రామయ్య తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో తిండి గింజలు, కూరగాయలు పండిస్తూ పూర్వీకులు కట్టిన పెంకుటింట్లో భార్య అనసూయ , కూతురు వరలక్ష్మి, కొడుకు కిరణ్ తో సంతోషంగా రోజులు వెళ్లదీస్తున్నాడు. అనసూయ పాడి గేదెల్ని మేపుతు పాల కేంద్రానికి పాలు పోసి భర్తకు ఆర్థికంగా సహాయ పడుతోంది. భార్యా భర్తల ఉదార గుణం, నోటి మంచి తనంతో ఊరిలో అందరి మన్ననలు సంపాదించారు. కూతురు వరలక్ష్మి పక్క ఊరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. చురుకైన పిల్ల. చదువుతో పాటు ఆట పాటల్లో మేటి. కుట్లు ,అల్లికలతో పాటు చిత్రకళలో ప్రావిణ్యం సంపాదించి చక్కటి ప్రకృతి చిత్రాలు గీసి, ముగ్గుల పోటీల్లో బహుమతులు సంపాదిస్తోంది. పాఠశాల వార్షికోత్సవాల్లో, జాతీయ పర్వదినాల్లో దేశభక్తి గీతాలు, చక్కటి సినిమా పాటలు శ్రావ్యంగా పాడుతుంది. అందువల్ల పాఠశాల ఉపాధ్యాయులకు వరలక్ష్మి అంటే ప్రత్యేక అభిమానం. ప్రధాన మంత్రి శ్రీనరేంద్రమోదీ గారి ' మనసులోని మాట' రేడియోలో హిందీ సందేశానికి తెలుగు అనువాదం శ్రద్ధగా విని తండ్రికి వివరించి చెబుతూంటుంది. ప్రశాంతంగా భార్యా పిల్లలతో సాగిపోతున్న రామయ్య కుటుంబానికి అనుకోని ఆపద వచ్చి పడింది. పచ్చని పంట పొలాలతో ప్రకృతి రమణీయంగా కళకళ లాడుతున్న ఆ పల్లె భూముల్లో ఖరీదైన ఖనిజ సంపదలున్నాయని భూ సర్వేలో నిర్దారణ అయింది. కొంతమంది స్వార్ద రాజకీయ నాయకుల కన్ను ఈ పల్లె గ్రామాల భూములపై పడింది. ఇంకేముంది, తరతరాలుగా ఈ పల్లెభూముల్ని నమ్ముకుని జీవిస్తున్న గ్రామ ప్రజలు ఊళ్లు కాళీ చేసి ప్రభుత్వం చూపిన స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవల్సిందిగా నోటీసులిచ్చి గ్రామ సర్పంచి ద్వారా దండోరా వేయించారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి రామయ్య- అనసూయ దంపతు లకు కంటి మీద కునుకు లేదు. సుఖ సంతోషాలతో సాగుతున్న వారి కుటుంబానికి పెద్ద దెబ్బ తగిలినట్టయింది. ఒకే కుటుంబం లోని అన్నదమ్ముల్లా ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు భాగం పంచుకుంటూ ఐక్యంగా జీవిస్తున్న ఆ గ్రామ ప్రజలందరిలోను ఇదే ఆందోళన కనబడుతోంది. ఎవరికి చెప్పుకుంటే ఈ ఆపద నుంచి రక్షణ కలుగుతుందీ, ఏమీ గోచరించడం లేదు. ఇది రాజకీయ వ్యవహారం కనక ఎవరిని ప్రాధేయ పడినా ప్రయోజనం ఉండదు. ఆ ఊరి ప్రతి గడపలోను ఇదే చర్చ సాగుతోంది. ఇంట్లో అమ్మా నాన్నల ఆందోళన, ఊరి ప్రజల భయం గమనిస్తున్న వరలక్ష్మికి ఏమీ తోచడం లేదు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తన ప్రసంగంలో' పల్లెసీమలే దేశానికి ఊపిరి, అన్నదాతలే దేశ ప్రజల ఆకలి తీర్చగలరు' అని చెబు తూంటారు. మరొకవైపు ప్రగతి , అభివృద్ధి పేరుతో పచ్చని చెట్లతో ప్రకృతి సంపదగా ఉండే అడవుల్నీ, పచ్చని పంట భూములు, జల సమృద్దితో అనేక జీవ జలచరాలకు ఆధారమైన చెరువులతో విలసిల్లుతున్న పల్లె సీమల్ని నాశనం చేస్తున్నారు. ప్రకృతి సమతుల్యం దెబ్బతిని భూతాపం పెరిగి అనేక దేశాలలో వాతావరణ మార్పులొచ్చి సకాలంలో వర్షాలు కురవక ఆహార ధాన్యాల కొరత, మరొక ప్రాంతంలో అకాల వర్షాలు, వరదలు, మంచు తుఫాన్లు ఇలా మనిషి తన స్వార్థం కోసం ప్రకృతి వనరుల్ని నాశనం చేసి తన వినాసనానికి కారమమవుతున్నాడు. దీనికి పరిస్కారం లేదా? ఇదే ప్రశ్న వరలక్ష్మిని వేధిస్తోంది. * * * పాఠశాల వార్షికోత్సవానికి జిల్లా కలెక్టరు గారు ముఖ్య అతిథి గా వస్తున్నట్టు ప్రకటించారు. ప్రథమంగా సాంస్కృతిక, వినోద విజ్ఞాన కార్యక్రమాల రిహార్సల్సు అబ్యాసం చెయ్యమని ప్రధానోపాధ్యాయుడు , కల్చరల్ టీముకి ఆదేశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చెయ్యాలనుకుంది వరలక్ష్మి. వార్షికోత్సవ సందర్భంగా పాఠశాల భవనాన్ని సుందరంగా అలంకరించారు. పాఠశాల వార్షికోత్సవ రోజు వచ్చింది. జిల్లా కలెక్టరు గారి స్వాగతానికి ఏర్పట్లు పూర్తయాయి. స్వాగత కార్యక్రమానికి ముందు వరలక్ష్మి ప్రధానోపాధ్యాయుల వారిని అబ్యర్థించి తనకు ఎలాగైనా జిల్లా కలెక్టరు గార్ని కలిసే అవకాశం కల్పించ వల్సిందిగా కోరింది. ప్రధానోపాధ్యాయుడు వరలక్ష్మి గ్రామ సమస్యను తెలుసుకుని తన వంతు ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సాదరంగా జిల్లా కలెక్టరు గార్ని స్వాగత వేదిక మీదకు తీసుకు వచ్చారు. పాఠశాల ప్రగతి గురించి ప్రధానోపాధ్యాయులు ప్రసంగించి సాంస్కృతిక , వినోద, ఆటల పోటీల్లో పాల్గొన్న విధ్యార్దులకు కలెక్టరు గారి చేతుల మీదుగా బహుమతులు అందచేసారు. కలెక్టరు గారి స్వాగత కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపించిన కుమారి వరలక్ష్మి ' పర్యావరణం - పరిరక్షణ ' వ్యాస రచన పోటీలో ప్రథమ బహుమతి, దేశభక్తి గీతాలాపనలో ప్రథమ బహుమతి , చిత్రకళ పోటీలో ప్రథమ బహుమతి కలెక్టరు గారి చేతుల మీద బహుమతులు తీసుకుని వేదిక మీద ప్రధాన ఆకర్షణ అయింది. కలెక్టరు గారు తన స్వాగత ప్రసంగంలో పాఠశాల ఉపాధ్యాయుల్ని, సిబ్బంది, విధ్యార్దుల్ని ప్రశంసిస్తూ తను కూడా ఈ పాఠశాల పూర్వ విధ్యార్దినని, తన గురువులు నేర్పిన క్రమశిక్షణ వల్లే ఇంత ఉన్నత స్థితికి చేరుకో గలిగానని కరతాళ ధ్వనుల మధ్య చెప్పడం జరిగింది. మీరు కూడా క్రమశిక్షణ , చదువులో శ్రద్ధ కనబరిచి పెద్ద హోదా పదవులు పొంది సమాజంలో పేద ప్రజలకు సేవ చెయ్యాలని ఆశీర్వదించారు. కార్యక్రమం చివరలో వేదిక మీద కలెక్టరు గారి పక్కన కూర్చున్న ప్రధానోపాధ్యాయుడు అవకాశం చూసుకుని వరలక్ష్మి అబ్యర్దనను ఆయనకు తెలియచేసారు. అప్పుడే వేదిక మీద జాతీయ గీతం ఆలపించి క్రిందకు దిగుతున్న వరలక్ష్మిని ప్రధానోపాధ్యాయుడు దగ్గరకు పిలిచి జిల్లా కలెక్టరు గారికి పరిచయం చేసారు. వరలక్ష్మి సంప్రదాయ వస్త్ర ధారణ వినయ విధేయతలకు కలెక్టరు గారు ముగ్ధులయేరు. విషయ మేమిటని వరలక్ష్మిని అడగ్గా తన గ్రామ ప్రజల మనోవేదన , అమ్మా నాన్నల ఆందోళన వివరంగా కలెక్టరు గారికి చెప్పింది. తక్షణం కలెక్టరు గారు తన వ్యక్తి గత కార్యదర్సిని పిలిచి వరలక్ష్మి నుంచి పూర్తి సమాచారం, గ్రామ ప్రజల నివేదన అర్జీ తీసుకుని మండల రెవెన్యూ అధికారి ద్వారా తనకు అందచెయ్యమని ఆదేశించి వరలక్ష్మిని అభినందించి వెళిపోయారు. వరలక్ష్మికి మనసు కుదుట పడింది. కొద్ది రోజుల తర్వాత రాష్ట్ర ముఖ్య మంత్రిగారు రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ పథకాల అమలు , అభివృద్ధి గురించి జిల్లా కలెక్టర్ల తో సమావేశం ఏర్పాటు చేసారు. సమావేశం చర్చల సందర్భంగా వరలక్ష్మి గ్రామ సమస్య ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వచ్చారు జిల్లా కలెక్టరు. ముఖ్యమంత్రి గారు స్పందించి సంబందిత శాఖ మంత్రి, అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకున్నారు. కమిటీ నివేదిక ప్రకారం కొంతమంది అవినీతి అధికారుల సహకారంతో రాజకీయ రాబందుల వ్యవహారమని తెలియడంతో వరలక్ష్మి గ్రామంతో పాటు చుట్టు ఉన్న గ్రామ ప్రజల ఆపద నుంచి గట్టెక్కారు. గ్రామాలు వదిలి వెళ్లాలన్న ప్రభుత్వ ఉత్తర్వు రద్దు కాబడింది రామయ్య -అనసూయ దంపతులతో పాటు గ్రామ ప్రజలు వరలక్ష్మి ఆడపిల్లైనా సమరస్ఫూర్తి దైర్యంగా వారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిస్కరించి నందుకు అభినందించేరు. వరలక్ష్మికి మనసు కుదుట పడింది.