ప్రధాన అర్చకులు - మద్దూరి నరసింహమూర్తి

Pradhana archakulu

పేరుకు తగ్గట్టు ఆ ఊరు ఆనందపురమే - ఎందుకంటే ఆ ఊరి నడిబొడ్డున గౌతమి గలగలల సవ్వడి వింటూ ఆనందనిలయుడే కొలువై ఉన్నాడు కాబట్టి. మందిరం ఎంత పురాతనమైనా ఆ ఊరి జనం హృదయాలలో ఎప్పుడూ నూతనత్వాన్ని నింపే ఉంటుంది. ఏ రోజూ కూడా వందమందికి తక్కువ జనం (భక్తులు) రారు ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుందికి.

ఆ దేవదేవుడికి నిత్య కైంకర్యాలు అన్నీ సవ్యంగా జరగడానికి ఆ మందిరం నిర్మించిన జమీందారీ కుటుంబం ఒక ప్రధాన అర్చకుడిని, అతనికి సహాయకులుగా మరో నలుగురు అర్చకులని నియమింపచేసి, వారి జీవనానికి దేవదేవుడి భోగరాగాలకి అవసరమైన ఆర్ధిక వనరులిని కూడా పరిపూర్ణంగా కల్పించి, ఆ ఊరి వారందరిచేత ధర్మప్రభువులు అనిపించుకున్నారు.

ప్రధాన అర్చకులు ఒక్కరికే దేవదేవుని దివ్య మంగళ విగ్రహాన్ని తాకే అర్హత. ఆ భగవంతుని సేవలో ఆయనకి అవసరమైనవన్నీ కనుసన్నలలో సమకూర్చవలసిన బాధ్యత మిగతా నలుగురు సహాయక అర్చకులది.

ఆ నలుగురిలో అందరికంటే వయసులో పెద్దవారైన రామాచారిగారు ముందుంటారు ఆ సహాయక విధులలో.

ఏకారణానికైనా ఏరోజైనా ప్రధాన అర్చకులు మందిరం లోనికి రాలేకపోతే/రాకపోతే, ఆ రోజు రామాచారిగారు ప్రధాన అర్చకుల సేవలన్నీ నిర్వహించాలని నియమం ఉన్నా -- ఆ అవసరం కానీ, అదృష్టం కానీ ఇంతవరకు రామాచారిగారికి కలగలేదు.

తనకి ఆ భాగ్యం కలగడం లేదే అన్న మనో విచారం, ఆ అదృష్టం కలగకుండా తను తనువు చాలించేస్తానేమో అన్న బెంగతో, రామాచారిగారు ఉన్న వయసు కంటే కాస్త పెద్దవయసు వారిలా కనిపిస్తుంటారు. ప్రధాన ఆర్చుకులవారు రామాచారిగారి కంటే వయసులో ఐదేళ్లు చిన్నవారు. పైగా పరిపూర్ణంగా ఆరోగ్యవంతులు.

రామాచారిగారికి అప్పుడప్పుడు కాస్త నలతగా ఉండడం ఈ మధ్యనే ఆరంభం అయింది. మరో ఏడాది రెండేళ్లు పొతే స్వామివారి సేవలకు తన శరీరం సహకరించదేమో అని మనసులో ఇప్పుడిప్పుడే బెంగ ప్రారంభం అయింది.

రామాచారిగారి 59 జన్మదినం మరునాడనగా ముందు రోజు రాత్రి పదిగంటలకి, ప్రధాన అర్చకుల వారి నించి రామాచారిగారిని అత్యవసరంగా రమ్మని పిలుపు వచ్చింది. అంత రాత్రి వేళ పిలిపించారంటే ఏమి పొరపాటు జరిగిందో అని, వెంటవెంటనే అబ్బాయిని తోడు తీసుకొని రామాచారిగారు ప్రధాన అర్చకుల వారి ఇంటికి వెళ్లారు.

రామాచారిగారు వారి అబ్బాయి అక్కడికి చేరుకునేసరికి ప్రధాన అర్చకులవారు వీధి గుమ్మం దగ్గరే ఎదురుచూస్తూ కనిపించారు.

ఆ దృశ్యం చూసి మరింత ఆందోళన పడిన రామాచారిగారు, ప్రధాన అర్చకుల సమీపానికి తొందరగా వెళ్లబోతుంటే --

ప్ర.అ. : "రామాచారిగారూ, అక్కడే ఆగండి. నా సమీపానికి రాకండి." అని కేక వేశారు.

ఆ కేకతో ఎక్కడున్నవారు అక్కడే ఆగిపోయిన రామాచారిగారికి గుండె ఆగినంత పనైంది.

రామచారిగారు : " అయ్యా, ఏమైంది. నావల్ల ఏదేనా పొరపాటు జరిగిందా." అని ఆతృతగా

ఆందోళనతో అడిగారు.”

ప్ర.అ. : "ఆబ్బె. అదేమీ కాదండి. పక్క ఊరిలో ఉన్న మా పెద్ద అన్నయ్యగారు కాలంచేసేరని

ఇప్పుడే కబురొచ్చింది. నేను వెంటనే బయలుదేరి వెళ్ళాలి. రేపటినించి నేను

వచ్చేవరకు, మీరే మందిరంలో ప్రధాన అర్చకుడు నిర్వహించే సేవలన్నీ చేయాలి.

గర్భగుడి తాళం చెవుల గుత్తి సంప్రోక్షమ్ చేయించి అక్కడ పెట్టించేను.

అవి స్వీకరించి మీ ఈ అదనపు బాధ్యతని సక్రమంగా నిర్వహించండి.

నేను ఇంక బయలుదేరతాను." అని లోపలికీ వెళ్లిపోయారు.

రామాచారిగారికి మెదడు ఒక్కసారిగా స్తంభించిపోయిందా అన్నట్టు నోటివెంట మాట రాలేదు. ఓ రెండు నిమిషాలవరకు తాను విన్నది నిజమేనా అని సందేహం వచ్చింది. తాను విన్నది నిజమే అన్నదానికి సాక్ష్యంగా అక్కడ తాళాల గుత్తి కనిపిస్తుండడంతో, వెంటనే తేరుకొని, వాటిని తీసుకొని కళ్ళకద్దుకొని ఇంటికి బయలుదేరారు.

ప్రక్కన అబ్బాయి ఉండడంతో క్షేమంగా ఇల్లు చేరేరుకానీ, రామాచారిగారికి ఎదో లోకంలో ఉన్నట్లుగా ఉంది.

మరుసటిరోజునించి, కనీసం పన్నెండు రోజులు ఆ ఆనందనిలయుని సమీపంలో ఆయనని చేతితో తాకుతూ సేవలు చేసే భాగ్యం కలిగింది తనకేనా అన్న నమ్మలేని నిజాన్ని జీర్ణించుకుంటూ, తనకి ‘జన్మదిన కానుక’ అన్నట్లుగా ఆ భాగ్యం కలిగింపచేసిన ఆ దేవదేవునికి పదే పదే మనసులో కృతఙ్ఞతలు చెప్పుకున్నారు రామాచారిగారు.

ఆ రాత్రి కలత నిద్రతో గడిపిన రామాచారిగారు, మరుసటి రోజు ఉదయం సుప్రభాత సేవకి పరుగు పరుగున చేరుకొని, స్వామిని తొలిసారి చేతితో తాకేసరికి -- తనలోకి ఏదో విద్యుత్తు ప్రసరించిన అనుభవంతో ఆనంద భాష్పాలు కారుస్తూ -- పదే పదే స్వామిని తాకుతూ, అలవికాని ఆనందాన్ని అనుభవించసాగేరు.

అలా తన్మయత్వం అనుభవిస్తున్న ఆయనని చూస్తూ -- ఆ దేవదేవుడు చిద్విలాసంగా చిరునవ్వులతో ఆయన పైన ‘పుట్టినరోజు ఆశీస్సుల జల్లు’ ప్రేమగా కురిపించేడు. స్వామి తనని ఆప్యాయంగా ‘ నీ కోరిక తీరిందా నాయనా ’-- --అని అనునయించినట్టు భావించేరు మన ప్రస్తుత ‘ ప్రధాన అర్చకులు ’.

--- మద్దూరి నరసింహమూర్తి ,

బెంగళూరు. తే 10.07.2021 దీ మొబైల్ : 9164543253 . e-mail : [email protected]

ఆర్యా,

ఇందుమూలముగా నేను మీకు తెలియచేయు హామీ :

రచన నా స్వంతమనీ, దేనికీ అనువాదము కాదని, ఎక్కడా ప్రచురించలేదనీ, రచన "డిజిటల్ రైట్స్" గోతెలుగుకే చెందుతాయని హామీ ఇస్తున్నాను.

భవదీయుడు,

M. N. మూర్తి, బెంగళూరు.

తే 10.07.2021 దీ

మొబైల్ : 9164543253 .

e-mail : [email protected]

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు