ఈ మధ్య కాలంలో నాకు ఆన్లైన్ బోధన మీద వ్యామోహం బాగా ముదిరిపోయింది. దీనికి కారణం కరోనా అనే చెప్పాలి. ఈ వ్యాధి పుణ్యమా అని ఆన్లైన్ తరగతులు చెప్పుకునే అవకాశం నాకు కలిగింది మరి. నాకు ఈ అయ్యవారు ఉద్యోగం అసలు ఇష్టమే ఉండేది కాదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులను చూసి......ఆ డాబూ....దర్పం మనకెప్పుడు వస్తాయో అనుకునే వాడిని. కానీ నేను చదివిన చదువు జువాలజీ కావడం తో, సాఫ్ట్ వేర్ రంగం లోకి ప్రవేశించే అర్హత నాకు లేకపోయింది. ఏదో ఈ అయ్యవారి ఉద్యోగం వచ్చింది. తరువాత పదోన్నతి కూడా రావడం తో డిగ్రీ కాలేజీ అధ్యాపకుడిని అయిపోయాను. జీతం బాగానే ముడుతున్నా కూడా అసంతృప్తి గా ఉద్యోగం వెలగబెట్టేవాడిని. నా దృష్టి అంతా సాఫ్ట్ వేర్ రంగం మీదే మరి. ఈ అసంతృప్తి తోనే ఒక దశాబ్దం పాటు ఉద్యోగ జీవితం గడిపేశాను. ఇంతలో కరోనా మహమ్మారి ఉప్పెన లాగా కమ్మేసుకోవడం తో కళాశాలలు మూసేశారు. విద్యార్థులు లేక కళాశాలలు బోసిపోయాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఒక తరం భవిష్యత్తు మసక బారిపోతుంది అని గ్రహించిన పై అధికారులు బోధనా పద్ధతులలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఆన్లైన్ ద్వారా బోధన కొనసాగించ వలసిందిగా ఉత్తర్వులు జారీ చేసారు. ఆ ఉత్తర్వులు వచ్చిన రోజున నా ఆనందం పట్టనలవి కాలేదు మరి. ఎందుకంటే నేను కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లాగా ఇక లాప్టాప్ పట్టుకు తిరగొచ్చు. అప్పటికే నేను యుట్యూబ్ వీడియోలు ఒక వంద వరకు చేయడం తో నన్ను కళాశాల లో అందరూ “గొట్టం బాబు” అని పిలిచేవారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో అప్పటికే నేను ఆరితేరిపోయాను. ఇలాంటి పరిస్థితులలో ఆన్లైన్ బోధన చేయాలనే ఉత్తర్వులు రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. తోటి అధ్యాపకులందరూ శాపంగా భావించిన ఈ ఆన్లైన్ బోధనా ఉత్తర్వులు నాకు వరంగా అనిపించాయి. ఇక ఆ రోజు నుంచి నేను చెలరేగిపోయాను. టీచర్ గా కన్నా మంచి టెక్నీషియన్ గా బాగా రాణిస్తున్నాను. చెప్పే విషయం లో పెద్ద సారం లేకున్నా అంతర్జాలం నుంచి అవీ...ఇవీ డౌన్లోడ్ చేసుకుని మసిపూసి....మారేడు కాయను చేయడంలో సిద్ధ హస్తుడిని అయిపోయాను. టీచింగ్ లో అసలైన విషయం తగ్గించి నా టెక్నికల్ స్కిల్స్ ను ప్రదర్శించడం మొదలెట్టాను. సద్ది తక్కువ .....ఊరగాయ ఎక్కువ వేసినట్టు తయారయయ్యింది నా టీచింగ్.
ఇంట్లో కూడా ఈ ఆన్లైన్ బోధన చేయడానికి నానా హంగామా చేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంట్లో నేను ఎవ్వరితో మాట్లాడడం లేదు. మూడు పూట్ల ఆన్లైన్ బోధనకు పనికివచ్చే మెటీరియల్ వెతకడం తో నే సరిపోతోంది సమయం. నాకున్న టెక్నికల్ స్కిల్స్ వలన ఆన్లైన్ టీచింగ్ పట్ల నాకు వ్యామోహం పెరిగిపోయింది. దీనికి తోడు మాకు ఇచ్చిన శిక్షణ తరగతులు నా ఉత్సాహాన్ని తీవ్ర స్థాయికి పెంచాయి.
ఒక రోజు ఉదయమే లాప్టాప్ ముందేసుకుని కూచున్నాను. గూగుల్ క్యాలెండరు లో క్లాస్ ను షెడ్యూల్ చేసి లింక్ ను విద్యార్థుల గ్రూప్ లో పెట్టాను. క్లాస్ మొదలెట్టిన మరుక్షణం లో గూగుల్ క్లాస్ లో డెబ్బై మంది విద్యార్థులు చేరిపోయారు. మిగిలిన వారి తరగతులకు హాజరు తక్కువగా ఉండడం, నా తరగతులకు హాజరు ఎక్కువగా ఉండడం నాకు ఎంతో థ్రిల్ కలిగిస్తోంది. ఆ విషయాన్నే అన్యాపదేశంగా నేను ప్రస్తావించినప్పుడు
“మీ క్లాస్ కు ఎక్కువ మంది విద్యార్థులు హాజరు కావడానికి కారణం, మీరు ఉదయాన్నే క్లాస్ షెడ్యూల్ చేసుకోవడం సర్.......మిగిలిన వారి క్లాస్ లకు తక్కువ హాజరు కావడానికి కారణం అప్పటికే మా డేటా అయిపోవడం సర్” అని ఒక విద్యార్ధి వినయంగా సెలవిచ్చాడు. ఆన్లైన్ లో ఈ చర్చ జరగడం వలన నా అహం దెబ్బ తినింది. ఎలాగైనా ఈ విద్యార్థులకు నేనంటే ఏమిటో తెలియజేసి నా ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనుకున్నాను. “మీలో అందరూ ప్రతి రోజూ నా క్లాస్ కు హాజరు కావలసిందే. లేదంటే తీవ్రమైన చర్యలుంటాయి. తరగతిలో వంద మందికి గాను కేవలం డెబ్బై మంది మాత్రమే హాజరవుతున్నారు. మిగిలిన వాళ్ళకు క్లాసుల విషయం తెలియజేయండి” అని హుకుం జారీ చేసాను.
“సర్.....అందరి వద్ద మొబైల్స్ లేవు........” పాపం విశాల్ ఆన్లైన్ లోనే వాపోయాడు.
“సర్.....మాకు ఒక్కోసారి సిగ్నల్స్ సరిగా అందవు” మెల్లగా గొణిగింది సల్మా.
“అబ్బా....ఛా......ప్రభాస్ చేసిన బాహుబలి సినిమా చూడడానికి సిగ్నల్స్ వస్తాయి గానీ, నా క్లాస్ లు వినడానికి మాత్రం సిగ్నల్స్ రావా?” అంటూ ఆన్లైన్ లోనే ఉక్రోషాన్ని వెళ్లగక్కాను. పాపం సల్మా ఏమీ మాట్లాడలేక పోయింది.
“సర్.....ఇంత మంది చెప్పే క్లాస్ లు వినాలి అంటే మొబైల్ ఎక్కువ వేడి గా అవుతోంది” అన్నాడు సాకేత్.
“అయితే క్లాస్ తరువాత ఆ వేడెక్కిన మొబైల్ ఉపయోగించి బట్టలు ఇస్త్రీ చేసుకో......నీకు డబల్ బొనాంజ వచ్చినట్టు ఉంటుంది” అని వెటకారంగా అనడం తో సాకేత్ నోరు మూత పడింది. స్టూడెంట్స్ ముందు మనం చులకన కాకూడదు అనే ఉద్దేశ్యం నాది. ఇలా వాళ్లకు ఆన్లైన్ క్లాసులు చెపుతూనే బ్రహ్మయ్య నా ఆన్లైన్ తరగతులకు హాజరు కావడం లేదని గుర్తించాను.
“బ్రహ్మయ్య కు ఏమయ్యింది? వాడు క్లాసు లకు రావడం లేదు?” అని అడిగాను. బ్రహ్మయ్య ది అనంతపురం జిల్లాలోని లోని దర్గా హొన్నూరు ప్రాంతం. అది చాలా చిన్న పల్లె. ఈ పల్లె ప్రత్యేకత ఏమంటే చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఇసుక మేట వేసుకుని ఉంటుంది. అనంతపురం జిల్లా రాబోయే రోజుల్లో ఎడారి గా మారబోతూ ఉంది అనడానికి ఈ దర్గా హొన్నూరే ఒక సాక్ష్యం. ఈ పల్లెలో పేరుకుపోయిన ఇసుక వలన నడుస్తూ ఉంటే కాళ్ళు దిగబడిపోతూ ఉంటాయి. వ్యవసాయం ఇలాంటి చోట్ల చాలా కష్టం. అసలు అనంతపురం జిల్లాలో చాలా పల్లెల్లో వ్యవసాయ కూలీలు ఉపాధి లేక బెంగళూరు కు వలస పోతూ ఉంటారు. అక్కడ వారికి అలవాటు లేని నిర్మాణ రంగంలో కూలి పనులు చేస్తూ చాలా సార్లు ప్రమాదాలకు గురి అవుతూ ఉంటారు. మరి బ్రహ్మయ్య కూడా ఏ బెంగళూరు కో వలస వెళ్ళాడా అని అనుమానం వేసి “ఏం ఎవరూ మాట్లాడరేం.......ఎక్కడ బ్రహ్మయ్య?” అని మరోసారి రెట్టించాను నేను. నాకు కావలసినది నా తరగతులకు వంద శాతం విద్యార్థులు హాజరు కావడం. వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో నాకు కాబట్టదు. హాజరు తగ్గితే నేను పై అధికారులకు జవాబు చెప్పుకోవాలి.
“సర్..... బ్రహ్మయ్య ఇంటిలో వాళ్ళ నాన్న పరమ తాగుబోతు. కూలికి పోతే గానీ వాడికి దినం గడవదు. వాడి దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు. అందుకే వాడు మీ ఆన్లైన్ తరగతులకు హాజరు కావడం లేదు” అన్నాడు బీరన్న. “సరే లే........వేరే వారి వద్ద స్మార్ట్ ఫోన్ తీసుకుని ఆన్లైన్ క్లాసు లకు అఘోరించమను” అన్నాను నిష్టూరంగా. ఇలా ఏదో ఒక సాకుతో సగం సమయం ఆన్లైన్ లో విద్యార్థులను తిట్టుకుంటూ గడపడం నాకు అలవాటు. లేదంటే గంట సేపు బోధన చేయాలంటే ఎక్కడ సాధ్యం మరి. ఈ విధంగా నయానో ...భయానో నా క్లాసుకు అందరినీ రప్పించే ప్రయత్నం చేసేవాడిని. కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా బ్రహ్మయ్య మాత్రం రావడం లేదు. నాకు కూడా వాడిని ఎలా అయినా ఆన్లైన్ క్లాసు లకు రప్పించాలనే ఉక్రోషం పెరిగింది. వాడి ఊరు దర్గా హోన్నూర్ అని నాకు తెలుసు కాబట్టి ఒక ఆదివారం నేను ఆ ఊరు బయలుదేరాను. అది కూడా నేను కొత్తగా కొన్న అవెంజెర్ మీద బయలుదేరాను. ఉరవకొండ.....ఉండబండ......బొమ్మెనహాళ్ మీదుగా వెళ్లి దర్గా హోన్నూర్ చేరుకునే సరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది. ఎండాకాలం లో లాగా వడగాడ్పు కొడుతూ ఉంది ఆ ఊరిలో. బ్రహ్మయ్య పేరు చెపుతూనే.......ఆ పల్లె లో ఒక పిల్లగాడు నాకు బ్రహ్మయ్య ఇల్లు చూపించాడు. అది ఇల్లు అని చెప్పడానికే లేదు. అది ఒక పూరి గుడిసె. అప్పుడో...ఇప్పుడో పడిపోయేలా ఉంది అది. ఎందుకైనా మంచిదని బయట ఉన్న నులకమంచం మీదే కూలబడిపోయాను. బ్రహ్మయ్య నాన్న బాగా తాగి ఉన్నాడేమో మరి ఆ గుడిసె బయట బండ మీద నిద్ర మత్తు లో జోగుతూనే వాంతి చేసుకొంటున్నాడు. ఇంతలో ఆ పల్లె లో ఉన్న చిన్న పిల్లలు నా అవెంజర్ చుట్టూ మూగిపోయారు. నేనొచ్చానని తెలిసి బ్రహ్మయ్య అమ్మ బయటకు వచ్చింది. ఆమెను చూస్తూనే వారెంత పేదరికం లో ఉన్నారో తెలుస్తోంది. మొదటిసారిగా ఆ ఎడారి లాంటి ప్రదేశమైన దర్గా హోన్నూర్ లో నా మనసు లో ఏ మూలో దాగి ఉన్న తడి నాకు తగలడం మొదలెట్టింది. గ్రామస్తులు దూరం నుంచి నీళ్ళు బిందెలతో మోస్తూ ఉన్నారు. వీరు రోజులో చాలా భాగం మంచి నీటిని మోయడానికే వెచ్చిస్తారు. మిగిలిన సమయం లో కూలి చేసి పొట్ట పోసుకుంటారు. మొదటసారిగా నేను కటిక దారిద్ర్యం తో ముఖాముఖి కలుసుకున్నాను అనిపించింది. అంతకు ముందు నేను చూసిన ప్రపంచం వేరే....ఈ పల్లె బతుకు వేరే. నేను చూసిన ప్రపంచం లో ఎక్కడ చూసినా అదనపు వనరులే.......ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా లోటే. ఇలా ఆలోచిస్తూ ఉండగానే బ్రహ్మయ్య అమ్మ “అయ్యా!!! మా వాడేమన్నా చేయకూడని పని చేసాడా !!!! ఇంత దూరం వచ్చావు........వాడు నాకు ఒక్కగానొక్క కొడుకు అయ్యా. వాడు చదువుకుని పైకొస్తే చాలు మాకు. నా పెనిమిటికి తాగి తొంగోవడం తప్ప ఏమీ తెలియదు. వాడు ఏదైనా తప్పు చేసుంటే మన్నించాల మీరు” అని వేడుకుంది. ఆమె దీనత చూసి నాకు గుండె చెదిరింది. ఇన్ని రోజులు.......నా ఆన్లైన్ తరగతుల హాజరు పెరిగితే చాలు అని ఆలోచించిన నేను మొదటిసారిగా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడం మొదలెట్టాను. ఆన్లైన్ బోధన కొనసాగిస్తూనే......విద్యార్థులు దాన్ని వినియోగించుకునే పరిస్థితులు ఉండేలా చూడాలని ......ఇది ఊరందరి ఉమ్మడి భాద్యత అని తెలుసుకున్నాను.
“అమ్మా ...బ్రహ్మయ్య కనిపించడం లేదే....ఎక్కడికి వెళ్ళాడు?” అని అడిగాను.
“పెయింటింగ్ పని కోసం ఏదో ఊరు వెళ్ళాడు సారూ........ఏ ఊరు వెళ్ళాడో కూడా నాకు తెలియదు” అనింది ఆ అమాయకపు తల్లి.
“చదువు ఎగరగొట్టి.....పెయింటింగ్ పనికి వెళితే ఎలా?” అన్నాను.
“అదే సారూ.....మీరేదో ఫోన్ లో చెపుతారటగా......వాడి దగ్గర అవేవి లేవు మరి. దానికి కావాల్సిన దుడ్డు సంపాదించుకోవడానికే వెళ్ళుంటాడు అయ్యా.......వాడికి ఎప్పుడు చదువు మీదే ధ్యాస......మీరే వాడిని మంచి తోవలో పెట్టాలా “ అని ఆమె వాపోయింది. ఆమె కళ్ళ నిండా బ్రహ్మయ్య కోసం ఆమె కంటున్న కలలే నాకు కనిపించాయి. ఇంతలో ఊరి పెద్దలు కూడా నా వద్దకు వచ్చారు. వారితో నేను ఆన్లైన్ తరగతుల గురించి చెపుతూనే......వారి గ్రామంలో విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినేలా సాంకేతిక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తుచేసాను. ఇది గ్రామ ప్రజలందరి ఉమ్మడి బాధ్యత అని కూడా చెప్పాను.
మేమంతా ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే, కూలి కోసం వలస పోయిన బ్రహ్మయ్య వస్తూ మాకు కనిపించాడు. “అయ్యా నా బిడ్డ వస్తున్నాడు” అంటూ బ్రహ్మయ్య తల్లి గట్టిగా అరిచింది. ఇంత జరుగుతున్నా కూడా బ్రహ్మయ్య తండ్రి తాగిన మత్తులో జోగుతూనే ఉన్నాడు. ఏ కుటుంబానికైనా తండ్రి ఒక ఆసరా....తండ్రి ఒక భరోసా. అలాంటి తండ్రే తాగుడుకు బానిసైతే......ఆ ఇంట్లో ని పిల్లల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనే విషయం నాకిప్పుడు తెలిసి వచ్చింది. ఇంతలో అల్లంత దూరం నుంచి నన్ను పోల్చుకున్న బ్రహ్మయ్య “సారూ........నీవా........” అంటూ వచ్చి నా కాళ్ళ మీద పడిపోయాడు. “సారూ...ఇన్ని రోజులు నీ ఆన్లైన్ క్లాసులు వినలేక పోయాను. నా వద్ద స్మార్ట్ ఫోన్ లేదు. కొనడానికి దుడ్డు సంపాయిద్ధామని బెంగళూరు వెళ్లాను. రోజుకు పన్నెండు గంటల పాటు పని చేసి నెలలో పదివేలు సంపాదించాను. దాంతో ఇదిగో.......ఈ బుల్లి స్మార్ట్ ఫోన్ ను కొనుక్కున్నాను. ఇక మీ అందరి క్లాసులు వింటాను” అని చెపుతూ ఆ స్మార్ట్ ఫోన్ ను నాకు చూపించాడు. నాకు కళ్ళు చెమ్మగిల్లి పోయాయి. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఆన్లైన్ బోధన కు రమ్మని పోరు పెట్టిన నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో నాకు అర్థం అయ్యింది. ఇంతలో ఆ గ్రామ పెద్దలు ఆ గ్రామ విద్యార్థుల కోసం చందా వేసుకుని ఒక పాతిక స్మార్ట్ ఫోన్స్ కొనడానికి నిర్ణయించుకున్నారు. పల్లె లోని విద్యార్థులందరూ వారి టైం టేబుల్ ప్రకారం వాటిని ఉపయోగించుకునేలా ఒక ఒప్పందానికి వచ్చారు. నేను ఈ పల్లెకు రావడం వల్ల నాకు తెలియకుండానే ఒక మార్పు కు శ్రీకారం చుట్ట గలిగాను అనిపించింది. ఇవన్నీ ఏమీ పట్టనట్టుగా పెయింటింగ్ పనిచేసి సంపాదించుకున్న కూలి డబ్బులతో కొన్న స్మార్ట్ ఫోన్ తడుముకుంటూ అరుగు మీద కూచున్న బ్రహ్మయ్య నా కళ్ళల్లో పడ్డాడు. ఆ స్మార్ట్ ఫోన్ తడుముతున్న బ్రహ్మయ్య మొహం లో వాడు వాడిన ఏషియన్ పెయింట్ డబ్బాల లోని రంగులన్నీ ఒలికినట్టు ఉన్నాయి మరి. స్మార్ట్ ఫోన్ ను తడుముకుంటూ తన ఉజ్వల భవిష్యత్తు గురించి కలలు కంటున్న బ్రహ్మయ్య ను చూస్తున్న నాకు వాడే ఓ ఇంద్రధనస్సు లాగా కనిపించాడు.