిపించకపోవటంతో అర్జునరావు కోపం ఎక్కువై తలుపు తట్టే ప్రయత్నం ఉధృతం చేసి, అది తలుపు తీసిఎదుట నిలబడ్డ కూతురు మీదుగా ప్రయాణం చేసి వంటింటి దిశగా సాగిపోయింది.

“ఇంట్లో వాళ్ళంతా ఏమయ్యారు చేతులు పడిపోయేట్లు తలుపులు బాదుతున్నా ఎవరు వినిపించుకోలేదు. మీ అమ్మేది? సర్లే ఒక గ్లాసు మంచినీళ్లు నా ముఖాన కొట్టు.అసలే గొంతు

తడారిపోయింది “అంటూ చివాట్ల వర్షం కురిపించింది అతని కోపం.

“ఏమిటండీ ఆ గావు కేకలు” అంటూ అతని భార్య సుభద్ర చీర కుచ్చిళ్ళు సర్దుకుంటూ “నువ్వు మంచి నీళ్ళు తీసుకురావే” అని కూతుర్ని పురమాయించింది.

“మీరొచ్చే ముందే స్నానానికి వెళ్ళాను. స్నానాల గదిలోకి మీరు చేసే హడావుడి వినిపించింది. అమ్మాయి సరిగా వినిపించుకోలేదు.నేను కసురుకునేసరికి తలుపు తీసింది”అంటూ స్నానానికి వెళ్ళే ముందు ముడి పెట్టుకున్న జడను విప్పింది.

జడ కోసలు నీళ్ళల్లో తడిసినట్లున్నాయి. ఆ నీటిబొట్లు చింది అప్పుడే తండ్రికి ఇవ్వటానికి కూతురు తీసుకొచ్చిన నీళ్ళ గ్లాసులో పడటంతో అర్జునరావు చికాకు ఇంకా ఎక్కువయింది.

“ఊ... ఏంటా అర్ధం లేని పనులు ఆ సబ్బు నీళ్ళన్ని మంచి నీళ్ళ గ్లాసులో పడ్డాయి. ఛీ ఛీ ఈ ఇంట్లో మంచి నీళ్ళు తాగే ప్రాప్తం కూడాలేదు”అంటూ ఆ నీళ్ళగ్లాసును విసిరి నేల మీద కొట్టి అవతలికి వెళ్లిపోయాడు.అమ్మాయి కూడా బిక్క ముఖం వేసి, అంత కంటే ఏం చేయాలో తెలియక నిలబడిపోయింది.

బట్టలు మార్చుకుని ముందుగదిలో ఈజిచైర్లో స్థిమితపడ్డ అర్జునరావు వద్దకు బార్య మంచి నీళ్ళు, కాఫీ తీసుకు వచ్చింది.అవి రెండు అందుకుంటూనే,

“ఇవేమ్ బట్టలు .మొగుడు ఆఫీసు నుండి వచ్చేసరికి కళకళలాడుతూ కాఫీ గ్లాసుతో ఎదురు

రావాలి “అన్నాడు కాస్త చిరునవ్వు చిందిస్తూ.

“నేను అటువంటి షోకులు వెలగబెట్టే రకం కాదు”.

ఈసారి చికాకు పడటం ఆమె వంతయింది

“ఇంటికి రాగానే ఆవిలేవు ఇవి లేవు అంటూ పంచాంగం మొదలు పెడతావు.అసలు ఇంటికి రావతమే బుద్ధి తక్కువ అనిపిస్తోంది.”

దానికి ఘాటయిన సమాధానం ఇవ్వగలిగినా ఆ సమయం లో అతనిని రెట్టించలేక ఖాళీ గ్లాసును తీసుకుని అవతలికి వెళ్లిపోయిందామె.శారీరకంగా అవతలికి వెళ్ళిపోయినా వంట చేస్తున్న సుభద్ర ఆలోచనలు తన భర్త చుట్టూ తిరుగుతున్నాయి.

అతని సంపాదనను బట్టి చూస్తే మధ్య తరగతి కుటుంబం అని చెప్పవచ్చు.ఆమెకు ఉద్యోగానికి కావలసిన అర్హతలున్నాఅతనితో వివాహమైన సంవత్సరానికే అమ్మాయి పుట్టటంతో ఆ ఆలోచనకు అంతరాయం ఏర్పడి మరి రెండేళ్లకు అబ్బాయి పుట్టటంతో ఆమెను సాధారణ గృహిణిగా స్థిరపరిచింది.దేశ కాల ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా అంతటితో ఆపేసి అతను ఇంక్రిమెంట్ కూడా పుచ్చుకున్నాడు..

అర్జునరావు స్వతహాగా మంచివాడే నని ఆమె అభిప్రాయం. అందుకు విరుద్ధంగా ఆలోచించటానికి ఆమెకు ఎటువంటి దాఖలాలు కనిపించవు..దుర్వ్యసనాలు లేని మనిషి. ఉన్నది ఒకటే వ్యసనం, చిరు కోపం.అయితే అది తాటాకు మంట వంటిది. కానీ అతని చిరుకోపం అవతలి వారి హృదయం లో రెల్లు గడ్డిలా రాజుకుంటుందని అతనికి తెలియదు.అన్నీ తాను అనుకున్నట్లుగానే జరగాలనుకుంటాడు.సాధాసాధ్యాలు అతనికి అనవసరం. అది అతని మనస్తత్వం అని మొదట్లో సరిపెట్టుకున్నా పెరుగుతున్న వయసు ఆమెలో చిరాకు పెంచుతోంది.అర్జునరావుకు చిరు కోపం అని ఆమె గ్రహించే సంఘటన పెళ్ళయిన మొదట్లోనే జరిగింది.

పెళ్ళయిన తర్వాత చాలా రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవని, అదీ కాక అర్జునరావుకు శలవు కూడా ఎక్కువ రోజులు లేకపోవటంతో మూడు నిద్రలలోనే ఆ కాస్త’ అడ్డు’ కూడా తొలగించేయాలని ఇరువైపు పెద్దలు నిర్ణయించారు.’ ఇప్పుడే ఎందుకు’ అని అర్జునరావు సణిగినా ఎవరూ ఖాతరు చేయలేదు.

ఎన్ని సినిమాలు చూసినా , ఎన్ని పుస్తకాల్లో చదివినా మొదటి రాత్రి ప్రస్తావన వస్తే మగవారు మురిసిపోవటం ,మగువలు ముడుచుకుపోవటం కద్దు. ఈ ముహూర్తాలు అట్టహాసం నాన్సెన్స్ చాదస్తం అంటూ కొంతమంది ఎగతాళి చేసినా ఆన్ని అనుకూలంగా ఉన్న ముహూర్తంలో వీరిద్దరిని ఒకటి చేస్తే ముందుముందు వీరి సంసారం సాఫీగా సాగిపోతుందని పెద్దల నమ్మకం. అయితే పెద్దలు అనుకున్నట్లుగా ఆ రోజు జరుగుతుందా లేదా అనేది మర్నాడు పరిశీలనలో గాని తెలీదు.

తను ఆరోజు పగలంతా పెళ్ళికి వచ్చిన బంధువులతో కాలక్షేపం చేసింది. తనకు ముందుగా తెలియకపోయినా కర్ణాకర్ణిగా విషయం గ్రహించింది..” ఇంకాసేపయితే మేం నీకుకనబడమ్ మరదలు పిల్లా” అంటూ ఒక వదిన గారు,” అన్నగారిని ఎలా ఆకట్టుకుంటావో” అని ఆరాటపడే ఒక మరదలు లాంటి చిలిపి కబుర్లతో మధ్యాన్న భోజనాలు పూర్తయినాయి.

ఇంకా కబుర్లు కొనసాగటంతో ఒక పెద్దావిడ “ఏమర్రా సుభద్రను ఇంకా వదిలేయ్యండి. పగలు కొంతసేపు నిద్ర పోనియ్యండి. రాత్రికి నిద్ర ఉంటుందో ఉండదో” అంటూ మూసిమూసినవ్వుల సలహా ఇచ్చింది.

“పో మామ్మా” అంటూ తను సిగ్గు పడింది.

“ఇప్పట్నుంచే పొమ్మంటావేమిటే భడవాఖానా “అంటూ ఆవిడ తన బుగ్గలు సాగతీసి భుజం మీద చరిచింది.

అందరూ గలగలా నవ్వుకున్నారు.

సాయంత్రమయ్యింది.పెద్దగా అలంకారాలు లేకపోయినా తనను ఆరోజు అందంగానే తయారు చేసారనే దానికంటే ఉన్న అందానికి మెరుగులు దిద్దారని చెప్పవచ్చు.

రాత్రి భోజనాలు కూడా పూర్తయినాయి”వదినా పాలగ్లాస్ రెడీ” అంటూ ఎదురొచ్చింది ఆడపడుచు.

“మరిది గార్ని జాగ్రత్తగా చూసుకో” అంటూ సలహా ఇక్కింది పెద్దక్క

వీటన్నిటికి తన చిరునవ్వే సమాధానం.

మార్చి నెలే అయినా పగలు ఎండ ఎక్కువగా రాత్రికి వాతావరణం చల్లబడుతోంది.ముందు గదిలో హడావుడి మొదలయింది.వీరికి పడక అక్కడ ఏర్పాటు చేశారు.

ఆ ఏర్పాట్లు భర్త తనిఖీ చేసినట్లున్నాడు. “అబ్బే ఇవేమీ బాగా లేదు “అంటూ తన అభిప్రాయం చెప్పేశాడు.

అల్లుడితో ఇంకా చనువు లేకపోవటంతో నాన్నగారు కంగారు పడుతూనే కారణం అడిగారు.

“ముందు గదిలో ఏమిటండీ అసహ్యంగా దీనికి ఫాన్ కూడా లేదు. కిటికీలు తేరీస్తే రొద్దంటా కనిపిస్తుంది. మూసేస్తే ఊపిరాడదు”.

“ఫాను తెప్పిస్తాను” అంటున్నారు నాన్న.

ఇవన్నీ అవతల గదిలో కూర్చున్న తనకు వినిపిస్తూనే ఉన్నాయి.

“లాభం లేదండీ .ఇంకెక్కడైనా ఏర్పాటు చేయండి” అని తెగేసి చెప్పాడు

మళ్ళీ ఇంట్లో పెద్దలంతా సమావేశమయ్యి మధ్య గదిలోకి పడకను మార్చారు. ఆ గదిలో సీలింగ్ ఫాను కూడా ఉండటంతో తన భర్త సరే అన్నట్టున్నాడు.

ఇదంతా గమనిస్తున్న ఒక బంధువు” ఏమే సుభద్రా మీ ఆయన గట్టి వాడే సుమా”అంటూ సర్టిఫికేట్ ఇచ్చింది.

“ మాట గట్టిదయితే సుఖమేముంది. మాటతో పాటు ...” ఇంకొకావిడ కిసుక్కుమంది.

తను కొరకొరా చూడటంతో అందరూ సర్దుకున్నారు.

ఇవన్నీ చూసిన తనకు భర్త అంటే ఏర్పడి కాపురాని కొచ్చిన తర్వాత బలపడింది.

“ఏం చేస్తున్నావ్ అన్న భర్త పిలుపుతో ఊహాలోకం నుండి వాస్తవం లోకి వచ్చింది.

“ఏమిటంత దీర్ఘంగా వంట ముందేసుకుని ఆలోచిస్తున్నావు. ఆ గిన్నెలో కూర మాడిపోయి కంపు వాకిట్లోకి వస్తోంది”. అన్నాడు అర్జునరావ్.

ఆసలే చిరాకుగా ఉందేమో” తినే వస్తువుని కంపు కొడుతోందని ఎవరూ అనరు” అన్నది.

“చాలే నాకు చెప్పొచ్చావు అధ్వాన్నంగా ఉంటే తినే దాన్నయినా అట్లాగే అంటారు.” అంటూ విసురుగా అవతలికి వెళ్లిపోయాడు.

ఆమెకు కళ్లనీళ్ళ పర్యమతమైంది.

ఆ రాత్రి వాళ్ళంతా అశాంతిగానే భోంచేశారు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ, పెద్దలు చురచురలాడుతూను.

పిల్లలిద్దరూ పుస్తకాలు తీసుకుని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు.

సుభద్ర తమ పడకగదిలోకి అడుగు పెట్టేసరికి అర్జునరావ్ మామగారు కొనిచ్చిన మంచం మీద వెల్లకిలా పడుకుని ఉన్నాడు. ఇటువంటి సమయం లో అతను ప్రశాంతంగా చిరు నవ్వులు చిందిస్తూ ఉంటాడని ఆమెకు భర్త వైఖరి సుపరిచితమే.

“ఇప్పుడా రావటం” అంటూ చిరు కోపం ప్రదర్శించాడు.

“ఇంకా పిల్లలు చదువుకుంటున్నారు. అయినా కళ్ళు కాయలు కాశాయా ఏమిటి?”.

“ఇట్లా దగ్గరకొచ్చి చూస్తే తెలుస్తుంది”.

అతను భార్యను దగ్గరకు తీసుకున్నాడు.

ఆమె కూడా కొంచం చలించినా, తమాయించుకుని “నేనొకటి అడుగుతాను ఏమి అనుకోకండేం.” అన్నది.

“ముందు...”

అతని కళ్ళల్లో కోరికల జీరలు

“నేను చెప్పేది వినండి.”

“ఊ. ఏమిటో తొందరగా కానీ” చిరునవ్వు వెనక చిరాకు.

“అదే నేనడిగేది మీతో ఏదయినా చెబుదామంటే చిర్రుబుర్రులాడతారు.అందుకనే మీరంటే నాకు భయం.

“ఇక అయిపోయినట్లేనా?”

ఆమె శరీరం మీద అతని చేతుల ప్రయాణం

ఆమెలో స్పందన శూన్యం.ప్రయాణం ఆగిపోయింది.

“ఎందుకట్లా చిరాకుగా ఉంటారు. అది ఎంతమందికి మనస్తాపం కలిగిస్తుందో ఒక్క క్షణం ఊహించండి.ప్రతి చిన్న విషయానికి కసురుకుంటారు.దానితో మన పిల్లలకి వారి వయసుతోపాటు మీమీద భయం కూడా పెరుగుతోంది. అది కొన్నాళ్లు పోతే ఏవగింపుగా మారి మీరంటే అగౌరవం ఏర్పడుతుంది.మీకు వాళ్ళకు మధ్య అగాధం ఏర్పడి నేను సతమతమవ్వాలి.ఎదిగే పిల్లలున్న మన ఇంట్లో ప్రతి చిన్న విషయానికి మీరు కల్పించుకోవటం ,కసురుకోవటం తగ్గించాలి.తగ్గించటం కాదు.పూర్తిగా మానేయాలి.నాకు వయసుతో పాటు అనారోగ్యం వస్తోంది.మీరు చెప్పినట్లుగా, మీకు నచ్చేటట్లుగా చేయాలంటే ప్రతిసారీ కుదరకపోవచ్చు.పిల్లలకు కూడా ఇది వ్యక్తిత్వం ఏర్పడే వయసు. అటువంటప్పుడు మనం వాళ్ళకు స్వేచ్చ ఇవ్వాలి.అలా అని మనం వాళ్ళని గాలికి వదిలేయకూడదు.”

ఆమె తన ఉపన్యాస ధోరణిని ఆపి భర్త ముఖం లోకి చూసింది.అతని ముఖం లో చిరాకు కనిపించటం లేదు.చిరునవ్వుతో ప్రసన్నంగా ఉండటంతో” నేను చెప్పేదేమిటంటే” .

“కోపగించుకోవటం మానేయాలి. చికాకు పడకూడదు.పోనీ ఒక పని చేస్తావేమిటి”అన్నాడు అర్జునరావ్ ఆమె ఉపన్యాసానికి అడ్డుకట్ట వేసి.

సుభద్ర ఏమిటన్నట్లు చూసింది.

“వంటల్లో ఉప్పు, కారం,పులుపు తగ్గించు పరమసాత్త్వికంగా తయారవుతాను. అన్నీ సర్దుకుంటాయి “అంటూ నవ్వేశాడు.

(నవ్వాలి మరి. ఆ వాతావరణం అలాంటిది)

“అదిగో అదే వద్దనేది.అదేమిటి.నాకు కోపం రాకూడదని నువ్వు కోపం తెచ్చుకుంటావేమిటి?”

“ఏమిటో మీ అలవాట్లు నాకు అబ్బుతున్నాయి.ఏడడుగుల సావాస దోషం. ఇన్ని సంవత్సరాల సంసార దోషం ఆమె కూడా భర్త నవ్వులో శృతి కలిపింది.

“తొందరగా తెల్లవారితే బాగుండును “అన్నాడతను, దిగాలుగా ముఖం పెట్టి.

ఆమె ప్రశ్నార్ధకంగా చూసింది

“ ఇవాళ ఉపన్యాసాలతోనే తెల్లారిపోయేట్లుంది. ఒక పని చెయ్యి. ఏదయినా పురాణ కధలు చెప్పు. జాగారం చేసిన పుణ్యం దక్కుతుంది.సర్లే పడుకో”.

“అంతే లెండి. నా అవసరం మాటలు చెప్పటానికి పనికిరాదు. ముందే చెబుతున్నాను. మీరు మీ పద్ధతులు మార్చుకుంటేనే.....”

“సర్లే అట్లా అంటే కుదరదు. కొన్నాళ్లు చూడు. అంతే గాని నోటీసయినా

ఇవ్వకుండా...... “బుంగమూతి పెట్టేశాడు.

ఆమె భర్తకు దగ్గరగా జరిగింది.

గదిలో నశ్శబ్ధమ్ మారుమోగుతోంది.ఎక్కడినుంచో వార్తలు వినిపిస్తున్నాయి

‘ఇరు పక్షాలవారు తమ సమస్యల్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి’

@@

.

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు