వీరేశం సన్నకారు రైతు. తనకున్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమికి తోడుగా మరొక ఐదు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని బోర్లు వేయించి వరి ,పసుపు ,మిర్చి సాగు చేస్తున్నాడు. ప్రభుత్వ గ్రామీణ గృహ పథకంలో ఇల్లు సంపాదించి భార్య నర్సమ్మ, ముసలి తల్లి దండ్రులు,పక్క ఊళ్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలో పదవతరగతి చదువుతున్న కూతురు వరలక్ష్మి,పన్నెండేళ్ల కొడుకు నారాయణతో ప్రశాంతంగా రోజులు గడుపుతున్నాడు. నర్సమ్మ భర్తకు తోడుగా కూరగాయలు పండించి, పాడి గేదెలు పెంచి పాలు సేకరించి పట్నానికి తీసుకెళ్లి అమ్ముతుంది.వీరేశం ముసలి తల్లి దండ్రులు శరీరక సమస్యలతో ఆరోగ్యం బాగులేకపోయినా తాళ్ళు, బుట్టలు, తట్టలు అల్లి ఆర్థికంగా కుటుంబానికి సాయంగా ఉంటున్నారు. పాఠశాలకి పంపి పిల్లలిద్దర్నీ శ్రద్దగా చదివిస్తున్నారు. కుటుంబ సబ్యులందరి సహకారంతో వీరేశం చీకూ చింతా లేకుండా జీవనం వెళ్లదీస్తున్నాడు.ఊళ్లోని సన్నకారు రైతులు మోతుబరులు తమ పొలాల్లో పండిన తిండి గింజలు ఇతర పంటల్ని పట్నానికి తీసుకెళ్లి మార్కెట్లో అమ్ముకుంటూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి బతుకు తున్నారు.గ్రామంలోని పిల్లగాళ్లు పట్నానికి పోయి చదువు కుంటున్నారు. ఊరంతా పచ్చని పంటపొలాలు ,పచ్చికబయళ్లు, పక్షుల కిలకిలారావాలతోఆహ్లాదకరంగా కనబడుతుంది. ఇదంతా ఒకప్పటి ముచ్చట. గత మూడు సంవత్సరాలనుంచి కరవు ఆప్రాంతాల్ని దిగమింగింది.వర్షాలు లేవు. బోర్లు చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. వ్యవసాయదారులు బేంకుల్లో ఆర్థిక సహాయం అందక పట్నంలో వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి పంటల మీద ఖర్చుచేస్తే సమయానికి నీరందక చేతికొచ్చిన పంట కరవు పాలైంది. తాగునీటికి కరవొచ్చింది.మనుషులకే కాదు పాడి పశువులకు నీళ్ళు లేవు. తినిపించడానికి గ్రాసం లేదు. ఆడవాళ్లు , పిల్లలు కలిసి కొండ వారనున్న వాగులోంచి కిలోమీటర్లు నడిచి ఊరంతా నీళ్ళు తెచ్చుకుంటున్నారు. ఊళ్లోని పశువులు , మేకలు ,కోళ్లకు నీళ్లులేక సంతల్లో అమ్ముకోవల్సి వస్తోంది. పసువుల్ని కబేళాలకు తరలిస్తున్నారు. గ్రామంలో శుభకార్యాలు చెయ్యడానికి సాహసించడం లేదు. ముందుగా నిశ్చయమైన ఆడపిల్లల పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు. పంటలు పండక , పనులు లేక చేతిలో డబ్బులు రాక పల్లెల్లో ప్రజలు పస్తులుంటున్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల పల్లె గ్రామాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. కొండ సానువుల్లో చెక్ డ్యాములు నిర్మించి వర్షాకాలంలో నీటిని చెరువులకు కుంటలకు మళ్లిస్తే నీటి నిలవలు పెరిగి ఇటువంటి కరవు పరిస్థితులనుంచి బయటపడే అవకాశం ఉండేది. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం భూముల వ్యాపారం చేసి పచ్చగా ఉండే ఫలసాయం ఇచ్చే తోటల్నీ అడవుల్నీ నాశనం చేసి వర్షాభావానికి కారకులవు తున్నారు.భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు ఎంత లోతు తవ్వినా నీటి చుక్క లబ్యమవడం లేదు. నీళ్ల సౌకర్యం లేక పంటపొలాలు బీళ్లుగా మారాయి. ఇటువంటి గడ్డు పరిస్థితులు వీరేశం గ్రామమే కాదు , చుట్టుపట్ల చాలా ఊళ్లు కరవు కోరల్లో చిక్కుకుని విలవిల లాడుతున్నాయి. పంటల మీద ఆదాయం లేక చేసిన అప్పులు తీర్చేమార్గం కనబడక బ్రతుకు తెరువు కోసం పల్లె జనం పిల్లాపాపలతో పట్నాలకు నగరాలకు గల్ఫ్ దేశాలకు వలసబాట పట్టేరు. యువకులు చదవులు మాని పట్టణాల్లో సెక్యూరిటి గార్డులుగా గృహ నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. ముసలి వాళ్లను ,వికలాంగుల్నీ ఇళ్ల వద్ధ వదిలి ఆడ మగ అందరూ తలుపులకు తాళాలు వేసి బ్రతుకు బాట పట్టారు. ఒకప్పుడు కుటుంబ సబ్యుల సంపాదన పంట సాగుబడితో దర్జాగా బ్రతికిన వీరేశం ముసలి తల్లి దండ్రుల్నీ వయసొచ్చిన కూతురు వరలక్ష్మిని తోడుగా ఉంచి కొడుకుని భార్యను వెంట బెట్టుకుని నగరబాట పట్టాడు.చెరకు రసం తీసే బండిని అద్దెకు తీసుకుని జీవ నాధారం చూసుకున్నాడు. వీరేశం లాంటి బక్క రైతులు , మోతుబరులు గడపలకు తాళాలు పెట్టి కుటుంబాలతో గ్రామాలు వదిలి బ్రతుకు తెరువు కోసం తలో దిక్కు బయలు దేరారు. ఎప్పుడూ జనాలతో కళకళలాడే పల్లె గ్రామాలన్నీ బోసిపోయాయి. పక్షుల కిలకిలారావాలు మూగపోయాయి. గ్రామాలకు సిరులు కురుపించే పాడి పశువులు పచ్చని పొలాల్లో మైదనాల్లో గడ్డిని మేస్తూ కనువిందు చేసేవి. ఇప్పుడు ఆ పశువుల మెడల్లో మ్రోగే గంటల శబ్దాలు నిశ్శబ్దమయాయి. జన సంచారం లేక పల్లెలు వెలవెల పోతున్నాయి. బ్రతుకు తెరువు కోసం ఊరు, కన్నవారిని వదిలి పరాయి రాష్ట్రాలకు వెళ్లిన పల్లె ప్రజలకు అనుకోని ఆపద వచ్చి పడింది. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలతో పాటు భారత దేశాన్నీ కబళించింది. ఈ కరోనా మహమ్మారి అతివేగంగా దేశం అన్ని రాష్ట్రాలకు విస్తరించి ఎక్కడి వారిని అక్కడ బంధించింది.ఈ రోగాన్ని కట్టడి చెయ్యడం కోసం దేశమంతా లాక్ డౌన్ అమలు చేసారు. పొట్టకూటి కోసం పరాయి ప్రాంతాలకు వెళ్లిన బడుగు బలహీన వర్గ ప్రజల దుస్థితి వర్ణనాతీతం. ఆర్థికంగా దేశ వ్యవస్థల్ని కుదిపేసింది. కార్ఖానాలు , పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు , సినేమా , హోటల్స్ టూరిజం ,ప్రైవేట్ సంస్థలు పర్యాటకం , చిరు వ్యాపారులు ఇలా అందరి ఆర్థిక స్థితి తిరగ బడింది. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్లడానికి నిషేధం అమలైంది. ప్రయాణ సాధనాలైన బస్సులు ట్రైన్లు విమానాలు అన్నీ బంద్ చేసారు. పరాయి ప్రాంతాలకు పనుల కోసం వెళ్లిన కూలిజనాలకు పనులు లేవు. తిండిలేదు. గ్రామాలకు చేరడానికి ప్రయాణ సాధనాలు లేవు. బయట తిరగడానికి నిషేధం.ప్రతిచోట పోలీసు పహరా. మండుటెండలు. అలాగే పిల్లాపాపలతో వందల వేల మైళ్లు నడుచుకుంటూ పల్లెజనాలు ఇళ్లకు బయలు దేరారు. రైలు పట్టాలు , అడవి మార్గం ,రోడ్లు ఎలా వీలైతే అలా ప్రయాణం చేసేరు. దారిలో ఆకలి దప్పులతో ,ప్రమాదాలతో ప్రాణాలు పోగా మిగిలిన వారు కొన ఊపిరితో గ్రామాలకు చేరుకున్నారు. ఇంతటి భయంకర కలి ఎప్పుడూ చూడలేదని పండు ముసలివారు చెప్పుకున్నారు. * * *