టీకా.. వేసుకున్నారా..? - అఖిలాశ

Teekaa vesukunnara

“ఇంకెన్నేళ్లు బతుకుతా! మహా అయితే ఐదేళ్లో, పదేల్లో” నాకెందురా ఈ మందులు?! నేనెవరికి ద్రోహం, మోసం చేశానని కరోనా వస్తుంది.” మంచిదాన్ని, మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ ని.

“నువ్వు మంచిదానివే కాని కరోనా డెల్టా వైరస్ కు అది తెలియదుగా? నీకు కరోనా వస్తే నువ్వు మాత్రమే చనిపోవు నీవల్ల మరికొంత మందికి కరోనా వచ్చే ప్రమాదం ఉంటుంది. టీకా నీకోసం మాత్రమే కాదు.” కుటుంబం కోసం, సమాజం కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం, మనిషి మనుగడ కోసం.

“నేను బయటకు పోతే కదా! ఆ పనికిమాలిన జబ్బులు వచ్చేది. జొన్న రొట్టెలు, రాగి సంగటి, కొర్ర బియ్యం తిన్న శరీరం నాది. అలాంటి జబ్బులు నా అరికాలిని కూడా తాకలేవు.” మొండి ధైర్యం, టీకా మీద అనుమానం, భయం.

“నీకు చెపితే అర్థం కాదా? అవన్నీ తిన్నవారికి కూడా కరోనా వచ్చింది, చనిపోయారు కూడా.”

“అవన్నీ ఉత్త మాటలు. నాకు టీకా వద్దు ఏం వద్దు చస్తే యాడో ఒక చోట పడేసేయ్యండి. గవర్నమెంటు వాళ్లు కావాలనే మనుషులను చంపుతాండారు. టీకా వేసుకున్నా కూడా కరోనా వస్తోందంటా! అంతదానికి వేసుకోవడం ఎందుకు? టీకా తయారు చేసే వాళ్లు, మోడీ గాడు కలిసి డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారు. నీకు అర్థం కావడం లేదు. నా మాట విని నువ్వు కూడా టీకా వేసుకోవద్దు.” మన వంశానికి అలాంటి జబ్బులు ఎందుకు వస్తాయి?. మూఢనమ్మకాలు, అజ్ఞానం.

“నీ ఇష్టం. ఎంత చెప్పినా వినడం లేదు. నేను, మహిష్క టీకా వేయించుకుంటున్నాము. నీకు కూడా స్లాట్ బుక్ చేశాను. ఎల్లుండి మునిసిపల్ స్కూల్ లో టీకా వేస్తారు. నువ్వు బతకడానికి, సమాజాన్ని, కుటుంబాన్ని బతికించడానికి వస్తే మంచిది లేదంటే?... ఈ వయసులో మాకు చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా చేస్తావు అనుకోలేదు.” అసహనం, చికాకు.

“ఇప్పుడు అర్థమయ్యింది నాకు. ఆ టీకా వేసుకొని నేను చస్తే పీడ విరగడ అవుతుందని నీ ఆలోచన. ఇది నీకు పుట్టిన బుద్ధి కాదురా, దాని ఆలోచనే. దానికి మొదటి నుండి నేనంటే సరిపోదు. ఈ టీకా పేరుతో నా అడ్డు తొలగించుకోవాలని చూస్తాన్నారు.

మీకు అడ్డంగా ఉంటే చెప్పండి ఏ అనాథాశ్రమములోనైనా చేరుతా. మూర్ఖంగా మాట్లాడింది, తన వయసును మరిచింది, బిడ్డ ఎలాంటి వాడో గ్రహించలేకపోయింది, గ్రహించడానికి వయసు పనికిరాలేదు. టీకాపై అపనమ్మకం, మోడిపై, మోడీ ప్రభుత్వంపై అపనమ్మకం. సమాజం ఏమైతే నాకేంటి? సమాజం వల్లే నాకు ముప్పు, నావల్ల సమాజానికి ముప్పు లేదనే భావన.

***

రత్నమ్మ ఒక్కగానొక్క కొడుకు విరోద్. పెళ్లి జరిగి పదేళ్లు అవుతోంది దానికి సాక్ష్యంగా తొమ్మిది ఏళ్ల విరూపాక్ష్ కూడా ఉన్నాడు. M.C.A పూర్తి చేసిన తర్వాత ముంబై L&Tలో ఉద్యోగం వచ్చింది. అక్కడ మూడేళ్ల పాటు ఉద్యోగం చేసిన తర్వాత బెంగళూరుకి ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. గత ఏడాది నుండి బెంగళూరులో పని చేస్తున్నాడు. వారానికి మూడు రోజులు ఆఫీస్ కి వెళ్ళడం మిగిలిన రోజులు ఇంటి నుండే పని చేయడం జరుగుతోంది.

L&Tలో ఉన్నత ఉద్యోగం కావడం, తను లేకుండా ప్రాజెక్ట్ పనులు సక్రమంగా జరగని కారణంగా ఫీల్డ్ కి వెళ్ళడం తప్పనిసరి అయ్యింది. ఉద్యోగ కారణాల వల్ల బయటకు వెళ్ళాల్సి వస్తోంది, ఇంట్లో కొడుకు విరూపాక్ష్ మరియు తల్లి రత్నమ్మ ఉన్నారు కనుక టీకా తీసుకోవడం మంచిదని స్లాట్ బుక్ చేసుకున్నాడు.

టీకా గురించి తనకు తెలిసిన డాక్టర్స్ ని అడిగి పూర్తి వివరాలు కనుక్కున్నాడు. టీకా తీసుకోవడం వల్ల కరోనా రాదని కాదు, వచ్చినా మరణ శాతాన్ని తగ్గిస్తుంది, కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ సమస్యలు, ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టీకా తీసుకోవడం వల్ల వాటిని 70 నుండి 80 శాతం వరకు తగ్గించవచ్చని చెప్పారు. డాక్టర్స్ సలహా మేరకు, సమాజం కొరకు, కుటుంబం కొరకు, దేశం కొరకు టీకా తీసుకోవడం మంచిదని భావించాడు.

రత్నమ్మ భర్త చనిపోయి మూడేళ్లు అవుతోంది. అప్పటి నుండి పల్లెలో కాకుండా బిడ్డ దగ్గరే ఉంటోంది. తనతో పాటు బిడ్డకు భారంగా ఉన్నాననే అభద్రతను కూడా పెంచి పోషించుకుంటోంది.

“బట్టలు ఉతుకుతాను అత్తయ్య అని రత్నమ్మ విడిచిన బట్టలను మహిష్క తీసుకోడానికి వెళ్తే “ఎందుకులే తల్లీ?! నా బట్టలు ఉచ్చల వాసన వస్తాయి. ముసలి దాన్ని కదా బట్టల్లో పోసుకోవడం మాములే అది మీకెలా అర్థమౌతుందిలే?” నా దగ్గర మంచిదానిలా నటిస్తావు వాడికి పుల్లలు ఎక్కిస్తావని తెలుసులే అని కసురుకుంటుంది.” కోడలిని తప్పుగా అర్థం చేసుకుంటుంది, చేసుకునే హక్కు అత్త స్థానానికి ఉందని బలంగా నమ్ముతుంది.

అందరూ కలిసి భోజనం చేస్తుంటే తను మాత్రం ఒంటరిగా పక్కకు వెళ్లి తింటుంది. అదేంటి అత్తయ్య మాతో కలిసి భోజనం చేయవచ్చు కదా! అంటే “మీతో కలిసి తినే అర్హత నాకెక్కడిది తల్లీ!? మీరు వయసులో ఉన్నారు, కండలు-మెండలు మెళ్ళో వేసుకొని బలంగా ఉన్నారు. నేను అన్నం తినేటప్పుడు చేతులు వణుకుతాయి, అన్నం కిందపడుతుంది, నీ కొడుకు నాకు అన్నం తినడం చేత కాదని వెక్కిరిస్తాడు. మీతో అనిపించుకొని, మీ బిడ్డలతో కూడా పడి బతకాలంటే ఎలా?” వయసు పెరిగింది కాని ఆలోచన పెరగలేదు. అర్థం చేసుకోవాల్సిన వయసులో అపార్థాలు చేసుకోవడం అలవాటు చేసుకుంది.

రత్నమ్మ స్వభావమే అంత. ప్రతి అంశంలోనూ వ్యతిరేకంగా ఆలోచిస్తుంది. ప్రతి దానిలో మంచి కంటే చెడే ఎక్కువగా ఉందని నమ్ముతుంది. విరోద్, మహిష్క దంపతులు రత్నమ్మను ఎంత బాగా చూసుకున్న ఏదో ఒకటి గొణుగుతూనే ఉంటుంది. తల్లి స్వభావం అంతేనని తెలుసుకున్న విరోద్ రత్నమ్మ మాటలను పెద్దగా పట్టించుకోడు. మొదట్లో మహిష్క బాధపడేది. ఈ మధ్య పట్టించుకోవడం లేదు.

***

విరోద్, మహిష్క టీకా వేయించుకోడానికి బయలుదేరే ముందు మళ్ళీ ఒకసారి టీకా వేయించుకోమని అడిగారు. మీరే వేయించుకొని చావండని కసిరింది.

ఇద్దరూ కలిసి టీకా వేయించుకొని వచ్చారు. టీకా వేసుకున్న తర్వాత మహిష్కకు జ్వరం, ఒళ్లు నొప్పులు, తల నొప్పి, టీకా వేసుకున్న నొప్పితో బాధపడింది. విరోద్ కి మాత్రం ఏ సమస్య లేదు. డాక్టర్ సలహా మేరకు మహిష్క ఒక డోలో మాత్ర వేసుకుంది. రెండు రోజుల తర్వాత అన్ని సర్దుకున్నాయి.

“చెప్తే వింటారా?! వద్దు వద్దు అంటే వినకుండా వేసుకుంటిరి ఇప్పుడు మంచాన పడి మూలిగితే ఎట్టా అని వదిరింది రత్నమ్మ.”

“డెల్టా వైరస్ చాలా డేంజర్ అంటా! నా మాట విని టీకా వేయించుకో భారత ప్రభుత్వం ఉచితంగా అందరికీ టీకా ఇస్తోంది. డెల్టా వైరస్ వస్తే మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అవన్నీ నిజాలో కాదో పక్కన పెడితే టీకా వేసుకోవడం తప్పనిసరి అని రత్నమ్మను మళ్ళీ బుజ్జగించాడు కొడుకు విరోద్.”

“నువ్వు ఎన్ని చెప్పినా! ఆ పాడు మందు వేసుకొను కాక వేసుకోనని తెగేసి చెప్పింది.”

మూడు నెలల తర్వాత రత్నమ్మకు ఒంట్లో నలతగా ఉందని చెప్తే Zerodol SP టాబ్లెట్స్ తెచ్చి ఇచ్చాడు విరోద్.

రెండు పూట్ల టాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఒళ్లు నొప్పులు తగ్గకపోగా జ్వరం కూడా వచ్చింది. అనుమానం వచ్చి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. రత్నమ్మకు కరోనా అని తేలింది. ఏ వేరియంట్ వచ్చిందో తెలుసుకోడానికి ముంబై ల్యాబ్ కి పంపారు.

పది రోజుల తర్వాత రత్నమ్మకు డెల్టా వేరియంట్ అని తెలిసింది. బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రిలో పది లక్షలు ఖర్చు పెట్టుకున్న తర్వాత రత్నమ్మ బతికి బట్ట కట్టింది.

***

కరోనా నుండి కోలుకున్న మూడు నెలల తర్వాత కరోనా టీకా తీసుకుంది రత్నమ్మ. టీకా వేసుకున్నప్పటి నుండి ప్రతి ఒక్కరిని టీకా వేసుకున్నారా? టీకా వేసుకున్నారా? అని అడగడం మొదలు పెట్టింది. పాలు వేసే వాడిని, కూరగాయలు బండి వాడిని, చెత్త తీసుకోడానికి వచ్చిన వారిని, ఇంట్లో పని చేసే పని మనిషిని, పక్కింటి వారిని, ఎదురింటి వారిని ఎవరూ కనపడినా టీకా వేసుకున్నారా? టీకా వేసుకున్నారా? అని అడగడం ఊత పదంగా మారింది. వీధిలో వాళ్లు అందరూ ఆమెను టీకా అంటీ, టీకా అంటీ అని పిలవడం మొదలు పెట్టారు.

***

“టీకా మీ కోసం మాత్రమే కాదు. కుటుంబం కోసం, సమాజం కోసం, దేశం కోసం, మానవ జాతి కోసం”

“టీకా వేసుకున్నారా?”

“అనుమానం, ఆలస్యం, నిర్లక్ష్యం చేయకండి. టీకా వేయించుకోండి వైరస్ ని తరమి కొట్టండి.”

***

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు