కాకులు - Akepati Krishnamohan

Kaakulu

ఊరిముందరి ఎర్రమట్టిని రేపుకుంటూ గ్రామంలోకి బస్సు దారితీసింది.

పవన్ తోడుగా డ్వాక్రా సంఘాల గురించి పరిశోధించడానికి ఆ ఊరినే ఎంచుకుని వస్తున్నందుకు ఒక విధంగా సంతోషంగా ఉంది. పచ్చటి పొలాలు, కొబ్బరి తోటల మధ్య అందంగా ఉందా గ్రామం. సముద్రం కూడా దగ్గరగా ఉండడంతో దూరం నుంచే అందమైన తీరం కనపడుతూ ఉంది. పట్నం నుంచి వచ్చే బస్సులో అందరూ చేపలు అమ్ముకుని బుట్టలు వెనక్కి తీసుకొస్తున్న ఆడవాళ్లే కనపడుతున్నారు. వారి మాట, నడత మొరటుగా ఉన్నా వాళ్ళు నిజాయితీతో కష్టపడుతున్నారని తెలుస్తూ ఉంది. బస్సులోని మగవాళ్ళు పట్నం నుంచి ఈ ఊరికి వస్తున్న ఈ కొత్త అమ్మాయి ఎవరా అని తేరిపార చూస్తున్నారు. పవన్ వాళ్ళ ఊరి గురించి చెప్పినప్పుడు, నా ప్రాజెక్ట్ రీసెర్చ్ కి వెళ్ళినట్టూ, పవన్ వాళ్ళ ఊరు చూసినట్లు ఉంటుందని ఒక వారం రోజులు ప్రోగ్రాం రెడీ చేసుకుని బయల్దేరాను. ఎలా ఏమి చెయ్యాలి అని అనుకుంటూ ఉండగానే బస్సు ఊరి మధ్యకి వెళ్ళి చావిడి దగ్గర ఆగింది. నడుచుకుంటూ పవన్ వాళ్ళింటికి వెళ్ళాము.

ఆ ఊళ్ళో అదే పెద్ద ఇల్లు అని అందరూ అనుకునేవాళ్ళు. ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ, ఇంటి ముందర అరుగు, లోపల వరండా, వరండాలో వరుసగా పేర్చిన పాతకాలపు కుర్చీలు. ఎండను కాచే దానికి తెరలు. వరండా ధాటి లోపలికి వెళితే వరుసగా గదులు. ప్రతి నాలుగు గదులకు మధ్యలో విశాలమైన హాలు, హాలులో అందమైన చిత్ర పటాలు, కుర్చీలు, తివాచీలు, పైన ఎప్పుడో తయారు చేసిన చాండిలియర్ లైట్లు, చాలా బల్బులు పోయినా, ఇంకా అది వైభవంగానే ఉంది.

ఇంట్లో చాలా మంది ఉన్నారు. ఊరినంతా కాకపోయినా చాలా మందిని శాసించే హోదా ఉన్న కుటుంబం అనిపిస్తుంది. ఆ ఇంట్లో ఒకప్పుడు ఏది నియమానుసారంగా జరిగేది కాదనీ పవన్ చెప్పాడు. ఉదయం ఐదు గంటలు మొదలు మధ్యహ్నం పన్నెండు గంటల దాకా టిఫిన్లు, ఉదయం 11 నుంచి సాయంత్రం 4 దాకా మధ్యాహ్నం భోజనాలు, రాత్రి 7 గంటల నుంచి, అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా వంటింట్లో పనులు జరుగుతూ ఉండేవి అని చెప్పాడు . ఇప్పుడు చాలా మారిపోయిందిలే అని అతనే అన్నాడు.

ఆ రోజు ప్రొద్దున్నే అందరూ నిద్రలేచారు. మేమప్పుడే ఇంటికి చేరుకుని బాగ్ పెట్టేసి వచ్చాము. ఫ్రెండ్ అని పవన్ నన్ను అందరికి పరిచయం చేసాడు. ప్రభాకర్ హలో చెప్పి పనిచేసుకుంటూ ఉన్నాడు. “ఎం మావయ్యా ప్రొద్దున్నే గన్ పట్టుకున్నావు? ఏదైనా వార్ మొదలు పెట్టబోతున్నావా?” తమాషాగా అన్నాడు పవన్.

“లేదురా యింట్లో వెనకాల తోపులో కాకుల గోల ఎక్కువయ్యింది. ఒకటే అరుపు. ఒకటి రెండు షూట్ చేస్తే మిగతావి వెళ్ళి పోతాయని” అన్నాడు ప్రభాకర్.

“అదేం లేదురా. పాపం కాకులు ఎంచేసాయి! ఏదో అరుస్తాయి. వెళ్ళిపోతాయి, వీడు ప్రాక్టీసు కోసం ఏదైనా చేసుకోవచ్చు. కాని ఆ కాకుల మీదే గురిపెడతాడు. ఆ బుల్లేటు మొన్న ఒకసారి గురి తప్పింది.. ప్రక్కింట్లో సత్యనారాయణ గారి భార్యకి తగిలింది. అయినా కాకుల్ని తరమడానికి గన్లు, బుల్లెట్లు దేనికిరా” అన్నది పవన్ వాళ్ళ అమ్మ.

ఆ పాతకాలపు ఇంట్లో గోడలి మీద ఫోటోల్లో కొన్నింటిలో గన్లు పెట్టుకుని నిల్చున్న మగవాళ్ళు ఫోటోలు కనపడ్డాయి. ఎందుకో ప్రభాకర్ తాత ముత్తాతల లాగా దర్పాన్ని చూపించడానికి గన్ పట్టుకున్నాడని నాకు అనిపించింది.

కాఫీలు వచ్చాయి. అందరం కాఫీలు తీసుకుని ఇంటి వెనకాల తోటలోకి నడిచాము. ప్రభాకర్ చెప్పినట్లు కాకుల గోల ఏమంత ఎక్కువగా అనిపించలేదు. ఒక వైపున గుబురుగా ఉన్న కొబ్బరి తోపు, ఇంకో వైపు జామ, మునగ, మామిడి, నేరేడు చెట్ల మధ్య తోట చాలా ఆహ్లాదంగా ఉంది. అక్కడక్కడా కలిపి మొత్తం 20 కాకులు లెక్క పెట్టగలిగాను. అంత పెద్దతోటలో 20 కాకులు ఉండటం ఏమంత ఎక్కువా అని అనిపించింది.

లోపల్నించి కుర్చీలు తెచ్చి మమ్మల్నందరినీ కూర్చోమని సైగచేసారు. పిల్లలు అప్పుడే నిద్ర లేచారు. ఆదివారం కాబట్టి స్కూలుకీ వెళ్ళే హడావుడి లేదు. ప్రభాకర్ మామయ్య గన్ షూటింగ్ చూద్దామని ప్రొద్దున్నే తోటలోకి వచ్చేశారు. గన్ బుల్లెట్ల సంచి తీసుకుని ప్రభాకర్ కూడా తోటలోకి వచ్చాడు. “ప్రొద్దున్నే నీ గన్ చప్పుళ్ళకి ప్రక్కింట్లో వాళ్ళు ఏమైనా అంటారేమో మామయ్య” అన్నాడు పవన్.

“ఎవ్వరేమనరు లేరా, గన్ కి Silencer కూడా పెట్టించాను” అన్నాడు ప్రభాకర్. ఇంట్లో వాళ్ళ గురించి చెప్పినప్పుడు పవన్ నాకు వాళ్ళ మామయ్య ప్రభాకర్ గురించి కూడా చెప్పాడు. ఎవ్వరితోనూ ఎక్కువ మాట్లాడడని ఊళ్లోనే ఎకరాలు సాగు చేస్తున్నాడని, పెళ్ళైన కోత్హలోనే బిడ్డకు జన్మ నిచ్చి భార్య చనిపోయిందని, “మాఇంట్లో వాళ్ళు ఆయనతో ఎక్కువ మాట్లాడరు. నీక్కనపడితే మామూలుగా విష్ చేసి వదిలేయి. ఆయనెక్కువ మాట్లాడడు” అన్నాడు పవన్.

గన్ ఎక్కుపెట్టి ఒక షాట్ గాలిలోకి పేల్చాడు ప్రభాకర్.

“ఉత్తుత్తి బుల్లెట్లేనా” అని అన్నాడు పవన్” ఎందుకరా అలా అంటావు? నీ మాటలకి కోపం వచ్చి నిజంగానే కాలుస్తాననుకున్నావా?.

“కావాలంటే కాల్చి చూపిస్తాను చూడు” అని గురిచూసి కాల్చాడు ప్రభాకర్. Silencer ఉండడం వల్ల గన్ లో నుంచి పెద్దగా శబ్దం రాలేదు.

బుల్లెట్ కాకికి తగల్లేదు కాని, పండిన బొప్పాయి పండ్ల మధ్యకు దూసుకుపోయింది. బుల్లెట్ దెబ్బకు బొప్పాయి పండ్లలోంచి చిక్కటి రసం కారింది.

“మామయ్యా గురి తప్పినట్లుంది?” అన్నాడు పవన్. ప్రభాకర్ ఎంమాట్లాడలేదు. పిల్లలు తమాషా చూస్తున్నారు. పవన్ వాళ్ళ అమ్మ పిల్లలందరికీ పాలు తీసుకొచ్చి కలిపి ఇచ్చింది. గన్ దించేసి దాన్ని పరిశీలించే పనిలో పడ్డాడు ప్రభాకర్ ఇంకొన్ని రౌండ్లు కాల్చేటప్పటికి కాకులు ఎగిరిపోయాయి. కొబ్బరి చెట్లకి ఎక్కుపెట్టి, కొబ్బరికాయలు కొట్టి ఆవేళకు ముగించాడు ప్రభాకర్. ఊళ్ళో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. పట్నం నుంచి వచ్చిన మాకు, ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి మాత్రం ఏపనీ లేదు. కాకి అరుపులు, పిల్లల ఆటల మధ్య భారంగా మధాహ్నం అయ్యింది. పిల్లలు అందరూ భోజనం చేస్తున్నారు. పవన్ ఊళ్ళో ఎవరితోనో మాట్లాడడానికి వెళ్ళాడు. నేను ఇల్లంతా తిరుగుతూ ప్రభాకర్ రూమ్ వైపు అడుగుపెట్టాను. తలుపులు బిగించి ఉన్నాయి కాని తెరిచిన కిటికీలోంచి అతను కనిపిస్తూ ఉన్నాడు.

కాళ్ళు టేబుల్ పైన పెట్టి ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్నాడు. ఒక చేతిలో సిగరెట్ వెలుగుతూ ఉంది. టేబుల్ మీద గ్లాసు, వాటర్ బాటిల్స్, సగం ఖాళీ అయిన సీసా ఉన్నాయి. ఎర్రటి మనిషి, బాగా వతైన జుట్టు, చక్కగా వెనక్కి దువ్వాడు. కానీ రెండు వైపులా వెంట్రుకలు పోవడం వల్ల, కోల మొహం బాగా కనిపిస్తూ ఉంది. చెంపల పైన గడ్డం బాగా పెంచి ట్రిమ్ చేసుకున్నాడు. కళ్ళు చురుకుగా ఉన్నాయి. పెదాలు మాత్రం సిగిరెట్ల వల్లనేమో బాగా నల్లగా ఉన్నాయి. ఖద్దరు పైజమా లాల్చీ వేసుకున్నాడు.

నా అలికిడి అయ్యిందేమో కళ్ళు తెరిచాడు. నన్ను చూసి లేచివచ్చి తలుపు గడియ తీసాడు, “లోపలికి వచ్చి కూర్చో” అన్నాడు. నేను వెళ్ళాను, నాకోసం ఒక గ్లాసు తీసాడు, ఫ్రిజ్ లోంచి కూల్ డ్రింక్ తీసి నాకు పోశాడు,

నాకు వెళ్ళి పోవాలని ఉంది. పవన్ మాట విని దూరంగానే ఉంటే బాగుండేదనిపించింది. ఇద్దరం ఎవరి గ్లాసుల్లోంచి వాళ్ళం తాగుతున్నాం. ఫ్యాన్ గాలిశబ్దం ఒక్కటేరూములో వినిపిస్తూ ఉంది. నిశబ్దం భారంగా ఉంది. అప్పటికే చాలా తాగాడని తెలుస్తూ ఉంది. కానీ దాని ప్రభావం అతని మీద లేదని కూడా తెలుస్తూ ఉంది.

ఎంచేస్తుంటావు? అన్నాడు

రీసెర్చ్ చేస్తున్నాను అని చెప్పాను. “బోరుగా ఉందా ? చాలా! అన్నాను “భోజనం చెయ్యొచ్చుగా?” “నేను పవన్ కోసం ఎదురు చూస్తున్నాను”.

“ఇట్లా ఉన్నాను ఏమిటా అనుకుంటున్నావా?” కాసేపాగి ఆయనే అన్నాడు. “ఏమీ చేయడానికి లేని వాడికి ఏదో ఒకటి కావాలి కదా అందుకే” అని బాటిల్ వైపు చూసి నవ్వాడు” “ఎం? ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా? చదువు కోవచ్చు, పని చెయ్యొచ్చు నా మనస్సులో అనిపించింది. బయటకు చెప్పాలని అనిపించా లేదు “తిముకిల్ చేయాలి” మళ్ళి ప్రభాకర్ అన్నాడు. “నిజంగా టైముపాస్ కోసమే తాగుతున్నారా?” అని అడగాలనిపించిది.

“పవన్ చెప్పాడో లేదోగాని నేను పదేళ్ళ క్రితం ఒక ఫ్యాక్టరీ మేనేజెర్గా పనిచేసేవాడిని, అయినా అదంతా ఎందుకులే” చేతిని గాలిలో తిప్పుతూ ఎదో మాట్లాడుతున్నాడు. “కాకుల్ని ఎందుకు కాలుస్తున్నారు?” అబూ అడగాలనిపించింది. మళ్ళి టైము కిల్ చేయాలి గడ అంటాడేమోనని అనిపించింది. “ఏ వర్క్ లేకపోతే యిదే మంచి వర్క్ ఏమంటావు?” విచిత్రంగా నవ్వుతూ బాటిల్ ని లోపల పెట్టి, పవన్ వచ్చాడు “భోజనానికి పోదాం పద” అని లేచాడు”. ఏమాత్రం తడబాటు పడకుండా భోజనాల గదికి నడిచాడు ప్రభాకర్. భోజనాల దగ్గిర అన్నంతో బాటు మందు గ్లాసు పక్కన పెట్టుకుని ప్రభాకర్ భోంచేస్తూ ఉండడం గమనించాను.

భోజనాల తరువాత పవన్ అన్నాడు, “మధ్యాహ్నం భోజనాల ముందు మొదలుపెట్టి రాత్రి 11 గంటల వరకు తాగుతూనే ఉంటాడు ఈ మనిషి కొన్ని సంవత్సరాల నుంచి ఈ తంతు జరుగుతూనే ఉంది”.

“అంతగా తాగితే ఏం కాదా” అని అడిగాను. “ఈ మనిషి డాక్టరుకి చూపించుకుంటే ఎదో ఒకటి బయట పడుతుంది. కానీ యితను వెళ్ళడు కదా. మనిషికి లెక్కలేదు, ఈ లెక్కన తాగితే ఎదో ఒకరోజు తీవ్రమైన జబ్బు బయట పడుతుంది.

భోజనాల కార్యక్రమం ఎక్కువ మాటలు లేకుండా గడిచిపోయింది. ఎవరెవరి రూముల్లోకి వాళ్ళం వెళ్ళిపోయాము.

మండువా లోగిళ్లో మధ్యాహ్నం భారంగా కదిలింది.

వదిలేసిన అన్నం పైకి ఈగలు ముసురుకున్నాయి. రోడ్లో వదిలేసిన ఇస్తరాకుల మీదకి కుక్కలా మూక వచ్చి చేరింది. పరమట గాలి సముద్రం మీన్చి తేలుతూ ఉంది. నేను పుస్తకం చదువుతూ నిద్రలోకి జారిపోయాను. సాయంత్రం లేచేసరికి చీకటి పడుతూ ఉంది. అలా పల్లెటూరిలో సాయంత్రం షికారుకు వెళ్దామని అనుకునే సమయంలోనే చల్లగా చినుకులు మొదలయ్యాయి. కరెంట్ పోయింది. ఇంట్లోని లాంతరు వెలుగులు దాటి బయటకు రాగానే ఊరంతా చిమ్మ చీకటి పరుచుకున్నట్లు ఉంది. గాలికి తాటాకు చెట్లు ఊగుతూ ముసురు శబ్దం చేస్తున్నాయి.

వర్షానికి మెత్తబడిన మట్టిలో జాగ్రతగా అడుగులు వేసుకుంటూ సముద్రం వైపు బయలు దేరాను. సవక తోపులో చెట్లు రివ్వున ఊగుతూ చీకటికే బయాన్ని కలిగిస్తున్నాయి. అక్కడక్కడా బెస్త వాళ్ళు గుడిసెల దగ్గర పిల్లా పాపలు కూర్చోని రాత్రికి ఎదో వండుకొంతున్నారు.

పూరిళ్ళ లోపల లాంతర్లు, వసారాల నీడలో కట్టెల పొయ్యి రాత్రికి వెలుగునిస్తున్నాయి. వర్షానికి గాలి మోసుకొస్తున్న మట్టి వాసనని ఆస్వాదిస్తూ చీకటిలో సముద్రాన్ని చూద్దామని వడివడిగా నడుచుకుంటూ ఇసుక మీదకి నడిచాను.

సముద్రం ముందర తాటి చెట్ల గుంపు మధ్య మహిళలు సమావేశం జరుగుతూ ఉంది. తెలుసు కుందామని వెళ్ళి కూర్చున్నాను. సంఘం కార్యకలాపాల గురించి, రాబోయే నెలలో మీటింగ్ గురించి చర్చించుకుని స్వయం సహాయక సభ్యుల సంతకాలు తీసుకుంటున్నారు. కొందరు వెళ్ళిపోగా నలుగురైదుగురు మహిళలు కూర్చోని మాట్లాడుకుంటున్నారు.

వెళ్ళి కూర్చున్నాక “ఏమ్మా ఊరికి కొత్తగా వచ్చావా? ప్రభాకర్ గారి అల్లుడి స్నేహితురాలువని చెప్పుకుంటున్నారు. నువ్వేనా?” అని మాటలు కలిపారు. అవునని తెలిపాను, “దేనికోసం వచ్చావు. “గ్రామాల్లో మీలాంటి మహిళా సంగాల గురించి తెలుసుకుని పుస్తకం రాయబోతున్నాను అని చెప్పాను“. సంఘం గురించి మాట్లాడుకున్నాక, విషయం ప్రభాకర్ మీదకు మళ్ళింది.

“అతడు మంచివాడు కాదు, భార్యను చంపాడు. ఆడపిల్లలు వాడికి బయపడుతున్నారు. ఆ ఇంట్లో ఉంటున్నావు. వాడితో జాగ్రత్త” అని చెప్పారు. వారి భయానికి కారణం ఏమై ఉండవచ్చో తెలుసుకునే లోగా వారి సమావేశం పూర్తి చేసుకుని యింటి బాట పట్టారు.

చూడ్డానికి చీకటి రాత్రి లాగున్నా సమయం రాత్రి 8 గంటలే అయ్యిందని వాచీ చూపిస్తూ ఉంది. అందరూ వాళ్ళ యిండ్ల వైపు అడుగులేస్తుంటే నేను కూడా నింపాదిగా బంగాళా వైపు నడిచాను, పవన్ అప్పుడే నా కోసం వెతుక్కుంటూ ఆటే వస్తున్నాడు. “ఎక్కడికి వెళ్లావు? చీకటి పడిపోయింది. పల్లెటూర్లో దారి తేలీక ఏటో తిరుగు తున్నావని బయమేసింది” అని అన్నాడు. బంగాళా పై గదిలో ఒక్కదాంట్లో మాత్రమే లైటు వెలుగుతోంది. వర్షానికేమో అందరూ ఎప్పుడో భోచేసి పడకలేక్కేసి ఉన్నారు.

గాలి చల్లటి తుంపర మోసుకొస్తూ ఉంది. పెద్ద తాటి చెట్టు అప్పుడప్పుడు వీస్తున్న గాలికి ఊగుతూ ఉంది. మండువా అరుగుక్రింద గానుగ పూలు గుమ్మగా పరుచుకున్నాయి. సన్నజాజి, పారిజాతాలు కలగలిసిన వింత సౌరభం వాకిలి అంతా పరుచుకొని ఆహ్లాదపరుస్తోది.

“ప్రభాకర్ గారు ఇంకా కార్యక్రమంలో ఉన్నారా? అని అడిగాను, “అతని సంగతి మనకెందుకులే మన పని చూసుకుని పోదాం పద. అసలే ఈ సమయంలో అతను మనిషికాడు”. అన్నాడు పవన్, మేము భోజనానికి కూర్చొనే టప్పటికి 10 గంటలు కావస్తూ ఉంది. ఆ రోజు ఎందుకో గంటముందే ముగించుకుని భోజనానికి కొచ్చాడు ప్రభాకర్. మనిషి తూలుతూ ఉన్నాడు కళ్ళు చింత నిప్పులా ఉన్నాయి.

“రేయ్ ఎక్కడరా నిన్ను బాటిల్ తెమ్మన్నాను కదా. ఎందుకు తేలేదు?” అని గట్టిగా అరిచాడు పవన్ వేపు చూసి “మామయ్య ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది నువ్వు కూడా చాలా తాగావు, అదీగాక యింటికి గెస్ట్ లు వచ్చారు వాళ్ళముందు నువ్వు ఇలా ప్రవర్తించడం బాగాలేదు? అన్నాడు పవన్.

“ఎవరి ముందు ఎలా ప్రవర్తించాలో నువ్వు నాకు నేర్పద్దు. చెప్పిన పని చేయలేని వెధవివి నువ్వు” అని తిట్ల పురాణం లంకించుకున్నాడు ప్రభాకర్. నేను మాట్లాడకుండా భోంచేస్తున్నాను. తర్వాత, “నీ ఫ్రెండ్ కి కాళ్ళ తీటా ఊరంతా బలాదూర్ గా తిరిగి వచ్చిందిగా ఎవరిని అడిగి వెళ్ళిందో అడిగి కనుక్కో “ అన్నాడు ప్రభాకర్.

ప్రొద్దున్నచూసిన మనిషికీ ఇప్పటి ప్రభాకర్ కి తేడా అన్పించింది నాకు. “తాగిన వాడివి ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే వాడివి? ఎందుకు ఈ రోజు నోరు లేస్తా ఉంది?” అన్నాడు పవన్ ఎందుకో ఎప్పటి నుంచో అడగాలనుకున్నదేదో పవన్ ఇప్పుడు అడుగు తున్నాడనిపించింది. “పక్కన అమ్మాయి ఉందని నువ్వు పెద్దా చిన్నా లేకుండా మాట్లాడుతున్నావు. నెత్తి మీదకి నలబై ఏళ్ళు వస్తున్నాయి. ఇంకా పెళ్లి చేసుకోలేదంటే ఈ తిరుగుళ్ళ కోసమే అని ఇప్పుడే తెలుస్తూ ఉంది” అన్నాడు ప్రభాకర్.

“నేను ఎవరితోనో తిరిగాను అనేది నువ్వు ఊహించుకుంటున్నావు. కానీ నువ్వు ఊరి మీద పడి తిరుగుతున్నావని ఊరంతా అనుకుంటున్నారు. ఆడవాళ్ళు అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నావు”. అన్నాడు పవన్.

“నేను నిశబ్దంగా వింటున్నాను. పవన్ అంతగా ఎందుకు React అవుతున్నాడో నాకర్ధం కాలేదు. బహుశా నా ఎదురుగా ఏమైనా Image building చేస్తున్నాడా అని అనిపించింది. ప్రభాకర్ ఎప్పుడూ యింతగా మాట్లాడడని పవన్ చెప్పేదాన్ని బట్టి తెలుస్తూ ఉండి. నేను రావడం వల్లనే ఇద్దరి మధ్య గొడవ జరిగే సూచనలు బయటపడుతున్నాయి.

“ఎందుకురా అమ్మాయి ముందు నాతో గొడవ పడుతావు బాటిల్ తెచ్చిచ్చేస్తే నా పనిలో నేను ఉండిపోయే వాడిని కదా” అన్నాడు ప్రభాకర్ నెమ్మదిగా.

నేను ముగించి Wash basin లో చేతులు కడుక్కుంటున్నాను. అతను నా దగ్గిరకి దూసుకొచ్చాడు. నేను దూరంగా జరిగి తప్పించుకున్నాను. పవన్ కూడా నాకు అండగా ఉండడానికి లేచివచ్చాడు. ప్రభాకర్ తడబడుతూ “ఐ యాం సారీ ఐ యాం సారీ” అంటూ తూలుకుంటూ తన రూమ్ వైపు వెళ్ళిపోయాడు.

నేను నా రూమ్ కి వెళ్ళిపోయి పక్క తయారు చేసుకున్నాను. రూములో లైటు ఆఫ్ చేసాను. అదే వరండాలో చివరి గదుల్లోంచి ప్రభాకర్ గొంతు వినపడుతూ ఉంది. ఏదో గొణుగుతూ ఉన్నాడు. మధ్య మధ్యలో కుర్చీలు విసిరేస్తున్నట్లు శబ్దాలు వస్తున్నాయి.

నేను నిశ్శబ్దంగా కిటికి చివర కూర్చుని వింటున్నాను. రాత్రి 12 గంటలు దాటింది. చలికాలం రాత్రిలోకి మంచు నెమ్మదిగా పరుచుకుంటోంది. రూముల్లో దేవుళ్ళ పటాలకు వేసిన మల్లెపూలు, వెలిగించిన అగరుబత్తీలు కలిసి మధురమైన పరిమళం గదంతా వ్యాపించి ఉంది. వీది కుక్కలు ఆగి ఆగి మొరుగుతున్నాయి. బర్రెలు దొడ్లో కదలినప్పుడు గిలకలు శబ్దం చేస్తున్నాయి. అప్పుడప్పుడూ వీస్తున్న గాలి సముద్రపు ఉప్పునీటి వాసన, గోమూత్రం కలిసిన పరిమళం మోసుకొస్తూ ఉంది. రాత్రి ఆకాశంలో గ్రహరాశులు, నక్షత్రాల సమూహం మెరుస్తూ ఉంది .

పవన్ రూములో లైటు ఆర్పేసిన విషయం తెలుస్తూ ఉంది. పవన్ నన్ను ప్రేమిస్తున్నాడా? I mean నా సాంగత్యం కోరుకుంటున్నాడా? అది అందరికీ అలా అనిపిస్తూ ఉందా? అలా కాదే: మరి ప్రభాకర్ అలాగ ఎందుకు కామెంట్ చేసాడు? అతను నా మీద ఏదైనా మోహం పెంచుకున్నాడా?

నా గురించి నా Movements గురించి కామెంట్ చేయడానికి ఈ ప్రభాకర్ ఎవరు? అతనేమనుకుంటున్నాడు? పవన్ కూడా ఎదో నన్ను కాపాడుతున్నట్లుగా, ఏంటి ఆయన మాటలు ఏదో విధంగా నా Rescue కు వచ్చానని చెప్పడానికా? Research చేసుకోవడానికా వచ్చింది? వీళ్ళ మధ్య తగవులు వినడానికా? ఛీ! రేపుదయమే ఊరికెళ్ళి పోవాలి, లేదంటే ఊళ్ళో ఏదైనా వేరే చోట వసతి చూసుకోవాలి అనుకుంటూ నేను నిద్రలోకి జారుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ప్రభాకర్ రూములో నుంచి ఇంకా ఏవో ధ్వనులు వినబడుతున్నాయి.

చీకటిలో బయట ప్రపంచం లీలగా అగుపిస్తూ ఉంది. కొంత మంది చావిడి చెట్టు అరుగులో కంబళి కప్పుకొని నిద్రపోతున్నారు. మేఘాలచాటుకు చంద్రుడు వెళ్ళిపోగానే ఊరంతా చీకటి దుప్పటి కప్పుకున్నట్లయ్యింది. నేను మెల్లగా నిద్రలోకి జారిపోతున్నట్లుగా అనిపిస్తున్న సమయంలో నా రూము తలుపులు దబదబా కొట్టినట్లు శబ్దం. బయట నుంచి వస్తున్న శబ్దాలను బట్టి ప్రభాకర్ అని తెలుస్తూ ఉంది. గట్టిగా అరిచి పవన్ ని పిలుద్దామా అని అనుకుంటూ తలుపు మెల్లగా తీసాను. బయట ప్రభాకర్ ఏదో మాట్లాడుతున్నాడు. అతని కళ్ళల్లోంచి నీళ్ళు కారుతున్నాయి.

“నేను చెడి పోయినవాడిని, నేను చెడి పోయినవాడిని నా ప్రవర్తనకి నన్ను ఎస్ క్యుజ్ ఎస్ క్యుజ్” అని అంటున్నాడు. తూలుతూ నాచేతులు పట్టుకుని క్షమాపణలు అడగాలన్నట్లుగా ప్రయత్నం చేస్తున్నాడు.

నేను గది బైటకు వచ్చాను. “It is alright మీరు ఉదయం అయినా చెప్పొచ్చుగా” అని అన్నాను. “ఉదయానికి నాకు గుర్తుండదు. అంతా మర్చిపోతా నేమో” “I m extremely sorry” అని అన్నాడు ప్రభాకర్. బలవంతంగా ఆయన్ని గది వైపు నెట్టాను. వెనక్కి తిరిగి చూసుకుంటూ అతను వెళ్ళిపోయాడు.

నేను తిరిగి రూములోకి వెళ్ళిపోయాను ఒక్క అరగంట గడిచిందేమో. మళ్ళి నిద్ర వస్తున్నట్లుగా అనిపిస్తున్న సమయంలో ఈ సారి చిన్నగా తలుపు కొట్టిన శబ్దం. ప్రభాకర్ రూములో అలికిడి ఆగిపోయిందని తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఎవరై ఉంటారా అనుకుంటూ తలుపు కొద్దిగా తీసాను. ఎదురుగా పవన్. “గట్టిగా ఇబ్బంది పెట్టినట్లున్నాడు మామయ్య” అని అన్నాడు “నువ్వంతా చూస్తూ ఉన్నావా? అని అన్నాను.

నా ప్రశ్న పట్టించుకోనట్లుగా చనువుగా లోపలి కొచ్చాడు. నా చేయి పట్టుకొని తీసుకొచ్చి బెడ్ మీద నా ప్రక్కన కూర్చున్నాడు. నాకెందుకో చాలా Uneasy గా అనిపిస్తూ ఉంది. మనిషి చాలా Tension తో ఉన్నట్లుగా మోహంతో నలిగిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. మామయ్య మళ్ళీ రాకుండా నేను ఇక్కడే ఉంటాను. మనమిద్దరం కలిసి ఈ రాత్రి గడిపేద్దాము“ అని యింకా ఏదో అనబోతూ నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికన్నట్లు వంగుతున్నాడు.

“ఇంతకాలం నిన్ను అర్ధం చేసుకోలేక పోయాను. నువ్వు నాతో మాఊరికి రావడానికి ఎంత రిస్క్ తీసుకున్నావు.” అంటూ నా మీదకు రావడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. నాకు రూమంతా తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంది. కాళ్ళు చేతుల్లో వణుకు పుడుతూ ఉంది. నా శక్తంతా చేతుల్లోకి కూడ దీసుకోవలనిపిస్తూ ఉంది. నేను Get out Get out అని అరుస్తున్నాను. అతను బలవంతంగా నన్ను పట్టుకోవాలని చూస్తున్నాడు. అతన్ని Get out you …. అని అరుస్తూ నేను గట్టిగా గది బయటకు తోసేసి గడియ పెట్టుకున్నాను. ఈ అలజడికి పవన్ వాళ్ళ అమ్మగారు వాళ్ళు తలుపులు తీశారు . పవన్ గబగబా తన రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. వాళ్ళు కిటికీలోంచి నాతో మాట్లాడి వెళ్ళిపోయారు.

ఆ రాత్రి నిద్రలేకుండా గడిపాను. ఉదయం అవుతుండగా తెలియకుండా నిద్ర పట్టేసింది. నేను లేచేటప్పటికి ఉదయం 8 గంటలు అయ్యింది నేను లేచి బాగ్ సర్దేశాను టౌనుకి తర్వాత బస్సుకి బయల్దేరుతున్నట్టు చెప్పేశాను.”పవన్ లేడమ్మా ఊళ్ళోకి వెళ్ళాడు” అన్నారు వాళ్ళమ్మ “అవసరంలేదండి అతనికి నిన్న రాత్రి చెప్పేశాను. ఇంటి నుంచి టెలిఫోన్ మెసేజ్ వెంటనే రమ్మని వచ్చింది” అని చెప్పేశాను. “ సరే ఇదిగో ఇతనిని తీస్కెళ్ళు బస్సేక్కిస్తాడు” అని చెప్పి ఆమె పంపించింది. నేను బాగ్ తీసుకొని గదులు దాటుకొని గేటు బయటకు వచ్చాను. దూరం నుంచి పెరట్లో కాకుల పైకి గన్ ఎక్కుపెడుతూ ప్రభాకర్ తిరుగుతున్నాడు. ఎర్రమట్టిని రేపుకుంటూ అప్పుడే ఊళ్ళోకి బస్సు వచ్చి ఆగింది.

==X==

కాకులు

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు