భద్రకాళి - BHADRIRAJU THATAVARTHI

Bhadrakali

రోజు కు ఒక్కసారి ఐనా అమ్మతో మాట్లాడతాను. వాళ్లకు కూతురైనా కొడుకు ఐనా నేనే.

ఈరోజు ఉదయం నా పని అంతా ఐపోయాకా అమ్మ కి ఫోన్ చేసాను రోజులాగే.

కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బహుశా ఏదైనా పనిలో ఉంది ఏమో అనుకున్నాను. చూసుకుని తానే ఫోన్ చేస్తుంది లే అని ఊరుకున్నాను.

కానీ సాయంత్రం వరకు అమ్మ దగ్గర నుండి ఫోన్ రాలేదు.సాయంత్రం అమ్మ ఫోన్ చేసింది.

' ఏమైంది అమ్మా?’ ఉదయం నుండి ఫోన్ లేదు అని అడిగాను.

'ఏమీ లేదే నీకు భద్రకాళి బామ్మ తెలుసు కదా’ ! అని మాట్లాడ్డం ఆపింది.

అయ్యో నాకు తెలియకపోవడం ఏంటి ? తనని తలుచుకున్నప్పుడు అలాంటి జీవితం ఎవరికీ రాకూడదు అని ఎన్ని సార్లు అనుకుంటానో అమ్మా .... ఐనా పోయిన నెలలోనే కదా తాను మన ఊరి కి ఒంటరిగా తిరిగి వచ్చింది అని చెప్పావు. ?

‘సరే కానీ ఇప్పుడు ఏమైంది ? ‘అని అడిగాను ఆత్రుత ఆపుకోలేక.

'ఏమీ లేదే' ... అంటూనే ...ఉదయం తాను పోయింది. అని చెప్పడం ఆపింది.

అవునా ...అదేంటి .

'మొన్నటి వరకూ బాగానే ఉంది అన్నావు కదా అమ్మా ..!' అన్నాను కొంచం బాధ తోనే.

అమ్మ మళ్లీ మాట్లాడతా అని చెప్పి ఫోన్ కట్ చేసింది.కానీ నా ఆలోచనలు మాత్రం భద్రకాళి బామ్మ చుట్టూనే తిరుగుతున్నాయి.

భద్రకాళి బామ్మ మాకు దూరపు చుట్టం. మా ఊరి కోడలు గా వచ్చింది. తన జీవితం నిండా ఎన్నో మలుపులు.
ఆ మలుపులు అన్ని తన ప్రమేయం లేకుండానే వచ్చాయి.తన జీవితం మొత్తం ఎవరో నడిపించారు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఒక్కకరూ తన జీవితం లోకి ప్రవేశించారు.

కానీ చివరకి ఎవరి తోడు లేకుండా ఒంటరి గా ప్రాణం వదిలింది. చివరి దశలో తాను నమ్మిన వాళ్ళు అందరూ తనని ఎలా వదిలించుకోవాలా అని చూసారు.

చివరకి అలానే వదిలించుకున్నారు. ***
నాకు కుడా ఈ మధ్యనే భద్రకాళి బామ్మ గురించి తెలిసింది.

వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు.
బామ్మ తండ్రి సంపాదన తో కుటుంబం గడవడానికే చాలా కష్టం గా ఉండేది. ఉన్న కొద్దిపాటి పొలం వర్షాధారం.

తన తండ్రి రాంబాబు ఎలాగో కష్టపడి పెద్ద కూతురి పెళ్ళి చేయగలిగాడు. ఇక ఇద్దరి కి ఎలా పెళ్లి చేయాలా అని దిగులు పడేవాడు.

కొంత మంది ఎదుటి వారి అవసరాలను, అమాయకత్వాన్ని, బలహీనతలను తమకు అనుకూలం గా మలుచుకుంటారు.

భద్రకాళి కుటుంబం పేదరికాన్ని , తమకు అనుకూలం గా అవసరానికి వాడుకోవాలని ఒక ప్రణాళిక తో వారి ముందు వాలింది భద్రకాళి మేనత్త రాజ్యలక్ష్మి.

"కొంతకాలం భద్రకాళి ని తీసుకెళ్లి పని నేర్పిస్తాను. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను " అని చెప్పి ఒప్పించి భద్రకాళి ని తనతో తీసుకుని వెళ్లి ఇంట్లో ఉంచుకుంది.
కానీ రాజ్యలక్ష్మి మనసులో ఉన్నది వేరే ఆలోచన.

రాజ్యలక్ష్మికి ఇద్దరు మగ పిల్లలు. పెద్దకొడుక్కి ఒక సంబంధం చూసి పెళ్లి చేసింది. కట్నకానుకలు బాగానే తీసుకుంది.

కొంతకాలానికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు పెద్ద కొడుక్కి. ఇక రాజ్యలక్ష్మి లో ఉన్న మరో రాక్షసి బయటకి వచ్చింది. "ఇద్దరూ ఆడపిల్లలనే కంటావా"? అంటూ రోజూ కోడలిని సాధించడం మొదలు పెట్టింది.

రాజ్యలక్ష్మి పెట్టె సాధింపులు , వేధింపులు తాళలేక కోడలు ఒకరోజు ఆత్మహత్య చేసుకుంది.

ఇప్ప్పుడు ఆ ఇద్దరు పిల్లల బాధ్యత ఈమెపైపడింది.పెద్ద కొడుక్కి వేరే పెళ్లి చేద్దామని అనుకున్నా ,ఈమె గురించి కోడలు ను పెట్టిన బాధలు గురించి ఆ నోటా , ఈ నోటా తెలిసిన వారు అంతా పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.

మేన కోడలు భద్రకాళి పై ఎక్కడా లేని ప్రేమ ను ఒలకబోస్తూ నెమ్మదిగా ఇంటి పని అంతా అప్పచెప్పింది.

రాజ్యలక్ష్మి చిన్న కొడుక్కి ఇంకా పెళ్లికాలేదు కాబట్టి మేన కోడలి ని చిన్న కోడలు గా చేసుకుంటుంది అని బంధువులు అంతా అనుకునే వారు కానీ ఊహించిన దానికి భిన్నం గా ..
ఏ బాధ్యతా లేకుండా వ్యసనాల బారిన పడిన పెద్ద కొడుక్కి మేన కోడలు ను కట్టబెట్టాలని తనమనసులో ఉన్న ఆలోచనను నెమ్మది నెమ్మది గా బయట పెట్టింది.

"పెద్ద బావ కు నువ్వంటే ఇష్టమే అంటూ"
వాడికి రెండో భార్య గా నువ్వే ఉండాలి .నువ్వు చేసుకోకపోతే వాడి జీవితం ఏమైపోతుంది అంటూ భద్రకాళి ని పెద్దవాడికి ఇచ్చి పెళ్లి చేసింది. భద్రకాళి తల్లి తండ్రులు కి చెప్పకుండానే.

తాను ఉన్న పరిస్థితుల్లో , బయట ప్రపంచం కొద్దిగా కూడా తెలియని భద్రకాళి మేనత్త రాజ్యలక్ష్మి కపట ప్రేమని నిజమే అనుకుంది.

కానీ చాలా తెలివి గా మేనత్త రాజ్యలక్ష్మి వేసిన వలలో తాను చిక్కుకుంది అనేది తనకి ఎప్పటికో కానీ తెలిసి రాలేదు. కానీ అప్పటికి ఏమీ చేయలేని పరిస్థితి.

పెద్ద కొడుక్కి పెళ్లి చేసిన కొంత కాలం వరకు నాలుగు గోడల మధ్యనే ఆ నిజాన్ని ఉంచింది రాజ్యలక్ష్మి. కనీసం తన అన్న వదినలకు కూడా చెప్పలేదు.

ఏ తల్లి తండ్రులు పిల్లలకు ఏ బాధ్యతా లేకుండా తిరిగే ఒక వ్యసనపరుడుకు రెండో భార్య గా తమ కూతురును ఇచ్చి పెళ్లి చేయాలని అనుకోరు. ఎంతోకొంత అప్పు చేసి ఐనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే కూతురు సుఖపడుతుంది అని అనుకుంటారు. ఆ విషయం రాజ్యలక్ష్మి కి కూడా తెలుసు.

కాల చక్రం తిరుగుతూనే ఉంది. ....

రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రాంబాబు కు ఉన్న కొద్ది పాటి పొలం పక్క నుండి కొత్తగా ఒక నేషనల్ హైవే వచ్చింది. దానితో పొలం ధరలు అమాంతం పెరిగాయి.

మార్కెట్ రేటు కంటే పది రెట్లు ధర రావడం తో రాంబాబు ఆ పొలం అమ్మేశాడు.
వచ్చిన డబ్బుతో పిల్లల పెళ్లిళ్లు చేసేద్దామని నిర్ణయించుకున్నాడు .

రాజ్యలక్ష్మి ఆ సమయం లో నిజం బయట పెట్టక తప్పలేదు.

ఆ నిజం విన్న రాంబాబు కి గుండె బద్దలు అయింది . సొంత చెల్లి ఇలా తన కూతురు జీవితాన్ని నాశనం చేస్తుంది అని కలలో కూడా ఊహించలేదు. కానీ ఇక చేయగలిగింది ఏమీ లేదు. పరిస్థితులతో రాజీ పడడం తప్పించి.

ఎప్పుడు ఐతే రాంబాబు దగ్గరకి డబ్బులు వచ్చాయో ...రాజ్యలక్ష్మి లో ఉన్న ధన పిశాచి మళ్ళీ మేల్కొంది.

" నేను కాబట్టి నా కొడుక్కి నిన్ను రూపాయి కట్నం తీసుకోకుండా చేసుకున్నాను " అంటూ భద్రకాళి ని దెప్పిపొడిచేది.

ఆ మాటలు తూటాల్లా భద్రకాళి మనసుని గాయం చేసేవి. కానీ చిన్నతనం నుండి ఎప్పుడూ పెద్దవాళ్ళ కి సమాధానం చెప్పని భద్రకాళి తనలో తానే కుమిలిపోయేది.

తన బాధల ను భర్త తో పంచుకోవడానికి కూడా అవకాశం లేదు. ఉన్న ఇద్దరు పిల్లలు కు జరిగే సంఘటనలు అర్ధం చేసుకునే వయసులేదు.

కొంత కాలానికి రాజ్యలక్ష్మి చిన్న కొడుక్కి పెళ్లి జరిగింది. చిన్న కోడలు దగ్గర రాజ్యలక్ష్మి ఆటలు సాగలేదు.

దానితో రాజ్యలక్ష్మి కొడుకులు ఇద్దరినీ దూరంగా ఉంచాలి అనుకుంది .ఓ మంచి రోజు చూసి ఇద్దరి కొడుకులు ని వేరే ఊరి లో వేరే కాపురాలు పెట్టించింది. అత్తగారు కి దూరంగా ఉండడం వలన ఇద్దరు కోడళ్లు కొంచం ఊపిరి పీల్చుకున్నారు.

భద్రకాళి బామ్మ జీవితం అక్కడి నుండి ఎన్నో మలుపులు తిరిగింది.

భద్రకాళి వేరే కాపురం పెట్టాక పొలం అమ్మిన డబ్బులో కొంత డబ్బు పంపాడు రాంబాబు .కానీ ఆ డబ్బు కూడా భద్రకాళి భర్త వ్యసనాలకు ఆవిరి అయిపోయింది.

ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు కదా నాకు ఇక పిల్లలు వద్దు. వాళ్లనే నా పిల్లలు గా చూసుకోవాలి అని అనుకుంది భద్రకాళి.

పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. కానీ వారి మనసులో భద్రకాళి స్థానం మాత్రం సవతి తల్లిగానే మిగిలింది. ఎవరికీ చెప్పకుండా ఇద్దరు పిల్లలు ప్రేమించిన వాళ్లతో వెళ్లిపోయారు.

భద్రకాళి కి ఇప్పుడు ఆశలు లేవు. ఆకాంక్షలు లేవు.
నమ్మిన మేనత్త మాయమాటలతో ఈ అగాధం లోకి తోసింది. తన పిల్లలు అనుకున్న వాళ్ళు కాకుండా పోయారు. కట్టుకున్న భర్త వ్యసనాలకు పూర్తి గా బానిస అయ్యి ఇంటికి రావడమే మానేశాడు.

అప్పుడప్పుడు పుట్టింటి వారు పంపే డబ్బుతోనే ఇల్లు కూడా గడుస్తూ ఉంది. తన భవిష్యత్ ఏంటో తనకే అర్థం కావడం లేదు. ఎంతకాలం అని ఇలా ఒకరి మీద ఆధారపడి బతకాలి అని అనుకుంది.

వెళ్లిపోయిన పిల్లలు రారు. ఉన్న భర్త ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇప్పుడు తనకు ఎవరూ లేరు. తాను పూర్తి గా ఒంటరి. తోడుగా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే వారు ఎవరూ లేరు. అలాగని చచ్చేఅంత ధైర్యం లేదు. కానీ బతకాలి . ఏదోలా బతకాలి. ఇప్పుడు ఇదే భద్రకాళి ముందు ఉన్న సంకల్పం

సంకల్పం గట్టిది ఐతే ....అవాంతరాలు కొండ అంత ఉన్నా కూడా కరిగిపోతాయి. ఆలోచనలు కూడా అద్భుతాలని అవిష్కరిస్తాయి.

నెమ్మది నెమ్మది గా బతకడానికి ఒక మార్గం చూసుకుంది. ఒక చిన్న ఇడ్లీ బండి పెట్టుకుంది. అలానే రూపాయి రూపాయి దాచిపెట్టింది.

రోజులు నెలలు గా , నెలలు సంవత్సరాలు గా మారుతున్నాయి. ...
తన ఒంటరి తనాన్ని దూరం చేసుకోవడానికి ఒక అబ్బాయిని దత్తత తీసుకుంది. పంచ ప్రాణాలు వాడి మీద పెట్టింది. కానీ వాడు కూడా నెమ్మదిగా ఆస్థి మొత్తం రాయించుకుని, డిల్లీ లో ఉద్యోగం వచ్చింది అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు.

రోజూ ..తన పెంపుడు కొడుకు ఏదో ఒకరోజు వస్తాడని ఎదురు చూస్తూ ఉండేది. పాపం తనకి తెలియదు వాడు కూడా ఈమెని మోసం చేసి వదిలించుకున్నాడని.
ఇక వృద్ధాప్యం సొంత ఊరు లొనే గడపాలని చివరకి ఈ ఊరు చేరుకుంది.

మానసికం గా బాగా అలిసిపోయింది. ఈరోజు ఇలా ప్రాణాలు వదిలింది.

భద్రకాళి బామ్మ జీవితం కొందరికి గుణపాఠం. కొందరికి ఆదర్శం.

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు