దైవం మానుష రూపేణ - శింగరాజు శ్రీనివాసరావు

Daivam manusha rupena

" సామీ ఇంద పూలు, ఆ సామి పాదాల కాడ బెట్టు" అని తెచ్చి పళ్ళెంలో పెట్టింది పున్నమ్మ. " నువ్వు చాలా పుణ్యాత్మురాలివి తల్లీ. నీకొచ్చిన దానిలోనే కొంత పెట్టి కొని ఆ దేవుడి పాదాలను పువ్వులతో సేవిస్తున్నావు" " ఆయనకు నేనిచ్చేదేముంది సామీ. ఆయన ఇచ్చిందే ఆయనకు ఇస్తున్నా. ఆ తండ్రి గుడి ముంగల గుడ్డపరుసుకున్నదాన్ని. ఆయన ఋణాన బతుకున్నదాన్ని. నేనాయనకు ఇచ్చేదికాదు సామీ. ఆయనే నాకీ బతుకిచ్చాడు. ఆయన పాదాల కాడ పడుండమని చెప్పాడు" దేవుడికి నమస్కరిస్తూ చెప్పింది. మధ్యాహ్నం దేవుడికి నైవేద్యం పెట్టేముందు పూజారికి, బిచ్చగత్తె పున్నమ్మకు మధ్య జరిగే సంభాషణ ఇది. ఆమె మాటలలో ఎంతో లోతైన భావన కనిపిస్తుంది పూజారి సాయికి. ఏ ప్రవచనకారుడి నోట వినని మాటలు ఆమె అమాయకంగా పలికే పలుకులలో వినిపిస్తాయి సాయికి. అందులో సాయికి నచ్చే మాట. "మనమెవరము సామీ ఆ భగమంతునికి ఇయ్యడానికి. ఈ బతుకు, ఈ పైసలు, ఈ బువ్వ అంతా ఆయనిచ్చినదే కదా. ఆయనిచ్చినదే ఆయనకిత్తున్నాం. మనం కొత్తగా ఇచ్చేదేంది. బతికినంత కాలం ఆయన్ను మనసులో ఉంచుకోగలిగితే సాలు ఈ జన్మలకి". ఎంతో పరిణతి చెందితే తప్ప ఆ భావన ఎవరికీ రాదు. ఆమె మాటలలో నిజాయితీ అతనికి నచ్చుతుంది. ఆమె భక్తి నచ్చుతుంది. చూడడానికి మంచి కుటుంబం నుంచి వచ్చినామెలాగే ఉంటుంది. ఆమె యాసగా మాట్లాడుతున్నా, అది ఆమె కావాలని అలా మాట్లాడుతుందేమో అనిపిస్తుంది సాయికి. రాములవారి గుడిలో పూజారి సాయి. వయసు సుమారు నలభై సంవత్సరాలు ఉంటాయి. పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు దేవాలయంలో. అతను వచ్చిన సంవత్సరం తరువాత కాబోలు ఒకరోజు పున్నమ్మ అక్కడికి వచ్చి సాయి అనుమతితో ఆ గుడి ముందు బిచ్చగత్తెగా మారింది. అంతకుముందు అక్కడ వుండే ముసలమ్మ కాలం చేయడంతో, అక్కడ వుండే మిగిలిన బిక్షగాళ్ళు కూడ అభ్యంతరం చెప్పలేదు ఆమెకు. ఆమెకు ఒక కన్ను పువ్వు పూసినట్లుగా ఉంటుంది. ఆమె ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. తగాదాలు పెట్టుకోదు. అంతకుముందున్న ముసలమ్మ నోటిదురుసు మనిషి. ఎవరితో ఒకరితో రోజూ గొడవ పెట్టుకునేది. అది ఆలయానికి వచ్చేవారికి, పూజారులకు కూడ ఇబ్బందిగా అనిపించేది. ఇక తోటి బిచ్చగాళ్ళకు సరేసరి. ఆమె స్థానంలో పున్నమ్మ వచ్చిన తరువాత ఎంతో ప్రశాంతంగా ఉంది వాళ్ళకు. అంతేకాకుండా తనతోటి బిచ్చగాళ్ళకు ఏరోజైనా తిండికి సరిపడ డబ్బులు రాకపోతే తన సొమ్ములోనుంచి కొంత వారికి ఇచ్చేది. ఆమెకంటూ ఇల్లు లేదు. పగలంతా గుడిలోనే ఉండేది. అందరితోపాటు తనకు పుజారి పెట్టిన ప్రసాదంతో కడుపు నింపుకునేది. 'అదెలా సరిపోతుంది నీకు' అని అడిగితే 'బ్రతకడానికి ఆ మెతుకులు చాలవా' అనేది. ఆమె మాటలలో వేదాంతధోరణి అధికంగా ఉండేది. ఆమె పరిస్థితి గమనించిన సాయి, ఆమెకు తనకు తెలిసిన ఆశ్రమంలో తలదాచుకోను చోటు ఇప్పించాడు. అప్పటినుంచి ఆమె రాత్రివేళల అక్కడే ఉండేది. మితాహారమే ఆమె ఆరోగ్య రహస్యమేమో మరి. ఎప్పుడూ నలతపడగా చూడలేదు ఎవరు. ప్రతిరోజూ మధ్యాహ్నమయేసరికి నాలుగు మూరలు పూలు తెచ్చి సాయికిచ్చి దేవుడి పాదాల వద్ద పెట్టమని, ఆయనిచ్చిన ప్రసాదం పట్టుకెళ్ళి తిని, ఆ దేవాలయం నీడలోనే విశ్రాంతి తీసుకునేది. ఆమె అంటే ఏదో తెలియని అభిమానం పెరిగింది సాయికి. ఒకవేళ తనకు తల్లి ఉండి వుంటే ఆమె ఇదే వయసులో ఉండి ఉండేది అనుకునేవాడు. ********* " ఏం పంతులువయ్యా నువ్వు. తీర్థమివ్వడం, శఠగోపం పెట్టడం తప్ప, సంపాదించుకోవడమే చేతకాదు. పళ్ళెంలో వేసిన డబ్బులు ఎవడైనా ధర్మకర్తలకు లెక్కచెబుతారా. దొరికింది చాలని జేబులో వేసుకోక. అలా చేయకపోతే వీళ్ళిచ్చే అత్తెసరు అయిదువేలతో ఎలా నెట్టుకొస్తావు కాపురాన్ని" అని తోటి పూజారులు దెప్పి పొడిచేవారు. " నాకు దేవుడిచ్చినది చాలు. నాకేమైనా పిల్లాజెల్లా. దానికి నేను, నాకు అది అంతేగా. ఏనాడు ఏ పాపం చేశామో, ఈ జన్మలో సంతానయోగం లేకుండా పోయింది. మరల ఈజన్మలోను పాపం చేయడం దేనికి" అని చెప్పేవాడు సాయి. " రోజులన్నీ ఇలాగే ఉంటాయా చెప్పండి. ఏ రోగమో, రొప్పో వస్తే నాలుగు రూకలు ఉండాలగదయ్యా చేతిలో. మరీ అంత మడికట్టుకుంటే బ్రతకడం చాలా కష్టం" అని సలహాలిచ్చేవారు. " అన్నింటికీ ఆ రామచంద్రుడే ఉన్నాడు. ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఆయనకొచ్చిన కష్టాలకంటే పెద్ద కష్టాలు మనకు రావుగా. ఏదయినా ఆయనదే భారం. ఆయన సేవచేస్తూ అవినీతి పనులు నేను చేయలేను. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. అయినా మన పిచ్చి కాకపోతే గుడి బయట బిచ్చమెత్తుకునే వారికి, మనకు తేడా ఏముందయ్యా. వారు ఆలయం బయట, మనం లోపల అంతేతేడా. అందరమూ బిచ్చగాళ్ళమే. ఆయన నీడలో బ్రతికేవారిమే. ఆయన ఇచ్చిన జీవితమిది. ఆయనకే అంకితం. అంతే తప్ప. నేనుగా ధర్మం తప్పను" అని ఖరాఖండిగా చెప్పేవాడు. ఇతనికి చెప్పినా ఒకటే, ఆ గోడకు చెప్పినా ఒకటే యని వెళ్ళిపోయేవారు వాళ్ళు. ఏ దిక్కూలేని వారికి దేవుడే దిక్కు అని బ్రతుకును సాగించేవారిలో ప్రథముడని చెప్పవచ్చు పూజారి సాయిని. అటువంటి సాయిని భగవంతుడు పరీక్షించదలచాడేమో ఒకనాటి అర్థరాత్రి ఛాతి పట్టినట్టుగా అనిపించింది. అతడిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. అది గుండెపోటని, రక్తనాళాలలో బ్లాకులు ఏర్పడ్డాయని, వెంటనే ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. చేతిలో వున్న ఆరోగ్యశ్రీ కార్డును ఉపయోగించుకోవడానికి ఆ ఊరిలో వున్న ఏ ఆసుపత్రి ముందుకురాలేదు. ఆలయ ధర్మకర్తల మండలి వారు వాళ్ళకు తెలిసిన డాక్టరు ద్వారా ప్రయత్నించి ఆపరేషనుకు లక్ష రూపాయలు చెల్లించడానికి ఒప్పించారు. " చూడమ్మా. మీరొక లక్ష రూపాయలు మీ బంధువుల ద్వారా సమీకరించుకుని ఆసుపత్రిలో కట్టండి. ఆయనకు పూర్తిగా నయమయేటంత వరకు అయన మందులకు, మీ భోజనానికి తగిన ఆర్థికసహాయం మేము చేస్తాము. ఆపరేషను ఖర్చు మీరు భరిస్తే చాలు. ఇక మీరు ఆ ప్రయత్నంలో ఉండండి. నాలుగురోజులలో ఆపరేషను చేస్తారు " అని చెప్పి వెళ్ళిపోయాడు ఒక ధర్మకర్త, సాయి భార్య సునందకు. సునంద కుప్పలా కూలబడిపోయింది. లక్ష రూపాయలంటే మాటలా. ఎవరిని అడగాలి. ఎక్కడ తేవాలి. తమ బంధువులంతా అంతంత మాత్రపు వాళ్ళే. కనీసం పదివేలు కూడ సర్దగలిగే స్తోమతు లేని వారే. పోనీ ఆలయానికి వెళ్ళి అక్కడికి రోజూ వచ్చేవారికి విషయం చెప్పి సహాయమడిగినా, ఇస్తారో, ఇవ్వరో. ఏంచెయ్యాలో పాలుపోవడం లేదు. అయినా ప్రయత్నిస్తే తప్పేముందని, బంధువులందరికీ ఫోను చేయాలని, తెలిసిన వారిని సహాయమడగాలని నిర్ణయించుకుంది సునంద. ****** ఆపరేషను చేసే రోజు వచ్చింది. ఎంత ప్రయత్నించినా పట్టుమని ఇరవై వేలు కూడ వసూలు చేయలేకపోయింది సునంద. వాళ్ళ నాన్న గారు కూడ అక్కడ ఇక్కడ దేబిరిస్తే ఒక పదివేలు తేగలిగాడు. తండ్రి తెచ్చిన సొమ్ముతో కలిపి ముప్ఫై వేలు తీసుకుని డాక్టరు దగ్గరికి వెళ్ళింది, తన అసహాయతను తెలియజేసి, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎలాగోలా ఆపరేషనుకు ప్రయత్నించమని చెబుదామని. " ఏవండీ. డాక్టరు గారిని కలవాలి. కొంచెం అనుమతి ఇప్పిస్తారా" కౌంటరు దగ్గరికి వెళ్ళి అడిగింది. " దేనికమ్మా" అడిగాడతను. " మావారు పూజారి సాయి. ఆయనకు ఈ రోజు గుండె ఆపరేషను అన్నారు. దానికిగాను లక్ష రూపాయలు చెల్లించమని చెప్పారు. కానీ నా దగ్గర ముప్ఫైవేలు మాత్రమే ఉన్నాయి. అవి డాక్టరు గారికిచ్చి, ఆయన పాదాలు పట్టుకుని ఎలాగైనా ఆపరేషన్ చెయ్యమని వేడుకుందామని" చెప్పింది సునంద. " అదేమిటమ్మా, మీకు తెలియదా. ఆపరేషనుకు అవసరమయిన లక్ష రూపాయలు రాత్రే వచ్చి కట్టిపోయారు. మీ వారి ఆపరేషనుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో గంటలో ఆపరేషను మొదలవుతుంది. మీరు నిశ్చింతగా ఉండండి" అని చెప్పాడతను. " ఎవరు కట్టారు " ఆశ్చర్యంగా అడిగింది సునంద. " ధర్మకర్తల మండలి వారే అనుకుంటాను" అన్నాడతను. ఆ రాముల వారే పంపారేమో వారి మనసును మార్చి అని ఆ భగవంతుడిని స్మరిస్తూ వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు తండ్రీకూతుళ్ళు. ******** రెండు నెలలకల్లా మామూలు మనిషయ్యాడు సాయి. ఆరోగ్యం కుదుటపడిన తరువాత ఒక్కక్షణం ఇంట్లో కాలు నిలువలేదు అతనికి. ఆసుపత్రిలో ఉన్నప్పుడే వచ్చి చూసివెళ్ళారు ధర్మకర్తల మండలి వాళ్ళు. ఆలయం ముందు బిచ్చగత్తె పున్నమ్మ రోజూ వచ్చి స్వామి వారి పాదాల వద్ద కుంకుమ, ఆంజనేయస్వామి వారి సింధూరాన్ని తెచ్చి సామికి పెట్టమని సునందకు ఇచ్చి సాయిని చూచి వెళ్ళేది. ఆస్తులు లేకపోయినా, అందరి అభిమానాన్ని పొందిన సాయికి వారి పలకరింపే రామయ్య దీవెనగా అనిపించేది. వారి ఆశీస్సులు, ధర్మకర్తల విశాలహృదయమే తనకు పునర్జన్మనిచ్చిందని అనుకునేవాడు. దీనికంతటికీ కారణం ఆ రామయ్య చల్లనిచూపేనని సంతోషపడేవాడు. ఎప్పుడెప్పుడు రాముని సేవకు పోదామా అనే తొందరను ఆపుకోలేక ఆలయానికి వస్తానని ధర్మకర్తకు ఫోను చేశాడు. అతను అంగీకరించి రేపు ఒకటవ తేదినుంచి రమ్మని చెప్పాడు. ఆనందంతో మనసు గంతులువేసింది సాయికి. ******** తిరిగి ఆరోగ్యవంతుడై వచ్చిన సాయిని సాదరంగా ఆహ్వానించి గుడి బాధ్యతలు తిరిగి అప్పగించాడు, అప్పటిదాకా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తున్న హనుమంతుని గుడిలో పూజారి. అంతలో సాయిని పలకరిద్దామని వచ్చారు ధర్మకర్త మండలి వారు. " అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. మీ సహాయసహకారాలు లేకుంటే నేను ఈరోజు ఈ రామయ్య చెంత ఉండగలిగేవాడిని కాదు. లక్ష రూపాయలు ఇచ్చి, మందులకు, ఇప్పటిదాకా మా కాపురానికి కావలసిన భోజనాది ఖర్చులు ఇచ్చి మా జీవితాలను నిలబెట్టారు. నేను మీకు జీవితాంతం ఋణపడివుంటాను. "ఈ పూజారి పోతే మరో పూజారి వస్తాడులే" అని వదిలేయకుండా, నాకు పునర్జన్మనిచ్చిన దేవతలు మీరు. ఆ రాముడే మీ మనసులో చేరి నాకు మరల బ్రతికే అవకాశాన్ని ఇప్పించాడు. ఇక నేను బ్రతికినంతకాలం ఈ దేవాలయాన్ని విడిచిపెట్టను" అని కృతజ్ఞత నిండిన మనసుతో వారికి నమస్కరించాడు సాయి. " మాదేమున్నది పంతులు గారు ఇందులో. అంతా ఆ శ్రీరామచంద్రుని దయ. ధర్మకర్తలుగా మా ధర్మాన్ని మేము నిర్వర్తించాము. కానీ మీకు ఆర్థికసాయం చేసి, మీరు కట్టవలసిన లక్ష రూపాయలను తను చెల్లించి, మిమ్మల్ని ఈ కష్టంనుంచి గట్టెక్కించినది, అదిగో ఆ పున్నమ్మ. ఈ గుడిలోని రామయ్యను నమ్ముకుని ఆలయం ముందు బిచ్చమెత్తుకునే ఆ పున్నమ్మే, మీరే ఆ రామయ్య ప్రతిరూపమని నమ్మి మిమ్ముల కాపాడాలనుకుని తపనబడింది. మీరు కట్టవలసిన లక్ష రూపాయలను మేమే గుడికి వచ్చే వారి దగ్గర నుంచి చందారూపంలో వసూలు చేయాలనుకుని ఆలోచిస్తుంటే, తనే మా దగ్గరకు వచ్చింది. తను యాచన ద్వారా సంపాదించిన సొమ్మును తన గదిలోని పెట్టెలో దాచుకుంటూ వచ్చిందట. మీరేనటగా ఆమె తలదాచుకోను, ఆ ఆశ్రమంలో గది ఇప్పించింది. ఆ కృతజ్ఞతతో తన వద్దనున్న సొమ్మును మూటగట్టి తెచ్చి మాకిచ్చింది. అంతా లెక్కవేస్తే తొంభైవేలు తేలింది. దానికి మేము పదివేలు జోడించి, లక్షరూపాయలను ఆసుపత్రిలో కట్టివచ్చాము. ఆమె దొడ్డ మనసు మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచింది. ఏ ఊరో, ఏ తల్లి కన్నబిడ్డో, మన ఆలయానికి వచ్చి చేరింది. ఈరోజు మీరు మరల మా మధ్య తిరుగుతున్నారంటే కారణం ఆమే. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పవద్దన్నది. కానీ నిజం చెప్పకపోతే ఆ రామయ్య మమ్మల్ని నిలదీస్తాడేమోనని భయపడి చెబుతున్నాము పూజారిగారు. మీకు ఆ రామయ్య రూపంలో వచ్చి ప్రాణభిక్ష పెట్టినది ఆ పున్నమ్మే " అని అసలు విషయాన్ని చెప్పాడు ప్రధాన ధర్మకర్త. ఆ మాటలు విన్న సాయి మనసు చలించిపోయింది. ధర్మకర్తలకు నమస్కరించి, వారి పేరున అర్చన చేసి, తీర్థమిచ్చి వారిని పంపివేశాడు. పూజకూడ పరధ్యానంగానే చేశాడు. వెంటనే వెళ్ళి పున్నమ్మకు సాగిలబడాలని మనసు తొందరపెట్టసాగింది. అంతలో పున్నమ్మ పూలు తీసుకుని లోపలికి రానే వచ్చింది. ఆమెను చూస్తూనే అతని కన్నులు అశృపూరితాలయినాయి. పూలు చేతిలోకి తీసుకుని పళ్ళెంలో పెట్టి, ఆమెకు చేతులు జోడించాడు. అతని బుగ్గల మీదుగా కన్నీరు జాలువారుతున్నాయి. " అమ్మా నేను మీకు ఏమవుతానని నాకోసం ఇంత త్యాగం చేశారు. మీరు సంపాదించుకున్న సొమ్మంతా నాకోసం వెచ్చించారు. ఎంత మంచి మనసమ్మా మీది. మీ ఋణం ఎలా తీర్చుకోను. ఏ బంధమూ లేని నన్ను ఆదుకున్న మీ దాతృత్వాన్ని ఎలా కొలువగలనమ్మా" సాయి మనసు ఆర్ద్రమయింది. " అంతమాటనకండి సామీ. మీరు మాకు ఆ రామయ్యతో సమానం. మీకు నేను చేసిన సాయం, ఆ రామయ్యకు వారధి కట్టడంలో ఉడత చేసిన సాయం లాంటిదేనయ్యా. కడుపునబుట్టిన వాళ్ళు నా ఇల్లు, వాకిలి లాగేసుకుని నన్ను వీధిలోకి నెడితే, ఊరుగాని ఊరొచ్చిన నాకు ప్రతిరోజు ప్రసాదమెట్టి కడుపునింపి, తలదాచుకోను గది చూపించి, నా బిడ్డలాగ నను చేరదీశావయ్యా. నీ అంతటి దేవుడిలాంటి మనిషికి ఆపద వస్తే, అక్కరకురాని సొమ్ము దేనికయ్యా. అందుకే నా దగ్గరవున్న సొమ్మంతా ఇచ్చేసినా. నాబిడ్డలాంటోడివయ్యా. ఆ రామయ్య తండ్రి నిను చల్లగ చూడాల." చేతులెత్తి రామయ్యను వేడుకుంది పున్నమ్మ. " ఆ రామచంద్రుడే నాకోసం నిన్ను పంపాడమ్మా. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న నాకు నిన్ను పంపి నాకు తల్లిలేని లోటు తీర్చాడు. అమ్మా, నీ బిడ్డలు నిన్ను కాదన్నా, నీకు నేనున్నానమ్మా. నీవు ఎవరివైనా ఇకనుంచి నా తల్లివి. మీ మాట తీరు చూస్తే, బాగా బతికిన దానిలానే ఉన్నారు. అయినా మీ గతంతో నాకు పనిలేదు. నా ప్రాణాన్ని కాపాడిన మీ ఋణం నన్ను తీర్చుకోనివ్వండి. ఇకనుంచి మా ఇంట్లోనే ఒక గది మీకు ఇస్తాను. మాతో పాటే తిని, మాతో పాటే ఉండండి" అంటూ పున్నమ్మ చేతులు పట్టుకుని కళ్ళకు అద్దుకున్నాడు. " నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలయ్యా. నాకు ఈ గుడి ముందు కూర్చుని రామయ్యను చూస్తూ, భక్తులు వేసిన కాసులతో, తమరు పెట్టే ప్రసాదంతో బ్రతకడమే సంతోషాన్నిస్తున్నది. శబరిలాగా ఆ రాముడి దర్శనం కోసం, ఆయన పిలుపు కోసం ఎదురుచూడడంలోనే నాకు తృప్తి సామీ. నేను చేసింది సాయం కాదు సామి, మనిషికి, మనిషి చేయవలసిన కనీస ధర్మం. అంతే. పదిమంది చేసిన దానం ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడింది. అది చాలు. మనమందరం ఋణపడింది ఆ రామయ్య తండ్రికి. అంతే" అంటూ ప్రసాదం వేయించుకోను పళ్ళెం తెచ్చుకుంటానని చెప్పి వెళ్ళింది పున్నమ్మ. ఆమె వెళ్ళిన వైపే తదేకంగా చూస్తున్నాడు సాయి. 'ఎదుటి మనిషికి సాయం చేయడానికి కావలసినది చేతినిండా డబ్బు కాదు, సాయం చేయగలిగే మనసు' అని చెప్పడం ఇన్నాళ్ళూ విన్నాడు. కానీ మొదటిసారి ప్రత్యక్షంగా చూస్తున్నాడు. " అమ్మా. నీకు నేనే కొడుకును. నువ్వు కాదన్నా సరే నీ బాధ్యత నాదే. నీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఈ బిడ్డ నీకు తోడుగా నిలుస్తాడు. ఇది నేను పాదాలంటి సేవించే ఈ రామచంద్రమూర్తి మీద ఆన" అని మనసులో అనుకున్నాడు సాయి. దైవ ప్రేరణ చిత్రమైనది. ఎవరిని, ఎప్పుడు, ఎందుకు కలుపుతుందో తెలియదు. అందుకే దేవుడంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని గుండెనిండా నింపుకుని, ఆ రాతిబొమ్మను కొలిస్తే, ఆ రాయే కరిగి నవనీతమై మన గాయాలను మాన్పుతుంది. ఆ నమ్మకమే పూజారి సాయికి పునర్జన్మను ఇచ్చింది. దిక్కులేదనుకున్న పున్నమ్మకు, సాయిని దిక్కుగా చూపింది. అందుకేనేమో 'దైవం మానుష రూపేణ' అంటారు పెద్దలు. ****** అయిపోయింది ********

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు