మనం జీవులం - B.Rajyalakshmi

Manam jeevulam

రంగయ్య మరణించి అప్పటికి పదిహేను రోజులయ్యింది . రామచిలుక వున్న పెట్టెను భుజాన తగిలించుకుని బయల్దేరాడు పద్దెనిమిదేళ్లకొడుకు శీనయ్య . వంట చేస్తున్న రంగమ్మ కొడుకు వాలకం గమనించి గుమ్మానికి అడ్డంగా నిలబడింది .

" ఒరేయ్ నా మాట వినరా చిలక సంపాదన మనకు కలిసిరాలేదురా ! మీ తాత చిలక జోస్యం చెప్పేవాడు . ఆయన దగ్గర యిరవై చిలకలు వుండేవి . పట్టుమని రెండునెలలు యే చిలుకా వుండేది కాదు . ఆయన తాగుడు అవసరాలకు అమ్మేసేవాడు . కొత్తవాటిని పట్టుకుని మచ్చిక చేసుకునేవాడు . చిలుక జోస్యం డబ్బు మనకు అచ్చిరాలేదురా !కటిక దరిద్రం తో చచ్చిపోయాడు . ఆ అనుభవం తో చిలుక పెట్టె పెట్టుకోవద్దని మీ అయ్యకు చెప్పాడు . కానీ మీ నాన్న వినలేదు . అంతెందుకు తమ్ముణ్ణి చూస్తున్నావుగా ,? వాడి రెండు కాళ్లు చచ్చుబడ్డాయి యెందుకో తెలుసా ?హాయిగా తిరిగే రామచిలుకలను పట్టుకుని రెక్కలు కత్తిరించి పెట్టెలో పెట్టి చిత్రహింసలు పెట్టి బందీ చెయ్యడమే !" రంగమ్మకు కళ్లు చెమ్మగిల్లాయి .

" మరి మనం యెలా బతకాలి ?డబ్బులెక్కడినించి వస్తాయి ?" ప్రశ్నించాడు శీనయ్య .

"అందరూ చిలక జోస్యం చెప్పే బతుకుతున్నారురా !కూలీ ,నాలీ చేసుకుందాం . మనకు చిలుకల సంపాదన వద్దురా "అన్నది బాధగా . " నీదంతా చాదస్తం అమ్మా !కూలీ ఒకరోజు దొరుకుంది ,ఒకరోజు దొరకదు . మన చిలుక రోజూ యెంతో కొంత సంపాదిస్తుంది . నీకేం తెలియదమ్మా ,నన్ను వెళ్లనివ్వు "విసుక్కున్నాడు శీనయ్య . రంగమ్మకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు . కొడుకు వినే స్థితిలో లేడు .

తండ్రి బతికున్నప్పుడు ఒక్కరోజూ చిలక పెట్టె ముట్టుకోనిచ్చేవాడు కాదు . అప్పుడప్పుడూ వెంట వెళ్ళేవాడు . ఇప్పుడు ఆ పెట్టె భుజాన తగిలించుకుని రోడ్డుమీద వెళ్తుంటే గర్వంగా ,వుంది . శీనయ్యకు తన తండ్రి చిలుకల మచ్చిక గుర్తుకొచ్చింది .

రంగయ్య చిలుకల్ని పట్టుకోగానే తిండి పెట్టకుండా వారం రోజులు పస్తుంచేవాడు . కొన్ని వాక్యాలు ,దేవుళ్ల బొమ్మలూ వున్న అట్టలను వరుసగా పెట్టి చిలుక వాటిని ముక్కుతో తీసిస్తేకాని పండు కానీ గింజ కానీ పెట్టేవాడు కాదు . చిలుక అట్ట తియ్యకపోతే చిన్న కర్రపుల్లతో తలమీద కొట్టేవాడు . అలాగే జనం అట్టమీద పెట్టే డబ్బు సరిపోదనుకుంటే చిలకకు అట్టలు తియ్యకుండా కూడా శిక్షణ యిచ్చేవాడు . చిలకలు యెగిరిపోకుండా రెక్కలు కత్తిరించేవాడు . . ఆలా మొదట్లో వాటిని నిర్దయగా కఠినం గా శిక్షణ యిచ్చేవాడు . తర్వాత చిలుకలతో సన్నిహితంగా వుండి స్నేహంగా ఉండేవాడు . చిలుక రఁగయ్య చెప్పినట్టు వినేది . డబ్బులు బాగానే వచ్చేవి కానీ దురలవాట్లవల్ల అన్నీ ఖర్చయ్యేవి . డబ్బవసరం అయితే చిలకల్ని అమ్మేసేవాడు . మళ్లీ కొత్త చిలకల్ని పెట్టేవాడు . రంగమ్మ యిళ్ళల్లో పాచిపని ,అప్పుడప్పుడూ పొలంలో పనులూ చేస్తూ సంసారం లాక్కొచ్చేది . శీనయ్యకు దోవపొడుగునా తండ్రి చిలుకలను పట్టడం ,శిక్షణ యివ్వడం అన్నీ గుర్తుకొస్తున్నాయి .

అంతేకాదు చిలుక జోస్యం చెప్పడంలో కూడా రంగయ్య మహా నేర్పరి . వచ్చిన మనిషి ముఖకవళికలను ,మాట్లాడేపద్ధతిని ,గ్రహించి ,దానికి తగ్గట్టుగా చిలుక ముక్కుతో యిచ్చిన అట్టలోని దేవుళ్ల బొమ్మలను ,వాక్యాలను అనుకూలంగా చెప్పేవాడు . జోస్యం చెప్పించుకోవడానికి వచ్చిన వ్యక్తి డబ్బులు తక్కువగా పెడితే కర్రముక్కతో చిలుకకు సైగ చేసేవాడు . చిలుక అట్టలచుట్టూ తిరిగి చివరికి అట్ట తియ్యకుండా పెట్టెలోకి దూరేది . డబ్బులు పెట్టగానే చటుక్కున అట్ట తీసేది . రంగయ్య మాట చాతుర్యమేమో కానీ పెట్టె చూడగానే జనం గుమ్మికూడేవారు . శీనయ్య యివన్నీ చూస్తూవుండేవాడు .

శీనయ్య ఒక హోటలు పక్కన చెట్టుకింద దుప్పటి పరిచి అట్టలన్నీ వరుసగా అమర్చాడు . చిలక పెట్టెను పక్కన పెట్టుకున్నాడు జనాలు హోటల్ వెళ్తున్నారు ,వస్తున్నారు ,రోడ్డుమీద వాళ్లు కూడా చూస్తున్నారు ,పోతున్నారు . సుమారు మధ్యాహ్నం సమయానికి మధ్య వయస్సు వ్యక్తి శీనయ్య దగ్గరకు వచ్చి పదిరూపాయల నోటు దుప్పటి మీద పెట్టాడు . శీనయ్య చిలుక పెట్టె తలుపు తెరిచి కర్రతో చిన్నగా చిలుక వీపుమీద తట్టాడు . చిలుక బయటకు వచ్చింది . శీనయ్యను తీక్షణంగా చూసి పెట్టెలోప నెమ్మదిగా లికి దూరింది . శీనయ్యకు అవమానం ,కోపం కలగలిపి వచ్చాయి . మళ్ళీ మళ్లీ సైగ చేసిన ,పిలిచినా చిలుక బయటకు రాలేదు .ఆ వ్యక్తి విసుక్కుంటూ తన డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు . ఆ విధంగా వచ్చిన ప్రతివాళ్లకు చిలుక అదేరకంగా పెట్టెలోపలికి వెళ్లిపోయింది . సుమారు సాయంకాలం నాలుగు గంటల దాకా ఇదే వ్యవహారం . ఒక్కరూపాయి కూడా సంపాదన లేదు . శీనయ్యకు సహనం తగ్గింది . చిలుకను బలంగా బయటకు లాగి గట్టిగా తలమీద కొట్టాడు .చిలుక శీనయ్యను ముక్కుతో గట్టిగా చెంపమీద పొడిచింది . విసుగు ,ఆకలి ,అవమానం అన్నీ అన్నీ కలిసి శీనయ్య కు దుఃఖం ముంచుకొచ్చింది . నిరాశగా దుప్పటి మడతపెట్టుకుని ,అట్టలు సంచీలో పెట్టుకుని పెట్టె భుజాన తగిలించుకుని యింటికి వచ్చాడు .

రంగమ్మ ,శీనయ్యను చూడగానే గ్రహించింది . కానీ కొడుకుని అడగలేదు .

"రారా ,అన్నం తిందువుగాని " పిలిచింది . శీనయ్య మౌనంగా కూర్చున్నాడు . తమ్ముడు మెల్లగా పాకుతూ శీనయ్య దగ్గరకొచ్చాడు . శీనయ్య ,తమ్ముణ్ణి ,చిలుక పెట్టెను పదే పదే చూసాడు . కాళ్లు చచ్చుబడ్డ తమ్ముడు , నిర్దయగా రెక్కలు విరిగిపోయిన చిలుక ! హాయిగా ఆకాశం లో యెగిరే చిలుకను రెక్కలు కత్తిరించి పెట్టెలో పెట్టి దాని బతుకును నాశనం చేసారు తన తాత ,తండ్రీ ! తమ్ముడు చచ్చుబడ్డ కాళ్లతో జీవితాంతం నరకం అనుభవిస్తున్నాడు . స్వేచ్ఛగా యెగిరే పక్షిని పట్టే హక్కు తనకు లేదు . స్వేచ్ఛగా తిరగాలనుకున్న తమ్ముడి కాళ్లు తన కళ్లముందు వేలాడుతూ కనిపిస్తుంటే శీనయ్యలోని మానవత్వం కరిగి కన్నీరయ్యింది . తమ్ముడిని ముద్దు పెట్టుకున్నాడు . చిలుకమ్మను పెట్టెలోనించి లాలనగా ప్రేమగా బయటకు తీసి చేత్తో నిమిరి బియ్యంగింజలు వేసాడు . అది తింటుంటే ఆనందపడ్డాడు .

"అమ్మా మన చిలుక యిప్పుడు చిట్టి చెల్లాయమ్మా !అది యింట్లోనే తమ్ముడితో ఆడుకుంటుంది " నవ్వుతూ శీనయ్య రంగమ్మతో అన్నాడు . రంగమ్మ ముగ్గురినీ హత్తుకుంది .

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు