ప్రాధాన్యత - Kodavanti Usha Kumari

Praadhaanyata

"సీతా! ఆ బడుద్దాయ్ నిద్రలేచాడా? టైము ఎనిమిదిన్నర అయ్యింది." "ఏమో, నేను వంటింట్లో ఉన్నాను. మీరే చూడండి." "ఒరేయ్! సందీప్ లేవరా! టైమ్ ఎనిమిదిన్నర అయ్యింది." "అప్పుడే తెల్లారిందా నాన్నా!", అన్నాడు ముసుగు సగం తీసి బయటకు చూస్తూ. "ఆ… ఆ… తెల్లారి మూడున్నర గంటలు అయ్యింది." " అయితే ఇంకో గంట పడుకోవచ్చు. నో ప్రాబ్లెమ్. ఐనా… ఈ సూర్యుడికి మరీ కంగారు ఎక్కువలా ఉంది నాన్నా. తెల్లవారకుండానే ఉదయించేస్తున్నాడు", అంటూ మళ్ళీ పడుకున్నాడు. సీతామహాలక్ష్మి, రంగారావుల ఏకైక పుత్రుడు సందీప్. కొడుకు కాలేజీ ఫస్తో, యూనివర్సిటీ టాపరో అవ్వాలని రంగారావు ఆశ. సందీప్ బాగానే చదువుతాడు గానీ రంగారావు ఆశించినంత కాదు. ఉన్నంతలో హ్యాపీగా ఉండడం సందీప్ అలవాటు. తొమ్మిదిన్నరకి నెమ్మదిగా లేచి బ్రష్ చేసుకుంటున్న సందీప్ ను చూసి, "ఒరేయ్! ఎదురింటి మహేష్ ని చూసావా?" "లేదు నాన్నా, ఇప్పుడేగా లేచాను." "అబ్బా! ఆ చూడడం కాదురా. ఉదయాన్నే ఐదింటికి లేస్తాడు, పాలు తెస్తాడు, మళ్ళీ వెళ్ళి కూరలు తెస్తాడు, పేపరు తెస్తాడు. ఇంకా చడువా, వాడెప్పుడూ కాలేజీ ఫస్టే." "ఇంక ఆ మహేష్ దండకం ఆపు నాన్న", అన్నాడు తువ్వాలుతో మొహం తుడుచకుంటూ. "ఆ మరే… తమరేం చేస్తున్నారో?", ఎగతాళగా అన్నాడు రంగారావు. "పది తెట్రా పాల ప్యాకెట్లు నిన్ననే తెచ్చాడండీ", అంది సీత. "ఓహో! మరి పది రోజులు పాల ప్యాకెట్లు అనకుండా… మరి పేపరో? ఉదయాన్నే వెళ్ళి పేపర్ తెవచ్చుగా… ", అన్నాడు రంగారావు. "నువ్వు సరిగ్గా చూడలేదు అనుకుంటా నాన్నా… నిన్ననే తెలుగు, ఇంగ్లీషు రెండు పేపర్లు తెమ్మని పేపర్ అబ్బాయికి చెప్పాను. చూడు ఎక్కడ వేశాడో." "అవున్రోయ్… నేను చూడనే లేదు సుమా… ఇక్కడే ఉన్నాయి", అంటూ గబగబా మెయిన్ హెడ్ లైన్స్ చూడసాగాడు. అమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ కూర్చున్నాడు సందీప్. "ఒరేయ్ నాన్నా, కూరలు లేవురా. అలా వెళ్ళి తేకూడదూ", అంది సీత. "అలాగేలే… కూరగాయలు, ఆకుకూరలు అంతేగా… " "ఆ… అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర." "సరేలే…", ఫోనులో ఏదో టైపు చేసి బాత్రూమ్ వైపు నడిచాడు. అరగంట తరువాత స్నానం చేసి, బయటకి వచ్చి, "అమ్మా! నా స్నానం అయిపోయింది. బాత్రూమ్ కూడా కడిగేసాను నీకు ఇబ్బంది లేకుండా." "అయ్యో, నేను కడుగుతాను కదరా నాన్నా." "పర్లేదులే గానీ ఇంకో సారి కాఫీ ఇవ్వు. టిఫిన్ తర్వాత తింటాను." "ఒరేయ్ సందూ, ఈ బ్యాగు అందుకోరా", అంటూ బయటనుంచి అమర్ దీప్ పిలిచేసరికి. బయటకు నడిచాడు సందీప్. రెండు పెద్ద సంచుల నిండా కూరగాయలు, ఆకుకూరలు చూసి అవ్వాకైంది సీత. "ఏరా! దీపూ! ఏమిటి ఇన్ని కూరలు! మనం ఏమన్నా నా కూరగాయల షాపు పెడుతున్నామా ఏమిటి?", నవ్వుతూ అంది సీత. "లేదులే అమ్మ, కూరలు ఫ్రెష్ గా ఉన్నాయి. మనము ఒక పది రోజుల పాటు తెచ్చుకోవక్కర్లేదు." "ఇది ఈ సందీప్ గాడి ఐడియానే అయ్యుంటుంది. ఏరా బడుద్దాయి, కూరలు నిన్ను తెమ్మంటే వీడి చేత తెప్పించావేమి?" "వీడు ఎలాగో ఆనందపురం నుంచే వస్తున్నాడు కదా, అక్కడైతే ఫ్రెష్ గాను ఉంటాయి, రేటు కూడా తక్కువగా ఉంటుంది." "ఉద్ధరించావులే గాని, దీపుకి కాఫీ ఇయ్యి. పాపం అలసిపోయి వచ్చాడు", అన్న రంగారావు. "ఇక్కడ మేము కూడా ఉన్నాం, కనబడటం లేదా", నెమ్మదిగా గొణిగాడు సందీప్. అమర్ దీప్ కి చిన్నప్పుడే తల్లితండ్రి పోవడంతో సీతామహాలక్ష్మి రంగారావు దగ్గరే పెరిగాడు. ఇద్దర్నీ అమ్మా నాన్నా అంటూ పిలవడంతో అమర్ దీప్ ని తమ పెద్ద బిడ్డగానే భావించారు ఆ దంపతులు. దూరపు బంధువులు ఎవరో ఉన్నారు గాని, ఎప్పుడు రాకపోకలు లేవు. సందీప్ కి, అమర్ కి కాఫీ అందించింది సీత. కాఫీ అందుకుని బ్యాగ్ లోంచి ఒక ప్యాకెట్ తీసాడు దీపు. "ఇదిగో నాన్న, జిలేబీలు వేడివేడిగా వేస్తున్నాడు, అందుకనే తీసుకున్నాను. ఇంకా వేడి గానే ఉన్నాయి", అంటూ అందించాడు. "అది ప్రేమ అంటే….", అంటూ అందుకున్నాడు రంగారావు. "ఒరేయ్! నిన్ను కూరలు మాత్రమే తెమ్మన్నాను", నాన్న చేతిలోంచి జిలేబీలు తీసుకుని తింటూ గుర్రుగా చూడసాగాడు. "పోరా సందూ! నీకెవరు భయపడతారు", అన్నాడు దీపు. "అదే వద్దనేది, ఆ పేరేంటి? సందూ, రోడ్డు అంటూ…. అసలు నీ పేరు కూడా నేను ఇలాగే ముక్కలు చెక్కలు చేస్తాను", ఉక్రోషంగా అన్నాడు సందీప్. సందీప్ కోపానికి ముగ్గురూ విరగబడి నవ్వారు. టిఫిన్స్ కూడా అయ్యాక ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు నలుగురూ. "ఒరేయ్ రంగా! మా మహేష్ కనబడటం లేదురా", అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు మహేష్ తండ్రి తిరుపతి రావు. "ఏమైంది రా తిరుపతి, ఏమైంది అసలు?" "ఏమోరా….ఈ చీటీ రాసి పెట్టాడు. ఇందులో 'నాన్న నన్ను క్షమించు' అని ఉంది. ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయడం లేదు. నాకేదో భయంగా ఉందిరా రంగా", అంటూ భోరుమన్నాడు తిరుపతి రావు. "మీరేమీ కంగారు పడకండి అంకుల్! నేను, సందీప్ ఇప్పుడే వెళ్లి వెతికి తీసుకువస్తాం", అన్నాడు దీపు. "నాన్న అంకుల్ ని జాగ్రత్తగా చూసుకో. మేము ఎలాగైనా వెతికి తీసుకువస్తాం", బయటకు నడిచాడు సందీప్. "ఒరేయ్ సందీప్, ఫోన్ చేయ్", అన్నాడు దీపు. "అలాగే, ఇదిగో రింగ్ అవుతోంది. కానీ లిఫ్ట్ చేయటం లేదు", అన్నాడు సందీప్. "రింగ్ అవుతుంది కదా, లొకేషన్ చూడు." "జస్ట్ ఏ మినిట్…. ఆ…. ఇది రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉంది. ఏదో గుడి." "గుడ్! అయితే పద", అంటూ బైక్ స్టార్ట్ చేసాడు. గుడి దగ్గరికి వచ్చేసరికి మహేష్ అక్కడ కనిపించలేదు. అక్కడ చెప్పులు కుట్టుకుంటున్న వ్యక్తిని, "బాబు ఈ ఫోటోలోని వ్యక్తిని ఇక్కడ ఎక్కడైనా చూశావా", అని అడిగాడు దీపు ఫోన్ ని చూపించి. "ఇంతసేపు ఇక్కడే అదిగో….ఆ గట్టు మీదనే కూసుని ఉన్నారు బాబు, ఇదిగో….ఈ దారంట వెళ్లారు. కూర్చున్న అప్పటినుంచి కళ్లు తుడుచుకుంటూనే ఉన్నారు బాబు", అన్నాడు. "అలాగా, థాంక్యూ", అంటూ ముందుకు కదిలారు. "ఒరేయ్! అటు చూడు ఆ రాళ్ళ వెనకాల, మహేష్ అనుకుంటా." "అవున్రా సందూ వాడే, అటు బైక్ వెళ్లదు. పద పరిగెట్టు." "అటు రైల్వే ట్రాక్ వైపు వెళ్తున్నాడు. వీడేదో అఘాయిత్యం చేసుకుంటాడో ఏమో", పరిగెడుతూనే అన్నాడు సందీప్. "అవును, మరి ఇంత స్పీడ్ గా పరిగెట్టు", ఆయాసపడుతూ అన్నాడు దీపు. "ఒరేయ్….ఏదో గూడ్స్ వస్తోంది. పట్టు….నువ్వు కాలు నేను చెయ్యి", అంటూ మహేష్ ని ఒక్కసారి లాగడం, అప్పుడే గూడ్స్ వెళ్ళిపోవడం జరిగింది. "థ్యాంక్ గాడ్! ఎలాగో కాపాడాం. అరే వీడి తలకి దెబ్బ తగిలింది. రక్తం కూడా వస్తోంది", ఆందోళనగా అన్నాడు సందీప్. "పద హాస్పిటల్ కి తీసుకు వెళ్దాం", అంటూ ముందుకు కదిలాడు దీపు. *** "రక్తం చాలా పోయింది. అర్జెంటుగా రక్తం కావాలి", అన్నాడు డాక్టర్. "నాదీ వాడిదీ ఒకటే బ్లడ్ గ్రూప్", అంటూ ముందుకి వచ్చాడు సందీప్. "నర్స్ … బ్లడ్ టెస్ట్ చెయ్యి. మీరు ఈ మందులు అర్జెంటుగా తీసుకురండి", అంటూ చీటీ దీపు చేతికి ఇచ్చాడు డాక్టర్. "సరే డాక్టర్", అంటూ ముందుకు నడిచాడు దీపు. మరో రెండు గంటలు గడిచాయి మహేష్ కి ఎలా ఉందో అన్న ఆందోళనలోనే గడిపారు ఇద్దరూ. "నీ ఫ్రెండ్ కి ప్రాణాపాయం తప్పింది, కాసేపట్లో రూమ్ కి షిఫ్ట్ చేస్తారు మీరు వెళ్లి చూడొచ్చు", అన్నాడు డాక్టర్. "థాంక్యూ డాక్టర్" ఆనందంగా అన్నారు ఇద్దరూ. "అమ్మయ్య! ఇప్పుడు టెన్షన్ కూడా తగ్గింది. ఇంట్లో వాళ్ళందరూ ఏం టెన్షన్ పడుతున్నారో, ఇప్పుడే కాల్ చేస్తాను", అన్నాడు దీపు. "నాన్న మహేష్ కనిపించాడు కంగారు పడాల్సిన అవసరం లేదు", అంటూ జరిగిందంతా చెప్పాడు. "ఇంత జరిగిందా!", ఆశ్చర్యంగా అన్నాడు రంగారావు. "అవును నాన్న, మీరు తిరుపతి రావు గారిని తీసుకుని రండి. నేను లోకేషన్ షేర్ చేస్తాను", అని ఫోన్ పెట్టేసాడు. "మహేష్ ని రూమ్ కి షిఫ్ట్ చేశారు పద వెళ్లి చూసొద్దాం", అన్నాడు సందీప్. మంచం మీద నీరసంగా పడుకున్న మహేష్ ను చూసి చలించిపోయారు ఇద్దరూ. "వీడు ఎందుకు ఈ పని చేసాడో కానీ వీడికి తెలివి వచ్చాక మొహం వాచేలా చీవాట్లు", పెట్టాలి అన్నాడు సందీప్. "నువ్వు ఊరుకోరా తెలివిలోకి వస్తున్నట్టు ఉన్నాడు. మహేష్ ఎలా ఉన్నావ్?", అడిగాడు దీపు. "దీపు…. నువ్వు…. ఇక్కడా…. సందీప్ నువ్వు కూడా…. నేనిక్కడికి ఎలా వచ్చాను!", అయోమయంగా అడిగాడు మహేష్. "నువ్వు రైలు కింద పడబోతుంటే నేను…. సందీప్ కలిసి పక్కకి లాగాము. నీ తలకి దెబ్బ తగిలింది, ప్రాణాపాయం తప్పింది. ఇప్పుడు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఎందుకురా ఇంత సాహసం చేశావు?", అన్నాడు దీపు. "సాహసమా…. నా బొంద…. ఉత్తి తెలివితక్కువ పని…. అది చాలదన్నట్లు నా రక్తం కూడా తాగాడు దొంగ రాస్కెల్", కసిగా అన్నాడు సందీప్. "నువ్వు ఆగరా సందూ…. మహేష్ నువ్వు చెప్పు?", అనునయంగా అన్నాడు దీపు. "నీకు తెలుసుగా నేను యూనివర్సిటీ ఫస్ట్ రావాలి అనుకున్నాను అది మా నాన్న కల. కానీ అది నేను నెరవేర్చలేకపోయాను. యూనివర్సిటీ సెకండ్ వచ్చాను. నా మొహం మా నాన్నకు చూపించలేకపోయాను", అంటూ విలపించాడు మహేష్. "ఒరేయ్! ఊరుకోరా, చిన్న పిల్లాడిలా ఏమిటిది, లైఫ్ అంటే మార్కులే అనుకుంటున్నావా? ఇంటికి పెద్ద అయినా, చిన్న అయినా, నువ్వే కదా! నీ మీదేగా మీ అమ్మానాన్న ఆశలు పెట్టుకున్నది. ఇలా అర్ధాంతరంగా ఇలాంటి పని చేస్తే మీ అమ్మ నాన్న ఏమవ్వాలి?", అన్నాడు దీపు. "ఏడ్చినట్టు ఉంది! బతకడానికి లేని రీజన్ చావడానికి చెప్తున్నావా! నా రక్తం తాగావు కదరా ఇడియట్", అన్నాడు సందీప్. మహేష్ ఏదో మాట్లాడబోయాడు ఈలోగా మహేష్ తల్లిదండ్రులూ, రంగారావు, సీత వచ్చారు. "ఎరా మహి, నువ్వు లేకుండా మేము ఎలా బతుకుతాము అనుకుంటున్నావు", అంటూ విలపించారు తిరుపతి రావు భార్య. "దీనికంతటికీ కారణం నేనే రా రంగా, యూనివర్సిటీ ఫస్ట్ రావాలని బాధపెట్టాను. అందుకే వాడు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు", దీనంగా అన్నాడు తిరుపతి.ఇంతలో డాక్టర్ రావడంతో, "ఎలా ఉంది బాబు మా అబ్బాయికి?", ఆత్రంగా అడిగాడు తిరుపతి రావు. "గండం గడిచింది. సమయానికి హాస్పిటల్ కి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది. మీరు కృతజ్ఞతలు చెప్పాల్సింది వీళ్ళకే. సమయానికి సందీప్ రక్తం ఇచ్చి కాపాడాడు. ఏమైనా ఇతనికి గండం గడిచింది", అంటూ తిరుపతిరావు భుజం తట్టి ముందుకు నడిచాడు డాక్టర్. "బాబు, మీ ఇద్దరికీ ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు", అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు తిరుపతిరావు. "అయ్యో! అదేం వద్దండి, ముందు మహేష్ కి ధైర్యం చెప్పండి", అన్నాడు దీపు. "వాడికేమి…. వాడు బాగానే ఉన్నాడు ముందు నా సంగతి చూడండి. నా రక్తం తాగాడు రాక్షసుడు, అసలే ఆకలి వేసి చస్తున్నా", ఉక్రోషంగా అన్నాడు సందీప్. "ఇదిగో ఫ్లాస్క్…. అదిగో బిస్కెట్స్….. ఇక నువ్వు నీ పని కాని", నవ్వుతూ అన్నాడు దీపు. "వీడికి తెలివి వచ్చేవరకు నాకన్నా వీడే ఎక్కువ బాధ పడ్డాడు", ఫ్లాస్కులో నుంచి కాఫీ తీసుకుని బిస్కెట్స్ తింటూ మహేష్ కేసి గుర్రుగా చూడసాగాడు సందీప్. "పెద్దవాళ్లు తమ ఆశల్ని పిల్లలపై రుద్ద కూడదని నాకు ఇప్పుడే అర్థమైందిరా రంగా", అన్నాడు తిరుపతి రావు. "ఇందుకు నేను కూడా అతీతం కాదు. నేనూ ఇలాగే సందీప్ ని ఏదో ఒకటి అంటూనే ఉంటాను. పిల్లలు మనసులు ఎంత సున్నితంగా ఉంటాయో నాకు కూడా ఇప్పుడే తెలిసింది", బిడియంగా అన్నాడు రంగారావు. "నా మొహం! మీ మాటలకే అంత సున్నితంగా అయిపోతే, లోకంలో జరిగే భయంకరమైన సంఘటనలకి మనం ప్రతి క్షణం చస్తూనే బ్రతకాలి. జీవితం అంటేనే ఒక ఛాలెంజ్", అన్నాడు సందీప్. "అవునురా సందీప్ జీవితం విలువ తెలుసుకోలేకపోయాను. ఏదో బలహీన క్షణంలో….. అయినా ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు", ధృడంగా అన్నాడు మహేష్. "పోనీలే…. ఇప్పుడు ఏం ఆలోచించకు. రెస్ట్ తీసుకో", అనునయంగా అన్నాడు దీపు. "మరే…. నా రక్తం తాగాడు కర్కోటకుడు", కసిగా అన్నాడు సందీప్. "నేను నీ రక్తం తాగడం ఏమిటిరా?!", అయోమయంగా అన్నాడు మహేష్. "వాడు నీకు రక్తం ఇచ్చి బ్రతికించాడుగా మరి, ఇంకేముంది లైఫ్ లాంగ్ నిన్ను ఇలా పీడిస్తూనే ఉంటాడు", నవ్వుతూ అన్నాడు దీపు. "ఒరేయ్ సారీ రా", దీనంగా అన్నాడు మహేష్. "సారీ లేదు ఏమీ లేదు. నువ్వు ఇంటికి వచ్చాక ప్రతిరోజు నాకు అన్ని లెసన్స్ చెప్పాల్సిందే", కోపంగా అన్నాడు సందీప్ అందరూ హాయిగా నవ్వారు. కష్టాలు ఎన్ని వచ్చినా, మనిషి తన జీవితం లో ప్రాధాన్యతలు మరువకూడదు. ***

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు