తెరిచిన తలుపు ...నాన్న - M R V SATYANARAYANA MURTHY

Terichina talupu naanna

“రంగయ్యా, నీ కొడుక్కి ఆక్సిడెంట్ జరిగిందట. తణుకు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్నాడట.నీ కోడలు మిల్లుకి ఫోన్ చేసింది. ఓనర్ గారు నీకు చెప్పమన్నారు.” గుమాస్తా వెంకటరాజు చెప్పాడు. రైస్ మిల్ కల్లంలో ధాన్యం ఆరబెడుతున్న రంగయ్య గబ గబా నడుచుకుంటూ రైస్ మిల్ ఆఫీస్ లోకి వచ్చాడు. మిల్ యజమాని జనార్ధన రాజు “కంగారు పడకు రంగయ్యా. మీ శేఖర్ కి కాలికి దేబ్బతగిలిందని మీ కోడలు చెప్పింది.వెళ్లి చూసిరా “అని వెయ్యి రూపాయలు అతనికి ఇచ్చాడు. వెంకటరాజు తో ,రంగయ్యని మోటార్ సైకిల్ మీద తణుకులో దింపమని చెప్పాడు.

వెంకటరాజు, రంగయ్యని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని తణుకు బయల్దేరాడు. రంగయ్యకి ఒక్కడే కొడుకు.శేఖర్. తాపీపని చేస్తూంటాడు. కోడలు నిర్మల పెరవలి దగ్గ్గరున్న స్పిన్నింగ్ మిల్ లో పని చేస్తోంది.ఇవాళ ఆదివారం. ఇద్దరూ ఇంటి దగ్గరే ఉన్నారు తను మిల్ కి వచ్చేటప్పుడు. ఆక్సిడెంట్ ఎలా జరిగిందీ ? ఆలోచిస్తున్నాడు రంగయ్య. అరగంటలో శివపురం నుండి తణుకు హాస్పిటల్ కి వచ్చారు ఇద్దరూ.లోపలికి వెళ్లి చూస్తె ,శేఖర్ కుడి కాలికి కట్టుతో బెడ్ మీద పడుకుని ఉన్నాడు. పక్కనే కోడలు ఉంది. ఒక ఐదు నిమషాలు ఉండి వెంకటరాజు వెళ్ళిపోయాడు. “ఎలా జరిగింది?” కోడల్ని అడిగాడు రంగయ్య.

“ఈయన స్నేహితుడు నాగరాజు వచ్చి తణుకులో బట్టలు కొనుక్కోవాలి తోడు రమ్మనిస్కూటర్ మీద తీసుకెల్లాదు. పెరవలి మలుపులో స్పీడ్ గా వస్తున్న వాన్ గుద్దేసిందట.నాగరాజు తలకి దెబ్బ తగిలింది.ఈయనకు కాలికి తగిలింది. ఆటోలో తణుకు తీసుకువచ్చి జాయిన్ చేసారు.ఆయన ఫోనులో నా నెంబర్ చూసి నాకు ఫోన్ చేసారు.”కన్నీరు కారుస్తూ చెప్పింది నిర్మల. సాయంత్రం అయ్యేసరికి శేఖర్కి కాలు పోటు బాగా ఎక్కు వయ్యింది.బాధతో కేకలు పెడుతున్నాడు .డాక్టర్ రంగయ్య ని ,నిర్మలని తన గదిలోకి పిలిచాడు.

“మీ అబ్బాయికి మోకాలు కింద నుంచి కాలు బాగా చితికి పోయింది. అతుక్కుంటుందని ఆశించాం .కాని అలా జరగలేదు.మోకాలు కింద వరకూ కాలు తీసేయాలి.ఆలస్యం చేస్తే ఇంకా ప్రమాదం.”చెప్పాడు డాక్టర్.ఆయన మాటలకు ఇద్దరూ నిర్ఘాంతపోయారు.అవతల శేఖర్ బాధ చూడలేకపోతున్నారు. “ఏం చేద్దాం?”కోడల్ని అడిగాడు రంగయ్య. “పెద్దవారు మీరే చెప్పండి”అంటూ ఘొల్లుమంది నిర్మల. మనిషి అంటూ ఉంటే ఎలాగైనా బతకవచ్చ్హని భావించాడు రంగయ్య. “డాక్టర్ గారూ, వైద్యం చేసి మా అబ్బాయిని కాపాడండి”అన్నాడు కన్నీళ్ళతో రంగయ్య.డాక్టర్ వారిద్దరి చేతా కాగితాల మీద సంతకాలు చేయున్చుకుని ,శేఖర్ కి ఆపరేషన్ చేయడానికి వెళ్ళాడు.

ఆపరేషన్ చేసి రాత్రి బాగా పోద్దుపోయాకా రూముకి తీసుకువచ్చారు శేఖర్ని. రాత్రి ఎవరినీ అనుమతించలేదు . ఉదయం రంగయ్య,నిర్మల వెళ్లి శేఖర్ని చూసి ఘొల్లు మనగానే నర్స్ కేకలేసింది పేషెంట్ దగ్గర గొడవ చెయ్యొద్దని. శేఖర్ మోకాలు దగ్గర పెద్ద కట్టు ఉంది. కింద కాలు లేదు.శేఖర్ నిస్త్రాణగా పడుకుని ఉన్నాడు.ఐదు నిమషాలు ఉండి ఇద్దరూ బయటకు వచ్చారు దిగులుగా. పిల్లాడు బెంగ పెట్టుకుంటాడు,ఇంటికి వెళ్లి వస్తానని శివపురం వెళ్ళింది నిర్మల. కొడుకు రాకేష్ ని పక్కింటి వాళ్లకు అప్పచెప్పి వచ్చింది నిర్మల. రంగయ్య ఒక్కడే హాస్పిటల్ లో ఉన్నాడు. వారం రోజులు గడిచాకా కొడుకుని ఇంటికి తీసుకువచ్చాడు రంగయ్య.

ఆ మర్నాడే నేను పనిలోకి వెళ్తున్నానని బాక్స్ పట్టుకుని వెళ్ళిపోయింది నిర్మల.రాకేష్ స్కూల్ కి వెళ్ళాడు. రంగయ్య ,శేఖర్ ఇద్దరూ ఉన్నారు ఇంట్లో. కొడుక్కి భోజనం పెట్టడం, బెడ్ పాన్ పెట్టడం అన్నీ రంగయ్యే చేస్తున్నాడు. ఒక రోజు నిర్మలతో అన్నాడు శేఖర్”నువ్వు ఇండి దగ్గరుండి నన్ను చూసుకో.నాన్న పనిలోకి వెళ్తాడని’. అంతే గయ్యుమంది నిర్మల”ఆడదాన్ని నేనేం చేస్తాను.మీ నాన్న అంటే మొగాడు.కుడి పని ,ఎడం పని నా వల్లకాదు బాబూ”అని తెగేసి చెప్పింది.

వారం రోజులు బాగా ఆలోచించుకుంది నిర్మల. స్పిన్నింగ్ మిల్ లో పనిచేస్తున్నందుకు తనకు పదివేలు వస్తోంది. ఆ డబ్బుతో వీళ్ళు ఇద్దర్నీ ఎందుకు పోషించాలి?మొగుడికి ఒక కాలు లేదు. ఏం పని చేస్తాడు?ఎలా సంపాదిస్తాడు? మునుముందు అంతా కష్టమే. తను పుట్టింటికి వెళ్ళిపోతే మంచిది. అక్కడినించే స్పిన్నింగ్ మిల్ కి వెళ్ళవచ్చు. తన డబ్బు వీళ్ళకు ఇవ్వక్కరలేదు. వాళ్ళ పాట్లు ఏవో వాళ్ళే పడతారు. అంతే .మర్నాడే కొడుకుని తీసుకుని ఇరగవరం వెళ్ళిపోయింది. రంగయ్య ,శేఖర్ ఇద్దరూ ఖిన్నులైపోయారు ఆమె ప్రవర్తనకి.

రంగయ్యే కొడుకుని చంటిబిడ్డని సాకినట్టు చూసుకున్నాడు.ఆరు నెలలు గడిచాయి. శేఖర్ చంకలో కర్ర సాయంతో ఇంట్లో అటూ,ఇటూ నడుస్తున్నాడు. అప్పు చేసి శేఖర్ కోసం బాత్ రూమ్ ని మార్పు చేసాడు రంగయ్య. ఇప్పుడు శేఖర్ కి తండ్రి అవసరం చాలా తగ్గింది. వంట చేసి కొడుక్కి అన్నీ సర్దిపెట్టి ,రైస్ మిల్లుకి వెళ్తున్నాడు రంగయ్య. నిర్మల ఒక్కసారి కూడా రాలేదు భర్తని చూడటానికి. ఏడాది గడిచింది.రంగయ్య శివపురం రోటరీ క్లబ్ వారిని తన కొడుక్కి సాయం చేయమని అడిగాడు .వారు శేఖర్ కి జైపూర్ కాలు కొని పెట్టారు . కృత్తిమ కాలుతో శేఖర్ వీధిలో అటూ ఇటూ నడుస్తున్నాడు .మిల్లు యజమాని రాజు గారిని కలిసి “నా కొడుకు దివ్యాంగుడయ్యాడని ,కోడలు వాడిని విడిచి పెట్టి వెళ్లి పోయిందని ,వాడికి ఏదైనా ఆధారం చూపించమని “అడిగాడు రంగయ్య. జనార్ధనరాజు ఒక బడ్డికొట్టు కొనిచ్చి లింగాలవీది సెంటర్ లో కొట్టు పెట్టుకోవడానికి పంచాయతీ నుండి అనుమతి కూడా తీసుకువచ్చాడు. ఏడాది తిరిగేసరికి శేఖర్ నిలదొక్కుకున్నాడు.

ఒకరోజు రాత్రి శేఖర్ తండ్రి దగ్గర కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.”నాన్నా,కంటికి రెప్పలా నన్ను కాపాడి,చిన్నా భిన్నమైన నా జీవితాన్ని మరలా ఒక దారిలోకి తీసుకు వచ్చావు. నువ్వు కూడా నన్ను వదిలేస్తే, రోడ్డునపడి ముష్టేత్హుకోవలిసి వచ్చేది” అన్నాడు. రంగయ్య కొడుకు కన్నీళ్ళు తుడిచి ఆప్యాయంగా దగ్గరకు తిఇసుకున్న్నాడు .

“చూడు నాయనా, తండ్రికి బిడ్డ ఎప్పుడూ భారం కాదు.బిడ్డ గొప్ప స్థితిలో ఉన్నా,పేదరికంలో ఉన్నా తండ్రి ప్రేమ మారదు.ఒక లాగే ఉంటుంది. నీ జీవితం మళ్ళి చిగురించాలన్నదే నా కోరిక” అన్నాడు రంగయ్య ప్రేమగా.

వారం తర్వాత ఒకరోజు సాయంకాలం ఇంటి అరుగు మీద కూర్చున్న నిర్మలని చూసి ఆశ్చర్యపోయాడు రంగయ్య.”నన్ను క్షమించండి మావయ్యా” అంటూ అతని కాళ్ళ మీదపడి రోదించింది.”లే అమ్మా ,ఏం జరిగింది?”అడిగాడు రంగయ్య. “మీ దగ్గర నుండి వెళ్ళాకా,మా అన్నయ్య కొన్నాళ్ళు నన్ను బాగానే చూసాడు. ఆ తర్వాత నా జీతం అంతా తీసెసుకునెవాడు. ఏడాది గడిచాకా మా ఇద్దరికీ పచ్చడి మెతుకులు పెట్టేవారు.ఇదేమిటని అడిగితె ఇష్టమైతే ఉండు,లేకపోతే ఫో అని చీదరించుకునే వాడు.నా తప్పు తెలుసుకున్నాను.నన్ను మన్నించండి”అంది నిర్మల. రంగయ్య కోడల్ని,మనవడిని లోపలకు తీసుకువచ్చాడు. రాత్రి ఇంటికి వచ్చిన శేఖర్ నిర్మలని చూసి చాలా కోపగించాడు. “తన తప్పు తెలుసుకుని,పశ్చాత్తాపం చెందిన మనిషిని ఆదరించడమే మానవత్వం”అని రంగయ్య కొడుక్కి సర్ది చెప్పాడు. కష్ట్ట్లాల మబ్బులు తొలిగి ,కొడుకు జీవితంలో మళ్ళీ వసంతం వచ్చినందుకు రంగయ్య చాలా ఆనందించాడు.

********

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు