ఎంత బాగుణ్ణు - పి. వి. రామ శర్మ

Enthabaagunnu

“కంగ్రాచులేషన్స్ కవితామూర్తి గారు. మొన్న మనసంస్థతరఫున జరిగిన సాంస్కృతికకార్యక్రమాలలో కవితలపోటీలో మన తెలుగువిభాగంలో , మీకు ప్రధమబహుమతి వచ్చిందన్న విషయంవిని, మన సి‌ఎం‌డి గారు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించారు. మీకవితని ఆయన ఇంగ్లిష్ లోకి అనువాదం చేయించుకుని మరీ విన్నారట!” అని కవితామూర్తిని అభినందించాడు ఆ సంస్థకి, ఆ నగరానికి చెందిన చీఫ్ మేనేజర్ మార్తాండం గారు.

“ఓహ్! నేనెంత అదృష్టవంతుణ్ణి సార్! మన సి‌ఎం‌డి గారే అభినందించారా! ఇంత మంచివార్త చెప్పిన మీకు ఇప్పుడే స్వీట్స్ కొని తీసుకొస్తా” అని మార్తాండం కి షేక్ హాండ్ ఇవ్వబోయి, కరోనాకాలం అని గుర్తొచ్చి, నమస్కారం చేశాడు కవితామూర్తి. అతని అసలు పేరు కనకమూర్తి అయినా, కవితలు వ్రాయడంలో బాగా పేరుపొంది, కవితమూర్తిగా ప్రాచుర్యం పొందాడు. వెలయాలి అంతరంగం నుండీ..కరోనా వల్ల విగత జీవులైన వారి కాష్టాల కష్టాల దాకా ఏదీ వదలకుండా తెగ కవితలు వ్రాసేడు.

“ఆగండాగండి. స్వీట్స్ నాకే కాదు, మన స్టాఫ్ అందరికీ కూడా పంచుదురుగానీ. మన సి‌ఎం‌డి గారు మిమ్మల్ని మెచ్చుకోవడమే కాదు,ప్రమోషన్ ఇచ్చి మరీ మిమ్మల్ని మూలుగులపాడులో ఉన్న మన బ్రాంచ్ కి మేనేజర్ గా ట్రాన్సఫర్ చేశారు కూడా. ఇదిగోండి ఆర్డర్. రేపే జాయినవాలి” అని ట్రాన్స్ఫరార్డర్ చేతికిచ్చాడు మార్తాండం.

ఏం లక్షణాలు లేకపోయినా, కరోనా పాజిటివ్ అని తెల్సినవాడిలా అదిరిపడి, “అది ఏ సౌకర్యాలు లేని పక్కా పల్లెటూరు కదండీ. అక్కడ ఏం బ్రతగ్గలను?” అని మూలిగాడు కవితామూర్తి అనబడే కనకమూర్తి, ప్రమోషన్ వచ్చిందని సంతోషించాలో, ఆ మారుమూలపల్లెకి తోసేసినందుకు ఏడవాలో తెలీలేదతనికి.

“నేనేం చేయలేను మూర్తి గారు. అయినా, ఒకరకంగా ఇది మీ రిక్వెస్ట్ ట్రాన్స్ఫరే. అలాంటిఊరే కావాలని కోరుకున్నారాయే!” అన్నాడు మార్తాండం, ‘నీ ఖర్మ! అనుభవించు!’ అన్నట్టు.

కోవిడ్ అని తెలియగానే వచ్చినభయానికి అంతవరకు లేని దగ్గు, ఆయాసం కమ్ముకువచ్చి ఆక్సిజన్ అందనివాడిలా ఇంకాస్త ఉక్కిరిబిక్కిరై, “నేనెందుకు కోరి కోరి అలాంటి ఊరు ట్రాన్సఫరడుగుతాన్సార్! ఇదన్యాయం?” అని ఉక్రోషపడ్డాడు కనకమూర్తి.

“మొన్న మీకు బహుమతివచ్చి, సి‌ఎం‌డి గారుమెచ్చిన మీకవితే మీ రిక్వెస్ట్. మన స్టాఫ్ లో ఎంతమందిని ఆ మూలుగులపాడు పోస్ట్ చేసినా, ప్రతీవాళ్లూ ‘ఓల్డ్ పేరెంట్స్, యంగ్ వైఫ్, టీనేజ్ చిల్డ్రన్’ లాంటి కారణాలతో రిక్వెస్ట్ లెటర్ పెట్టి, ఆపై సి‌ఎం‌డి గార్ని స్వయంగా కల్సి కాళ్లా వేళ్లా పడి బ్రతిమాలుకుని తప్పించుకుంటున్నారాయే. అయినా, సర్వీస్ లో ఉన్నవారికి ముసలి తల్లిదండ్రులు, పడుచుభార్య, చదివే పిల్లలు కాక, ఇంకేం కారణాలుంటాయయ్యా అని మన సి‌ఎం‌డి గారు ససేమిరా అని ఒప్పుకోకపోయినా, మనవాళ్లు సామాన్యులు కారుగా, ఆయన శ్రీమతి గార్ని కలిసి, కాకా పట్టి, ప్రసన్నం చేసుకుని ఆవిడని ఆయన మీదకి ప్రయోగించి పని కానిచ్చుకునే వారు. మీ ఖర్మ కాలి, సి‌ఎం‌డి గారి అదృష్టం కొద్దీ, మీ కవిత ఆయన కంటపడి, పంట పండింది. అది ఆయన తన మీ కవితని ఇంగ్లీష్ లోకి మార్చుకుని విన్నాక, ఇక మన స్టాఫ్ లో మీరే సరైనవారని, పల్లెటూర్లపట్ల ఎంతో మమకారం ఉన్నవారని ఆయన నిర్ణయించుకుని, మీకు అక్కడికి ప్రమోషనల్ ట్రాన్సఫర్ ఇచ్చారు.” అని అతని బహుమతి పొందిన కవితని గుర్తు చేశాడు మార్తాండం. కనకమూర్తి ఓసారా కవితని మననం చేసుకున్నాడు.

“వానొస్తే..గొడుగుకూడా లేకుండా మావూళ్లో బురదరోడ్డమ్మట

తడుస్తూ,జారుతూ,పడుతూ లేస్తూ స్కూలుకెళ్ళిన ఆరోజులోస్తే ఎంతబాగుణ్ణు!

ఎప్పటికో వచ్చే ఎర్రబస్సు కన్నా, ఇంచక్కా పిక్కబలంతో

పక్కూరికి సైకిల్ మీదెళ్లిన ఆ రోజులోస్తే ఎంత బాగుణ్ణు !!

ఒళ్ళు అలవకుండా షవర్ నీళ్ళతో ఆడే ఈ జలకాలాటల కన్నా,

ఒంగి ఒంగి చేదుకుని పోసుకునే బావి నీళ్ళ స్నానాల రోజులోస్తే ఎంత బాగుణ్ణు!!

ఏ‌సి గదిలో పడుకుని, వేలకి వేలు కరెంట్ బిల్లు కట్టేకన్నా,కరెంటే లేని మా వూర్లో

ఆరుబయట మంచం వేసుకు పడుక్కున్న ఆ రోజులోస్తే ఎంత బాగుణ్ణు!!

.... ఇలా, ఇంకా .. “వడ్లు దంచడం, తిరగలి విసరడం, పిండి రుబ్బడం, చెంబట్టుకుని ఆరుబయటకి పోవడం ” లాంటి చాలాచాలా బాగుణ్ణులతో సాగిన ఆ కవితగుర్తొచ్చి తలపట్టుకున్నాడు. ఇప్పుడు తను వెళ్ళబోయే ఆ మూలుగులపాడు అలాంటివూరే. ఈరోజుల్లో అందుబాటులోకొచ్చిన అన్నిసౌఖ్యాలూ అనుభవిస్తూనే, “అబ్బే! ఆరోజులసాటి ఇవేంవస్తాయని” చాలా మంది వ్రాసే కవితలు, కధలు, వ్యాసాలు వాట్సాపుల్లో, ఫేసు బుక్కుల్లో తెగ చక్కర్లు కొడుతూంటే. తానూ ఆవేశపడి, ఓ కవిత వ్రాస్తే, ‘అందులోఉన్నవన్నీతనకిష్టమైనవే అనుకుని సి‌ఎం‌డి గారింతపనిచేసారా!?’ అని లబోదిబోమని,

“వ్రాసే కవితల్లో, కధల్లో సందేశం అంటూ ఏదో ఒకటుండాలి కదాని అలా వ్రాసాను గానీ, అప్పుడెప్పుడో బ్రతికినట్టు, ఇప్పుడిన్ని సుఖాలొచ్చాక ఇంకా అలా ఏం బ్రతుకుతాం సార్? మీకు పుణ్యముంటుంది. మీరో మాట ఆయన చెవినివేసి, ఈ ట్రాన్స్ఫర్ ఆపుచేయించండి. నేనూ ఓసారి సి‌ఎం‌డిగారినో, ఆయన శ్రీమతిగారినో కలిసి ఈ ట్రాన్సఫర్ ఆపుచేయించుకుంటాను. అందరూ అన్నట్టు, నాకూ అలాంటి ఓల్డ్ పేరెంట్స్, యంగ్ వైఫ్, చిన్న పిల్లల బాధలే ఉన్నాయి కదా సార్, పైగా పాత సిన్మాల్లోలా ఓ పెళ్లికాని చెల్లి, ఉద్యోగంలేని తమ్ముడు కూడా అదనంగా ఉన్నారు నాకు.” అని మార్తాండం గార్ని బ్రతిమాలాడు కవితామూర్తి.

“అబ్బే! ఛాన్సే లేదండీ. మీదగ్గరనుండి కూడా ఇలాంటి ప్రమాదమే ఎదురవుతుందని తెల్సీ, ఈ సారి మీ ట్రాన్సఫర్ ప్రపోజల్ ముందుగానే హై కమాండ్ లాంటి వాళ్ళవిడతో డిస్కస్ చేసి, ఈ కవితని ఆవిడకి కూడా వినిపించి, ఆవిడ అప్రూవల్ తో ఈ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేశారు. ఇంక మీరు ఏ ప్రయత్నం చేయకుండా, వెళ్ళి జాయిన్ అవడం మంచిది.” అని కరోనా కట్టడి కి లాక్ డౌన్ విధిస్తున్నట్టు, బయటికొస్తే బడితపూజే అన్న ప్రభుత్వ హెచ్చరికలా చెప్పాడు చీఫ్ మేనేజర్ మార్తాండం.

“హయ్యో! నా కవితా! ఎంత బాగుణ్ణు అని అనుకుంటే, ఇంత చేశావా!?” అని బావురుమన్నాడు కనక(వితా)మూర్తి.

*****సమాప్తం*****

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు