కొత్త 'జీ(వి)తం' - బట్టేపాటి జైదాస్

Kotta Jee(vi)tam

"అయ్యబాబోయ్ ఆరు నెల్ల జీతమా..సర్..! నిజంగానే..?"నమ్మలేనట్టుగా అడిగేడు పార్ట్ టైం ప్రసాదు."యస్.. ఈ బడ్జెట్ ఇయర్లో ఏకంగా ఆరునెల్ల జీతం శాంక్షనయింది.మీ 'జీ(వి)తా'నికిదో మరచిపోలేని రోజే." అన్నారు ప్రిన్సిపల్ గారు కూడా కాస్త ఎగ్జైటింగ్ గా.అది ఓ ప్రభుత్వ కళాశాల.అందులో 'పార్ట్ టైం లెక్చరర్' గా పనిచేస్తున్న ప్రసాదు, ఎన్నేళ్లనుంచి పని చేస్తున్నాడంటే 'ఏ(వే)ళ్ళ'న్నీ లెక్కబెట్టినా లెక్కతేలక గుడ్లు తేలేసి, లెక్కలు మానుకునేవాళ్లే తప్ప ఖచ్చితంగాలెక్క చెప్పేవాళ్లేలేరు. అందుకే ఆ కాలేజీకి ట్రాన్స్ ఫర్ల మీద వచ్చే,పోయే వాళ్లంతా 'ఆల్ టైం ఫుల్ పార్ట్ టైమ్ ప్రసాదు' గా పిలుస్తుంటారు. అయినా ఫీలవ్వక ఏదో ఒకనాడు రెగ్యులరవుతాననే భ్రమతోనేబ్రతుకు నెట్టు కొచ్చేస్తున్నాడు.ప్రసాదు పేరుకు 'పార్ట్ టైం' అయినా చేసేవన్నీ 'ఫుల్ టైం' పనులే. అతనికి రానిపనంటూ లేదు.తెలీని విషయ మంటూ లేదు.ఏ పనికీ సరిపడా స్టాఫ్ లేని ఆ కాలేజీలో ప్రతి పనికీ పనికొస్తాడు. అంత నాలెడ్జి పరుడు.కానీ టైం బాగోలేక రిక్రూట్మెంట్లు జరగని టైంలో గతిలేక 'పార్ట్ టైమ్' పాలబడ్డాడు. 'అరకొర జ్ఞానంతో 'అడ్డమైన పట్టాలు' తెచ్చుకుని సంపాదనే ధ్యేయంగా 'చదువు కొన్నోళ్లు' కూడా చక్కటి బోధకులుగా చలామణీ అయి పోతున్నా,,తాను మాత్రం భావిపౌరుల్ని తీర్చిదిద్దే బోధనతోనే బాంధవ్యాన్ని పెంచుకొని 'వంతుల జీ(వి)తం పంతులు'గా, పర్మినెంట్ కాని ప్రసాదు"గానే మిగిలి పోయాడు.అతని నెలజీతంపదివేలే.అది కూడా ఏడాదిలో ఎప్పుడొస్తుందో ఎరిగినవాళ్లెవరూ లేరు.ఎప్పుడైనా రావచ్చు.రాకుండా పై ఏడాదికి పోస్టుపోనూ కావచ్చు.అలాంటి 'వేతనం' ఇప్పుడిలా'వెతలు' పెట్టకుండా వస్తే 'వేడుకే'కదా!అందుకే అతనికి ఆనందంగానూ,ఒకింత అనుమానంగానూ ఉంది.కానీ అందులోనే 'సరికొత్తకతలు'న్నాయని తెలియని ప్రిన్సిపల్ గారు వెంటనే క్లర్క్ ను బిల్లు ప్రిపరేషన్ కు పురమాయించేరు. * * * రాజేంద్రం ఈ మధ్యనే వేరే ప్రాంతం నుంచి'హైదరాబాద్ హెడ్ క్వార్టర్' కు 'డెప్యుటేషన్' మీదొచ్చేడు.మునుపు తానున్న చోట దేనికీ ఇబ్బందిపడలేదు.కానీ ఉన్నఫళాన సిటీ కొచ్చాక పరిస్థితులన్నీ తలకిందులై పోయాయి.'సిటీకి దూరంగా ఐదు వేలు అద్దె పెట్టినా రెండుగదులఇల్లు కూడా దొరకడం గగనమైపోయింది.ఇక పిల్లల చదువులకు ఫీజులుకట్టడం తనవల్లయ్యేలాలేదు.ఇవి చాలవన్నట్టు వచ్చినప్పటినుంచి ఎడతెగని వర్షాలు. సిటీలో ఎక్కడచూసినా చెరువులే దర్శనమిస్తూ,ఇంట్లోంచి బయటకొచ్చేందుకే వీలుకావడంలేదు.ఇక 'ఓలా' లాంటి కంపెనీలు బోట్ సర్వీసులు నడిపితే తప్ప ఆఫీసుకు చేరలేని పరిస్థితి.ఈ పరిస్థితుల్లో ఆటోల్లో ఆఫీసుకు వెళ్లడానిక్కూడా తన జీతం చాలకపోతుండడంతో 'ఇకపై బతికేదెలా..' అనే ఆలోచనలతో సతమతమైపోతూ, 'డ్యూటీ'కూడా సరిగ్గా చేయలేక పోతున్నాడు.ఇంతలో "సార్ అయ్యగారు పిలుస్తున్నారం'టూ' అటెండర్ రావడంతో ఉలిక్కిపడి ఈలోకంలో కొచ్చిన రాజేంద్రం వెంటనే ఫైల్స్ పక్కపడేసి లేచాడు . * * * "జన్మానికో శివరాత్రి'లా జీతం జర ముందుగానే వచ్చిందని మురిసిపోతుంటే,నా పేరు 'ప్రసాదం'అని అచ్చుతప్పురాసి 'ఎస్టీవో' లో బిల్లు రిజెక్ట య్యేలా చేశారు. అప్పులుకట్టుకునేందుక్కూడా అక్కరకురాక అగచాట్లు పడుతున్నా,వెంటనే సరిచేసి ఆదుకోండి సారు" అన్నాడు ప్రసాదు బోర్డ్ లో సెక్షన్ ఆఫీసర్ ను బ్రతిమాలుతూ.ఆయన 'జగపతి బాబు'లా జాలీగా నవ్వేసి "ఓస్.. దానిదేముందోయ్ ఓ రెండు వేలిచ్చేయ్.. సాయంత్రానికల్లా సెట్ చేసేస్తాం" అన్నాడు."ఇది మరీ అన్యాయం సర్.నాకు రావాల్సిందాన్ని కూడా డబ్బులిచ్చితీసుకోవాల్సి రావడం"ఆక్రోశించేడు ప్రసాదు. "చూడు ప్రసాదూ...ఈసిటీలో ఎన్నెన్నిఖర్చులుంటాయో తెలుసుకదా!మా జీతాలు చాలక, పైన పైసలేమీ దొరక్క ప్రాణం కడబట్టిపోతోంది.కాస్తఅర్ధం చేసుకోవయ్యా..!.మేమూ బ్రతకాలిగదా!ఇప్పుడయితే ఓ రెండు వేలతోనే పోతుంది.లేదంటే వచ్చే ఏడు కూడా బోర్డు చుట్టూ తిరగుడే.అవన్నీ నువ్వుభరించగలవా?.అసలే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఆలోచించుకో " అన్నాడు తాపీగా'కూల్' గొడుతూ.అదీ నిజమే.ఇప్పటికే ఏటా జీతాలొచ్చేదాకా చేసే అప్పుల మీద వడ్డీలుకట్టాల్సొస్తుంది.వీళ్ళిప్పుడు లేట్ చేస్తే,ఆర్ధిక సంవత్సరం మారిపోయి మళ్ళీ బడ్జెట్ ఎలాట్ మెంటు కోసం తిరగాలి. అసలే 'బొక్కసం' లో బడ్జెట్టుక్కూడా భద్రత' లేని రోజులాయే.ప్రభుత్వానికి మల్లె తనకూ మళ్ళీ అప్పులు,వడ్డీలు తడిసి మోపెడవుతాయి.'శతకోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు' ప్రభుత్వం టెక్నాలజీతో లంచాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తుంటే దానికందనంతగా లంచగొండి తనం కూడా సరికొత్తపుంతలు తొక్కుతోంది. 'ఈ'-సరికొత్త '(అ)నైతిక'దోపిడీలను తనేకాదు, ఇక ఎవరుకూడా ఏమీచేయలేరు.అందుకే అడిగింది ఇచ్చుకుని బయటపడ్డాడు ప్రసాదు.బాస్ రూమ్ బయటజేరి భాగోతమంతా చూస్తోన్న రాజేంద్రం ఏదో కనిపెట్టేసిన వాడిలా 'యురేకా'అంటూ ఎగిరిగంతేశాడు.తను ఆలోచనల్లో పడి బడ్జెట్ ఎలాట్ మెంట్ లోచేసిన పొరపాట్లే తనపంట పండిస్తాయనే పరమార్ధం పట్టుబడింది రాజేంద్రానికి.అంతే ఆనక అవి కావాలనే చేస్తూ,'ప్రశాంతి' పేరులో చివరి 'ఐ' తీసేసాడు. దాన్నితీసుకెళ్లి 'విజయకుమార్' కు 'చివర' చేర్చాడు.అలా బాస్ తో కలిసి 'అక్షర లక్షల' బడ్జెట్ నెలకో ఏరియాకు కేటాయిస్తూ, జీతాలురాక అప్పులతో ఆలస్యం భరించలేని వారి ఆతృతలే, 'అమ్యామ్యాలు' కాగా సిటిలైఫ్ ను చీకూ, చింతా లేకుండా గడిపేస్తున్నాడిప్పుడు రాజేంద్రం.ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందికదా! ***

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు