సీతమ్మ లోగిలి - Dr.P.K.Jayalakshmi

Seetamma logili
టిఫిన్ తింటున్నవిక్రమ్ భార్యని కేకేసి “రాణీ! అమ్మ గది నీట్ గా సర్దారా లేదా?పూజ సామగ్రి అంతా అందుబాటు లో ఉంచారా? కిటికీ లకి, గుమ్మానికీ లైట్ కలర్ కర్టెన్స్ వెయ్యండి, ముదురు రంగులు అమ్మకి నచ్చవు. తెల్సు కదా?”అని ఆదేశం జారీ చేశాడు.
“ఓ ఎప్పుడో రెడీ. కంగారుపడకండి సార్ . అన్నీ అత్తయ్యకి నచ్చినట్టే చేశాము.” రాణీ మాటలకి శృతి కలుపుతూ “అత్తయ్యగారు ఇల్లు చూసి చాలా సరదా పడతారు, నేను గ్యారంటీ ఇస్తున్నా బావగారూ” అంది మరదలు గీత నవ్వేస్తూ.
ఉమ్మడికుటుంబ వ్యవస్థకి విలువిచ్చే గరుడాచలం, సీతమ్మ గారి పిల్లలు విక్రమ్,రాజీవ్,అనిల్. ముగ్గురన్నదమ్ములు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ పెళ్లిళ్ల య్యి పిల్లలతో హాయిగా అంతా కలిసి ఉంటున్నారు. తండ్రి గరుడాచలం తన చివరి రోజుల్లో ఆస్తులు సమానంగా పంచుతూ, పిత్రార్జితమైన ఇల్లు కూడా వాళ్ళపేర వ్రాస్తూ“ నాయనా! ఇది మీ తాత గారి హయాం నించి వస్తున్న ఇల్లు. ఈ ఇల్లంటే మీ అమ్మకి అమితమైన ఇష్టమని మీ అందరికీ బాగా తెలుసు. అదృష్టవశాత్తు మీకు ఈ ఊళ్లోనే ఉద్యోగాలు కాబట్టి అంతా కలిసి ఇక్కడే ఉండండి. అమ్మ ఉన్న౦తకాలం ఈ ఇంటిని మాత్రం అమ్మకండిరా. తర్వాత మీ ఇష్టం” అని చెప్పడం వాళ్ళకి బాగా గుర్తే.
విక్రమ్ ఆడిటర్ గాను, రాజీవ్ ఇంజనీర్ గాను అనిల్ బ్యాంక్ ఆఫీసర్ గాను పనిచేస్తూ, క్వార్టర్స్ లో ఉండే సౌకర్యం ఉన్నా పాత ఇంటినే కాస్త బాగు చేయించుకొని తల్లి దండ్రుల కోర్కె మేరకు అంతా కలిసి ఉంటున్నారు. కోడళ్ళు కూడాబుద్ధిమంతులు కావడం, అత్తగారిని అమ్మలా ఆదరిస్తూ అరమరికల్లే కుండా స్వంత అక్క చెల్లెళ్ల ల్లా కలివిడిగా ఉండడం ఇంకో ప్లస్ పాయింటు. రెండోకొడుకు రాజీవ్ కి అనుకోకుండా ఆస్ట్రేలియా లో మంచి ఉద్యోగం రావడంతో భార్య,కూతురు తో వెళ్తూ తల్లి ని కూడా తనతో తీసుకు వెళ్ళాడు. వెళ్ళిన రెణ్ణేల్లకి సీతమ్మ ప్రమాదవశాత్తూ బాత్రూమ్ లో జారి పడిపోవడంతో ఆమె కాలి ఎముక విరిగింది. పెద్దతనం కావడంతో అతకడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. రాజీవ్ అతని భార్య దేవి ఆమెకి సపర్యలు చేసి జాగ్రత్త గా చూసుకున్నారు. కాస్త కోలుకున్నాక సీతమ్మ కి సొంత ఇంటి మీద గాలి మళ్ళ టంతో రాజీవ్ ఆమెని దింపడానికి ఇండియా వస్తున్నాడు.
విక్రమ్, అనిల్ తల్లిని , తమ్ముడిని రిసీవ్ చేస్కోడానికి ఏర్ పోర్ట్ కి వెళ్లారు. ఇంటి ముందు కార్ ఆపగానే రాణీ,గీత పరుగున వచ్చి సీతమ్మ చేయి పట్టుకొని దించారు.ఆమె అనుమానం గా ఇంటి వైపు చూస్తూ “ ఇదేంటి? ఇక్కడకెందుకు వచ్చాం? ఇదెవరిల్లు? మనింటికి వెళ్దాం. పదరా విక్కీ”అంది చిన్నపిల్లలా.
విక్రమ్ ప్రేమగా తల్లిని బుజ్జగిస్తూ “ అమ్మా,ఇదిమనిల్లేనే! నీకుచక్కగాసౌకర్యంగాఉంటుంది. నీగదిచూద్దువుగానిరా” అంటూఆమెభుజంచుట్టూచేయివేసిలోపలికినడిపించాడు.
“ఒరేయ్ మీ అసాధ్యం కూలా! నన్న్తు పంపించి బంగారం లాటి ఇల్లు అమ్మేసారా?రాజీ నువ్వు చెప్పు , నీకు తెలిసే ఉంటుందిగా?” అరవడం మొదలెట్టింది. “ఇది మరీ బాగుంది. మధ్యలో నన్ను లాగుతావేంటే ?అప్పుడు నిన్ను తీస్కోని వెళ్ళిన వాణ్ని మళ్ళీ ఇదే కదా రావడం?నాకేం తెలుసు ఇక్కడేం జరుగుతుందో?” చల్లగా తప్పుకున్నాడు రాజీవ్.
అనిల్ కల్పించుకుంటూ “అమ్మా, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. ముందు కాఫీ,టిఫిన్ కానివ్వు. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది?”మాట మార్చే ప్రయత్నం చేశాడు. “ఆరోగ్యం లేదు, ఆవకాయా లేదు. మీ నాటకాలు చాలించి ఇల్లే౦ చేశారో చెప్పండి ముందు”కసిరేసింది సీతమ్మ.
“అమ్మా అనవసరంగా టెన్షన్ పడకే . ఇది మన ఇల్లేనే. ఆ మనుషులే, ఆ రోడ్డే, అంతా అదే వాతావరణమేనే బాబూ” సహనం గా చెప్పాడు విక్రమ్. “ఏరా,? కాస్త చూపు మందగించినంత మాత్రాన మీకు నేను గుడ్డిదాన్లా కన్పిస్తున్నానా?”అదే ఇల్లు అంటున్నావు? రెండేళ్ళు కాదు, రెండు శతాబ్దాలైనా నా ఇంటిని నేను మర్చిపోతానట్రా? ఏదిరా పెద్ద వరండా, నడవా?ఎక్కడ నా విశాలమైన పెరడు, పూల మొక్కలు, పారిజాతం, జామ, కొబ్బరి చెట్లు, తులసి కోట?” ఖంగుమంది ఆమె కంఠం.ఈలోగా మనవలు “హాయ్ నాన్నమ్మా!” అంటూ గోలగా వచ్చి ఆమెని చుట్టుముట్టారు. ఇదే ఛాన్స్ అని కోడళ్ళు “అత్తయ్యా ముందు కాఫీ తాగండి. మీకిష్టమని పెసరట్టు,ఉప్మా చేశాం తినండి” అంటూ మర్యాదలు చేయసాగారు.విక్రమ్ కూతురు హాసిని ‘’నానమ్మా, చూడు నీకోసం గులాబ్ జామ్ నేనే స్వయం గా చేశా. నమిలే పనే లేదు.నోట్లో వేస్కుంటే కరిగిపోతుంది. ఏది ఆ, ఆ నోరుతెరు.” అంటూ ప్రేమగా తిన్పించింది.
భోజనాల వేళయ్యింది. సీతమ్మ ఇంకా కోపం గానే ఉంది.”మీరంతా నిజం చెప్పే వరకు నేను ఒక్క మెతుకు కూడా ముట్టను.. ఇది మనిల్లు కాదు. కొత్తింటికి వచ్చామంటే పాతిల్లేమైనట్టు? నాకు తెలియాలి., తెలియాలి!” అంది పంతంపట్టినట్టు సీతయ్య లాగా. “ ‘’అమ్మా, ఈ ఇంట్లో నీకేం నచ్చలేదో చెప్పు.మన పాతింటికంటే వసతి గా ఉందా లేదా?అది చూడు ముందు.అనవసరంగా ఆందోళన పడుతున్నావ్!” అన్నాడు పవన్ నచ్చచెప్తూ. అమ్మా, అన్నం చల్ల గా అయిపోతోందే. అందరం ఆకలితో కూచున్నాం. ముందు భోజనాలు కానిస్తే అన్నీ వివరం గా మాట్లాడుకుందాం. నా తల్లి కదా. అన్నం తిను” అనునయంగా చెప్పాడు విక్రమ్. “నా కోసం మీరంతా కడుపు మాడ్చుకోవడం దేనికి? చెప్పానుగా నాకు ఆకలి లేదని. మీరెళ్లి తినండి.” అంది విసుగ్గా సీతమ్మ. చిన్న కోడలు గీత అత్త గారి దగ్గరకెళ్లి “ మీ కాలు బాగయ్యి, క్షేమంగా వస్తే చిలుకూరు వస్తామని అంతా మొక్కుకున్నాము. సాయంత్రం అంతా కలిసి గుడికి వెళ్ళి మొక్కు చెల్లించు కుందామా అత్తయ్యా?” అడిగింది ఆమె చేయి పట్టుకొని.సరదా పడిపోయింది ఆమె మాటలకి. “ నిజం గానా? అసలు నేను లేచి ఇలా తిరగ గలుగుతానని కల్లో కూడా అనుకోలేదే గీతా! అంతా వెంకటేశ్వరుల వారి దయ. దేవి, రాజీ ఎంత సేవ చేశారని?వెర్రి కన్న నా కోసం ఎంత డబ్బు కర్చు పెట్టాడో, ముసల్దాన్నని వదిలేయకుండా?మనం గుడికి వెళ్ళాల్సిందే. పదండి అన్నాలు తినేసి, కాసేపు నడుం వాల్చి బైలు దేరుదాం.” అంటూ లోపలికి నడిచింది. అంతా ప్రశంసాపూర్వకంగా గీత వైపు చూశారు.
అంతా సాయంత్రం గుడికి బైలు దేరుతుంటే హఠాత్తుగా సీతమ్మకి స్ఫురణకి వచ్చింది.గేటు తీస్తూ “అవున్రా!మన గేటు ఇలా ఉండదు. మనిల్లు ఏమైందో ఇప్పటికైనా చెప్పకపోతే నేనెవరితో మాట్లాడను, ఎక్కడికీ రాను” అని భీష్మించుకొని ఇంట్లోకి వచ్చి ముఖం మాడ్చుకొని కూచుంది..ఇంక తప్పదని కొడుకులు ఆమె పక్కన చేరి “ అమ్మా, మన ఇల్లు బాగా పాతబడిపోయిందే. వర్ష మొస్తే ఇల్లంతా ఒకటే కారడం. బాత్రూమ్ శ్లాబ్ అయితే నానిపోయి ఒక పక్కకి ఒరిగిపోయింది. ఇంటి గోడలు కూడా బీటలు వారిపోయాయి. అంతే కాదు ఇదివరకు లేదు గాని ఈ మధ్య ఎండాకాలం వస్తే నీళ్ళకి ఎద్దడి వచ్చేసింది మన ఏరియా లో. వేడి తట్టుకోలేక ఏ. సి పెట్టిద్దామంటే గోడలు మెత్తబడిపోయి అస్సలు అనువుగా లేవు తెల్సా అమ్మా? అనిల్ బ్యాంక్ క్వార్టర్స్ కి వెళ్దామన్నాడు కానీ మనందరికీ సరిపోదు. వేరు కాపురాలు పెట్టి నిన్ను బాధ పెట్టడం మాకిష్టం లేదు.” అంటూ ఆగాడు విక్రమ్. అనిల్ అందుకుంటూ “అందరం కలిసి ఉండాలంటే పెద్దిల్లు కావాలి. అద్దె ఇంటి కోసం వెతికినా లాభం లేకపోయింది. మాకు మాత్రం మనిల్లంటే ప్రేమ లేదా ఏంటి? కానీ ఎంత కాలం ఇబ్బందులు పడతాం? అవసరమేంటి అయినా?”అన్నాడు తల్లి కాలి మీద చేయి వేసి నిమురుతూ.
“అందుకే అన్ని ఆధునిక వసతులతో ఈ రెండంతస్తుల బిల్డింగ్ అమ్మకానికొస్తేధర కూడా అందుబాటు లోఉండేసరికి ఆ ఇల్లమ్మేసి ఇది కొన్నాం. కొత్తిల్లే ఇది, ఓనర్స్ కి వేరే దేశం లో ఉద్యోగం రావడంతో హడావిడి గా అమ్మకం పెట్టారు. మనకి తక్కువకి వచ్చినట్టే, మంచి సెంటర్ కూడా.”అప్పచెప్పినట్టు గబగబా చెప్పేశాడు విక్రమ్. మౌనం గా వింటున్న సీతమ్మ కళ్ల నించి ధారా పాతంగా కన్నీరు....! “ మీ నాన్నగారేం చెప్పారో గుర్తు లేదురా మీకు? మీ అమ్మ బతికినంత కాలం ఈ ఇంటిని అమ్మకండిరా అని చెప్పారా లేదా? రేపు నేనూ పాతబడిపోయి ఇంకా ముసలిదాన్నయిపోతే నన్నూ బైట పారేయండి రా పీడా పోతుంది” అని వెక్కిళ్లు పెట్టసాగింది.
ఎన్ని పండగలు,పబ్బాలు,శుభకార్యాలు జరిగాయిరా ఆ ఇంట్లో? ఒక్కసారి వంద విస్తళ్ళు లేఛేంత పెద్ద నడవా.నలభై రెండేళ్ల క్రితం ఆ ఇంటికి కొత్త కోడలిగా మెట్టాను. గుమ్మం దగ్గర ఆడపడుచులు మా పేర్లు చెప్పించి, మేలమాడి హారతి పట్టారు.అది ఎంత అపురూపమైన జ్ఞాపకమో మీకెలా తెలుస్తుందిరా? పెద్ద ఉయ్యాలబల్ల మీద మిమ్మల్ని కూచోబెట్టి కధలు చెప్తూ గోరుముద్దలు తినిపించేదాన్ని. సాయంత్రాలు మన దొడ్లో పూచిన జాజి పూలు అక్కడ కూచోనే మాల కట్టుకునేదాన్ని. కొంచెం పెద్దయ్యాక దాని మీదే మీరు హోమ్ వర్కులు చేసుకునే వారు. శుభ కార్యాలప్పుడు పది గడపలకీ పసుపు రాసి కుంకం బొట్లు పెట్టి అలంకరించేదాన్ని. ఆ ఇంట్లో ఎన్నెన్ని జ్ఞాపకాలు నా జీవితం తో ముడివడి ఉన్నాయో మీకేం తెల్సురా?నన్ను చాలా బాధ పెట్టారు మీ అంతా కలిసి.” అంది నిట్టూరుస్తూ.
***** ***** ***** ****** **** ******** **** *****
కొన్ని రోజులు గడిచాయి.సీతమ్మ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడ్డం లేదు. ఒంటరిగా కూచుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది…ఎంత పెద్ద ఇల్లు?ఎంత పెద్ద కుటుంబం?పొద్దున్న ఐదింటికి పొయ్యి వెలిగిస్తే రాత్రి పది వరకు వండుతూనే ఉండేవాళ్లు తాను,అత్తగారు,పనిమనుషులునూ!ఎప్పుడూ పదిమంది బంధువులతో నిండుగా ఉండే ఇల్లు.పురుళ్లూ,బారసాలలు,అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, పుట్టినరోజులు, ఉపనయనాలు,పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లల పుట్టుకలూ... ఎన్ని మధురమైన జ్ఞాపకాలు ఆ ఇంట్లో?
చలికాలం లో తమ ఇంటి వరండాలో నులివెచ్చని సూర్యరశ్మి గుర్తొచ్చేది. ఇంత మంచి వాతావరణం ఎక్కడ దొరుకుతుందోయ్ అంటూ అక్కడ కుర్చీ వేసుకొని తనందించే కాఫీ తాగుతూ పేపర్ లో వార్తలు వినిపించే భర్త గుర్తొచ్చి.... ఇక్కడ ఎండ అనేదే కనపడదు కదా అని కుమిలిపోయేది. ఆమె పాత స్మృతుల నించి బైట పడలేక పోతోంది. ఒకటా, రెండా? ఆ ఇంట్లో అణువణువుతో నలభయి రెండేళ్ల అనుబంధం పెనవేసుకుంది. పెరట్లో కొబ్బరి, జామ,కర్వేపాకు, సపోటా,ఉసిరి తో పాటు పారిజాతం, మందార, జాజి,నందివర్ధనం, కనకాంబరం మొక్కలు కూడా నాటింది. తన పిల్లల్లాగే వాటిని ప్రేమగా పెంచుకుంది. ఎలా మర్చిపోగలదు ఇవన్నీ?మనోవ్యాధి పట్టుకుందామెని. డాక్టరికి చూపిస్తే “ ఈమెకి ఏ జబ్బూ లేదు... మానసికవేదన తప్ప. కారణ మేంటో మీకే తెలియాలి.” అనగానే విక్రమ్, అనిల్ జరిగిందంతా చెప్పారు. “మీ అమ్మగార్ని ఆ ఇంటికి తీసుకు వెళ్తే ఆమె ఆరోగ్యం బాగుపడవచ్చు. అంతకంటే ఏమీ చేయలేం.”అని సలహా ఇచ్చాడు డాక్టర్. తల్లి తమని ఎంత అల్లారుముద్దుగా పెంచిందో తలచుకొని, అనవసరంగా ఇల్లు అమ్మేసి అమ్మని కలత పెట్టాం, అని విక్రమ్ ,అనిల్ బాధపడ్డారు . తల్లిలా ప్రేమించే అత్తగారి పరిస్థితి చూసి కోడళ్ళు కూడా కూడా చలించిపోయారు.
డాక్టర్ సలహా ప్రకారం తమ ఇల్లు కొనుక్కున్న వాళ్ళని కలిసి సంప్రదింపులు జరిపారు.ఇల్లు పడగొట్టి ఫ్లాట్స్ కట్టే యోచన లో ఉన్నారు వాళ్ళు.కార్పొరేషన్ నించి ప్లాన్ అప్రూవల్ కి టైమ్ పట్టేలా ఉండటం తోప్రస్తుతం ఇల్లు ఖాళీ గానే ఉంది. వీళ్ళ అదృష్టం కొద్దీ ఇంకా పడగొట్టలేదు. సీతమ్మ పరిస్థితి విని వాళ్ళు సహృదయంతో కొన్నాళ్ళపాటు ఇల్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
గబగబా పాత ఇంటిని శుభ్రం చేయించి రంగులు వేయించారు.అంతా కలిసి మళ్ళా పాతింటికి వెళ్లడానికి సన్నాహాలు మొదలెట్టారు. కానీ కొత్త ఇంటికి అలవాటుపడ్డ పిల్లలు మాత్రం అక్కడికి రావడానికి ససేమిరా అన్నారు. దాంతో అనిల్,గీత నలుగురు పిల్లలతో కొత్తింట్లో ఉండేలా, విక్రమ్,రాణి తల్లితో పాతింటికి వెళ్ళేలా నిర్ణయించుకున్నారు.సీతమ్మకి ఇంత పెద్ద ఇల్లూ ఎందుకో ఖాళీ ఖాళీ గా అన్పించింది. పగుళ్లు బారిన గచ్చులతో, పెచ్చులూడిన గోడలతో,బొందులు జారిపోతున్న కిటికీ లతో ,శ్లాబ్ లోంచి ఇనుపచువ్వలు కన్పిస్తూ కళావిహీనం గా ఉంది ఇల్లు. వీళ్ళు వెళ్ళిన వారానికి ఒక రాత్రి కరెంట్ పోయింది. కాలనీ అంతా ఉంది కానీ వీళ్ళ ఇంటికేలేదు. విక్రమ్ ఫ్యూజ్ వేస్తే కాసేపటికి మళ్ళీ పోయింది. మరునాడు గీజర్ ,ఫ్రిజ్ కూడా మొరాయించాయి.ఎలక్ట్రీషియన్ చూసి తాత్కాలికంగా ఏదో రిపేర్ చేసి వైర్లు బాగా పాతబడిపోయినందు వల్ల ఇంటి మొత్తానికీ కొత్త వైరింగ్ చేయించాల్సిందేనని స్పష్టం గా చెప్పేశాడు.
ఇలా కొన్నాళ్లు గడిచాయి ఎలాగో! ఆరోజు సీతమ్మని కలవడానికి ఆమె చెల్లెలు శారద వచ్చింది. స్టేషన్ కి వచ్చిన అనిల్ ముందు కొత్తింటికి తీసుకు వెళ్ళి జరిగిందంతా వివరించి అన్నావదిన అమ్మతో కలిసి పాతింట్లో ఉంటున్నారన గానే ఆశ్చర్యపడుతూ ఇక్కడికి వచ్చింది. ఇద్దరూ కలుసుకొని మూడేళ్లు కావడం తో బోల్డు సంగతులు ముచ్చటించుకున్నారు. శారద ప్రేమగానే అక్కని మందలించింది. “ఏంటే సీతా , ఇంత పాతబడ్డ ఇంట్లో ఉండడమేంటే?” అని. “అదేంటే, అంత మాట అనేశావు . ఇది నా ఇల్లే. ఇక్కడే కదా నా వైవాహిక జీవితం మొదలయ్యి పరిపూర్ణమయ్యింది.” కసిరింది చెల్లెల్ని. ‘“చాల్లే ఊరుకో సీతా! ఈ పాతింట్లో ఏం మూలుగుతోందే? అమ్మేసి చక్కని ఇంట్లో హాయిగా ఉంటున్న వాళ్ళని మళ్ళీ ఇక్కడికి తెచ్చి పడేశావు చాదస్తమా? మూర్ఖత్వమా? ఎంతకని రిపేర్ చేయిస్తారు చెప్పు వాళ్లయినా?ఒక్క మాట చెప్పు. ఆస్ట్రేలియా లో రెండేళ్ల పాటు అంత సౌకర్యవంతమైన జీవితాన్ని హాయిగా అనుభవించి వచ్చిన దానివి ఇక్కడకి వచ్చి ఈ పాతింటి కోసం ఎందుకే అంత పాకులాడుతున్నావ్? ఏమన్నా బాగుందా అసలు? నువ్వు ఆస్ట్రేలియా లో ఉన్నప్పుడు ఈ ఇల్లు నీతో ఉందా చెప్పు? అయినా అక్కడ నువ్వు మనశ్శాంతి గానే గడిపావు కదా? మరి ఇక్కడకొచ్చి ఎందుకే అందర్నీ ఇబ్బంది పెడుతున్నావ్, నువ్వూ ఇబ్బంది పడుతున్నావ్? ఒసే ఒక్క మాట చెప్పనా నా కంటే పెద్దదానివి, తప్పుగా అనుకోకు. పోయేటప్పుడు ఏం కట్టుకుపోతామే?.వొట్ఠి చేతుల్తో పోవాల్సిందేగా ఎవరిమైనా! అలాటిది ఈ ప్రాణం లేని ఇంటి కోసమెందుకే నీకంత వ్యామోహం? పోయేటప్పుడు ఇంటిని కూడా తీసుకుపోతావేంటే పిచ్చిదానా?”నవ్వింది శారద. అందరూ బతికిన నాల్రోజులూ పిల్లాపాపలతోఉన్నంతలో సుఖం గా, సౌకర్యవంతం గా బతకాలనుకుంటారు. నీ పిల్లలు మంచివాళ్లు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయ్. పెద్దరికానికి గౌరవమిచ్చి , నిన్ను సంతోషపెట్టడానికి పాపం వాళ్లెంత బాధ పడుతున్నారో చూడు. ముసలి తల్లిదండ్రుల్ని భారం గా భావించి వృద్ధాశ్రమాల పాల పడేసే కొడుకులే ఎక్కువ శాతం ఈ రోజుల్లో. మంచి ఉద్యోగాల్లో ఉన్న నీ పిల్లలు తలుచుకుంటే ఎవరి మానాన వాళ్ళు చక్కని బంగ్లాల్లో ఉండగలరు. కానీ అలా వెళ్లకుండా నీ మీద ప్రేమతో నీ ఇష్టాన్ని గౌరవిస్తూ నీకు నచ్చినట్టు ఈ పాతింటికే వచ్చేశారు. నీకు నీ పిల్లల కంటే ఇల్లే ముఖ్యమని అర్ధమౌతోంది.” అంది గంభీరం గా శారద. “అదేంటే అంత మాట అనేశావ్? నా పిల్లల చిన్నప్పటి జ్ఞాపకాల కోసమే గా ఈ ఇల్లు వదులుకోలేకపోతున్నది?” అయోమయంగా అడిగింది సీతమ్మ. “ఎందుకే అర్ధం లేని మాటలు? సంతోషాన్నివ్వని జ్ఞాపకాలు? గతం లో చాలా ఆనందాన్ని అనుభవించావు ఈ ఇంట్లో. కానీ వర్తమానం, భవిష్యత్ పిల్లలదే, దాన్ని హరించే హక్కు నీకు లేదు. ఈ పాత కొంప లో వాళ్ళకేం మధుర స్మృతులిస్తావో చెప్పు.తలా ఒక చోట... ఎందుకొచ్చిన తంటా? బుర్రపెట్టి సవ్యం గా ఆలోచించు.” హితబోధ చేసి వెళ్లింది చెల్లెలు. సీతమ్మ ఇంట్లో జరుగుతున్నవన్నీ గమనిస్తోంది. రాజీవ్, దేవి రోజు ఫోన్ చేసి పలకరిస్తూ ఉంటారు ఆస్ట్రేలియా నించి. అనిల్,గీత రెండ్రోజులకోసారి వస్తూ ఉంటారు. సీతమ్మకిష్టమైనవేమైనా తెస్తూ ఉంటారు.ఇంక విక్రమ్,రాణి చిన్నపిల్లలా చూస్కుంటూ ఉంటారు ఆమెని.మనవలెప్పుడైనా వస్తారు. వాళ్ళు కొత్త తరం పిల్లలు. సౌకర్యవంతమైన జీవన విధానానికి అలవాటు పడినవాళ్ళు. నచ్చే వ్యక్తులున్నా నచ్చని చోటుకి నచ్చ చెప్పుకొని రాలేని తరం వాళ్ళది.
ఒకరోజు సీతమ్మ డిక్లేర్ చేసెసింది… “విక్కీ, మనం కొత్తింటికి వెళ్లిపోదాంరా ,సామాన్లన్నీ సర్దేయండి” అని. ఆశ్చర్య పోయారు రాణి, విక్రమ్. “అవును రాణీ! ఇల్లంటే గోడలు,గడపలు, ప్రాణం లేని, ప్రయోజనం లేని జ్ఞాపకాలు కాదు. నా కొడుకులు,కోడళ్ళు, మనవలు తమకి నచ్చిన చోట హాయిగా నవ్వుతూ, తుళ్లుతూ, కళకల్లాడుతూ ఉండేదే అసలైన ఇల్లని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నా. నన్ను సంతోష పెట్టడం కోసం మీరంతా తలా ఒక చోట ఉంటూ ఇబ్బందులు పడ్డారు ఇన్నాళ్లూ. ఇంక జరిగింది చాలు. నాకిప్పుడు బాగానే ఉంది. పదండి ఇవాళే మనింటికి వెళ్దాం”.అంటూకొత్తింటికిప్రయాణంకట్టించింది.
ఇప్పుడు ఆమె పాత ఇంటిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది కానీ మునుపటిలా దుఖపడ్డం లేదు.. సీతమ్మ తన కొత్త లోగిలి లో పాత జ్ఞాపకాల్ని పదిలపరచుకుంది.

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు