మా ఇంటి మహలక్ష్మి - కందర్ప మూర్తి

Maa inti mahalakshmi

ఆదివారం శలవు దినమైనందున హాల్లో విశ్రాంతిగా దినపత్రిక చదువుతున్న చంద్రశేఖరం ఇంటి మైన్ గేటు వద్ద ఆగిన ఖరీదైన కారులోంచి దిగి వస్తున్న దంపతుల్ని చూసి " రావోయ్ కోటీ , రా చెల్లమ్మా "అంటూ ఎదురెళ్లి సాదరంగా హాల్లోకి తీసుకు వచ్చాడు. కొత్త వ్యక్తుల మాటలు విన్న అన్నపూర్ణ వంటగదిలోంచి హాల్లోకి వచ్చి " బాగున్నారా అన్నయ్యా , ఎలాగున్నారు వదినా ! " పలకరించి సోఫాలో చంద్రశేఖరం పక్కన కూర్చుంది. కబుర్లు కాఫీలైన తర్వాత బ్రీఫ్ కేసులోంచి నగిషీలతో డిజైన్ చేసిన పెద్ద పెళ్లి శుభలేఖ పైకి తీసి " మా పెద్దబ్బాయి శివకి వచ్చే నెలలో పెళ్లి నిశ్చయమైంది. మీ దంపతులిద్దరూ ముందుగా పిల్లల్ని తీసుకుని రావాలోయ్ చంద్రం ! " లేచి నిలబడి చంద్రశేఖరం చేతికి అందించాడు కోటేశ్వర్రావు. జగదీశ్వరి అన్నపూర్ణకు వెండి కుంకుమ భరిణెలోంచి కుంకుమ బొట్టు పెట్టి పెళ్ళి పిలుపుకి ఆహ్వానం పలికింది. వారిని గేటు వరకూ సాగనంపి హాల్లోకి వచ్చారు అన్నపూర్ణ - చంద్ర శేఖరం దంపతులు. " పది లక్షల కట్నం ,మారుతీ స్విఫ్టు కారు , అత్త గారి లాంఛనాలతో మొత్తం ఇరవై లక్షల వరకు ఇస్తున్నారట." పార్కులో కలిసినప్పుడు కోటేశ్వర్రావు చెప్పాడు. ఆదివారం శలవు దినమైనందున ఇద్దరూ తీరిగ్గా కబుర్లు చెప్పు కుంటున్నారు. " ఎందుకివ్వరండీ ! లక్షణమైన అబ్బాయి. సాఫ్టువేర్ ఇంజినీరాయె. కొద్ది రోజుల్లో విదేశాల కెల్తాడట.ఆ మద్య జగదీశ్వరి వదిన సూపర్ మార్కెట్ దగ్గర కలిసి నప్పుడు వారి పెద్దబ్బాయి శివకి పెళ్లి సంబంధాలు చూస్తున్నామంది" భర్తకి వంత పాడింది. " ఔను , పూర్ణా ! కోటి అధృష్టవంతుడు. సిరిలో పుట్టి పెరిగాడు. బోలెడంత ఆస్తికి ఏకైక వారసుడు. తండ్రి డెప్యూటీ కలెక్టరాయె. ఏది కావాలంటె అది అందుబాట్లో ఉండేది. అందువల్ల చిన్నప్పటి నుంచి డబ్బు మనిషిగా పెరిగాడు.టిప్ టాప్ గా డ్రెస్ చేసుకుని సైకిల్ మీద స్కూలు కి వచ్చి తన దర్పం కనబరిచే వాడు. నా చేత క్లాస్ నోట్సు , లెక్కలు చేయించేవాడు. హైస్కూలు చదువు అవగానే కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేసి తండ్రి పలుకు బడితో రెవెన్యూ డిపార్టుమెంట్లో ఉద్యోగం సంపాదించి ప్రమోషన్లు కొట్టి మండల రెవిన్యూ ఆఫీసర్ స్థాయికి చేరి బాగా డబ్బు కూడబెట్టాడు. అప్పట్లో సన్నగా పీలగా ఉండే కోటేశ్వర్రావు ఇప్పుడు గుర్తు పట్టలే నంతగా మారిపోయాడు .ఒళ్ళుతో పాటు సిరి బొజ్జ వచ్చి లావయాడు. అత్తవారు కూడా డబ్బున్న వారైనందున అటువైపు నుంచీ బాగానే కట్నం ముట్టింది. హోదా ఉద్యోగం , ఖరీదైన కారు , ఇండిపెండెంటు ఫ్లాటు సమ కూరాయి. ఉన్న ఇద్దరు కొడుకుల్లో పెద్ద వాడు శివరామ్ ని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ని చేసి చిన్న వాడు చంద్రాన్ని డెంటల్ సర్జరీ చదివిస్తున్నాడు. ఇక కోటేశ్వర్రావుకి డబ్బు రాబడే కాని ఖర్చేముంటుంది. కట్నాల వల్ల రాబడి దండిగా ఉంటుంది" కోటేశ్వర్రావుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు చంద్రశేఖరం. " అవున్లెండి, .ఎవరి అదృష్టం వారిది. జగదీశ్వరి వదిన కూడా ఒంటినిండా బంగారు నగలు, ఖరీదైన చీరలతో అన్నయ్య గారిలా దర్జా కన బరుస్తుంది." మొగడితో వంత పలికింది అన్నపూర్ణ. తన ముందు సాదా నేత చీరెతో తన కుటుంబ కష్ట సుఖాల్లో భాగం పుచ్చుకుని సంసార నౌకని సాఫీగా నడిపిస్తున్న అన్నపూర్ణ ని చూసిన చంద్రశేఖరానికి గతం కళ్ల ముందు మెదిలింది. * * * నేనూ, కోటీ ఒకే ఊళ్లో కలిసి చదువు కున్నాము. మాది మద్య తరగతి కుటుంబం. నాన్న ఎలిమెంటరీ స్కూలు టీచర్ గా పని చేసేవారు. ఆయనకు స్కూలు జీతం తప్ప మరో ఆదాయం లేదు. మేము స్కూలు మిత్రులమైనందున తరచు కోటితో వాళ్లింటికి వెల్తూండే వాడిని. కోటి నాన్నగారు ప్రసాదరావు దయామయులు. నా కుటుంబ పరిస్థితి తెలిసి ఆయన డబ్బు సాయం చేస్తూండే వారు. నా స్కూలు చదువు సమయంలో అకస్మాత్తుగా నాన్న చనిపోవడంతో అమ్మ , చెల్లి కుటుంబ పోషణ భాద్యత నా భుజాల మీద పడింది. అందువల్ల హైస్కూలుతో నా చదువుకు స్వస్తి పలికి కోటి నాన్న గారి సాయంతో పంచాయతీ ఆఫీసులో గుమస్తా ఉద్యోగం సంపాదించ గలిగాను. నాన్న మరణాంతరం వచ్చిన డబ్బు బ్యాంకులో వేసి చెల్లి పెళ్లికి జాగ్రత్త చేసాను. అమ్మకి ముందు నుంచి ఉన్న క్షయ జబ్బు ముదరడంతో ఆవిడ వైద్యానికి కొంత డబ్బు అవుసరమయేది. ' నేను బతికుండగానె నువ్వు పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకు రా ' అంటూ అమ్మ పోరు పెట్టేది. వచ్చే అమ్మాయి మన కుటుంబ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సర్దుకు పోగలదో లేదోనని అనుమానంతో పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను. చివరకు అమ్మ పోరు వినలేక నా పెళ్లి సంబంధాల వేట మొదలెట్టాను. మామయ్య గారి ఊళ్లో పెళ్లి సంబంధం ఉందని కబురు చెయ్యగా అమ్మతో కలిసి వెళ్లాను. గుడి పూజారి గారమ్మాయి పెళ్లికి ఉందనీ , కట్న కానుకలు ఇచ్చుకోలేరని మామయ్య చెప్పగా పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూడగానే కుందనపు బొమ్మలాగ తెల్లగా సంప్రదాయ బద్దంగా కనబడింది. మారు మాట్లాడకుండా గుడిలో నిరాడంబరంగా అన్నపూర్ణ మెడలో మూడు ముళ్లు వేసి మా ఇంటికి తీసుకు వచ్చాను. కొత్త కోడలుగా వచ్చిన అన్పపూర్ణ నా అవసరాలు తీరుస్తూ అమ్మని కంటికి రెప్పలా కనిపెడుతు చెల్లిని ఆప్యాయంగా చూసుకునేది.ఇంటి భాద్యతంతా తనే చక్క పెట్టేది. అన్నపూర్ణ అణకువ వినయం చూసి అమ్మకూ నాకు మనశ్శాంతి కలిగింది. చెల్లికి మంచి పెళ్లి సంబంధం తనే చూసి పెళ్లి జరిపించి అత్తారింటికి పంపింది. అమ్మకి దగ్గరుండి మందులు తినిపిస్తూ ఎప్పుడు ఏం కావాలో సమకూర్చేది. తన సుఖం చూసుకునేది కాదు.హైస్కూలు చదువుతో పాటు నేర్చుకున్న కుట్లు అల్లికలు మా ఇంటి వద్ద సార్దకం చేసి ఆర్థికంగా ఆదుకునేది. అన్నపూర్ణ సేవలోనే అమ్మ ప్రశాంతంగా తనువు చాలించింది. చెల్లిని అత్తారింటికి పంపి నా బరువు భాద్యతల్ని తీసుకుంది. అన్నపూర్ణను దేవుడు నా కిచ్చిన వరంగా భావిస్తున్నాను. తను వచ్చిన తర్వాత నా జీవిత గమనమే మారిపోయింది. నాకు చదువుకునే రోజుల్నుంచీ కర్ణాటక సంగీతమంటే ఇష్టం.ఆర్థిక స్తోమత అనుకూలించక సంగీత సాధన చెయ్యలేకపోయాను. కోటితో వాళ్లింటి కెళ్లినప్పుడు వాడి నాన్నగారు రేడియో ఆకాశవాణి సంగీత కార్యక్రమాల్లో యం.యస్. సుబ్బలక్ష్మి , మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారి కర్ణాటక సంగీత కచేరీలు వింటూంటే ఆయనతో నేనూ వినేవాడిని.ముఖ్యంగా బాల మురళీకృష్ణ గారి కల్యాణి రాగంలో పాడే సంగీతమంటే ఆశక్తిగా ఉండేది. నా ఇస్టాన్ని తెలుసు కుని అన్నపూర్ణ మా పెద్దమ్మాయికి ' కల్యాణి ' పేరు పెట్టింది. రెండవ అమ్మాయికి ' సంద్య' అని అమ్మ పేరు పెట్టింది. పెద్దమ్మాయికి కర్ణాటక సంగీతం నేర్పిస్తోంది. ఆదివారం అందరికీ విశ్రాంతి దినం. ఆఫీసు ఉరుకులు పరుగులూ ఉండవు. అమ్మాయి లిద్దరూ కూడా శలవు అవడంతో అందరం కూర్చుని కబుర్లు చెప్పకుంటు భోజనం చేసేసరికి సమయం ఆనందంగా గడిచిపోతుంది. ఆదివారం వచ్చిందంటే అన్నపూర్ణకు పూర్తి విశ్రాంతి. కల్యాణి వంట పనులు చూసుకుంటే , సంద్య ఇంటి శుభ్రత బట్టలు ఉతకడం చేస్తుంది. ఇద్దరూ ఆడపిల్లలైనా రత్నాల్లాంటి పిల్లల్ని దేవుడు ప్రసాదించాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఏది కొనిస్తే దాంతోనే సంతృప్తి పడతారు. అన్నపూర్ణదీ అదే మనస్తత్వం. ఇరవై ఐదు సంవత్సరాల మా సంసార జీవితంలో పెళ్లైన కొత్తలో కొన్న బంగారు గొలుసు , మంగళసూత్రాలు తప్ప మరొక బంగారు వస్తువు కొనివ్వలేక పోయాను.ఎటువంటి చీర కొన్నా అదే కట్టుకునేది. పిల్లలకు ట్యూషన్లు చెప్పి కొంతా కుట్టు మిషీన్ మీద కొంత సంపాదించి ఆర్థికంగా ఇంటిని ఆదుకునేది. హౌస్ లోను పెట్టించి మా కంటూ ఒక ఇంటిని ఏర్పర్చింది. పెద్దమ్మాయి కల్యాణి డిగ్రీతో పాటు కంప్యూటర్ కోర్సు నేర్చుకుని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సంపాదించి మా మీద ఆర్థిక భారం లేకుండా చూస్తోంది. సంద్య కూడా డిగ్రీ పూర్తయితే యం.బి. ఎ చేస్తానంటోంది.నేనా ఎదుగు బొదుగూ లేని గుమస్తా ఉద్యోగంతో రోజులు వెళ్లదీస్తున్నాను. నాన్న ఆకస్మిక మరణంతో అమ్మ చెల్లీ కుటుంబ భాద్యతలతో సగం జీవితం ఆర్థిక ఇబ్బందుల్లోనే గడిచిపోయింది. మా ఇంటి మహలక్ష్మిలా అన్నపూర్ణ వచ్చి కుటుంబాన్ని చక్క దిద్దింది. కల్యాణి పెళ్లీడు కొచ్చింది. తగిన పెళ్లి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి. కల్యాణి తన సంపాదనలో దాచుకున్న డబ్బు కాకుండా కట్న కానుకలు , పెళ్లి ఖర్ఛుల కోసం ప్రావిడెఃటుఫండు నుంచి లోన్ పెడితేనే కాని కార్యం గట్టెక్కదు. ఇలా గత జీవీతాన్ని నెమరు వేసుకున్నాడు చంద్రశేఖరం. * * * ఒక ఆదివారం శలవు రోజున అన్నపూర్ణ మాటల సందర్భంలో వారి వదిన మేనమామ గారబ్బాయి పెళ్లికి ఉన్నాడనీ, బ్యాంకు సెలక్షన్ పరిక్షలు రాసి చిన్న వయసులోనే మేనేజర్ పోస్టు సంపాదించాడని, పెళ్లి సంబంధాలు చూస్తున్నారని కల్యాణికి ప్రయత్నిస్తే బాగుంటుందని చెప్పింది. అన్నపూర్ణ మాటలు విన్న చంద్రశేఖరం " మనం వాళ్ల స్తాయికి తూగ గలమా, అదీగాక బ్యాంకు మేనేజర్ అంటున్నావు. లక్షల్లో కట్న కానుకలు , లాంఛనాలు డిమాండ్ చేస్తే ఎక్కడి నుంచి తేవాలి. అప్పో సప్పో చేసి ఈ సంబంధం ఖాయం చేసినా రెండవ పిల్ల సంద్య మాటెలాగ, చెప్పు పూర్ణా !" అంటూ తన అసమర్దత కనబరిచాడు. " ఒకసారి ప్రయత్నిస్తే నష్ట మేముంది. అందరూ కోటేశ్వర్రావు అన్నయ్య గారిలా డబ్బు మనుషులే ఉండరు. మనకి అందుబాటులో ఉంటే ముందుకు వెళదాం. లేదంటే వెనక్కి" అంది. అన్నపూర్ణ ఆలోచన కూడా సబబుగా ఉందనిపించి ఒక మంచి రోజున కల్యాణి బయోడేట , ఫోటో , జాతకం వెంట తీసుకుని ఊరికి బయలు దేరారు. పెళ్లి కొడుకు పేరు కల్యాణ్ కృష్ణ.. పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి బ్యాంకు ఎంట్రెన్సు ఎగ్జామ్సులో సెలక్టయి అసిస్టెంట్ నుంచి మేనేజర్ స్థాయికి ఎదిగాడు. మంచి పెర్సనాలితో హేండ్సమ్ గా కనిపిస్తున్నాడు. అబ్బాయి తండ్రి సుబ్బారావు గారు హైస్కూల్ హెడ్ మాష్టరుగా రిటైర్ అయారు. ఇద్దరు కొడుకులు , ఒక అమ్మాయి. అమ్మాయికి పెళ్లయి భర్తతో అమెరికాలో ఉంటోంది. రెండవ అబ్బాయి ' లా ' చదివి వకీలుగా ప్రాక్టీసు చేస్తున్నాడు. పెళ్లి కొడుకు తల్లి పక్షవాతంతో మంచం మీద ఉంటోంది.. స్వంత ఇల్లు ఉంది. ఇవీ పెళ్లికొడుకు వివరాలు. పెళ్లి కొడుకును చూడగానే కల్యాణికి తగిన జోడు అనుకుంది అన్నపూర్ణ. దేవుడు చల్లగా చూసి ఈ సంబంధం నిశ్చయమైతే బాగుండుననుకుంది. సంప్రదాయ లాంఛనాలు పూర్తయాక కల్యాణి ఫోటో బయోడేటా అందచేసి అమ్మాయిని చూసుకోడానికి రావల్సిందిగా ఆహ్వానించారు చంద్రశేఖరం దంపతులు. ' సరే ' నన్నారు సుబ్బారావు గారు. మంచి రోజు చూసుకుని సుబ్బారావు గారు, వారి పెద్దబ్బాయి కల్యాణకృష్ణ , అన్నపూర్ణ అన్నయ్య వదినతో పాటు ఇంటి పురోహితుణ్ణి వెంట పెట్టుకుని పెళ్లికూతుర్ని చూసుకోడానికి వచ్చారు. పద్దతి ప్రకారం ఫలహారాలైన తర్వాత కల్యాణిని ముస్తాబు చేసి హాల్లోకి తీసుకు వచ్చారు. పుత్తడి బొమ్మలా గుండ్రటి ముఖం బారెడు జడ నిండుగా మల్లెలలతో చక్కగా ఉన్న కల్యాణిని చూడగానే తగిన ఈడూజోడు అనుకున్నారు హాల్లోని వారందరు. శాస్త్రీయ సంగీత మంటే ఆశక్తి ఉన్న సుబ్బారావు గారు కల్యాణి చేత త్యాగరాజ కృతులు ఆలపింప చేసి అందర్నీ పరవసుల్ని చేసారు. " అమ్మాయిని అబ్బాయినీ ఏకాంతంగా మాట్లాడుకోనివ్వండని" పురోహితుడు అనగానే సుబ్బారావు కలగ చేసుకుని " ఈ సంబంధం మాకు అన్ని విధాల అనుకూలమే. అమ్మాయిని లోపలికి తీసుకెళ్లండి" అన్నారు. ఆమాట విన్న అన్నపూర్ణ మనసు తేలిక పడింది. హాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోను చూసి మనసులో "ఏడుకొండల వెంకట రమణా, కట్నకానుకలు కూడా సర్దుబాటు చెయ్యమని" కోరుకుంది. చంద్రశేఖరానికి మాత్రం గుండె ' లబ్ దబ్ ' మని కొట్టుకుంటోంది. పెళ్లి కొడుకు తరపువారు ఎంత కట్నం డిమాండ్ చేస్తారో, లాంఛనాలెన్ని పెట్టమంటారోనని గుబులు పట్టుకుంది. ఇంతలో పెళ్లికుమారుడి తండ్రి సుబ్బారావు గారు హాల్లో కూర్చున్న పెద్ద వారి నందర్నీ సమావేశ పరిచి " ఈ పెళ్ళి సంబంధం మాకు అన్ని విధాల నచ్చింది. ఎటువంటి కట్న కానుకలూ అవుసరం లేదనీ " కల్యాణి - కల్యాణ్ కృష్ణ ల పెళ్లి నిరాడంబరంగా మా ఖర్చులతో జరుపుతామని , పెళ్లిపీటల మీద కూర్చొని కన్యాదానం చేస్తే చాలని" చంద్రశేఖరం దంపతులకు చెప్పి, పెళ్లి నిశ్చయతాంబూలాలకు ఏర్పాటు చేయమన్నారు. తమవెంట వచ్చిన సిద్ధాంతి గారితో ఆడపెళ్లి వార్ని సంప్రదించి వీలైనంత తొందరలో పెళ్లి కి సుమూహుర్తం పెట్టమన్నారు. అన్నపూర్ణ సలహా పాటించి సుబ్బారావు గారింటికి వెళ్లినందున కల్యాణిని ఇంతటి ఉదార స్వభావమున్న కుటుంబంలో కోడలిగా పంపుతున్నందుకు చంద్రశేఖరం , తన మొర ఆలకించి ఈ సంబంధం నిశ్చయమైనందుకు అన్నపూర్ణా ఏడుకొండల శ్రీనివాసుడికి మనసారా వందనాలు తెలుపు కున్నారు. పక్క ఇంటి టీ .వీ .లో మంగళంపల్లి మురళీకృష్ణ గారి ' పాడనా వాణి కల్యాణిగా - వరరాణి పాదాల పారాణిగా- నా పూజకు శార్వాణిగా - నా భాషకూ గీర్వాణిగా ...." అంటూ మృదు మధురంగా వినిపిస్తూంటే పరిసరాలు ఆహ్లాదంగా మారాయి. ** ** ** **

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు