పడుపు - అఖిలాశ

Padupu

“ఐదు నెలలైతాంది ఇంటి అద్దె ఇంకా ఇయ్యలేదు కనీసం సగం డబ్బులైనా ఇయ్యకూడదు. మాకు కూడా ఇంట్లో ఇబ్బందిగానే ఉందంటూ రాజేశ్వరిని అడిగింది ఇంటి ఓనర్.”

“జీతం ఇంకా పడలేదండి. పడిన వెంటనే మొత్తం ఇచ్చేస్తానని చెప్పింది రాజేశ్వరి.”

“ఐదు నెలలైనా కూడా జీతం ఇవ్వకుంటే ఇంటికైనా ఫోన్ చేసి డబ్బులు తెప్పించుకోకూడదు. అయినా అందరికి సగం జీతం వేస్తున్నారంట కదా! మీ సారు వాళ్లు వేయలేదా?”

“మాది చిన్న దుకాణం అండి. వ్యాపారం సరిగా జరగడం లేదు. అందుకే జీతాలు ఇవ్వలేకపోతున్నారు. రెండు రోజుల్లో జీతాలు వేస్తామని మా సారు చెప్పారు. జీతం వచ్చిన వెంటనే అద్దె కట్టేస్తానండి.”

“ఎలాగైనా చేసి రెండు నెలలదైనా ఇవ్వు తల్లీ…! ఇంట్లో ఖర్చులకి కూడా డబ్బులు లేవు. ఈయన పనికి కూడా పోవడం లేదు. మాకైనా ఎవరిస్తారు చెప్పు? ఏదో ఈ అద్దె వస్తే నాలుగు మెతుకులు తింటాము లేదంటే పస్తులు ఉండాల్సిందే అంటూ ముఖానికి చీర కొంగు అడ్డు పెట్టుకొని వెళ్ళిపోయింది.”

***

నా పేరు రాజేశ్వరి, నా వయసు 28 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. కాలేదు అంటే నేను చేసుకోవాలనే అనుకున్నాను కానీ పెళ్లి చేసే శక్తి మా అమ్మా, నాన్నలకు లేదు. ఎలాగైనా నా పెళ్లి చేయాలని మా అమ్మ చేయని ప్రయత్నం అంటూ లేదు. నన్ను చూసుకోడానికి వచ్చిన వారంతా అమ్మాయి బాగుంది కానీ అంతో, ఇంతో కట్నం ఇవ్వకపోతే ఎలా? మీ అమ్మాయికి కనీసం పది తులాలైనా పెట్టాలి కదా! ఏమీ లేకుండా చేసుకోలేమని చెప్పి వెళ్ళిపోయారు. పది సంబంధాలు చూసి ఇక పెళ్లి కాదని నేనే ఒక నిర్ణయానికి వచ్చాను.

మాది అనంతపురం జిల్లా కదిరి. అమ్మ, నాయన కూరగాయలు అమ్మేవాళ్లు. నాయనకు కరోనా రావడంతో ఇప్పుడు కూరగాయలు అమ్మడం లేదు. అమ్మ కూరగాయలు అమ్ముతున్నా కూడా నాయనకు కరోనా వచ్చిందని అమ్మ దగ్గర ఎవరూ కూరగాయలు కొనకపోవడంతో ఇంట్లోనే ఉంటోంది. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇంటి దగ్గర ఖాళీగా ఉండటం ఇష్టం లేక బెంగుళూరులో ఏదైనా పని చేసుకోవచ్చని సిటీకి వచ్చాను. నేను వచ్చి రెండేళ్లు గడిచిపోయింది. ఉద్యోగం కోసం చేయని ప్రయత్నాలంటూ లేవు. మూడు నెలలు పాటు ఉద్యోగం కోసం తిరిగిన తర్వాత ఒక బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్ గా పనికి కుదురుకున్నాను. నెలకు ఏడు వేల రూపాయలు ఇచ్చేవారు. మూడు వేలు నేను పెట్టుకొని, ఇంటికి నాలుగు వేలు పంపేదాన్ని. ఆ డబ్బు ఏమాత్రం సరిపోయేది కాదు. అయినా కూడా ఉన్నదాంట్లోనే సర్దుకునేదాన్ని.

ఇక్కడికి వచ్చిన తర్వాత హేమంత్ పరిచయం అయ్యాడు. తను కూడా మా దుకాణంలోనే పని చేసేవాడు. మొదట్లో నాతో బాగా మాట్లాడేవాడు, మాంచి మాటకారి, చూడటానికి అందంగా కూడా ఉంటాడు. నా సమస్యలు, ఇంటి సమస్యలు, పెళ్లి ఎందుకు చేసుకోలేదో? ఇలాంటి విషయాలన్నీ తనతో చెప్పుకునేదాన్ని. తను కూడా తన గురించి, వాళ్ల ఇంటి గురించి నాతో చెప్పేవాడు. మేము ప్రేమించుకోలేదు కానీ మనసు విప్పి మాట్లాడుకునేవాళ్లము.

ఒకరోజు నేను ఉండే ఇంటికి వచ్చాడు. నువ్వు అందంగా ఉన్నావు అన్నాడు కానీ ప్రేమిస్తున్నా అనలేదు. నీ లాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు అన్నాడు కానీ నిన్ను పెళ్లి చేసుకుంటాను అనలేదు. తనకు లొంగిపోయాను, అప్పుడప్పుడు నేను అద్దెకు ఉండే ఇంటికి వస్తూ వెయ్యి, రెండు వేలు ఇస్తూ ఉండేవాడు. మా సంబంధాన్ని ఏమని పిలవాలో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత తన స్నేహితుడిని ఇంటికి తెచ్చాడు. తనతో కూడా పడుకున్నాను. ఐదు వేల రూపాయలు ఇచ్చాడు. హేమంత్ రెండు వేలు తీసుకొని నాకు మూడు వేలు ఇచ్చాడు. ఇంట్లో అయితే కుదరదని ఓయో రూమ్ బుక్ చేసి ఎవరెవరినో పంపేవాడు. అలా నాకు తెలియకుండానే వేశ్యగా మారిపోయాను. ఆ తర్వాత కొన్ని రోజులకు హేమంత్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొన్నటి వరకు కూడా నా దగ్గరకి మగవాళ్లను పంపుతూ ఉండేవాడు.

కరోనా వచ్చినప్పటి నుండి నా దగ్గరకు ఎవరూ రావడం లేదు. మాములుగా అయితే రోజుకు ఐదు వేలు తీసుకునే దాన్ని ఇప్పుడు రెండు వేలు అన్నా కూడా ఎవరు రావడం లేదు. హేమంత్ కి ఫోన్ చేసి డబ్బులు అడిగితే? రెండు సార్లు నాలుగు వేలు పంపినాడు. ఆ తర్వాత నాకే అడగబుద్ది కాక అడగలేదు. తనకైనా ఎక్కడి నుండి వస్తుంది. ఈ కరోనా వచ్చిన తర్వాత ఎవరి దగ్గరా డబ్బులు ఉండటం లేదు. నేనెలా బతకాలో? అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరి ఖాతాల్లో వేలకు వేలు డబ్బులు వేస్తోంది. మా లాంటి వారిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఉన్న ఊళ్లో బతకలేక ఇక్కడికి వచ్చి వేశ్య కూపంలోకి దిగిన మా లాంటి వాళ్లను ఎవరూ ఆదుకోవడం లేదు. మాకు కూడా ఏదో ఒక వ్యాపారం పెట్టిస్తే గౌరవంగా బతుక్కుంటాము కదా!

***

ఎడతెరిపి లేని ఆలోచనలతో ఉండగా ఫోన్ రింగ్ అయ్యింది.

“హలో ఎవరూ?”

“నేను శ్రీనివాస్ ని గుర్తుందా? సంవత్సరం క్రితం ఓయో రూమ్ లో కలిసాము.”

“ఎంతో మంది కలుస్తుంటారు. ఎవరినని గుర్తు పెట్టుకుంటాను. సరే చెప్పు ఏమిటి విషయం.”

“నిన్ను కలవాలి అనుకుంటున్నాను. ఎంత?”

“మాములే. అప్పుడు ఎంత ఇచ్చావో అంతే.”

“అప్పుడంటే కరోనా లేదు కదా! ఇప్పుడు కరోనా ఉంది రిస్క్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ముందే నీ దగ్గరకు ఎంతోమంది వస్తుంటారు.”

“నీకు ఎంత రిస్క్ ఉందో! నాకు అంతే రిస్క్ ఉంటుంది కానీ ముందు నువ్వు ఓయో బుక్ చేసి అడ్రస్ పంపు.”

“మూడు వేలు ఇస్తాను.”

“సరేలే అలాగే కానీ… క్యాబ్ బుక్ చేసి వివరాలు మెసేజ్ చెయ్యి.”

ఓయో రూమ్ కి వెళ్లి శ్రీనివాస్ ని కలిసి వచ్చాను. మూడు వేలు ఇచ్చాడు. ఇంటి ఓనర్ కి రెండు వేలు ఇచ్చి వెయ్యి రూపాయలకు బియ్యం, కూరగాయలు తెచ్చుకున్నాను. ఇంటికి డబ్బు పంపడానికి కుదరలేదని బాధపడి అలా మంచంపై వాలినాను.

సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో అనుకుంటా!. లేచి ఇంట్లో పని చేసుకొందామని లేవడానికి ప్రయత్నం చేస్తే శరీరం సహకరించలేదు. ఒళ్ళంతా నొప్పులు, తల బరువుగా అనిపించింది, ఊపిరి సరిగా ఆడటం లేదు. మెల్లగా లేచి వాష్ బేసిన్ దగ్గర ఉన్న సబ్బు వాసన చూశాను. వాసన రావడం లేదు. వెంటనే బాత్ రూమ్ దగ్గర ఉన్న సర్ఫ్ ఎక్సెల్ పొడిని చేతిలో వేసుకొని నలిపి నలిపి వాసన చూశాను. వాసన రాలేదు. ఒళ్ళంతా వణికిపోయింది, భయపడిపోయాను, గుండెలో పట్టేసినట్టు అనిపించింది. అమ్మతో మాట్లాడాలని ఫోన్ కలిపాను. రింగ్ అవుతోంది కాని లిఫ్ట్ చేయడం లేదు. రెండు సార్లు ఫోన్ చేసి ఓపిక లేక మళ్ళీ పరుపు మీదకు వచ్చేశాను.

వంట చేసుకోడానికి అవ్వడం లేదు, ఆకలిగా అనిపించలేదు. ఇంట్లో నుండి బయటకే రాలేదని ఓనర్ తలుపు కొడితే తలుపు తియ్యకుండానే నాకు బాగాలేదు, ఫోన్ చేస్తానని చెప్పాను. ఓనర్ కి ఫోన్ చేసి నాకు కరోనా వచ్చినట్టు ఉందని చెప్పాను. తనూ భయపడిపోయింది, ఆ తర్వాత నాకు ఫోన్ కూడా చేయలేదు. మూడు రోజుల నుండి ఇంట్లో ఒక్కదాన్నే.

***

“వేసిన వాకిలి వేసినట్టే ఉంది.”

“ఇంట్లో వెలుతురు లేదు. రాజేశ్వరి ఒంట్లో ఊపిరిని ఎవరో కాజేసినట్టు ఉన్నారు.”

“రాజేశ్వరి కరోనాతో చనిపోలేదు. తిండి లేక, ఎవరూ పట్టించుకోక.”

“రాజేశ్వరిది కరోనా మరణం కాదు. సమాజం చేసిన మరణం, మనుషులు చేసిన మరణం, ప్రభుత్వం చేసిన మరణం, బలవంతులు చేసిన మరణం, బీదరికం చేసిన మరణం, ఆకలి మరణం, అనాథ మరణం.”

“భారతదేశంలో వేశ్యలను ఆదుకునేది ఎవరు?”

***

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు