“తాతయ్యా నాకు ఇంకా చదువుకోవాలని ఉంది” భయం భయంగా అడిగింది జ్ఞానద.
“అవసరం లేదు. ఇప్పుడు నువ్వు పై చదువులు చదివి ఎవరిని ఉద్ధరిం చాలి?” హుంకరించారు వీరపాండ్యం.
“నాకు డాక్టర్ అవ్వాలని ఉంది”
“ఓహో! అప్పుడే అంతవరకూ వెళ్ళాయన్న మాట ఆలోచనలు. నిన్ను బడిలో వేస్తానన్నప్పుడే మీ నాన్నకు చెప్పాను అసలు ఆడపిల్లకి చదువెందుకురా అని! నామాట వింటేగా వాడు”
“ఇందులో నాన్నని ఏమీ అనొద్దు. ఇది నా ఆలోచనే”
“అయితే విను నువ్వింక చదవడానికి వీల్లేదు. త్వరలో మంచి సంబంధం చూసి నీకు పెళ్ళి చేసేస్తాము. ఆ తరువాత మీ మెట్టినింటివారి ఇష్టం. అంతవరకూ ఈ విషయమై ఇక మాట్లాడద్దు” ఖరాఖండిగా చెప్పేసారు.
తాతగారి మాటలకి ఖిన్నురాలైంది.
“డాక్టర్ అవ్వాలన్న నా కోరిక ఇక ఎప్పటికీ నెరవేరదా?” తన గదిలోకి వెళ్ళి కుమిలి కుమిలి ఏడ్చింది. అదేమి చిత్రమో కానీ తాతగారితో సంభాషణ తరువాత జ్ఞానద కోరిక మరింత బలపడింది. అసలు డాక్టర్ చదవాలన్న కోరిక కలగడానికి పునాది వేసిన సంఘటనలు కళ్ళముందు కదిలాయి.......
!+!+!+!+!
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ సమీపంలో మూడువందల పైచిలుకు గడపలున్న ఒక గ్రామం. ఒక ప్రభుత్వ పాఠశాల, ఆసుపత్రి తప్ప పెద్దగా సౌకర్యాలేమీ లేని ఆ గ్రామంలోని ఒక శుద్ధశ్రోత్రియ కుటుంబం వీరపాండ్యంగారిది. ఆయన పరమ నిష్టాగరిష్ఠుడే కాదు ఆడపిల్లలకి చదువు అనవసరం అనుకునే ఛాందస భావాలు పుష్టిగా ఉన్నవాడు కూడానూ!
వీరపాండ్యంగారికి ఇద్దరు కొడుకులూ, ఇద్దరు కూతుర్లూ. బాల్య వివాహాలు నిషిద్ధమనే ఒకే ఒక్క కారణంతో ఆగారుగానీ లేకపోతే అదీ చేసేవాళ్ళే కూతుర్లకి. యుక్తవయసు రాగానే ఆడపిల్లలిద్దరికీ తగిన సంబంధాలు చూసి పెళ్ళి చేసి అత్తవారింటికి పంపేసి చేతులు దులిపేసుకున్నారు.
పెద్దకొడుకు వేదాధ్యయనం చేసి గ్రామంలోనే వేదపాఠశాల నడుపుతూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండిపోయాడు. తండ్రి మాటకి ఎదురు చెప్పలేకపోవటం ఆతడి బలహీనత. తండ్రంటే ప్రేమ మెండుగా ఉన్నా, అభ్యుదయ భావాలు కలిగిన చిన్నకొడుకు మాత్రం పట్నం వెళ్ళి చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి చూసిన అమ్మాయిని వివాహమాడి పట్నంలోనే స్థిరపడ్డాడు. అప్పుడప్పుడూ కుటుంబ సమేతంగా వచ్చి తండ్రినీ అన్నగారినీ చూసి వెళుతుంటాడు.
వీరపాండ్యంగారి మనుమరాలు, పెద్దకుమారుని ఏకైక పుత్రిక జ్ఞానద. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. స్వతహాగా తెలివిగలదైన జ్ఞానదకి పై చదువులు చదువాలనీ, డాక్టర్ అవ్వాలనీ కోరిక.
జ్ఞానదకి పదేళ్ళ వయసులో ఆమె తల్లికి పెద్ద జబ్బు చేసినప్పుడు ఆ ఊర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళగా ఆర్. ఎం. పి. డాక్టర్ పరీక్ష చేసి “మీరీమెను వెంటనే పట్నం తీసుకెళ్ళి పెద్దాసుపత్రిలో చేర్పిస్తే మంచిది” అని సలహా ఇచ్చాడు. తీరా అక్కడికి వెళ్ళాక “చాలా ఆలస్యమైంది కొంచం ముందుగా తీసుకుని వచ్చుంటే బ్రతికించే అవకాశం ఉండేది” అని పెదవి విరిచారు పట్నం డాక్టర్లు.
ఆ రోజే తుది శ్వాశ విడిచింది జ్ఞానద తల్లి. తల్లి మరణం ఆ పసిదానిని కలచివేసింది. సమయానికి సరైన వైద్యం అంది ఉంటే తల్లి బ్రతికేదనిపించింది జ్ఞానదకు. ఆ సంఘటనే డాక్టరు కావాలన్న ఆలోచనకు పునాది వేసింది చిన్నారి జ్ఞానద మనసులో. వయసు పెరిగే కొలదీ ఆమె ఆలోచనా ధృఢమైంది. అయితే తన కోరిక ఇదీ అని ఇంట్లో చెప్పటానికి జంకు. తండ్రి ఒప్పుకున్నా చండశాసనుడైన తాతగారేమంటారోనని భయం. అక్కడికీ ధైర్యం చేసి అడిగినందుకు తాతగారిచ్చిన సమాధానం జ్ఞానద మనసుని కృంగదీసింది.
!+!+!+!+!
తలగడలో ముఖం దాచుకుని ఏడుస్తున్న కూతురి తలపై చేయి వేసి నిమురుతూ “నన్ను మన్నించు తల్లీ. మీ తాతయ్యని ఎదిరించలేను” కంటతడి పెట్టుకున్నాడు జ్ఞానద తండ్రి.
విషయం తెలిసి పట్నంలో ఉన్న వీరపాడ్యంగారి చిన్నకొడుకు తండ్రికి నచ్చజెప్పజూసాడు కానీ ఫలితం లేకపోయింది. కనీసం ప్రైవేటుగానైనా పై చదువులు చదువుతానని వేడుకుంది జ్ఞానద. ససేమిరా అన్నారు వీరపాండ్యంగారు.
తండ్రి నిస్సహాయతా, తాతగారి మాటలూ బాధ కలిగించినా స్వతంత్రించి ఏది చేయడానికైనా తనకి వయసు లేదని తనలో తనే కుమిలిపోయింది. పద్ధెనిమిది సంవత్సరాల వయసు నిండగానే, ప్రక్క గ్రామంలోని వ్యవసాయ ప్రధానమైన కుటుంబంలోని కుర్రవాడితో జ్ఞానద పెళ్ళి చేసి అత్తవారింటికి కాపరానికి పంపించేసారు ఇంటి పెద్దలు.
భర్త పరమేశ్ సహృదయుడు చదువు విలువ ఎరిగినవాడని అర్థంచేసుకున్న జ్ఞానద ఒకనాడు “నాకు డాక్టరు అవ్వాలని ఉంది” అంటూ తన కోరికను వెలిబుచ్చింది.
కుటుంబ బాధ్యతలవల్ల తాను చదువు కొనసాగించ లేకపోయినప్పటికీ భార్యకి చదువుపట్ల ఉన్న ఆసక్తి, పట్టుదల గమనించి ప్రోత్సహించాడు పరమేశ్. కోడలి కోరిక విని మొదట సుముఖత చూపించకపోయినా, కొడుకు కూడా భార్య ఆలోచనని బలపరచి సమర్థించడంతో మరి కాదనలేకపోయారు. దానితో కొండంత బలం వచ్చినట్లయ్యింది జ్ఞానదకి. తన అదృష్టానికి ఎంతో మురిసిపోయింది. తన కల నెరవేరబోతోందని పొంగిపోయింది. అయితే కాలేజీలో చేరాలంటే పట్నం వెళ్ళాల్సిందే కనుక భార్య కోసం పరమేశ్ గుంటూరు మకాము మార్చడానికీ సిద్ధమయ్యాడు.
“నువ్వు చదువుకుంటానంటే మాకు అంగీకారమే కానీ అందువల్ల మా అబ్బాయి మాకు దూరమవుతాడంటే ఒప్పుకోలేము” అన్న అత్తమామల మాటలకి హతాశురాలైంది. అప్పటికే ఆకాశంలో విహరిస్తున్న జ్ఞానద ఆలోచనలు రెక్కలు తెగిన విహగాల్లా నేలకూలాయి. విషయం తెలుసుకున్న పరమేశ్ భార్యకి ధైర్యంచెప్పి “తరచూ వచ్చివెళుతుంటాను. దిగులు పడవద్దు మమ్మల్ని ఆశీర్వదించి పంపించండి” అని తల్లిదండ్రులని వేడుకున్నాడు.
అత్తమామల ఆశీర్వాద బలంతో భర్త సహకారం ప్రోత్సాహంతో గుంటూరులోని ఒక ప్రముఖ కళాశాలలో బై.పి.సి. గ్రూపు తీసుకుని ఇంటర్మీడియట్ లో చేరింది. అందులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలై కోచింగ్ సెంటర్ లో వైద్య ప్రవేశ పరీక్షకై తర్ఫీదు తీసుకుంది. ఆ సంవత్సరం జరిగిన వైద్య ప్రవేశ పరీక్షలో ఐదవ ర్యాంకు సాధించిన జ్ఞానదకి గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎం.బి.బి.ఎస్. లో ప్రవేశం దొరికింది.
ఆ శుభ వార్త కన్నవారితో పంచుకుందామని పుట్టినింటికి వెళ్ళి “మీ వాక్కు ఫలించి భర్త సహకారం అత్తమామల ఆశీర్వాదంతో డాక్టర్ చదవబోతున్నాను” తాతగారికి వినమ్రంగా నమస్కరించింది. తన ఉన్నతిని ఆకాంక్షించే తండ్రి ఆశీర్వాదం తీసుకుంది.
గడచిన ఐదు సంవత్సరాల కాలంలో జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొని సమయం కుదిరినప్పుడల్లా అత్తమామలకు సేవ చేస్తూ, దిగ్విజయంగా ఎం.బి.బి.ఎస్. పూర్తి చేసింది జ్ఞానద. అనాటమీ సబ్జెక్ట్ లో స్వర్ణపతకం సంపాదించుకుని యూనివర్సిటీలోనే ప్రథమంగా నిలిచిన ఆమె ఇప్పుడు డాక్టర్ జ్ఞానద. డాక్టర్ అవ్వాలనుకున్న తన కలని సాకారం చేయడంలో చేయూత అందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపింది జ్ఞానద.
వృద్ధులైన అత్తమామలను ఒంటరిగా ఉండవద్దని బ్రతిమిలాడి ఒప్పించి తమ వద్దకు తీసుకొచ్చింది. తదుపరి అదే కాలేజీనుండి గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది.
‘పెళ్ళయ్యాక మీ అత్తవారు ఒప్పుకుంటే అప్పుడు చదువుకో’ అని తాతగారు పలికిన పలుకులు అక్షరాలా నిజమయ్యాయి జ్ఞానద విషయంలో. అయితే చదువు మూడవ సంవత్సరంలో ఉండగానే వృద్ధులైన వీరపాండ్యంగారు కాలం చేయటంతో డాక్టర్ అయ్యానన్న శుభవార్త తెలిపి ఆయన అశీర్వచనాలు అందుకునే అదృష్టానికి నోచుకోలేకపోయానని బాధపడింది. డాక్టర్ పట్టా పుచ్చుకుని తాతగారికి శ్రద్ధాంజలి ఘటించింది. కూతురి ఉన్నతికి ఎంతో ఆనందించి ఆశీర్వదించారు తండ్రి, పినతండ్రి తదితర శ్రేయోభిలాషులు.
జ్ఞానద గైనకాలజిష్టుగా పట్టా పుచ్చుకున్న తదుపరి తిరిగి గ్రామానికి మకాము మార్చేసింది ఆమె కుటుంబం. ప్రైవేటు ప్రాక్టీసు ఆరంభించి ఇటు మెట్టిన గ్రామానికీ, అటు పుట్టిన గ్రామానికీ సాధ్యమైనంతవరకూ ఉచితంగా వైద్యసేవలు అందిస్తూ ‘మంచి హస్తవాసి కలిగిన డాక్టరమ్మ’ అని అనతికాలంలోనే పేరు సంపాదించుకుంది జ్ఞానద.
కొసమెరుపు : కాలగమనంలో జ్ఞానదకు కవల పిల్లలు కలిగారు...ఒక అబ్బాయి ఒక అమ్మాయి. పిల్లలకి పది సంవత్సరాల వయసులో ఆమె అత్తమామలిరువురూ సంవత్సరం తేడాలో స్వర్గస్థులయ్యారు. అత్తమామల పేరుతో గ్రామంలో ఆస్పత్రి నిర్మించి, తన తల్లికి కలిగిన దుస్థితి మరెవ్వరికీ రాకూడదని, అత్యవసర పరిస్థితులలో నిస్సహాయులై ఎవరికీ పట్నానికి పరుగులిడే అగత్యం కలుగకుండా అన్ని వైద్య సదుపాయాలూ అమర్చింది ఆస్పత్రిలో.
తల్లి అడుగుజాడలలో నడచి జ్ఞానద పిల్లలిద్దరూ డాక్టర్లు కావడం విశేషం. ఇరువురూ వివాహాలై తమ తమ జీవితాలలో స్థిరపడి గ్రామ ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు.
వర్తమానంలో....పిల్లలతో మనుమలతో ఆనందంగా జీవితం గడుపుతూ ఇప్పటికీ అవిశ్రాంతంగా పేదలకు వైద్య సేవలందిస్తోంది డాక్టర్ జ్ఞానద.
*****