"ఎంకటలచ్చిమి   సానా   మంచిది" - నల్లబాటి రాఘవేంద్రరావు

Yenkatalachimi sana manchidi

సమయం.... అర్ధరాత్రి దాటింది! హోరున వర్షం...చిరిగిపోయిన నల్లనిగొడుగు వేసుకొని తడుస్తూ గబగబా.... కంగారుతో పరుగు లాంటి నడకతో నడు స్తుంది...ఎంకటలచ్చిమి. చేతిలో చిన్ని ప్లాస్టిక్ డబ్బా... దానిలో నేమ్ కూడా అస్పష్టంగా కనిపించని ఖాళీ టాబ్లెట్స్ రేపర్.... ఆమె పట్టుకున్న గొడుగు నుండి ఒక్క వర్షం నీటి బొట్టు కూడా వృధా కాకుండా ఆమె తలమీద పడుతూనే ఉన్నాయి. వెంట్రుకల మీద పడిన నీళ్ళు నుదురు మీదనుండి దబదబా జారిపడి కనురెప్పలను క్రిందకు బలవంతంగా దించేస్తు న్నాయి. దానితో ఆమెకు దారి కూడా కనిపించ టం లేదు.. పైగా చీకటి..అక్కడక్కడ గోతులు, గుంతలు...అప్పుడప్పుడు ఉరుములు...... మెరుపులు.... ఆ భయంకర వాతావరణంలో తననెవరో తరుముకొస్తున్న శబ్దాలు... తన నెవరో చెట్టు చాటు నుండి చూస్తున్న అలికిడి.. అంతేకాదు ఎవరో అస్పష్టపు ముసుగుమనిషి లాంటి వ్యక్తి కదలికలు.... ఇంకోపక్క దూరం నుండి పోలీస్ పెట్రోలింగ్ వాహనం.... పెద్దగా సైరన్ వేస్తూ దూసుకొస్తున్న శబ్దం..... మరోపక్క నిద్రాదేవత, ఆకలిరాక్షసి ఇద్దరూ కలిసి ఒకేసారి తన కంఠాన్ని నులిమిపాడేస్తున్న...అనుభూతి!! ఇవన్నీ ఎంకటలచ్చిమి మహాప్రయత్నానికి అడ్డు రావడం లేదు!..... ఆమె సాధించాలను కున్న ప్రయత్నం బాపతు పట్టుదల...దీక్ష అలాంటివి మరి సడన్గా ఆమె వెనుక నుండి ముందుకు వచ్చి ఆగింది పోలీసు పెట్రోలింగ్ వాహనం. " ఎవరు నువ్వు ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళుతున్నావు" ఎయిర్ విండ్ మిర్రర్ డౌన్ చేసి ప్రశ్నించింది ఓ పోలీసు కంఠం. ఆమె ప్లాస్టిక్ డబ్బా తెరిచి ఏదో చూపిం చింది....నెమ్మదిగా ఏదేదో చెప్పింది. 'సరే కొంచెం.. ఎదరకు వెళ్ళు ' అన్నట్టు చేత్తో చూపించి... కదలి వెళ్ళిపోయింది ఆ వాహనం. ఎంకటలచ్చిమి డబ్బా జాగ్రత్తగా మూత పెట్టింది. చుట్టూ బెదురుగా చూసింది. అంత వర్షంలోనూ దూరంగా మర్రిచెట్టు చాటు నుండి ముసుగు మనిషిలాంటి వ్యక్తి....తనను పరి శీలనగా పరిశీలిస్తున్నట్టు గానే అనిపించింది. మళ్లీ పరుగులాంటి నడక లంకించుకుంది. ఈ ఏరియా కాకపోతే...మరొక ఏరియా తెల్లవారే వరకు తిరిగి తిరిగి.... తను అనుకున్నది సాధించి తీరాలి.... అది సంపాదించే తను తిరుగుముఖం పట్టాలి....! భయం.. భీతి..బెరుకు.. అసహనం.. అసహాయత.. అనుమానం.. కలవరపాటు.. తడబాటు... ఇవన్నీ పక్కన పెట్టేసింది ఎంకట లచ్చిమి..... ఆ అర్ధరాత్రి... దూరంగా కనిపిస్తున్న ఓ మందుల షాపు దగ్గరకు వెళ్లి ఆతృతగా తన దగ్గర ప్లాస్టిక్ డబ్బా మూత తెరిచి..... చూపిం చింది ఎంకటలచ్చిమి. ఆ షాపు ఓనరు దానిని పరిశీలనగా చూసి... అర్థం కావడం లేదు అన్నట్టు చెయ్యి ఊపి మళ్లీ ఆమెకు ఇచ్చేశాడు. ఆమె బాక్స్ కు మూత పెట్టి...మళ్లీ నడక లంకించుకుని...కొంచెం దూరంవెళ్లి అనుమానం తో వెనక్కు తిరిగి చూసింది. తనను వెంబడిస్తున్న ఆ ముసుగుమనిషి లాంటి వ్యక్తి... తను వెళ్ళిన మందులషాపు దగ్గర నిలబడి ఉండడం..స్పష్టంగా గమనిం చింది. తన గురించి ఆరా తీస్తున్నాడా???? ఎంకటలచ్చిమి చాలాసేపు ఆ ఏరియా లో తిరిగి తను అనుకున్నది సాధించే సమయం పూర్తి కాకపోవడంతో...మరో ఏరియాలో ప్రవే శించింది.....ఆ పెద్దనగరంలో. ఈసారి ఇంకా పెరిగింది వర్షం..గాలి వీస్తూ నే ఉంది ....ఉరుములు మెరుపులు వస్తూనే ఉన్నాయి. ఆ పరిస్థితుల్లోనూ ఎంకటలచ్చిమి ఓ ఆసక్తికర సంఘటన.. ..తనకు కొంచెం దూరం లో గమనించింది. అన్ని ఏరియాలకు ఒకే పెట్రోలింగ్ వాహనం కావడంతో తన ముందు వెళుతున్న ఆ పెట్రోలింగ్ వాహనం ని చెయ్యి అడ్డు పెట్టి ఆపి.. దగ్గరకు వెళ్లి ఏదో గుసగుసగా చెప్పినట్టు చెప్పాడు ఆ ముసుగు మనిషి లాంటి వ్యక్తి . అతడిని పోలీసులు ఏదో అడిగారు. అతను ఏదో చెప్పాడు. చివరికి 'నేను... ప్రయత్నిస్తా గా మీరు వెళ్ళండి' అన్నట్టు పోలీ సులతో అతను చెప్పినట్టు...ఆమె అర్ధం చేసు కుంది. అయినా ఆమె ఏమాత్రం భయపడ లేదు.. భయం దేనికి...? చంపేస్తారా?మరీ మంచిది...ఎప్పటికైనా తప్పనిది ఆది ఒకటేగా ... దాన్నుంచి ఈ భూప్రపంచంలో ఏ వ్యక్తి తప్పించుకోలేడు. ఇక తను ఎంత? తన అర్భక బ్రతుకెంత..? అసలు తను బ్రతకాలా?.. బ్రతకాలి.. బ్రతకాలి.... బ్రతికి తీరాలి... తను లేనిదే బ్రతకలేని ఒక ప్రాణం గురించి..ఖచ్చి తంగా.. ఏమాత్రం అనుమానం లేకుండా... నూటికి నూరుపాళ్లు... తను బ్రతికే తీరాలి. ఆ అర్ధరాత్రి దాటిన తర్వాత... రెండు న్నర గంటల సమయం.... ఆ ఏరియాలో మరొక మందుల షాప్ ను ఆమె వెతుకుతుండగా... మళ్లీ అడ్డగించింది అదే పెట్రోలింగ్ వాహనం.... ఆమె..తన పని పూర్తికాలేదు..అన్నట్టు చెప్పింది ఆ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదుముందుకు వెళ్ళిపోయారు....ఏది ఏమైనా ఆ పోలీసులు తనను అనుమానంగానే చూస్తున్నట్టు.. ఆమెకు అనిపించింది. ఎంకటలచ్చిమి తిరిగి తిరిగి తిరిగిన చోటకే తిరిగి తిరిగి... చిట్టచివరికి ఒక మందుల షాపు చూసి ఆనందంతో అక్కడకు వెళ్లి తన దగ్గర ప్లాస్టిక్ డబ్బా మూత తెరిచి.... వాళ్లకు చూపిం చింది.ఆ షాపు వాళ్లు.... లైట్ కాంతిలో... ఆమె ఇచ్చిన మెడికల్ రేపర్ ను చాలాసేపు నిశి తంగా పరిశీలించి.... అర్థం కాలేదు అన్నట్టు ఆమెకు తిరిగి ఇచ్చేశారు. ఆమె ఏదో అడిగింది.. వాళ్లు కొంచెం ఎదురుగా వెళ్లి పక్కకు తిరిగి అక్కడ ప్రయత్నించమన్నారు. ఆమె మరో ప్రయత్నం చేద్దాం అన్నట్టు నడక మొదలు పెట్టింది. ఎంకటలచ్చిమి నడుస్తుంది...నడుస్తుంది.. నడుస్తుంది. నడిచిన చోటే నడుస్తుంది. తిరిగిన చోటే తిరుగుతుంది. సమయం మూడున్నర దాటింది. మరో గంటన్నర లో తెల్లతెల్లగా తెల్లవారిపోతుంది. ***** ***** " హలో విశ్వం... ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా..." " ట్రై చేస్తున్నాను సార్ ఎలాగైనా ఈ రోజు గేమ్ ఫైనల్ కి వచ్చేస్తుంది.... నో డౌట్." " ప్రొసీడ్ ప్రొసీడ్.... నువ్వు చాలా అలర్ట్ గా ఉండాలి. నా ఉద్దేశం ప్రకారం గా మొదట్లో ఆవిడ పిచ్చిది అని భావించాను. అదేం కాదని నువ్వు ఖచ్చితంగా చెప్పడంతో..... ఈ కేసు ఏ మలుపు తిరిగి ఎక్కడ ఆగుతుందో తెలుసు కోలేకపోతున్నాను.. అడిగితే ఆవిడ తన పేరు ఎంకటలచ్చిమి అని చెప్పింది ఆడకూతురు... పెద్ద వయసు కాదు..నలభై యాభై కి మధ్యలో ఉండొచ్చు... పోనీ బ్రోతల్ హౌస్ మెయింటెయిన్ చేసే.. లేడీ అను కోవడానికి... ఆవిడ ముఖం .. మాటలు బట్టి ఆవిడకు అంత సీన్ లేదు అని పిస్తుంది.. అయినా మన నగరంలో అసాంఘిక కార్యకలాపాలు ఎప్పుడో కట్టడి చేశాను కదా.... మరి ఏ కోణంలో ఆలోచిద్దాం..అన్న... క్లూ ఇప్పుడు దొరకటం లేదు... ఆరు నెలల నుంచి ఆ ఆడది.. ఇలాగే అర్ధరాత్రి కొన్ని ఏరియాల్లో అలా ఎందుకు సంచరిస్తున్నట్లు.... మన స్టాప్ చెప్పినదాన్ని బట్టి వారంలో కనీసం రెండు మూడు రోజులు ఆవిడ ఇదే రకంగా ప్రవర్తి స్తుంది అట... మానవబాంబు కన్నా పెద్ద టెన్షన్ పెడుతోంది..... ఎనీహౌ... విశ్వం నీ వృత్తికి... సరైన న్యాయం చేసే సమయం ఇదే. ఆ... అన్నట్టు చెప్పటం మరిచాను... ఆవిడ పూర్తి అడ్రస్ కూడా సేకరించాలి... పూర్తి ఫ్యామిలీ డీటెయిల్స్... మొత్తం అన్ని రేపటికల్లా నా దగ్గర ఉండాలి. ఇప్పుడు నువ్వు ఏ ఏరియాలో ఉన్నట్టు? ఆ ఆ ఆహా..అలాగా..12 గంటలు దగ్గర నుండి ఆవిడనే అనుసరిస్తున్నావా? వెరీగుడ్ వెరీగుడ్... గతంలో కూడా ఇలాగే మా డిపార్ట్మెంట్ కి చాలా సహకరించావు.... మా అధికారులు తరఫునుంచి నీకు మంచి గిఫ్ట్ వచ్చే.. ప్రయత్నం నేను చేస్తాను. ఉంటాను.. ఏదైనా ప్రమాదం జరిగినా..లేదా అనుకోని సంఘటనలు ఎదురైనా నాకు ఫోన్ చేస్తే నిమిషాల్లో అక్కడికి వస్తాను. బైదిబై..రిస్కు తీసుకోవద్దు...ప్రాణాలు ముఖ్యం కదా...... ఉంటాను." పెట్రోలింగ్ వాహనం లో ఉన్న ఎస్సై శ్రీధర్ మాట్లాడవలసినదంత పూర్తిగా మాట్లాడి... సెల్ ఆఫ్ లో పెట్టాడు. ***** ******* ***** సమయం తెల్లవారుజామున 4 . 30 నిమిషాలు... ఎంకటలచ్చిమి తన పని పూర్తి కానందుకు నిరాశతో నిస్పృహతో... లేదు..! తను అనుకున్న మెడిసన్ దొరకకపోయినా తను వచ్చిన పని పూర్తిగా పూర్తయినది... అన్న భావనలో వెను తిరిగినట్టు... నడు స్తుంది. వర్షం పూర్తిగా తగ్గింది. అయినా ఆమె గొడుగు ముడచలేదు. తను తన ఇంటికి వెళ్లేసరికి ఇంచుమించుగా తెల్లవారవచ్చు. చాలు ఇక తను అనుకున్న పని ఈరోజుకు పూర్తయినట్లే..... చుట్టూపరికించి చూసింది...ఆ ముసుగు మనిషి లాంటివ్యక్తి ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు తన నడకలో వేగం కొంచెం పెంచింది. నడిచింది నడిచింది.. ఇంచుమించు నగరం చివరకు వచ్చేసింది. కొంచెం దూరంగా ఆ కనిపించే బడ్డీకొట్టు దానిని ఆనుకొని పెద్ద రాళ్ల గుట్టలు.. అవి దాటేక రెండు మూడు చిన్న పూరి గుడిసెలు.. అవి దాటాకా... ఆ కనబడే అతి చిన్ని పూరి గుడిసే ఎంకటలచ్చిమిది. అది ఓ పక్కకుఒరిగిపోయింది...దాన్ని...సమీ పించింది ఆమె. తాటాకు తలుపు...నెమ్మదిగా తోయబోయింది... " ఆగు" వెనుకనుండి గట్టిగా అరిచాడు ఆ ముసుగుమనిషి లాంటి వ్యక్తి ముందుకు వచ్చి........భయపడింది ఎంకటలచ్చిమి..... " ఎవరు నువ్వు... అర్ధరాత్రి నుండి ఇప్పటివరకు ఎందుకు సిటీ అంతా తిరిగావు. నీ వెనుక ఎవరున్నారు? నీ చర్యలు ఏమిటి? ఇతర దేశాలతో సంబంధాలు ఉన్న వ్యక్తిగా నువ్వు కనిపిస్తున్నావు ..పైగా అమాయకంగా అడుక్కుతినే దానిలా నటిస్తున్నావు... నీ గురించి నా నిద్ర అంతా పాడైంది.. వర్షం లో తడిసి ముద్దయ్యాను. నేను సాధారణంగా నిన్ను వదిలిపెట్టను.. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి.. వాళ్లకు నిన్ను సరెండర్ చేస్తాను... నిజంగా చెప్పు ఎవరు నువ్వు నీ చర్యలు ఏమిటి? పాకలో లోపల ఏమున్నాయి... మారణాయుధాలా?.. మాదకద్రవ్యాలా... విదేశీ ద్రోహులా.... అసాంఘిక కార్యకలాపాలా.... లేక బాంబులు తయారుచేస్తున్నారా???? చెప్పు చెప్పు" గద్దించాడు ముసుగు మనిషి లా కనబడే విలేఖరి విశ్వం. "అయ్యా... పేపరోళ్ళు మీరు నాకు ముందే తెలుసు... మీ ఉజోగం మీది... నా నరకయాతన నాది." అంటూ తలుపు తోసింది ఎంకటలచ్చిమి నేల మీద బట్టలులేకుండా పడున్నాడు ఆమె మొగుడు కోటితిప్పడు. " నా మొగుడు తాగి వత్తే నాకు యమ లోకం కనపడతాది బాబు. పిచ్చి యదవ.. నన్ను నా బట్టలు ఇప్పమంటాడు..తప్పులేదు బాబు.. పెల్లాన్ని కదా... కానీ ఆడు పిచ్చిపిచ్చి పనులన్నీ సేత్తాడు బాబు...అశుద్ధం పట్టు కొచ్చిo ఒల్లంతా.... రాశి ఏడిపిస్తాడు. మీరైతే తట్టుకోగలరా...." ఆమె బోరున ఏడుస్తుంది. "నన్ను రోడ్డు మీద నిలబడి బట్టలు లేకుండా డాన్స్ కట్టమంటాడు.... మీరు సేయ గలరా...?" ఆమె చాలా గట్టిగా రోదిస్తోంది. " తనకు సేతికి దొరికిన వస్తువుతో... నన్ను సితకబాదుతాడు... ఈగో గాయాలు.. మీరు తట్టుకోగలరా..బండబూతులు తిడ తాడు ....గోర్లతో రక్కుతాడు." ఈసారి ఆమె ఏడవడం లేదు. దబదబా రెండు చేతులతో నెత్తి బాదు కుంటుంది. " ఆ యమలోకపు నరకం భరించలేక.... అంత కన్నా ...రోడ్డుమీద... పోలీసుల బారి నుండి తప్పించు కోవడం కోసం ఏదో వంక పెట్టుకొని రాత్రంతా తిరిగితిరిగి రావడమే... నాకు సుఖం అనిపించింది.ఒకచోట కూర్చుంటే ఎందుకు కూర్చున్నావు అని పోలీసులు వేధిస్తారు.... ఇంటికి వెళ్లి పొమ్మని కేకలు పెడతాడు. అందుకనే ఎక్కడా దొరకని మందులు వంక పెట్టుకుని రాత్రంతా తిరుగు తున్నాను. తెల్లవారులు తెరిచి ఉండేవి మందుల సాపులే కదా. ఎంత వరద వచ్చినా, తుఫాను వచ్చిన..నా మొగుడు... పెట్టే కట్టం ముందు....ఇలా తిరగడం నాకు పెద్ద బాధ అనిపించదు. ఇలా తిరగడమే నాకు అంతకన్నా సుఖంగా ఉంది" ఆమె ఇంకా చెప్తుంది వినలేక చెవులు మూసు కున్నాడు విలేఖరి విశ్వం...అతని శరీరచలనం ఆగిపోయింది.అంతవరకూ తను తీసిన ఆమె ఫొటోస్ సెల్ నుండి డిలీట్ చేశాడు. ఆమె వాయిస్ రికార్డింగ్ కూడా.... తీసి పడేసాడు. జేబులో చెయ్యిపెట్టాడు.... ప్లాస్టిక్ కవర్లో ఉన్న కొన్ని రూపాయి నోట్లు తీశాడు...దోసిలిలో పట్టుకొని ఆమెకు ఇవ్వబోయాడు.... ఆ నోట్ల మీద రెండువెచ్చటి కన్నీటిబొట్లు రాలి పడ్డాయి... అవి ..'తన కన్నీటి బొట్లు..'అని కూడా విశ్వం తెలుసుకోలేక పోతున్నాడు. " సరే.... నిన్ను ఇప్పుడు నీ మొగుడు ఎవడి దగ్గర కి వెళ్లి పడుకొని వచ్చావు అని అడిగితే ఏం చెప్తావ్?"... ఆమెను బాధపెట్టాలని కాకుండా అడిగాడు విశ్వం. "ఆడు ఎదవే కానీ ఎర్రి ఎదవ కాదు బాబు. తెలివస్తే....ఆడు సానా మంచోడు బాబు. ఈ ఎదవ.. ఒక్క నిమిసం నేను నేకుండా బతక నేడు .... ఆడు సచ్చేదాక.. నేను బతికుండాలి. నా మొగుడు సానా మంచోడు .... " ఎంకటలచ్చిమి గట్టిగా ఏడుస్తూ ఇంకా ఏదో చెప్పబోతోంది..... ఇంతలో విలేఖరి విశ్వం సెల్ ఫోన్ రింగ్ అయింది " విశ్వం...ఎనీ ఇన్ఫర్మేషన్...." ఎస్సై శ్రీధర్ కంఠం. " సార్... ఎంకటలచ్చిమి సానా మంచిది ." విశ్వం సెల్ ఆఫ్ చేశాడు. ***** ****** *******

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు