కూలి పనులు చేసి బతికే రాములమ్మకు పెనిమిటి పాము కాటుతో చనిపోతే పదేళ్ల కొడుకు గోవిందుని టీకొట్టు నర్సమ్మ దగ్గర వదిలి పనులకు పోతుంది. గోవిందు టీకొట్టు వద్ద ప్లేట్లు టీ గ్లాసులు కడుగుతు నర్సమ్మ పెట్టే టిఫిన్ తిని అక్కడే సాయంకాలం వరకు గడిపేవాడు. టిఫిన్ కొట్టు దగ్గర పనిలేనప్పుడు రచ్చబండ వద్ద తన తోటి పిల్లగాళ్లతో గోలీలు ఆడుతూంటాడు. ఒకరోజు గోలిలాడుతుంటే గోవింద్ గోలి తుప్పల దగ్గరున్న రంద్రంలో పడింది. దాన్ని పైకి తియ్యడం కోసం రంద్రంలో చెయ్యి పెడితే ఏదో కుట్టింది. చెయ్యి మంటగా జరజర లాగుతుంటే 'అమ్మో' అంటూ ఏడవడం మొదలెట్టాడు. వాడి ఏడుపు విన్న నర్సమ్మ ఏమైందిరా అంటూ వచ్చి గోవిందు చెయ్యిని చూస్తే ఏదో విషపురుగు కుట్టిందని అనుమానం వచ్చి ఊరి వైద్యుడు ఆచారి గారి దగ్గరకు తీసుకెళ్లి చూపెడితే ఆయన గోవిందు చేతిని పరిక్ష చేసి మండ్రతేలు కరిచిందని నిర్దారణ చేసి బియ్యం కడుగుతో చింతపిక్క అరగదీసి తేలు కుట్టినచోట రాసి పూతికచీపురు పుల్లతో పైకి కిందకు రాపిడి చేస్తే కొంత సమయానికి గోవిందుకి బాధ తగ్గింది. అప్పటి నుంచి గోవిందుకి తను కూడా ఆచారి డాక్టరి గారిలా వైద్యం నేర్చుకోవాలని కోరిక పుట్టింది. ఆ మాటే వాడు అమ్మ దగ్గరంటే "ఊరుకోరా, బుల్లోడా! డాటరీ మన బోటోళ్లకు రాదు. అది సదువుకున్న పెద్దోళ్లకే వత్తాది. ఒల్లకుండి నర్సమ్మ టీ బడ్డీలో పనులు చేసుకో " అని కసిరింది. అప్పటి నుంచి గోవిందు నర్సమ్మ టిఫిన్ దుకాణంలో పని చేస్తున్నాడే కాని మనసంతా ఆచారి గారి దగ్గర వైద్యం నేర్చుకోవాలనే కోరిక ఉండేది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆచారి డాక్టరు గారు మూలికలు పసరు ఆకుల కోసం ఊరెల్తూ నర్సమ్మ టీ బడ్డీ దగ్గర ఆగేరు. అదే అదునుగా గోవిందు వినయం ఆచారి గారికి దండం పెట్టి తన మనసులోని మాట చెప్పేడు. సరేలే నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఆలోచిస్తానన్నారు. కొద్ది రోజుల తర్వాత ఆచారి గారు రాములమ్మను పిలిచి గోవిందు ఉత్సాహం తెలివిని మెచ్చుకుని తన దగ్గరకు పంపమన్నారు. "బాబూ, కూలీనాలీ సేసుకుని బతికే మా బోటోళ్లకు ఈ ఇద్దెలెందుకు. కొద్ది రోజులు పోనాక ఆడిని కూడా నా ఎంట కూలి పనికి తోలుకుపోతా " నంది రాములమ్మ. " చూడు , రాములమ్మా! అన్నిటికీ చదువే అక్కర లేదు. తెలివుండి కష్టపడితే కడుపుకి తిండి అదే పుడతాది. నీ కొడుకు చురుకైన కుర్రాడు. కష్టపడే తత్వం వాడిది. నా దగ్గరకు పంపు. వాడికి తిండి మా ఇంట్లో ఏర్పాటు చేస్తాను" అని నచ్చ చెబితే సరే నంది రాములమ్మ. అప్పటి నుంచి గోవిందు ఆచారి గారి ఇంటి దగ్గర తింటూ ఆయన చెప్పినట్టు మూలికలు నూరుతు ఆకుల పసర్లు , కషాయాలు , గుళికలు తయారు చేస్తు సహాయంగా ఉంటున్నాడు. అగ్రహారం గ్రామం అంతా నిరక్షరాస్యులు , కాయకష్టం చేసుకుని బతికేవారు. ఎంత పెద్ద రోగమైనా పట్నం వెళ్లి వైద్యం చేయించుకునే స్థోమత లేని పేదవారు. ఊళ్లో రంగాచారి గారు గుళ్లో పూజారిగా దైవ సేవ చేసుకుంటూ తాతల నాటి నుంచి వచ్చిన ఆయుర్వేద వైద్యం ఉచితంగా చేస్తు వస్తున్నారు. వారసులు లేనందున తన తదనంతరం ఈ విద్య అంతరించిపోతుందని బాధ పడుతూంటారు. గోవిందు శ్రద్ధగా రంగాచారి వైద్యులు చెప్పినట్టు చేస్తు ఆయుర్వేదంలో అనుభవం సంపాదిస్తున్నాడు. సాధారణంగా పాము , తేలు ,జెర్రి, వంటి విష కీటకాల కాట్లతో పాటు సంధి జ్వరాలు విరోచనాలు వాంతులు ఎముకలు విరగడం వంటి వాటికి వైద్యం చేస్తుంటారు ఆచారి గారు. ఆయనే ఆ ఊరి వైద్యుడు. ప్రాణం పోసే దేవుడు. ఇప్పుడు గోవిందు రంగాచారి గారి అధ్వర్యంలో ఊళ్లో వారికి ఆయుర్వేద వైద్యం చేస్తు పెరిగి పెద్ద వాడయాడు. ఒక్కొక్కప్పుడు ఆచారి గారు పని మీద ఎటైనా వెళితే గోవిందే వైద్యం చేసే స్థాయికి ఎదిగాడు. ఒకసారి రంగాచారి గారు బంధువుల ఇంట్లో చావు జరిగితే ఊరు వెళ్ల వలసి వచ్చింది. అదే సమయంలో ఒక ముసలితాతకి రాత్రి నిద్రలో కిరోసిన్ దీపం బుడ్డి పడి ఒళ్ళంతా కాలింది. ఉదయం ఆ ముసలి తాతను ఆచారి గారింటికి తీసుకు వచ్చారు. గోవిందు ఒక్కడే ఉన్నాడు. తాతకి ఎలా వైద్యం చెయ్యాలా అని తర్జనభర్జన పడుతున్నాడు.ఇప్పటి వరకూ ఇటువంటి శరీరం కాలిన పేషెంటు రాలేదు. తన సమయస్ఫూర్తి ఉపయోగించాడు. వెంటనే లేత ఆరిటాకులు తెప్పించి తడపల మంచం మీద ఎండు గడ్డి పరిచి తాతను దాని మీద పడుకో పెట్టించాడు.. ఈగలు ముసరకుండా చేపల వల చుట్టు ఏర్పాటు చేసాడు. దేవుడి గుడిలో ఉండే ముద్ద కర్పూరం నూరించి కొబ్బరి నూనెలో కలిపి దూదితో ఒళ్ళంతా పూయించాడు.అలాగే పెరుగు వెన్న తీయించి సమయానుకూలంగా లేత అరిటాకులు మారుస్తూ నోటి ద్వారా సూపులు తాగించడం మొదలెట్టాడు. ఊరి నుంచి తిరిగి వచ్చిన రంగాచారి గారు విషయం తెల్సి గోవిందు సమయస్ఫూర్తి వైద్యానికి ఆశ్చర్య పోయారు.తన తర్వాత ఊరికి గోవిందు ఆయుర్వేద వైద్యం అందించ గలడని నమ్మకం ఏర్పడింది.తనకి తెల్సిన అన్ని వైద్య విద్యలు నేర్పేరు. కొద్ది రోజుల తర్వాత ఆ ప్రాంత యం.ఎల్.ఎ గారు ఏదో కార్యక్రమం నిమిత్తం అగ్రహార గ్రామం రావల్సి వచ్చింది. కార్యక్రమం అయిన తర్వాత మూత్ర విసర్జన కోసం పక్కన తుప్పల వైపు వెళ్లారు. అక్కడ ఆయన కాలి మీద పాము కాటేసింది. ఆయన సిబ్బంది వెంటనే రంగాచారి గారి వద్దకు తీసుకు వచ్చారు. ఆయన పాము కాటును చూసి ఇది కట్లపాము కాటని నిర్ధారణ చేసారు. కట్లపాము కుడితే మనిషి వెంటనే చనిపోరు కాని దాని విష ప్రభావంతో కుట్టిన భాగం నుంచి శరీరం కుళ్లుతుందని చెప్పారు. వెంటనే స్ఫందించిన గోవిందు పాము కుట్టిన భాగాన్ని పసుపుతో రుద్ది శుభ్రం చేసి సర్పగంధ మూలిక గంధం తీసి పై పూతగా వేసాడు. లేత కొబ్బరి నీటిలో పచ్చి అరటికాయ రసం కలిపి తాగించాడు. ఇదంతా చూసిన రంగాచారి గారు అబ్బుర పడ్డారు. పట్నం చేరిన యం.ఎల్.ఎ గారు అక్కడ పెద్ద హాస్పిటల్లో పాము కాటుకు ఇంగ్లీష్ వైధ్యం చేయించుకోగా ఆయన కోలుకున్నారు. అగ్రహారం గ్రామంలో పాముకాటుకు వెంటనే మూలికా వైధ్యం అందినందున పాము విష ప్రభావం తగ్గి ప్రాణాపాయం తప్పినందుకు సంతోషించి యం.ఎల్. ఎ గారు గ్రామంలో ఆయుర్వేద హాస్పిటల్ కి కావల్సిన ఏర్పాట్లు కలిగించి నిస్వార్థంగా ఊరి ప్రజలకు వైద్య సేవలందిస్తున్న రంగాచారి గారి పేరు పెట్టారు. * * *